Share News

ఇజ్రాయెల్‌ ఉన్మాదం

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:53 AM

యుద్ధానికి కూడా హద్దులుంటాయి, నీతినియమాలుంటాయి. హమాస్‌తో పోరులో ఇజ్రాయెల్‌ నానావిధ అతిక్రమణలకూ పాల్పడుతోంది, అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. గాజాలో...

ఇజ్రాయెల్‌ ఉన్మాదం

యుద్ధానికి కూడా హద్దులుంటాయి, నీతినియమాలుంటాయి. హమాస్‌తో పోరులో ఇజ్రాయెల్‌ నానావిధ అతిక్రమణలకూ పాల్పడుతోంది, అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. గాజాలో ఆపన్నులకు కాస్తంత సాయాన్ని అందిస్తున్న ఏడుగురు వర్కర్లను ఇజ్రాయెల్‌ దళాలు కాల్చివేయడం, మిగిలివున్న ఆ ఒక్క ప్రధాన ఆస్పత్రిని కుప్పకూల్చడం, పొరుగుదేశంలోని మరోదేశం కాన్సులేట్‌ మీద దాడిచేసి కీలకమైన వ్యక్తులను చంపివేయడం వంటి చర్యలు ఇజ్రాయెల్‌ మిగతాప్రపంచానికి ఎంతమాత్రం జడవడం లేదనడానికి నిదర్శనం. ఈ వరుస సంఘటనలపట్ల ఇజ్రాయెల్‌ ప్రతిస్పందన చూసినప్పుడు అది శత్రువులకూ, మిత్రులకూ కూడా జవాబుదారీగా ఉండదల్చుకోలేదని అర్థమవుతుంది.

స్వచ్ఛంద సంస్థ ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’కు చెందిన ఏడుగురు సహాయకులను సోమవారం ఇజ్రాయెల్ చంపివేయడం పొరపాటున జరిగిందని ఎవరూ అనుకోవడం లేదు. యుద్ధం అన్నాక ఇటువంటివి సహజం అని ఇజ్రాయెల్‌ అధినేత బెంజమీన్‌ నెతన్యాహూ ఎంతో తేలికగా ఈ ఘటనను తీసిపారేశారు. కానీ, ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) తమ వాహనం మీద దాడిచేశాయని ఈ చారిటీ సంస్థ అధినేత ఆరోపిస్తున్నారు. ఆ వాహనం ఒక సహాయక సంస్థదని తెలియచెప్పే గుర్తులు దాని మీద స్పష్టంగా ఉన్నాయి. పైగా ఐడీఎఫ్‌తో సమన్వయం చేసుకుంటూ ఘర్షణలేని ప్రాంతం గుండా అది ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. మూడుసార్లు కాల్పులు జరపడం, కొందరు చనిపోగా, పారిపోతున్న మిగతా సహాయకసిబ్బందిని కూడా వదిలిపెట్టకుండా హతమార్చడం వంటివి గమనించినప్పుడు ఇజ్రాయెల్‌ దళాలు పొరపాటుపడ్డాయని అనుకోలేం. మరణించినవారిలో బ్రిటన్‌, అమెరికా పౌరులు ఉన్నందువల్ల కాబోలు, నెతన్యాహూ ఈ ఘటనను అంగీకరించారు కానీ, అది ఉద్దేశపూర్వకమైనది కాదన్నారు. ఇంతటి ఘోరమైన సంఘటమీద కూడా అమెరికా, బ్రిటన్‌లు తీవ్రంగా స్పందించలేకపోయాయి. జరిగిన దానిమీద లోతైన దర్యాప్తు చేయించమని బ్రిటన్‌ తిరిగి ఇజ్రాయెల్‌నే అడిగిందంటే అగ్రదేశాలు ఎంతగా సాగిలబడ్డాయో అర్థమవుతుంది. పచ్చి అబద్ధాలు, మోసాలతో యుద్ధాన్ని సాగిస్తున్న ఇజ్రాయెల్‌ నుంచి నిజాలు బయటకురావని వాటికి మాత్రం తెలియదా? పారదర్శకతకు పాతరేసి, నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ముప్పైమూడువేలమంది పాలస్తీనియన్లను ఊచకోతకోసి, గాజాను నేలమట్టంచేసి, లక్షమందిని నిరాశ్రయులుగా మార్చిన ఇజ్రాయెల్‌ ఇకమీదట తన తప్పులు బయటకు పొక్కకుండా, క్షేత్రస్థాయి సమాచారాన్ని తెలియనివ్వకుండా మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. గాజాలో ఘోరాలను బయటి ప్రపంచానికి తెలియచెబుతున్న అల్‌ జజీరా చానెల్‌మీద అది ప్రత్యేకంగా కక్షకట్టింది. నచ్చని విదేశీ చానెళ్ళను గెంటివేసే అధికారాలను నెతన్యాహూ తన మంత్రులకు కట్టబెట్టారు. విదేశీ సహాయకులమీద ఉద్దేశపూర్వకంగా జరిపిన ఈ దాడిద్వారా పాలస్తీనియన్లకు అందుతున్న ఆ కాసింత సాయాన్ని కూడా అడ్డుకోవాలని ఇజ్రాయెల్‌ ఉద్దేశం. హమాస్‌ అభిమానులతోనూ, ఉగ్రవాదులతోనూ ఐక్యరాజ్యసమితి సహాయక సంస్థ ‘యుఎన్‌ఆర్‌డబ్లుఏ’ నిండిపోయిందని ఆరోపిస్తూ, దానికి సరఫరాలు జరగకుండా అడ్డుపడుతూ పాలస్తీనాలో దాని ఉనికే లేకుండా చేయాలన్నది ఇజ్రాయెల్‌ ఆలోచన. తద్వారా మరిన్ని వేలమంది తమకు తాముగా చనిపోయేట్టు చేస్తున్నది.

ఇక, ఏప్రిల్‌ ఒకటిన సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ భవనంమీద క్షిపణి దాడిచేసి, రివల్యూషనరీ గార్డ్స్‌ ఉన్నతస్థాయి కమాండర్లను ఇజ్రాయెల్‌ చంపివేయడం ప్రమాదకరమైన చర్య. ప్రతీకారం తీర్చుకొని తీరుతానని ఇరాన్‌ వెంటనే హెచ్చరించింది. ఆ దేశం కానీ, దాని అండదండలతో దాడులు చేస్తున్న హౌతీ, హిజ్‌బుల్లా ఇత్యాది సంస్థలు కానీ తనను ఏమీ చేయలేవని ఇజ్రాయెల్‌కు గట్టినమ్మకం ఉన్నట్టుంది. కానీ, ఇరాన్‌ అధినేత హెచ్చరికల నేపథ్యంలో ప్రతీకారం ఏదో ఒక స్థాయిలో ఉంటుందన్నది వాస్తవం. ప్రతిదాడులు జరిపే హక్కు తనకు ఉందని భద్రతామండలి సమావేశంలో ఇరాన్‌ విస్పష్టంగా ప్రకటించింది. హమాస్‌ను సమూలంగా నిర్మూలించేవరకూ యుద్ధం కొనసాగుతుందని చెబుతూ చిత్తంవచ్చినట్టు వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్‌ను వెంటనే దారికితెచ్చి కాల్పుల విరమణకు ఒప్పించకపోతే, యుద్ధం విస్తరించి, చర్చలకు కూడా వీల్లేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.

Updated Date - Apr 05 , 2024 | 02:53 AM