సీమకు చేసిన ద్రోహం చాలదా జగన్?
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:20 AM
రాయలసీమ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా కావాల్సింది సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల రద్దు, 90శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాల సరఫరా...

రాయలసీమ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా కావాల్సింది సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, వ్యవసాయ మోటార్లకు మీటర్ల రద్దు, 90శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాల సరఫరా, హత్యా రాజకీయాల నివారణ. 1947 నుండి 2024 వరకు అంటే 77 ఏళ్ల పాలనలో 56 ఏళ్లు అధికారంలో ఉన్నది జగన్ తండ్రి పార్టీ, జగన్‌రెడ్డి పార్టీనే. ఈ సుదీర్ఘ కాలంలో రాయలసీమ రాళ్లసీమగానే మిగిలిపోయింది.
1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, 90శాతం సబ్సిడీతో డ్రిప్, ఉద్యానవన పంటల ప్రోత్సాహం, రహదారుల అభివృద్ధి, టూరిజం అభివృద్ధి చెప్పుకోదగిన స్థాయిలో జరిగింది. ఫ్యాక్షన్ హత్యల్ని అదుపుచేసి రక్తపాతం తగ్గించారు. సామాజిక న్యాయం టీడీపీ పాలనలోనే అమలైంది. కడప జిల్లా నుండి తొలిగా బీసీ ఎమ్మెల్యే, బలిజలు మంత్రులు అయ్యారు. బీసీలను టీటీడీ చైర్మన్లుగా చేసింది టీడీపీనే. విశ్వవిద్యాలయ వీసీలుగా మైనార్టీలను నియమించింది టీడీపీ పాలనలోనే.
కాంగ్రెస్, వైసీపీ పాలనలో దోచుకొని నేతలు బాగుపడ్డారు. టీడీపీ పాలనలో రాయలసీమ ప్రజలు బాగుపడ్డారు. సీమ రైతులు, బడుగు బలహీనవర్గాల ప్రజలు బాగుపడితే తమ పెత్తనం, దోపిడీ సాగదని భావిస్తున్న వైసీపీ నేతలు శ్రీబాగ్ పేరుతో ప్రాంతీయ చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారు. ఏ జగన్ కుటుంబమైతే సీమకు ద్రోహం చేసిందో వారి సొంత మీడియాలో శ్రీబాగ్ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వీరి ఉచ్చుల్లో తగులుకుంటే సీమ రైతులు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువగా నష్టపోతారు.
వైఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీబాగ్ అంటూ ఎన్టీఆర్ ప్రభుత్వంపై విద్వేషం రెచ్చగొట్టారు. హక్కు జలాలా? మిగులు జలాలా? అంటూ కుతర్కం లేవదీసి తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరిపై ప్రజల్ని రెచ్చగొట్టారు. ఎన్టీఆర్‌పై దాడి ప్రయత్నం చేశారు. అధికారానికి వచ్చిన వైఎస్ పాలనలో జలయజ్ఞాన్ని జగన్ ధనయజ్ఞం చేశారు. ఓబులాపురం గనులు, మంగంపేట బెరైటీస్ గనులు, లైమ్ స్టోన్ గనులు, శేషాచలం ఎర్రచందనం, అసైన్‌మెంట్ భూములు, నదుల్లోని ఇసుక వంటి సీమ సహజ వనరుల్ని కొల్లగొట్టారు. ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, చర్చీ, మసీదు, దేవాదాయ భూముల్ని కొల్లగొట్టారు. జగన్ పాలనలో హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో స్థాపించలేదు. పైగా కృష్ణా ట్రిబ్యునల్ కార్యాలయాన్ని విశాఖపట్నంలో పెట్టమని కేంద్రానికి లేఖ రాశారు.
కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల్ని కేంద్రానికి ధారాదత్తం చేసింది జగనే. కృష్ణా నదిలో మిగులు జలాలపై హక్కు కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు వైఎస్ ప్రభుత్వం లేఖ ఇచ్చి సీమ సాగునీటి ప్రాజెక్టులకు ద్రోహం చేశారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ పేరుతో జగన్ తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాన్ని సృష్టించి– కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదులపై రాష్ట్ర హక్కుల్ని కేంద్రానికి ధారాదత్తం చేశాడు. ఏ వివాదం లేని, పైగా 798 అడుగుల నుండి నీరు తోడుకొనే ముచ్చుమర్రిని, హంద్రీ నీవా కెనాల్ వెడల్పు పనుల్ని, గాలేరు నగరి రెండో దశ, కుందూ నదిపై రిజర్వాయర్ నిర్మాణం, గుండ్రేవుల, ఆర్‌డీఎస్, వేదవతి, గురురాఘవేంద్ర లాంటి నిర్మాణాలకు మొండి చేయి చూపారు. ఉన్న రిజర్వాయర్లలో పూర్తిస్థాయి నీటి నిలువలకు అవసరమైన భూసేకరణకు తగు నిధులు కేటాయించలేదు. దీనివల్ల 120 టీఎంసీల హక్కు జలాలను కూడా రిజర్వాయర్లలో నిలుపుకునే వీలులేకపోతోంది. ఇసుక మాఫియాకు అన్నమయ్య ప్రాజెక్టును బలిపెట్టారు. కొట్టుకుపోయిన పింఛా ప్రాజెక్టును తిరిగి నిర్మించలేదు. ప్రాజెక్టుల గేట్ల మరమ్మత్తులకు నిధులు ఇవ్వనందున తుంగభద్ర గేటుతోపాటు అనేక గేట్లు కొట్టుకుపోయాయి. 90శాతం సబ్సిడీ సదుపాయం ఉన్న డ్రిప్ ఇరిగేషన్‌ను నీరుగార్చారు. 2014–-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో రూ.7లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా– అందులో సాగునీటి ప్రాజెక్టులకు రూ.71వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో సీమ ప్రాజెక్టులపై రూ.12,500 కోట్లు ఖర్చు చేసింది. 2019–-24 మధ్య జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా– అందులో సాగునీటి ప్రాజెక్టులకు రూ.31వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇందులో సీమ ప్రాజెక్టులపై కేవలం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. పైగా ఎన్జీటీలో వివాదంలో ఉన్న ఆవులపల్లి లాంటి పనులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి లాంటి వారికి రూ.600కోట్లకు పైగా దోచిపెట్టారు. సీమ భూములన్నింటికీ నీరు పారి రైతులు, రైతు కూలీలు బాగుపడితే తమ ఫ్యాక్షన్ ముఠాకు కిరాయి హంతకులు దొరకరనే భయంతో సీమ ప్రగతికి తూట్లు పొడవడానికి శ్రీబాగ్ పేరుతో తిరిగి చిచ్చుపెట్టే కుట్రలు చేస్తున్నారు. అధికారం పోతుందని తెలిసి పరిపాలన చివరి రోజుల్లో రాజధానిలో ఉండాల్సిన కొన్ని ఆఫీసుల్ని కర్నూలులో పెట్టారు. కొత్త ప్రభుత్వం వాటిని మార్చుతుందని, ఆ సాకుతో ప్రాంతీయ చిచ్చును రెచ్చగొట్టవచ్చని పథకం పన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు.
రాయలసీమ ప్రజల అభివృద్ధికి కావల్సింది సాగునీటి ప్రాజెక్టులకు భారీ నిధుల కేటాయింపు. భారీ పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు, ఉపాధి కల్పించటం కావాలి. విద్యా సంస్థలకు నిధుల కేటాయింపులు పెరగాలి. పంటలకు ధరలు పడిపోకుండా కాపాడాలి. ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వం చేసింది, చేస్తున్నది. తెలుగుదేశం ప్రభుత్వం గత నెలలోనే కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25 కోట్ల పెట్టుబడులతో 75 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు కేంద్రం నుండి అనుమతి పొందింది. రాయలసీమ జిల్లాలకు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ సాధించింది. విద్యుత్ రంగంలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులతో రూ.7.75 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతోంది. ఇందులో అధిక భాగం సీమకే దక్కుతాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే జగన్ పథకాన్ని రద్దు చేశారు. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటును యుద్ధప్రాతిపదికన వరద సమయంలోనే బిగించి రాయలసీమ సాగునీటిని కాపాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో గాలేరు నగరికి రూ.2,888కోట్లు, హంద్రీ నీవాకు రూ.1,867కోట్లు, పులివెందుల కెనాల్‌కు రూ.398కోట్లు, తెలుగుగంగకు రూ.887కోట్లు ఇలా భారీగా నిధులు కేటాయించారు. బొల్లాపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి గోదావరి జలాలు, బానకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు అనుసంధానం ద్వారా సీమలో ప్రతి ఎకరాకు నీరందించే లక్ష్యంతో పోలవరం నదుల అనుసంధానం జరుగుతోంది. తెలుగుగంగ, హంద్రినీవా, గాలేరునగరి, కేసీ కెనాల్ మోడరైజేషన్, పోతిరెడ్డిపాడు నిర్మాణం, ముచ్చుమర్రి ఎత్తిపోతల చేసింది తెలుగుదేశం. 7,500 మెగావాట్ల సామర్థ్యం గల విండ్ సోలార్ ప్లాంట్‌ను నిర్మించి 13వేల ఉద్యోగాలు కల్పించింది. కియా పరిశ్రమను స్థాపించింది చంద్రన్నే. స్విమ్స్, బర్డ్, టాటా క్యాన్సర్ ఆసుపత్రి, తిరుమలకు తెలుగుగంగ జలాలు, ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధి జరిగింది చంద్రన్న పాలనలోనే. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేశారు. ఓర్వకల్లు, కడప విమానాశ్రయాలకు వయోబులిటి ఫండ్ ఇచ్చారు. ద్రవిడ యూనివర్శిటీ, తిరుపతి ఐఐటీ, ఐషర్, ట్రిపుల్ ఐటీ, శ్రీసిటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ, హిందూపూర్‌లో నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సస్, ట్రిపుల్ ఐటీ కర్నూల్, ఉర్దూ యూనివర్శిటీ కర్నూల్ ఇవన్నీ చంద్రబాబు స్థాపించినవే. జగన్ ముఠా అధికారంలో ఉంటే దోచుకోవడం, అధికారం పోతే శ్రీబాగ్ అంటూ ప్రాంతీయ చిచ్చు, కుల చిచ్చు రేపటం పనిగా పెట్టుకున్నారు. వైకాపా కుట్రలను, అబద్ధాలను తిప్పికొడదాం, రాయలసీమ ప్రగతి సాధిద్దాం.
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్