నిరుద్యోగ సమస్యకి చిట్కాల పరిష్కారమా?
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:35 AM
తాజా బడ్జెట్టులో, నిరుద్యోగుల కోసం, లక్షా 7 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది! ఎందుకూ? రకరకాల పరిశ్రమలలో, ప్రైవేటు రంగంలో, దాదాపు 50 లక్షల కొత్త ఉద్యోగాలు దొరికేలా!...

తాజా బడ్జెట్టులో, నిరుద్యోగుల కోసం, లక్షా 7 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది! ఎందుకూ? రకరకాల పరిశ్రమలలో, ప్రైవేటు రంగంలో, దాదాపు 50 లక్షల కొత్త ఉద్యోగాలు దొరికేలా! ‘ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింద’ని పత్రికలు కూడా ప్రకటించాయి! కానీ, ఆ రకపు కేటాయింపులు, ‘నిరుద్యోగం’ అనే రాకాసి వ్యాధిని ఏ మాత్రం తగ్గించవని బైట వున్న లెక్కలు చెపుతున్నాయి. ఇప్పటికే, పని చేసే సామర్ధ్యం వుండీ, పని దొరకనీ, 28 కోట్ల మంది నిరుద్యోగులు వున్నారని ఆ లెక్కలే చెబుతున్నాయి. అంతేకాదు. ఇంకా, ప్రతీ సంవత్సరం, 2 కోట్ల 40 లక్షల మంది, అప్పటికి పెరిగిన యువతీ యువకులు, ఉద్యోగాల కోసం కొత్తగా తయారవుతున్నారు. ఇటువంటి స్తితిలో, ప్రభుత్వం, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా, ప్రకటించే బడ్జెట్టు కేటాయింపులు ఏ మాత్రమూ సరిపోయేవి కావు.
ఈ నిరుద్యోగ సమస్య గురించి, ప్రభుత్వమూ పారిశ్రామికవేత్తలూ, ఆర్ధికవేత్తలూ, చేస్తున్న రకరకాల సూచనల్ని చూద్దాం. ముందుగా ఒక ఉదాహరణ! దేశంలోని అన్ని ప్రాంతాలనీ కలిపే రహదారుల్ని నిర్మిస్తే, కొన్ని లక్షలమందికి పని దొరుకుతుందనేది ఒక సూచన! కానీ, జరుగుతున్నది ఏమిటి? ఒకప్పుడు, ఒక్క రహదారి నిర్మాణానికి కొన్ని ‘వందల మంది’ అవసరం అయితే, ఇప్పుడు కొన్ని ‘పదుల మందే చాలున’ని ఇప్పటి లెక్క! ఎందుకంటే, భారీ యంత్రాలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి! నేలని బాగా లోతుగా తవ్వే యంత్రాలూ (జె.సి.బి.లు); రోడ్డు వెయ్యడానికి కావలసిన సిమెంటునీ, ఇసకనీ కలిపి తయారుచేసే కాంక్రీట్ మిక్చర్లూ; రోడ్డుని చదును చేసే రోడ్డు రోలర్లూ; నిర్మాణ సామగ్రిని తీసుకొచ్చే పెద్ద పెద్ద ట్రక్కులూ వంటివెన్నో భారీ యంత్రాలను ఉపయోగించడం వల్ల, కార్మికుల్ని తక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒక పెద్ద వెడల్పు రహదారిలో, ఒక కిలోమీటరు రోడ్డు వెయ్యడానికి 20 మందిని మాత్రమే, 40 రోజుల్లో మాత్రమే పనిలో పెడతారని ఇప్పటి లెక్క! కాబట్టి, భారీ యంత్రాలను ఉపయోగించి, కార్మికులకు పనులే లేకుండా చేసే ‘ప్రధానమంత్రీ గ్రామ్ సడక్ యోజన’ అని ఎన్ని గొప్ప పేర్ల పధకాలు పెట్టినా, వాటిలో ఏ పధకమూ నిరుద్యోగం సమస్యని పెంచుతుందేగానీ తగ్గించదు.
ఇప్పుడు బడ్జెట్టులో ఒక కొత్త పధకం పెట్టారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమల వారికి, డబ్బు రూపంలో కొంత ప్రోత్సాహకాలు అందించే పధకం. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి, ఒక నెల జీతాన్ని ప్రభుత్వమే మూడు వాయిదాల్లో ఇవ్వడం. ఎప్పటికప్పుడు సాంకేతికత (టెక్నాలజీ) మెరుగవుతూ వుంటుంది కాబట్టి, దానికి తగిన నైపుణ్యాన్ని నేర్చుకునే సమయంలో, ఆ నిరుద్యోగులకి కొంత డబ్బు (‘స్టైపెండ్’) ఇవ్వడం. నైపుణ్యాలు నేర్చుకున్న తర్వాత కూడా వారందరికీ ఉద్యోగాలు గ్యారంటీగా దొరుకుతాయో లేదో స్పష్టత లేదు. ఇక, ప్రతి ఏటా కొత్తగా ఉద్యోగాలు కావలిసిన ‘2 కోట్ల 40 లక్షల’ మంది యువజనుల మాటేమిటి?
ఎన్ని పధకాలు పెట్టినా, ఇప్పుడు వున్న పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్తలో నిరుద్యోగం అనేది సమాజానికి పుట్టుకతో ప్రారంభమైన రాచపుండు! దీనికి చిట్కా వైద్యాలెలా పని చేస్తాయి? ‘లాభమే’ లక్ష్యంగా గల ఈ ఆర్ధిక విధానంలో, ఆ లాభాల్ని సంపాదించడానికి, పరిశ్రమల వాళ్ళు అనుసరించే ఒక ప్రధానమైన పద్ధతి, ‘ఉత్పాదకత’ కోసం సాంకేతికతల్ని పెంచుకుంటూ పోవడం! సాంకేతికత అంటే, భారీ యంత్రాలనూ, ఆటోమేటిక్ యంత్రాలనూ నడుపుతూ తక్కువ మంది కార్మికులు, తక్కువ ఖర్చుతో, పెద్ద మొత్తంలో, ‘సరుకుల్ని’ ఉత్పత్తి చేసేలా చూడడం! ఈ మధ్య, ‘కృత్రిమ మేధ’తో (‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’) అంటే కంప్యూటరు సైన్స్‌ని ఉపయోగించి, మనుషులకున్న తెలివితో పోలుస్తూ, యంత్రాల్ని ఉపయోగించడం! ఈ మార్గంలో, కోట్ల కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఏర్పరిచే మార్గాలోచనే లేకుండా ఆ సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నాలు ఎక్కువయ్యాయి!
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అసలు యంత్రాలే వద్దని కాదు. మానవుల మేధాశ్రమల వల్లా, శారీరక శ్రమల వల్లా తయారైన యంత్రాలు, మార్క్సు ‘కాపిటల్’లో చెప్పినట్టు, మానవుల ‘‘పని భారాన్ని తగ్గిస్తాయి. కానీ, పెట్టుబడి వాటిని ఉపయోగించినప్పుడు, అవి శ్రమ తీవ్రతను పెంచుతాయి.’’ పెట్టుబడిదారుల సంపదని పెంచి, కార్మికుల్ని ‘పరమ దరిద్రులుగా’ (‘పాపర్స్’గా) చేస్తాయి. పెట్టుబడి అన్నప్పుడు అది చిన్నస్తాయిదైనా, మధ్యస్తాయిదైనా, భారీ స్తాయిదైనా, సాధారణంగా పెట్టుబడిదారులు ఏదో స్తాయిలో యంత్రాలను ఉపయోగించడం, తక్కువమంది కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ పరిశ్రమలు నడపడానికే! దాని ఫలితమే, నిరుద్యోగం రెట్లు మరింతగా పెరగడం.
అది ఎలా జరుగుతుందో చూద్దాం: ఒక తివాచీల ఫ్యాక్టరీ, సంవత్సరానికి 6 కోట్ల పెట్టుబడితో పనిచేస్తోంది అనుకుందాం. యంత్రాలూ, ముడిపదార్ధాలూ వగైరాల కోసం 3 కోట్లు. జీతాల కోసం 3 కోట్లు. ఈ జీతాలతో సంవత్సరానికి 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక మనిషికి సంవత్సర జీతం: 3 లక్షలు. ఇలా ఉండగా, కార్మికుల అవసరాన్ని సగానికి తగ్గించే కొత్త యంత్రం వచ్చినప్పుడు? జీతాలలోనించే 1 కోటీ, 50 లక్షల్ని తగ్గించి, దాన్ని తీసి, కొత్త యంత్రం కోసం అదనంగా పెట్టారు. కొత్త యంత్రం వల్ల 50 మంది కార్మికులు, అవసరం లేకుండా, అదనం ఐపోయారు. మిగిలిన 50 మంది కార్మికులతోనే గతంలో జరిగిన పని అంతా జరుగుతుంది.
ఆ పెట్టుబడి, గతంలో: యంత్రాలూ, వగైరాలకు– 3 కోట్లూ + జీతాలకు 3 కోట్లూగా ఉంటే, అదే ఇప్పుడు: యంత్రాలకు 4 కోట్ల, 50 లక్షలుగా పెరిగి + కార్మికుల జీతాలకు 3 కోట్ల నించి, 1 కోటీ, 50 లక్షలుగా తగ్గిపోయింది! ఆ పెట్టుబడితో గతంలో: 100 మంది కార్మికులు పనిలో ఉంటే, దానితో ఇప్పుడు 50 మంది మాత్రమే పనిలో ఉన్నారు. ఇంకో 50 మంది నిరుద్యోగులయ్యారు.
దీనికి పరిష్కారం, యంత్రాలు అనే ‘ఉత్పత్తి సాధనాల’ రూపంలో వున్న పెట్టుబడిని, శ్రమలు చేసే కార్మిక వర్గం స్వాధీనం చేసుకోవడమే! ఇది జరగాలంటే, చాలా పనులు జరగాలి. అన్నిటికంటే ముందు జరగవలిసింది: ‘‘పాలక వర్గాల రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంస్తాపరంగా పురోగమించి వుండకపోతే, ఆ అధికారానికి వ్యతిరేకంగా నిరంతర ప్రచారం ద్వారానూ, పాలకవర్గాల విధానాల పట్ల శతృపూరిత వైఖరిని ప్రదర్శించడం ద్వారానూ, కార్మికవర్గానికి శిక్షణ ఇచ్చి తీరాలి. లేకపోతే, కార్మికవర్గం పాలకవర్గాల చేతిలో ఆట వస్తువుగా వుండిపోతుంది.’’ (మార్క్స్, 23–11–1871).
ఈ పని చెయ్యవలిసింది ఎవరు? కార్మికవర్గ రాజకీయ పార్టీల వారు. మరి వారు ఈ పని చేస్తున్నారా?
రంగనాయకమ్మ