Share News

పేదల వైద్యానికి ఇదేనా ప్రాధాన్యం?

ABN , Publish Date - Feb 15 , 2024 | 05:35 AM

ప్రభుత్వాలు తాము ఎంపిక చేసుకున్న రంగాలకి కాస్త ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. దానికి తగ్గట్టుగానే బడ్జెట్‌నూ కేటాయిస్తాయి. ఉదాహరణకు గత ప్రభుత్వం, రాష్ట్రంలో జల సంరక్షణ, గ్రామీణ పారిశుధ్యం వంటి...

పేదల వైద్యానికి ఇదేనా ప్రాధాన్యం?

ప్రభుత్వాలు తాము ఎంపిక చేసుకున్న రంగాలకి కాస్త ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. దానికి తగ్గట్టుగానే బడ్జెట్‌నూ కేటాయిస్తాయి. ఉదాహరణకు గత ప్రభుత్వం, రాష్ట్రంలో జల సంరక్షణ, గ్రామీణ పారిశుధ్యం వంటి అంశాలను తీసుకొని వాటిపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు రూపొందించింది. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించింది. ఏ ప్రభుత్వాలు ఏయే రంగాలని ప్రాధాన్యతాంశాలుగా తీసుకున్నా... విద్య, ఆరోగ్యం వంటివి ఏ ప్రభుత్వానికైనా నిత్య ప్రాధాన్యతాంశాలుగా ఉండాల్సిందే. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం అన్నిటికంటే బటన్‌ నొక్కి సంక్షేమ కార్యక్రమాల పేరిట కోట్లాది రూపాయల పంపిణీకి మొదటి ప్రాధాన్యతనిస్తోంది. ఇక రెండో ప్రాధాన్యతాంశంగా సచివాలయాల స్థాయిలో నిర్మించాల్సిన భవనాలు కనిపిస్తున్నాయి. అయితే, అందరికీ అవసరమైన ఆరోగ్య రంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది.

ముఖ్యంగా పేదల ఆరోగ్యానికి అండగా ఉంటున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకోకపోవడంతో రాష్ట్రంలోని పేదలు, సామాన్య రోగులు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. పేదల ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వాసుపత్రులు సౌకర్యాలు, తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేక ఇప్పటికే మంచాన పడిపోగా, ఇక కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పేదలకు అందుతున్న ఆరోగ్యశ్రీ కూడా సకాలంలో నిధులు ఇవ్వని ప్రభుత్వ వైఖరి కారణంగా అంపశయ్యకి చేరిపోయింది.

ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, పెన్షన్‌ కానుక, సంపూర్ణ పోషణ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, విద్యా కానుక, నవశకం, లా నేస్తం, మత్సకార భరోసా, నేతన్న నేస్తం, వాహన మిత్ర, రైతు భరోసా, నవోదయం, పెళ్లి కానుక వంటి రకరకాల పేర్లతో లక్షల కోట్లు ముఖ్యమంత్రి పంచి పెడుతున్నారు. కానీ కేవలం 1200 కోట్ల పెండింగ్‌ కారణంగా, పేదల ఆరోగ్యం కోసం ఆయన తండ్రి హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడం సమర్ధనీయం కాదు. ఈ పెండింగ్‌ల కారణంగా 3000 రోగాలకు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో పేదలకు అందాల్సిన చికిత్సలు అందడం లేదు. చికిత్సల కంటే ముందు జరగాల్సిన కేస్‌ షీట్ల పరిశీలనకు సైతం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో సరిపడా వైద్యులు లేరు. నవంబరు నుంచి 57,479 ఆప్తాల్మాలజీ, 3,029 కార్డియాలజీ, కార్డియోథొరాసిస్‌ కేస్‌ షీట్లు పరిశీలన స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందుకు సుమారు 60 మంది నిపుణులైన వైద్యులు అవసరం కాగా, కేవలం 31 మంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు వైద్యనిపుణుల కొరత, మరోవైపు నిధుల విడుదల చేయకపోవడం ఆసుపత్రుల యాజమాన్యాలకు తల నొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో పేదల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి.

ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల విమర్శల పట్ల అనుచితంగా ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం, ఇతరుల సలహాలు పెడచెవిన పెడుతున్నా, కనీసం ఆత్మ విమర్శకైనా సిద్ధం కావాలి. ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం శస్త్రచికిత్స జరిగిన 60 రోజుల్లో సంబంధిత క్లెయిములు ఆసుపత్రులకు చెల్లించాలి. అయితే నెలలు గడుస్తున్నా చెల్లింపులు చేయడం లేదు. బకాయిలు పేరుకుపోవడం వల్ల ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద రోగుల్ని చేర్చుకోవడం లేదు. ఏ నాయకుడో ఫోన్‌ చేస్తే, కనీసం సగం మొత్తం చెల్లిస్తేనే దవాఖాన గేట్లు తెరుస్తున్నారు. శస్త్రచికిత్సలకయ్యే మొత్తంలో సగం కూడా చెల్లించలేని సామాన్యుల పరిస్థితి ఆ సమయంలో దారుణంగా ఉంటోంది.

బకాయిలు, వైద్యనిపుణుల మాట అటుంచితే, ప్యాకేజీల మొత్తాలు చాలవని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు ఎప్పటినుంచో గోల పెడుతున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ కింద దేశవ్యాప్తంగా చెల్లిస్తున్న ప్యాకేజీలతో పోలిస్తే, మన రాష్ట్రంలో చెల్లిస్తున్న మొత్తాలు తక్కువగా ఉంటున్నాయని యాజమాన్యాలు అంటున్నాయి. ఇప్పటివరకూ కార్పొరేట్‌ ఆసుపత్రులకు చెల్లించాల్సిన దాదాపు వెయ్యి కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో, నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే రోగుల్ని చేర్చుకోడానికి ముందుకు రావడం లేదు. ఇకపోతే, బకాయిలు చెల్లించక, మరోవైపు ప్యాకేజీల మొత్తం పెంచాలన్న నెట్‌వర్క్‌ ఆసుపత్రుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం, ఎవరూ అడక్కపోయినా ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచడం కొసమెరుపు.

డొంకాడ గోపాల్‌

Updated Date - Feb 15 , 2024 | 05:35 AM