Share News

మధ్యంతర భృతి లేనట్టేనా?

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:04 AM

ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వాలి. ప్రభుత్వ ఉత్తర్వులలోనే ఇది ఉంది. దీన్నే అమలుపరచడంలో ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా...

మధ్యంతర భృతి లేనట్టేనా?

ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వాలి. ప్రభుత్వ ఉత్తర్వులలోనే ఇది ఉంది. దీన్నే అమలుపరచడంలో ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తోంది. ఈ ప్రభుత్వం పదేళ్లకే పీఆర్సీ అంటూ కొత్త విధానానికి తెరలేపి ఉద్యోగ, ఉపాధ్యాయుల నోరు మూయించి, కొత్త డిమాండ్‌కు శ్రీకారం చుట్టింది. ఆ డిమాండ్‌ను పరిష్కరించుకోవడం కోసం సంఘాలు నానా యాతనలు పడ్డాయి. ఉన్న సమస్యలను పక్కనపెట్టి ఐదేళ్లకే పీఆర్సీ అనే కొత్త డిమాండ్‌ను ప్రభుత్వం పరిష్కరిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆర్భాటంగా ప్రకటించాయి. అయితే ప్రస్తుతం మధ్యంతర భృతి (ఐఆర్‌) లేని పిఆర్సీనే ఉంటుందన్నది ప్రభుత్వ వాదన. కానీ మధ్యంతర భృతి ఎందుకు ఇస్తారన్న విషయాన్ని అటు సంఘాలు, ఇటు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించకపోవడం వల్లే సమస్యను కొలిక్కి తీసుకురాలేకపోయాయి. దీంతో ఉద్యోగులకు అన్యాయం జరగనున్నది.

పీఆర్సీ కమిటీ వేశాక సకాలంలో వేతన స్థిరీకరణ జరగకపోతే ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం సమాంతరం చేయడం కోసమే ఐఆర్ మంజూరు చేస్తారు. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలుచేయాలి. కానీ ఇప్పటివరకు ఎనిమిది నెలలు గడిచినా పీఆర్సీ ఆలస్య కాలానికి మధ్యంతర భృతి లేదు. ప్రభుత్వం డిసెంబర్ లోపు కమిటీ నివేదిక తెప్పించుకోవాల్సింది, కానీ అది జరగలేదు. అందుకే మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నా ఫలితం లేదు.

రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి డా. మన్మోహన్ సింగ్‌ను 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం జూలై, 2023లో నియమించింది. ఎనిమిది నెలలు గడిచిన తర్వాత సిబ్బందిని నియమిస్తూ 22 ఫిబ్రవరి, 2024న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆలస్యానికి ఉద్యోగులు బాధ్యులు కారు, కాబట్టే మధ్యంతర భృతి డిమాండ్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. సంవత్సరంలో నివేదిక అందించాలని ప్రభుత్వం సూచించినా, ఇప్పటికే 8 నెలలు గడిచినందున సకాలంలో నివేదికొచ్చే అవకాశం లేదు. ఈ విషయాలన్నీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమావేశాల్లో ప్రస్తావించి ఉంటే మధ్యంతర భృతికి బలం చేకూరేది.

ఇప్పటివరకు ఏపీలో మధ్యంతర భృతి లేని పీఆర్సీ లేదు. గత పీఆర్సీలను పరిశీలిస్తే– 9వ పీఆర్సీలో 22 శాతం, 10వ పీఆర్సీలో 27 శాతం, 11వ పీఆర్సీలో 27 శాతం ఐఆర్ ఇచ్చారు. పీఆర్సీ ఆలస్యమైన ఆరు నెలల్లోనే మధ్యంతర భృతి ప్రకటించారు. 12వ పీఆర్సీ అమలు ఇప్పటికీ ఎనిమిది నెలలు ఆలస్యమైనా మధ్యంతర భృతి ఇవ్వలేదు. దీంతో పెరిగిన ధరల కనుగుణంగా, ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా పెరగాల్సిన వేతనాలు చేజారిపోతాయి. రాబోయే కాలంలో పీఆర్సీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వాలు సకాలంలో పీఆర్సీ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికే రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒక విడత పీఆర్సీ అంత నష్టపోయారు. మధ్యంతర భృతికి మంగళం పాడితే పీఆర్సీకి మంగళం పాడినట్లే. పీఆర్సీలో ఫిట్‌మెంట్.. ఐఆర్ మీద ఆధారపడి ఉంటుంది. ఐఆర్ లేనప్పుడు ఫిట్‌మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. దీన్ని సమాంతరం చేయడం సున్నితమైన అంశం. ఆర్థిక అంశాలను, ధరల సూచికలను పరిశీలించి, కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐఆర్ శాతాన్ని ప్రతిపాదించాలి. తదుపరి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి కమిటీ నివేదికను సమర్పించాలి. కొత్త కమిటీ గత పీఆర్సీల్లో అనుసరించిన సంప్రదాయాలను పరిశీలించాలి. 30 శాతం కంటే తక్కువ లేని ఐఆర్ ప్రతిపాదించాలి. వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రతిపాదన నివేదికలు, జిల్లాల వారీ సమావేశాలను ఏర్పాటు చేయాలి. మరొక్కసారి చర్చలు జరిపి స్తబ్దతను నివారించాలి.

సి.వి. ప్రసాద్

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఏపీటీఎఫ్ అమరావతి

Updated Date - Feb 29 , 2024 | 04:04 AM