Share News

విభజన హామీల అమలులో ఏదీ సమాఖ్య స్ఫూర్తి?

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:48 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం ముగుస్తున్న తరుణంలో విభజన బిల్లులో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అరకొరగానే అమలవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం హామీల అమలులో చిత్తశుద్ధి చూపించవలసి ఉంది...

విభజన హామీల అమలులో ఏదీ సమాఖ్య స్ఫూర్తి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం ముగుస్తున్న తరుణంలో విభజన బిల్లులో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అరకొరగానే అమలవుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం హామీల అమలులో చిత్తశుద్ధి చూపించవలసి ఉంది. కేంద్రంలో ఎన్నో కీలక బిల్లులకు మద్దతు ఇచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు పలు హామీలను రాబట్టంలో విఫలమైంది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి కేంద్రంతో సత్సంబంధాల కోసం సయోధ్యతో వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని, విభజన బిల్లులోని హామీలు అమలయ్యేట్టు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌‌లా కాకుండా ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరిస్తామన్నారు. ఈ తరుణంలో కేంద్రం సానుకూలంగా బీజేపీ పాలిత రాష్ట్రంతో సమానంగా తెలంగాణను చూస్తుందని ఆశిద్దాం. విభజన బిల్లులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలలోనూ కీలకమైనవి ఏవీ అమలుచేయక అరకొర మాత్రమే చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఉభయ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి కాదు కదా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా వచ్చే పరిస్థితి దరిదాపుల్లో కనిపించకపోవడమే అని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్ముతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి విభజన బిల్లు రూపంలో బంగారం లాంటి అవకాశం లభించింది. గడిచిన పదేళ్ళల్లో బిల్లులో మంజూరు చేసిన, ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే ఆ పార్టీకి కీలక రాజకీయపక్షంగా జెండా ఎగురవేసే అవకాశం లభించి ఉండేది. బిల్లులో తప్పొప్పుల గురించి మాట్లాడే బీజేపీ ఆనాడు వారి పరిశీలన తరువాతే దాన్ని పార్లమెంట్‌లో పెట్టిన అంశాన్ని కప్పిపుచ్చుతుంది. దాన్ని సరిచేసే అధికారం వచ్చి ఇన్ని సంత్సరాలైనా ఆ దిశగా ఏనాడూ పని చేయలేదు.

విభజన చట్టంలోని సెక్షన్ 93లో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ 13లో మంజూరు చేసిన అంశాలు కొత్త రాష్ట్రాలలో సుస్థిర అభివృద్ధి కోసం పదేళ్ళ లోపు ఏర్పాటు చేయాలని స్పష్టంగా నిర్దేశించింది. గిరిజన, హార్టికల్చర్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలనీ నిర్దేశించారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి కేవలం రూ.135 కోట్లు కేటాయించి మీరే ఏర్పాటు చేసుకోవాలని చేతులు దులుపుకున్నారు. విభజన బిల్లులో పెట్టినవన్నీ కేంద్రం ఏర్పాటు చేసేవి మాత్రమే. అలాంటప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ హార్టికల్చర్ యూనివర్సిటీని రూ.1500కోట్లతో నిర్మించి ఐసీఆర్ క్రింద నిర్వహించాలి. కేసీఆర్ ప్రభుత్వం రూ.135కోట్లు తిరస్కరించి కేంద్రమే విద్యాలయాన్ని నిర్మించాలని పట్టుబట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.

బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విభజన జరిగిన ఆరు నెలలకే ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు దీని సాధ్యాసాధ్యాలపై లోతైన పరిశీలన చేసేందుకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదని చెప్పింది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయ్యారంలో లభించే ఐరన్ ఓర్‌లో నాణ్యత లేదని, అందువలనే ప్లాంట్ ఏర్పాటు సాధ్యపడదని ప్రకటించారు. మరోవైపు ఉక్కు మంత్రిత్వ శాఖ డీపీఆర్ కోసం సమాచారం పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదమూడు సార్లు లేఖలు రాసినా స్పందన లేదని తెలియజేసింది. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరి మాట నమ్మాలి అనే మీమాంసలో ప్రజలు ఉన్నారు.

తెలంగాణలో 4000 మెగా వాట్ల సామర్థ్యంతో ఎన్టీపీసీ ప్రాజెక్టును మంజూరు చేస్తూ అందుకు అవసరమైన కోల్ లింకేజీ కల్పించాలని విభజన బిల్లు ఆదేశించింది. కానీ ఇప్పటికి కేవలం 1600 మెగావాట్లు రూ.10,898కోట్లతో ఏర్పాటు చేసి మిగిలిన 2400 మెగావాట్లకు రూ.17,739 కోట్లతో 2016 మొదటి త్రైమాసిక ధరల ప్రకారం డీపీఆర్‌ను ‍ఎన్టీపీసీ పెట్టుబడుల బోర్డు ప్రతిపాదించింది. 2023 ధరల ప్రకారం సవరించిన అంచనాలు రూపొందించాలి, వాటికీ పెట్టుబడుల ఆమోదం పొందాలి. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున ఎన్టీపీసీ ఈ ప్రాజెక్ట్ రెండో దశను నిర్మించేందుకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. తాము ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని హెచ్చరించటంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించింది. దీని వల్ల రాష్ట్రానికి కేంద్ర పెట్టుబడులు, ప్రత్యక్ష పరోక్ష ఉపాధితోపాటు ఉత్పత్తి ఐయ్యే విద్యుత్‌లో 85శాతం రాష్ట్రానికే చెందుతుంది. జనవరిలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ శక్తి పథకం క్రింద ఈ రెండవ దశ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గును కేటాయించింది.

రైల్వేశాఖకు సంబంధించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలనీ, హైదరాబాద్ – ఆంధ్రప్రదేశ్‌లోని నగరాల మధ్య ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ కోసం కొత్త రైల్వే లైన్ల నిర్మాణం చేయాలని స్పష్టంగా నిర్దేశించింది. తెలంగాణలో నాలుగు దశాబ్దాల నినాదం, కలగా మిగిలిపోయిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై రైల్వేశాఖ చిన్నచూపు చూసిందనే చెప్పాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోపాటు అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి భూమి కేటాయింపు జరిపినా ముందుకు రాలేదు. ఈ మేరకు 2019 ఆగస్టుకు ముందే దేశంలో కోచ్ ఫ్యాక్టరీల అవసరం ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా పెట్టే ప్రసక్తి లేదు, అలాగే దేశంలో ఏటా అవసరమైన కోచ్‌ల కంటే మంజూరైన ఫ్యాక్టరీలలో ఎక్కువ కోచ్‌లు తయారవుతున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టంగా తెలిపింది. అంతేగాక భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం లేదని రైల్వే బోర్డు 2020 తేల్చిచెప్పింది.

హైదరాబాద్ – ఆంధ్ర రాజధాని, ఇతర నగరాలకు ర్యాపిడ్ రైల్వే సౌకర్యం ఏర్పాటు చేయాలని స్పష్టంగా విభజన చట్టంలో చెప్పినా సర్వే నిర్వహించాలన్న నిర్ణయానికి తొమ్మిదేళ్ళు పట్టింది. ఈ మేరకు ఈ ఏడాది పిభ్రవరిలో రైల్వే బోర్డ్ నిర్ణయం తీసుకుందని ఆర్టీఐకు సమాధానంగా సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, ఇతర తెలంగాణలోని ముఖ్య పట్టణాల నుండి ఆంధ్రప్రదేశ్ రాజధానికి ర్యాపిడ్ రోడ్ కనెక్టవిటీని ఏర్పాటు చేయాలన్న నిబంధన విషయానికొస్తే ఈ పదేళ్లలో రవాణా రహదారుల అభివృద్ధి సంస్థ రోడ్డు ప్రాజెక్టులను మంజూరు చేయలేదు, మంజూరైన వాటి నిర్మాణంలో పురోగతి లేదు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలంగాణాకు 34, ఆంధ్రప్రదేశ్‌కు 50 అసెంబ్లీ స్థానాలు పెంచి పునర్విభజన చేయాలని నిర్దేశించినప్పటికీ రాజ్యాంగ సవరణ చేయనిదే పెంపుదల కుదరదన్న అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పింది. కానీ జమ్మూ కశ్మీర్లో అర్టికల్ 370 రద్దు చేసిన తరువాత దేశంలోని అన్ని రాష్ట్రాలతో కశ్మీర్ రాజ్యాంగ పరంగా సమానం అయింది. బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి జమ్మూ కశ్మీర్ విభజన చట్టంలో 7 అసెంబ్లీ స్థానాలను పెంచుతూ తదనుగుణంగా డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీల ఇలాంటి వైఖరి వల్ల ప్రాంతాల మధ్య అనవసర విద్వేషాలు పెరుగుతాయి.

విభజన హామీల అమలు విషయంలో నిజానికి కేంద్రంపై ఆర్థిక భారం లేదు. బీఆర్‌ఎస్ బలహీనపడిన ప్రస్తుత తరుణంలో విభజన హామీలన్నీ నెరవేర్చిన పక్షంలో బీజేపీ తెలంగాణలో అధికారం వైపు వేగంగా అడుగులు వేయగలుగుతుంది.

ఇనగంటి రవికుమార్

సీనియర్ జర్నలిస్ట్

Updated Date - Apr 23 , 2024 | 03:48 AM