Share News

మన ఓటుకు ఏదీ నైతిక కొలమానం?

ABN , Publish Date - May 10 , 2024 | 01:07 AM

ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల స్థాయికి దిగజార్చి చాలా కాలం అయ్యింది. ఎంతలా అంటే ప్రపంచవ్యాప్తంగా నియంతలు కూడా ఎన్నికలు అనే ముసుగు వేసుకోడానికి ఆత్రుత పడుతున్నారు. కానీ ఎన్నికలు సక్రమంగా జరిగితే ఓటు వేయడం ఏ విధంగా...

మన ఓటుకు ఏదీ నైతిక కొలమానం?

ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల స్థాయికి దిగజార్చి చాలా కాలం అయ్యింది. ఎంతలా అంటే ప్రపంచవ్యాప్తంగా నియంతలు కూడా ఎన్నికలు అనే ముసుగు వేసుకోడానికి ఆత్రుత పడుతున్నారు. కానీ ఎన్నికలు సక్రమంగా జరిగితే ఓటు వేయడం ఏ విధంగా ప్రజాస్వామ్య ప్రక్రియో ఆలోచించాలి. ఓటు వేయడంలో ఒక ప్రత్యేకమైన వ్యవహారం ఇమిడి ఉంది. ఇందులో ప్రజలు తమకు ఉమ్మడిగా ‘స్వంతమైన’ దానిని ఇంకొకరి చేతికి ఉద్దేశపూర్వకంగా బదలాయించడం ఉంది. తమను తాము పరిపాలించుకొనడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల ఉమ్మడి సంపద. ఇందులో ప్రజలందరికి భాగస్వామ్యం ఉంది. ఈ ఉమ్మడి సంపదను నిర్వహించే బాధ్యతను ప్రజలు కొద్దిమంది రాజకీయ నాయకుల చేతిలో ఓటింగ్ ద్వారా పెడతారు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల తరఫున, వారి స్థానంలో, వారి పరోక్షంలో కొద్దిమంది పాలించేది. ప్రజల తరఫున పాలించడం అంటేనే నిరంకుశత్వానికి అవకాశం ఉందనేది స్పష్టం. అరుదుగా తప్ప ప్రజాస్వామ్యం ఎప్పుడూ ప్రజల చేత నడిపించబడేది కాదు. అంటే మరింత జాగ్రత్తగా ఓటు వేయాలని అర్థం. పుతిన్ కూడా 97శాతం ఓట్లతో ప్రజల తరఫున ఎన్నికయినట్టు ప్రకటించుకున్నాడు.


ప్రజలందరికీ మంచి చేసేదే నిజమైన ప్రజాస్వామ్యం అనే మాటను తరుచు వింటుంటాం. కానీ ప్రజలు అనే పదంలో అందరూ అనే అర్థం చరిత్రలో ఎప్పుడూ లేదు. నోరున్నవారి, బలమున్న వారి ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలుగా చలామణి అవుతూ వచ్చింది. బానిసల, కింది కులాల, స్త్రీల, శ్రామికుల ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలుగా చాలా కాలం చలామణి కాలేదు. అయినా ప్రజా ప్రయోజనం అనే మాట చాలా కాలంగా చలామణిలో ఉంది. ప్రజాస్వామ్యంలో పేదల శాతం తీవ్రంగా పడిపోలేదనేది వాస్తవం. ఆ అర్థంలో ఆచరణలో ప్రజాస్వామ్యం ‘ప్రజల కొరకు’ పనిచేయడం లేదు. ‘అందరి ప్రయోజనాలు తీర్చుతాం’ అనే వాదనను నియంతృత్వ వ్యవస్థలు కూడా వాడుకుంటాయి. అది ప్రజాస్వామ్య వ్యవస్థలకు ప్రత్యేకం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం అనే మాటను నిజమైన అర్థంలో ఏ రాజకీయ పార్టీ అయినా వాడితే, అది సమాజంలో ఎటువంటి సామాజిక బలం, గొంతు లేని అత్యంత అట్టడుగు వర్గాల ప్రయోజనాలకు ముందు పీట వేసిందా లేదా అనే నైతిక కొలమానాన్ని వెతకాలి. అంటే మెజారిటీ ప్రజల ప్రయోజనాలు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు కొలమానం కాదని మనం గుర్తించాలి.

సమాజంలో బడుగు వర్గాలు పాల్గొన్నంత చురుకుగా సంపన్నులు ఓటింగ్‌లో పాల్గొనరు. పేదలు డబ్బులు, వినియోగ వస్తువుల కోసం ఓట్లు వేస్తారని మధ్యతరగతి అంటుంది. మతపరమైన కారణాల రీత్యా మైనారిటీలు ఓటు వేస్తారని మెజారిటీ వాదులు అంటారు. కులం రీత్యా ఓటు వేసేవారు కూడా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారనేది ఇంకొక ఎత్తిపొడుపు. ఈ వాదనలు అన్నీ ఏదో ఒక భావజాల ప్రభావానికి లోనై ఓటు వేసే వారికి కూడా వర్తిస్తుంది. ఇవన్నీ ఓటు వేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందనే విశ్వాసం రీత్యా చేసేవే. ఏదో ఒకటి ఆశించి ఓటు వేయడం ఎప్పుడు ఒక రాజకీయ వ్యవహారమే.


ఓటు వేయడం ఎలాంటి బాధ్యత, ఎవరి పట్ల బాధ్యత? ప్రతి ఓటరుకు తెలుసు తన ఓటు వేల ఓట్లలో ఒక చిన్న భాగమని, తన ఓటుకు అంతిమ ఫలితానికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని. ఎన్నికైన ప్రతినిధులు తమ అధికారాన్ని, సంపదను పెంచుకున్నంత కాలం, ‘ఓటేస్తే నాకేమొస్తది’ అనే వ్యవహారం చాలా సహజం. పాలన వ్యాపారం అయిన తర్వాత, ఓటరు తన ధరను ఎందుకు అడగకూడదు? డబ్బు ఆశించే ఓటర్లు ప్రజాస్వామ్యం ‘ప్రజల కొరకు’ అనే వాదనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్నారు. సామాజిక సంబంధాలను డబ్బుమయం చేసిన మార్కెట్టు సాధించిన విజయంగా దీన్ని చూడవచ్చు. ఎటొచ్చి, లాభాలను ఆశించే రాజకీయ నాయకుడు ఎన్నికలలో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడడం లేదు. ఎన్నికైన ప్రతినిధులు లాభాలు సంపాదించు కుంటుంటే ఓటింగును వ్యాపారంగా ఎందుకు పరిగణించకూడదు? ఆ లాభాల్లో భాగాన్ని ఓటరు ఎందుకు ఆశించకూడదు? తాము చేసే సేవకు (ఓటు వేసే సేవకు) సాధ్యమైనంత లాభం పొందాలని ఒక పేద ఓటరు ఆశిస్తే, అతనిని తప్పు పట్టే నైతిక హక్కు, పన్నులు చెల్లించడం తప్ప తమకు ఏమీ ఒరగదని ఓటు వేయని మధ్య తరగతికి ఉందా? పేద ఓటరును ఆడిపోసుకునే హక్కు రాజకీయ పొలంలో మేసే ధనిక వర్గానికి అసలే లేదు.

ఇదంతా ప్రజాస్వామ్యంలో భాగం కాదని మనకు తెలుసు. ప్రజాస్వామ్యాన్ని అత్యంత నిమ్న వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేసేదని నిర్వచిస్తే, ఓటు వేయడాన్ని స్వప్రయోజనం కోసం వేసేదిగా పరిగణించకూడదు. అంటే నేను ఓటు వేసేది నా కంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న వారి తరపునే తప్ప నా తరపున కాదు– ఈ అర్థంలో మాత్రమే ఓటు వేయడం అనేది ఒక నైతిక, సామాజిక విధి.


ఎన్నుకోబడే ప్రతినిధి ప్రజల తరఫున ధర్మకర్తగా వ్యవహరించాలి. తమ మీద ఉంచిన విశ్వాసాన్ని ధ్వంసం చేయకూడదు. ప్రజాస్వామ్యానికి ఇది ఒక శక్తివంతమైన అర్థం. ఈ విస్తృతమైన అర్థాన్ని ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఒక సాధనంగా మాత్రమే భావించే వైఖరి ధ్వంసం చేసింది. అందుకే నిజమైన అర్థంలో మన ప్రతినిధి ఎలా పనిచేసాడు అనేది కాక అతను ఏ మేరకు జవాబుదారిగా మెలిగాడు అనేది ప్రజాస్వామ్యానికి కొలమానం. కానీ ఇప్పటికే తాము ఎంతో చేసాం అనేవారైనా, రాబోయే కాలంలో ఎంతో చేస్తాం అనేవారైనా తాము ప్రజలకు జవాబుదారిగా ఇప్పటివరకు ఉన్నారా, ఆ స్వభావం వాళ్ళలో ఉందా అనే విషయం చెప్పడం లేదు. ఈ అంశం ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో లేకపోవడం కొట్టొచ్చేలా కనిపించే అంశం.

ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసి పేదలకు సంక్షేమాన్ని ప్రకటిస్తున్నారనేది మధ్య తరగతికి రాజకీయాల పట్ల ఉండే ఆక్షేపణ. ప్రజాస్వామ్య వ్యవస్థలుగా చలామణి అయ్యేవి తమ సమస్యలు తీర్చుతాయి అని విశ్వసించే పేదలు ఎవరూ ఈ రోజు లేరు. ఈ వ్యవస్థలు పేదల అవసరాలు తీరే విధంగా రూపొందకపోవడం వెనక మధ్య తరగతి పాత్రా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల కింది మధ్య తరగతికి ఉన్న తరగని ఆశ వెనక అధికారం, దాంతో వచ్చే ప్రయోజనాల పట్ల చర్చ బాహాటంగానే జరగడం చూస్తాం. కులాన్ని, మతాన్ని, డబ్బును ఎరగా వేసి ఉద్యోగాలు సంపాదించే ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి చేయడం కాదు. కానీ ఈ వ్యవస్థలు ఎంతగా పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తే, సమస్యల్లో ఉన్న ప్రజలు అంతగా వీటిని ధ్వసం చేసైనా తమకు న్యాయం చేస్తాననే మాయచేసే నియంతలను ఎన్నుకోడానికి సిద్ధపడతారు. బలమైన నాయకుడు అనే భావన వెనక, తమ పురోగతికి అడ్డుపడే వ్యవస్థల కన్నా బలమైన నాయకుడు అనే భావన అంతర్లీనంగా ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల ఫలాలను కింది వర్గాల దాకా రాకుండా చేస్తే జరిగే పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా నియంతలు ఎన్నిక కావడంలో చూడవచ్చు. ప్రజాస్వామ్యానికి వస్తున్న ముప్పు గురించి వగచే మధ్యతరగతి ప్రజాస్వామ్యం పరిధిని విస్తృతం చేయడం ద్వారా మాత్రమే ఎదుర్కోగలదు. తమకు పనిచేయని ప్రజాస్వామ్యాన్ని మేమెందుకు కాపాడాలి అనే శ్రామిక వర్గం ప్రశ్నకు మధ్యతరగతి దగ్గర సమాధానం లేదు.


నమ్మకం అనే నైతిక విలువ లేకుండా ప్రజాస్వామ్య పునాదులు ఉండవు. వివక్షకు తావులేకుండా, న్యాయబద్ధంగా మనకు ప్రాతినిధ్యం వహిస్తాడు అనే నమ్మకం మీద ఆధారపడి మనం ఓటు వేయగలగాలి. మనుషుల మధ్య సంబంధాలను కలిపేది గుణాత్మకమైన ఈ విశ్వాసమే. అందుకే విశ్వాస ఘాతుకమే అన్నిటికంటే హీనమైనది. ఈ విశ్వాసం ఒక ఆదర్శం మాత్రమే కాదు, ఒక ఆచరణా మార్గం కూడా. నిత్య జీవితంలో మనం ఆందోళన చెందకుండా జీవించాలంటే మన చుట్టూ ఉన్నవారు తాము చేయాల్సిన పని చేస్తారనే నమ్మకం కలగాలి. సామాజికంగా తమకన్నా దిగువన ఉన్నవారి కోసం తాము వేసే ఓటులో ఈ నైతిక కర్తవ్యాన్ని మధ్య తరగతి గుర్తెరగాలి. ఇతర వర్గాల అభివృద్ధికి హామీ పడే పార్టీకి ఓటు వేయడంలో రాజ్యాంగ విలువైన సౌభ్రాతృత్వానికి ప్రాణం పొసే పాత్రను ప్రతి ఒక్కరు పోషించవచ్చు. మొత్తం సమాజం తరపున ధర్మ కర్తృత్వం వహించవచ్చు. వర్గాలకు అతీతంగా ‘భారతీయ ప్రజలమైన మేము’ అనే అమాయకమైన రాజ్యాంగ భావనకు ప్రాణం పోయవచ్చు.

రాజకీయ ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ సమాన అధికారం అనేది అమాయకమైన విషయమే. కానీ, అది కొద్దిగానైనా సాకారం కావాలంటే అధికారం చెలాయించే వాళ్లలో విశ్వాసం, ధర్మ కర్తృత్వం, జవాబుదారీతనం అనే విలువలు చాలా అవసరం. మనమున్నది ఆదర్శాలకు కాలం కానీ మాట నిజమే. కానీ ఓటు ద్వారా అధికార వ్యవస్థలను సృష్టించే వర్గాలు, ముఖ్యంగా మధ్య తరగతిలోనే ఈ ఆదర్శాలు కొద్దిగానైనా లేకపోతే, ఇక రాజ్య వ్యవస్థలో వాటిని ఆశించలేం.

మురళి కర్ణం

Updated Date - May 10 , 2024 | 01:08 AM