Share News

హరిత ఆర్థికం సమ్మిళితమేనా?

ABN , Publish Date - May 10 , 2024 | 01:01 AM

హరిత ఆర్థిక వ్యవస్థలుగా శీఘ్రగతిన పరివర్తన చెందేందుకు ప్రపంచ దేశాలు ఆరాటపడుతున్నాయి. ఇంధన వ్యవస్థలలో బొగ్గు, గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పునరుద్ధరణీయ పవన, సౌరశక్తి వనరులను; రవాణా రంగంలో...

హరిత ఆర్థికం సమ్మిళితమేనా?

హరిత ఆర్థిక వ్యవస్థలుగా శీఘ్రగతిన పరివర్తన చెందేందుకు ప్రపంచ దేశాలు ఆరాటపడుతున్నాయి. ఇంధన వ్యవస్థలలో బొగ్గు, గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పునరుద్ధరణీయ పవన, సౌరశక్తి వనరులను; రవాణా రంగంలో పెట్రోలియం ఉత్పత్తులకు బదులుగా విద్యుత్‌ను, పరిశ్రమలలో శిలాజ ఇంధనాలకు మారుగా హైడ్రోజన్‌ను ఉపయోగించుకునే దిశగా ప్రపంచ దేశాలన్నీ చురుగ్గా చర్యలు చేపడుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా భూ తాపం తీవ్రమవుతుండడం, తత్పర్యవసానంగా వాతావరణ వైపరీత్యాలకు కారణమవుతున్న కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు, ఇంధన వ్యవస్థలు, రవాణా రంగం, వస్తూత్పత్తి కార్యకలాపాలలో చోటు చేసుకుంటున్న మౌలిక మార్పులు దోహదం చేయగలవని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి.

హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రపంచ దేశాలు మరింత వేగంగా, సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన బృహత్ చర్యలతో పురోగమించవలసి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కొత్త హరిత ప్రపంచానికి మనం తీసుకువెళ్లే (వనరుల వినియోగ, ఉత్పాదక కార్యకలాపాల నిర్వహణ) విధానాలు, పద్ధతులు ఎలా ఉండనున్నాయి? అవి హరిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాల పరిపూర్తికి తోడ్పడుతాయా? సహజ వనరులను ఉపయోగించుకోవడంలో మనం అనుసరిస్తున్న పాత పద్ధతులలో స్వతస్సిద్ధంగా పలు సమస్యలు ఉన్నాయి. ఇవి సామాజిక, పర్యావరణ వ్యవస్థలను ప్రతికూలంగా, మరింత కచ్చితంగా చెప్పాలంటే విధ్వంసకరంగా ప్రభావితం చేస్తున్నందునే హరిత ఆర్థిక కార్యకలాపాలలో సైతం మనం పాటించే పద్ధతుల గురించి ప్రశ్నించడం అనివార్యమయింది.


ఖనిజాల వెలికితీతనే తీసుకోండి– బొగ్గు, ఇనుము, అల్యూమినియం మొదలైన ఖనిజాలు మన ఆర్థిక వ్యవస్థలకు మౌలిక అవసరాలు. అయితే భూగర్భం నుంచి వాటి వెలికితీత పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోంది. భారత్‌లో ఈ ముడి పదార్థాలు అడవుల కింద, వన్యప్రాణుల ఆవాస ప్రదేశాలలోను, గిరిజన ప్రాంతాలలో ఉన్నాయి. పర్యావరణ భద్రతకు, ప్రజా శ్రేయస్సుకు హాని వాటిల్లకుండా ఆ సహజ సంపదను ఉపయోగించుకోవడం ఎలా? ఇదొక విపత్కరమైన పరిస్థితి. వనరుల విపత్తు అనేది సంపద్వంత భూములు, పేద ప్రజలకు సంబంధించిన సమస్య. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన ఖనిజాలను సమకూర్చుకునేందుకు మనం అడవులను నరికివేస్తున్నాం; స్థానిక జనసముదాయాలను నిర్వాసితులను చేస్తున్నాము. ఖనిజాల వెలికితీత అనేది మనం అనుసరిస్తున్న ఆర్థికాభివృద్ధి నమూనాలో చాలా కీలకమైన కార్యకలాపం. దానివల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం సమకూరుతున్నది. అయితే ఆ సహజ వనరులు ఉన్న ప్రాంతాలలో నివశిస్తున్న ప్రజలు ఆ వనరుల నుంచి అతి తక్కువగా, అదీ అరుదుగా మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఇది నిజంగా ఒక విషాదం. విధ్వంసకర వాతావరణ మార్పుకు దారితీస్తున్న కాలుష్యకారక వాయువుల ఉద్గారాలు మాత్రమే మన సమస్యలకు ప్రధాన కారణం కాదు సుమా!


కొత్త హరిత ప్రపంచానికి మనం తీసుకువెళ్లే (వనరుల వినియోగ, ఉత్పాదక కార్యకలాపాల నిర్వహణ) విధానాలు, పద్ధతులు ఎలా ఉండనున్నాయని ప్రశ్నించాను కదా. ఎందుకో వివరిస్తాను. కొత్త హరిత ఆర్థిక వ్యవస్థలో ప్రపంచానికి అవసరమైన ఖనిజాలు భిన్నమైనవి– లిథియం, నికెల్, కాపర్, కోబాల్ట్, గ్రాఫైట్ మొదలైనవి. అయినప్పటికీ అరణ్యాల కింద, ఆదివాసీలు, నిరుపేదలు నివశించే ప్రాంతాలలో లభ్యమయ్యే ఖనిజాలు సైతం అత్యంత అవసరమైనవే. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటా వాస్తవమే. అమెరికాలో 97శాతం నికెల్, 89శాతం కాపర్, 79 శాతం లిథియం, 68 శాతం కోబాల్ట్ నిల్వలు నేటివ్ అమెరికన్ రిజర్వేషన్స్ (అమెరికా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించిన దేశీయ అమెరికన్ ఆదివాసీ జాతి పాలనలో ఉన్న భూములు)లో ఉన్నాయని న్యూయార్క్‌లోని మార్కెట్ కన్సల్టెన్సీ ఎమ్ఎస్‌సి పేర్కొంది. లాటిన్ అమెరికా నుంచి ఆఫ్రికా, ఆసియా దాకా అంతటా ఇదే పరిస్థితి ఉన్నది.

భారత్‌లో ఖనిజాల వెలికితీత పర్యావరణానికి నిరపాయకరంగా, సామాజిక శ్రేయస్సుకు తోడ్పడే విధంగా ఉండేలా భారత్‌లో చాలా కాలంగా పోరాటాలు చేస్తున్నాం. అయితే సమస్యలకు కార్యసాధక పరిష్కారాలు లభించడం లేదు. చాలా సంవత్సరాల క్రితం సమతా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రభుత్వేతర సంస్థ. ఆదివాసేతరులు ఇచ్చిన భూమిని గురించి సుప్రీంకోర్టులో కేసు వేసి గెలిచింది. ఆ భూములు ఆదివాసులకే చెందుతాయనేది సుప్రీంకోర్టు తీర్పు సారాంశం) కేసు తీర్పులో గిరిజనుల భూములలో మైనింగ్ కార్యకలాపాలు, గిరిజనుల భాగస్వామ్యం లేకుండా జరగకూడదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గనుల వ్యాపారంలో గిరిజనులు సమాన వాటాదారులుగా ఉండితీరాలనేది ఆ తీర్పు స్పష్టీకరించింది. అయితే అలా జరిగిందా? సమాధానం స్పష్టమే. ఆ తరువాతనే, మైనింగ్ కార్యకలాపాల నుంచి సమకూరే ఆదాయంలో ఆదివాసులకూ వాటా కల్పించే ప్రయత్నం జరిగింది.


నిజానికి మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాలలోని ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఉనికి లోకి వచ్చిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డిఎమ్ఎఫ్) గనుల వ్యాపారంలో ఆ జన సముదాయాలను భాగస్వాములు చేసేందుకు కృషి చేసింది. అయితే ఈ సత్ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఖనిజాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసి, వారి అభ్యున్నతికి తోడ్పడాలనే సత్సంకల్పం అంతిమంగా ఖనిజాలపై అదనపు సెస్ విధింపుగా పరిణమించింది! ఈ పన్ను ద్వారా సమకూరిన ఆదాయాన్ని డిఎమ్ఎఫ్‌కు జమ చేశారు. అయితే ఆ సొమ్మును, ప్రభుత్వం తాను అభివృద్ధి పనులుగా పరిగణించిన వాటికి, ఖనిజాలను కనుగొన్న ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం లేకుండానే ఖర్చు చేసేందుకు ఉపయోగించింది.


పర్యావరణ, అటవీ సంబంధిత అనుమతుల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఈ ప్రాజెక్టులను ఆమోదించడం లేక ఆమోదించక పోవడంపై స్థానిక జనసముదాయాలకు హక్కు ఉండేలా చేయడమేది ఒకప్పుడు లక్ష్యంగా ఉండేది. అయితే స్థానికుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడమనేది రానురాను తగ్గిపోయింది. అభివృద్ధి సాధన పేరిట స్థానికుల మాటను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులపై స్థానికుల అభిప్రాయాలు, అభ్యంతరాలను విధిగా పరిగననలోకి తీసుకోవాలనే నిబంధనను చిత్తశుద్ధితో అమలుపరిచినట్టయితే సామాజికంగా సమ్మిళిత, పర్యావరణ పరంగా న్యాయమైన, భద్రమైన భవిష్యత్తును నిర్మించేందుకు దోహదం జరిగి ఉండేది.

ఇప్పుడు మళ్లీ ప్రశ్న ఏమిటంటే భూతాపాన్ని పెంచని అధునాతన శిలాజేతర ఇంధనాల ఆధారిత హరిత ఆర్థికంలో, స్థానిక ప్రజలకు మేలు జరిగేలా వివాదాలను పరిష్కరించడానికి దోహదం చేసే నిబంధనలను ప్రభుత్వాలు రూపొందిస్తాయా? పరివర్తన ఆరాటంలో అవే పాత పద్ధతులను మరింత లోపభూయిష్టంగా ఆచరిస్తాయా? వాస్తవమేమిటంటే శిలాజ ఇంధనాల ఆధారిత పాత ఆర్థిక వ్యవస్థ సృష్టించిన సంపద నుంచి అత్యధిక ప్రజలు ఏ మాత్రం లబ్ధి పొందలేదు. మరి అధునాతన శిలాజేతర ఇంధనాల ఆధారిత కొత్త ఆర్థికం పర్యావరణ సమతుల్యతను కాపాడే, సామన్యుల శ్రేయస్సుకు హామీ పడే సమ్మళిత సమాజ నిర్మాణానికి దారి తీస్తుందా? అలా కాని పక్షంలో కొత్త ఆర్థికం కొత్తదీ కాదు, హరితమైనదీ కాదు.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - May 10 , 2024 | 01:01 AM