Share News

శ్రీరామతత్వమే భారతీయత

ABN , Publish Date - Jan 02 , 2024 | 04:00 AM

సమస్త హిందువులూ జనవరి 22 ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్నారు. అయోధ్యలో రామ జన్మభూమిలో శ్రీరాముడి మందిరాన్ని ప్రతిష్ఠాపించే రోజు అది. ప్రతి హిందువు ఇంటిలో పూజించే...

శ్రీరామతత్వమే భారతీయత

సమస్త హిందువులూ జనవరి 22 ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్నారు. అయోధ్యలో రామ జన్మభూమిలో శ్రీరాముడి మందిరాన్ని ప్రతిష్ఠాపించే రోజు అది. ప్రతి హిందువు ఇంటిలో పూజించే ఇష్టదైవం శ్రీరాముడు. భారత జాతీయ జీవనంలో రాముడు, రామాయణానికి ఉన్న ప్రాధాన్యం అపారమైనది. రామాయణం కొన్ని దశాబ్దాలుగా భారతీయుల సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తోంది. అది మానవ ఉద్వేగాలు, నైతిక సందిగ్ధాల సమ్మేళనం. రామాయణం అనువాదం కాని భాష అంటూ దేశంలో లేదు. రామాయణ గాథ అన్ని భాషల్లో, సాహిత్యాల్లో సృజనాత్మకతను ప్రతిఫలించింది. ప్రతి జానపద సంప్రదాయంలోనూ శ్రీరాముడున్నాడు. ‘రామ్’ అన్న పేరు లేకుండా దేశంలో ఏ కులమూ, మతమూ లేదు. సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్‌లో శ్రీరాముడి పేరు కొన్ని వేలసార్లు ప్రస్తావితమయింది. తులసీదాస్ నుంచి సూరదాస్ వరకూ, కబీర్ నుంచి తుకారాం వరకూ, అస్సాంలో శంకర దేవ్ నుంచి తమిళనాడులో కంబ, తెలుగులో విశ్వనాథ వరకూ అనేకమంది శ్రీరాముడుని అనేక రీతుల్లో అభివర్ణించారు. పర్షియన్ కవి అల్లామా ఇక్బాల్ కూడా శ్రీరాముడిని ‘ఇమామ్ ఏ హింద్’ (భారత ఆధ్యాత్మిక నాయకుడు)గా అభివర్ణించారు. శ్రీరామ తత్వమే భారతీయత అన్న విషయంలో సందేహంలేదు.

సనాతన ధర్మానికి, సంస్కారానికి, పితృవాక్య పరిపాలనకూ, దుష్ట సంహారానికీ పేరొందిన శ్రీరాముడు మనదేశంలో అనాదిగా నెలకొన్న విలువలకు ప్రతీక. ఆ విలువలు సార్వత్రికమైనవి, శాశ్వతమైనవి. అయోధ్యలో జన్మించిన శ్రీరాముడి ఆనవాళ్లు శ్రీలంక వరకు అడుగడుగునా ఉన్నాయి. రాముడి పాదాలను దేశమంతా ప్రజలు పూజిస్తారు. కోదండ రాముడి మందిరం లేని ఊరు మన దేశంలో లేదు. కోట్లాది భారతీయుల ఇళ్లలో ఇప్పటికీ రామకోటి రాసేవారున్నారు. మహాత్మాగాంధీయే స్వయంగా రామరాజ్యాన్ని భారతదేశానికి ఆదర్శంగా భావించారు. చివరి క్షణంలో కూడా ఆయన హే రామ్ అని తనువుచలించారు. రాముడు ఒక అదర్శవంతమైన రాజు. ఉన్నత మానవ లక్షణాల సమ్మేళనం. రామరాజ్యం అనేది సుపరిపాలనకు సంకేతం. బీజేపీ ఈ సుపరిపాలననే కోరుకుంటుంది.

అలాంటి శ్రీరాముడి చరిత్రాత్మక మందిరం ఇప్పుడు ప్రారంభమవుతున్నదంటే ప్రతి భారతీయుడి మేను భక్తితో పులకరిస్తోంది. ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లుగా జనవరి 22న ప్రతి భారతీయుడి ఇల్లూ శ్రీరామ జ్యోతి దీపకాంతులతో దీపావళి రోజు మాదిరి శోభాయమానం కానున్నాయి. ఘర్ ఘర్ యాత్ర పేరుతో జనవరి 1 నుంచి 15 వరకు దేశంలో ఇంటింటికీ చేరుకుని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మోదీ ప్రభుత్వం చేసిన కృషి వివరించేందుకు బీజేపీ ఉద్యుక్తమైంది.

భారతదేశంలో ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు, దైవభక్తి చరిత్రతో ఏ విధంగా ముడివేసుకుని ఉన్నాయో భారతీయ జనతా పార్టీకి తెలిసినంతగా మరే పార్టీకి తెలియదు. సోమనాథ మందిరం మాదిరే అయోధ్యలో శ్రీరామ మందిరం కూడా ఒక ముస్లిం దురాక్రమణదారు దాడికి గురైందన్న చరిత్ర తెలిసినా ఆ పార్టీలన్నీ ప్రజల నమ్మకాలను అవహేళన చేసి విశ్వాసాలతో చెలగాటమాడుకున్నవే. కొన్ని దశాబ్దాల పాటు శ్రీరాముడిని ఆయన జన్మభూమిలోనే బందీ చేసిన పార్టీలవి. ఆయనను ప్రజలు దర్శించకుండా అడ్డుకున్న పార్టీలివి. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి శ్రీరాముడికే న్యాయం జరగకుండా నిరోధించిన పార్టీలవి. ఎవరైతే శ్రీరాముడి మందిరం స్థానంలో కట్టడం నిర్మించారో వారి తరఫున వకాల్తా పుచ్చుకున్న పార్టీలవి. కరసేవ చేసేందుకు వచ్చిన వేలాది మందిపై కాల్పులు జరిపి అయోధ్య వీధుల్లోనూ, దేశ వ్యాప్తంగానూ ప్రాణాలు బలిగొన్న పార్టీలవి. కాంగ్రెస్ పార్టీ ఊగిసలాట ధోరణి, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఎప్పుడో పరిష్కారం కావల్సిన అయోధ్య వివాదం కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయింది. లౌకిక వాదానికి కాంగ్రెస్, ఇతర పార్టీలు తప్పుడు అర్థాన్నిచ్చాయి. మన రాజ్యాంగ నిర్మాతల ప్రకారం లౌకికవాదం అంటే సర్వమతాల పట్ల సమభావంతో ఉండటం. మన చరిత్రను, సంప్రదాయాన్నీ తిరస్కరించినట్లు ఎంత మాత్రమూ కాదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ 1990లలో చేపట్టిన ఉద్యమానికి అపూర్వ ప్రతిస్పందన లభించింది. 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు లాల్ కృష్ణ ఆడ్వాణీ చేపట్టిన రథయాత్రను జెండా ఊపి ప్రారంభించింది నాడు సాధారణ నాయకుడుగా ఉన్న నరేంద్రమోదీ. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే అయోధ్యలో రామమందిర ప్రారంభం కావడం అపూర్వం.


ప్రధాని మోదీకి భారతదేశ ఆత్మ తెలుసు కనుకనే అభివృద్ధితో సమానంగా ఆధ్యాత్మికతకు విలువ ఇచ్చారు. ‘నా శరీరంలో ప్రతి కణంలో దైవభక్తి ఉన్నది. ఒక భారతీయుడుగా నేను కూడా రామమందిర ప్రతిష్ఠాపన కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నాను. మనం 550 సంవత్సరాలు వేచి చూశాం. ఇక మరికొన్ని రోజులు వేచి చూస్తే చాలు..’ అని మోదీ రెండు రోజుల క్రితం అయోధ్యలో ప్రకటించారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులూ తొలగించిన మోదీ శ్రీరాముడి నగరంలో రూ. 15వేల కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి అయోధ్య భారతదేశ చిత్రపటంలో సుస్థిరస్థానం పొందేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణించిన మాదిరే అయోధ్యా నగరి ఆధునిక వసతులతో ఒప్పారేలా నిర్మించేందుకు మోదీ కంకణం కట్టుకున్నారు. 1943 డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్‌లో త్రివర్ణ పతాకం ఎగుర వేశారు. 2023 డిసెంబర్ 30న నరేంద్రమోదీ నూతన భారతానికి అనుగుణంగా నూతన అయోధ్య నగరాన్ని ప్రారంభించారు. అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టి మోదీ ప్రారంభించారు.

ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే తన ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకోవాలి. వర్తమానానికీ, గతానికీ మధ్య వారధి నిర్మిస్తూనే భవిష్యత్‌కు బాటలు వేయాలి. మోదీ ప్రభుత్వం చేస్తున్నదదే. అభివృద్ధి పథకాలను అమలు చేయడమే కాదు, వాటి ప్రయోజనం పొందినవారిని చేరుకోవాలన్నదే మోదీ సంకల్పం. డిసెంబర్ 30న ఆయన ఉజ్జ్వల యోజన వల్ల ప్రయోజనం పొందిన ఒక దళిత లబ్ధిదారుడి ఇంటిని సందర్శించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో తన ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరినీ కలుసుకొమ్మని ఆయన నేతలను ఆదేశించారు. తాను స్వయంగా లబ్ధిదారులను కలుసుకోవడం ప్రారంభించారు. పథకాల అమలు పట్ల చిత్తశుద్ది గల నేత చేసే పని ఇది.

శ్రీరాముడి మందిర నిర్మాణాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఎందుకంటే రామజన్మభూమి ఉద్యమాన్ని నిర్వహించింది బీజేపీయే అని ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అయోధ్యలో నిర్మిస్తున్నది శ్రీరాముడి మందిరం కాదు. బీజేపీ మందిరం అని ఒక కాంగ్రెస్ నేత అన్నారు. బీజేపీ ప్రతి నేత హృదయంలో శ్రీరాముడి మందిరం ఉంటుందని ఈ దేశ ప్రజలకు తెలుసు.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - Jan 02 , 2024 | 04:00 AM