భారత యాత్రికుడు, హిందూ ధర్మయోధుడు
ABN , Publish Date - Feb 06 , 2024 | 02:00 AM
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన పక్షం రోజులలోనే బీజేపీ సంస్థాపక సభ్యుడైన లాల్‌కృష్ణ ఆడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ...
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన పక్షం రోజులలోనే బీజేపీ సంస్థాపక సభ్యుడైన లాల్‌కృష్ణ ఆడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం భారత జాతీయవాదులందర్నీ ఎంతో ఆనందపరిచింది. అయోధ్యకూ, ఆడ్వాణీకి అవినాభావ సంబంధం ఉన్నది. అయోధ్య రథయాత్రకు ఆయన పూనుకోకపోయి ఉంటే రామమందిర పునర్నిర్మాణం కోసం స్వతంత్ర భారత చరిత్రలో అతి పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభమయి ఉండేదే కాదు. ఈ దేశ ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న జాతీయవాద భావాలను పెల్లుబుకేలా చేసి ఇవాళ 500 సంవత్సరాల బానిసత్వం నుంచి దేశం విముక్తి అయ్యేందుకు ఆడ్వాణీయే నాంది పలికారన్న విషయంలో ఎవరికీ ఏ మాత్రం సందేహం లేదు.
హిందూ మత భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకే భారతీయ జనతా పార్టీ రామ జన్మభూమిని తెరమీదకు తీసుకువచ్చిందని కుహనా లౌకిక పార్టీలు, మేధావులు ఇప్పటికీ విమర్శిస్తుంటారు అయితే బీజేపీతో నిమిత్తం లేకుండా ఈ దేశ ప్రజలందరూ శ్రీరాముడిని ఆరాధిస్తారని, అయోధ్యతో వారు చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మమేకం అయ్యారనే సత్యాన్ని వారు గ్రహించలేదు. లేకపోతే అయిదు దశాబ్దాలుగా రామజన్మభూమి కోసం ప్రజలు పోరాడేవారే కాదు. భారత ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకే అయోధ్యలో 1990 సెప్టెంబర్– అక్టోబర్ నెలల్లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ ఆడ్వాణీ రామ్ రథయాత్ర జరిపారు. ఆనాడు ఎవరూ ఊహించని విధంగా ఈ యాత్రకు ప్రజాస్పందన లభించింది. హిందూ ధర్మం భారతీయ ఆత్మ. ఈ ధర్మం పట్ల ప్రజలకున్న మమేకతను ఒక సానుకూల శక్తిగా మళ్లించినట్లయితే దాన్ని జాతీయ పునర్నిర్మాణం కోసం ఉపయోగించుకోవచ్చని స్వామీ వివేకానంద చెప్పిన మాటల్లో ఎంత సత్యం ఉన్నదో బీజేపీ తెలుసుకుంది. ఇవాళ అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు కోట్లాది ప్రజలు సానుకూలంగా స్పందించి వాడవాడలా సంబరాలు, ప్రార్థనలు జరుపుకోవడాన్ని చూస్తుంటే నాడు ఆడ్వాణీ రథయాత్రకు లభించిన ప్రతిస్పందన ఎంత సహజమైనదో అర్థమవుతోంది. ఆడ్వాణీ చేపట్టిన ఉద్యమం పట్ల ప్రజల ప్రతిస్పందన గమనించి నాడు కుహనా లౌకిక పార్టీలన్నీ ఏకమై ఆయనను 1990 అక్టోబర్ 23న బిహార్‌లోని సమస్తిపూర్‌లో అరెస్టు చేసి దాదాపు ఐదు వారాల పాటు నిర్బంధించాయి. ఆ రోజు ఆడ్వాణీతో పాటు వేలాది బీజేపీ కార్యకర్తల, కోట్లాది ప్రజల మనోభావాలను తొక్కిపెడితేనేం వారిలో ఉన్న అంతర్లీన జాతీయ వాద భావనల్ని అణిచివేయలేకపోయారు. నిప్పురవ్వ దావానలమైనట్లు ఆ తర్వాత కూడా అయోధ్యకోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, బలిదానాలు జరిగాయి. తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రజలు భారతీయ జనతా పార్టీని పూర్తి మెజారిటీతో రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చారు.
రామజన్మభూమి కోసమే కాదు, దేశాన్ని సమైక్యం చేసేందుకు ఆడ్వాణీ అనేక యాత్రలు జరిపారు. 1993లో ఆయన తన జనాదేశ యాత్రను మైసూరు నుంచి ప్రారంభించి భోపాల్ వరకు 14 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజల జీవితాల్లో మతాన్ని నిర్మూలించేందుకు, మైనారిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ బిల్లును వ్యతిరేకించేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టారు. నక్సలైట్ పీడిత ప్రాంతాలతో పాటు దేశ వ్యాప్తంగా నలుమూలలా ఆయన యాత్రకు అమోఘమైన ప్రతిస్పందన లభించింది. ఆ తర్వాత ముఖ్యమైనది 1996లో ఆయన కొచ్చిన్ నుంచి జరిపిన సురాజ్ యాత్ర. రామరాజ్యం భావన గురించి వివరిస్తూ అధికార పార్టీ అవినీతిని ఎండగడుతూ నెలరోజులకు పైగా ఆయన ఈ యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించే సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ యాత్రను నిర్వహించిన వారిలో ఒక కార్యకర్తగా నేను ఆడ్వాణీ తన ప్రసంగాల ద్వారా దేశభక్తిని ఎలా పురిగొల్పారో, ప్రజల్లో అద్భుతమైన ప్రతిస్పందన ఏ విధంగా లభించిందో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను 1997లో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యోద్యమ భావాలను పురికొల్పేందుకు, స్వరాజ్యం నుంచి సురాజ్యం సాధించే దిశగా దేశ ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించేందుకు ఆయన స్వాతంత్ర్య స్వర్ణజయంతి యాత్ర. నిర్వహించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యోద్యమ వీరులు, అమరులకు నివాళులు అర్పించేందుకు వారి ప్రాంతాలను సందర్శించారు. వారు త్యాగాలు జరిపిన ప్రాంతాలకు వెళ్లడం ఒక తీర్థయాత్రగా ఆడ్వాణీ అభివర్ణించారు. నిజానికి స్వాతంత్ర్యం సాధించామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు కూడా స్వర్ణజయంతిని జరుపుకోలేదు. కాని ఆడ్వాణీ తన స్వర్ణజయంతి యాత్ర ద్వారా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి అయిదు దశాబ్దాల్లో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలను సమీక్షించి ప్రజల్లో చర్చను లేవనెత్తారు. భారతీయ జనతా పార్టీయే దేశానికి మంచి పాలనను అందించగలదని వివరించారు. దేశాన్ని ఆకలి, అవినీతి, భయం నుంచి విముక్తి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావల్సిన చారిత్రక అవసరాన్ని ఆయన వివరించారు. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వాన్ని 13 రోజుల్లో పడగొట్టడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న సమయమది. దాదాపు 15వేల కిలోమీటర్ల మేరకు నాలుగు దశల్లో జరిపిన ఈ స్వర్ణజయంతి రథయాత్రలో 59 రోజుల పాటు 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయన ప్రయాణించి 759 సభల్లో ప్రసంగించారు. స్వాతంత్రోద్యమాన్ని జాతీయ వాదంతో సమ్మిళితం ఎలా చేయాలో, దేశం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లపై ఏ విధమైన దృక్పథాన్ని అలవరుచుకోవాలో ఆయన ఈ యాత్ర ద్వారా తెలిపారు. నాడు ఆడ్వాణీ జరిపిన స్వర్ణ జయంతి యాత్ర 1998లో అటల్ బిహారీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేసింది.
అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆడ్వాణీ యాత్రలు జరపడం ఆపలేదు. 2002లో భారత్ ఉదయ్ యాత్ర పేరుతో 33 రోజుల పాటు 8500 కిలోమీటర్ల మేరకు రెండు దశలుగా 16 రాష్ట్రాల్లోని 121 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. మళ్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2006లో భారత సురక్షా యాత్ర జరిపి ఉగ్రవాదం, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి, రాజకీయాల్లో నేరచరిత్రుల వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించారు. 2011లో జనచేతనా యాత్ర పేరుతో బిహార్ నుంచి ప్రారంభించి 40 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పర్యటించారు. యూపీఏ హయాంలో అవినీతిని ఆయన ఎండగట్టారు. ఈ యాత్ర ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించి 2014లో బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడానికి మార్గాన్ని సుగమం చేసింది. తన జీవితమంతా ప్రజలను కలుసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ ఆడ్వాణీ వదిలిపెట్టలేదు. ప్రజలతో సంబంధాలే ప్రజాస్వామ్యానికి ప్రాణం అని ఆయన రుజువు చేశారు. ఆయన లాగా భారతదేశంలో విస్తృతంగా పర్యటించి ప్రజల నాడి తెలుసుకున్న నాయకుడు మరొకరు లేరు. నిత్యం ప్రజల్లో ఉంటూ, సామాన్యులనే నేతలుగా రూపొందిస్తూ భారతీయ జనతా పార్టీని ఆయన పటిష్ఠం చేశారు. దేశం కోసం ఈ నిరంతర యాత్రికుడు చేసిన త్యాగాలను గౌరవించేందుకు ‘భారతరత్న’ ప్రదానం చేయడం చంద్రుడికి నూలుపోగు సమర్పించడం మాత్రమే.
వై. సత్యకుమార్
(బీజేపీ జాతీయ కార్యదర్శి)