Share News

కాకతీయుల ఆలయాల్లోనూ

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:41 AM

సూర్యతిలకం! శ్రీరామ నవమి రోజున అయోధ్యలో బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించిన దృశ్యాలను అన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. ఇటీవలికాలంలో చేపట్టిన శాస్త్ర సాంకేతిక అద్భుతమిది....

కాకతీయుల ఆలయాల్లోనూ

సూర్యతిలకం!

శ్రీరామ నవమి రోజున అయోధ్యలో బాల రాముడి నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించిన దృశ్యాలను అన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. ఇటీవలికాలంలో చేపట్టిన శాస్త్ర సాంకేతిక అద్భుతమిది.

సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీబీఆర్‌ఐ) ఈ సూర్య తిలకం వ్యవస్థను రూపొందించింది. రామ మందిరం మూడవ అంతస్తునుంచి సూర్య కిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ఏటా శ్రీ రామ నవమి రోజు ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలు అమర్చారు. ఈ ప్రక్రియలో ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదని సీబీఆర్‌ఐ తెలిపింది. శ్రీ రామ నవమి రోజు బాలరాముడికి సూర్య తిలకం దిద్దిన ఆ దృశ్యాలు చూసి కోట్లాది మంది భావోద్వేగానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించిన వివిధ దేవాలయాలపై చర్చ జరుగుతోంది. దేశంలో దాదాపు 800 సంవత్సరాలకు పూర్వమే దీని వాడకం మొదలైంది. ఎన్నో రాజవంశాలు తాము నిర్మించిన ఆలయాల్లో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించాయి. ప్రధానంగా, కాకతీయులు తాము కట్టిన ఆలయాల్లో సూర్యరశ్మిని పరావర్తనం చేయించి, సూర్య కిరణాలు మూల విరాట్టుపై నేరుగా పడేలా, తద్వారా ఆలయం చీకటిగా ఉన్నా, దేవతామూర్తిని చక్కగా దర్శించుకునేలా ఏర్పాటుచేశారు. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్లు ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం, కోణార్క్, ఎల్లోరా గుహలు... ఇలా ఎన్నో చోట్ల ఈ విధమైన వ్యవస్థతో వందల సంవత్సరాల క్రితమే ఆలయాలను నిర్మించారు. ఎల్లోరా గుహల్లోని 10వ గుహలో ధర్మచక్రముద్రలో ఉన్న బుద్ధుడి మొఖం మీద కాంతి పడే ఏర్పాటు 7వ శతాబ్దం లోనే చేశారు. గుడిగోపురాల్ని నిర్మించిన పాలకులు ఆ రకంగా దేవతామూర్తులపై సూర్య కిరణాలు పడే ఏర్పాట్లు చేశారు. అరసవెల్లి నుండి నాగులాపురం దాకా తెలుగుగడ్డమీద ఇలాంటి ఆలయాలున్నాయి. కాకతీయ నిర్మితమైన ఆలయాలలో, వీటిలో అత్యధికం శివాలయాలు, ప్రధాన విగ్రహమైన శివలింగంపై ప్రత్యేకంగా వెలుతురు ప్రసరించేలా నిర్మించారు. ప్రధానంగా, వేయిస్తంభాల ఆలయం, రామప్ప ఆలయం, ఘనపురం దేవాలయాల్లో వెలుతురు ప్రసరించే విధానాన్ని చూడొచ్చు. నల్లగొండలోని పానగల్లు ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం ఆధునిక శాస్త్రజ్ఞులను సైతం ఆశ్చర్యానికి గురిచేసే అద్భుత విశేషాలు కలిగినది. 11వ శతాబ్దంలో కందూరు చోళులు నిర్మించిన ఈ ఆలయంలో కాంతి పరావర్తనం ద్వారా స్తంభాల ఛాయ (నీడ) ఎదురుగాగల శివలింగంపై పడడం ఇక్కడి ప్రత్యేకత. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఇలా ఏ వేళలోనైనా ఒకే వైపు ఛాయా పడడం ఈ ఛాయా సోమేశ్వర ఆలయం ప్రత్యేకత. సూర్య కిరణాలను పరావర్తనం చెందించడం ద్వారా నీడ అన్నివేళలా ఒకే దగ్గర పడేలా చేశారని పరిశోధకులు వెల్లడించారు. ఈ సోమేశ్వరాలయంలో ‘ఏకఛాయా’ స్తంభం కనిపిస్తుంది. అంతేకాదు పక్కలకు నిలబడితే మననీడ వ్యతిరేకదిశలో లోపల కనిపిస్తుంది. మధ్యలో కనిపించే నీడలో ఏ తేడా ఉండదు. నిశ్చలంగా వుంటుంది. మనుషులు, వస్తువులు కదిలేవి అడ్డొస్తే వాటి నీడలు వ్యతిరేకదిశల్లో కదులుతుంటాయి. చాలా దేవాలయాల్లో నీడలు వ్యతిరేకదిశల్లో కదిలినట్టు కనిపిస్తాయి. కాని, ఇక్కడివలె స్థిరమైన ఛాయ ఎక్కడా కనిపించదు.

అయోధ్య బాల రాముడి నుదిటిపై శ్రీరామ నవమి రోజున మాత్రమే సూర్య కిరణాలు పడేలా అక్కడి వ్యవస్థను రూపొందించారు. ఈ మెకానిజమ్‌లో భాగంగా ఆలయ మూడో అంతస్తులో ఉండే అద్దంపై పడే సూర్య కిరణాలు పలు ఇత్తడి పైపులు, కటకాల గుండా ప్రసరించి అద్దాల ద్వారా ప్రతిబింబించి రామ్‌లల్లా నుదుటన పడతాయి. ప్రస్తుత కాలంలో ఇదో గొప్ప సాంకేతిక అద్భుతం. అయోధ్య రాముడి సూర్య తిలకానికి కల్పించిన ప్రాచుర్యం పానగల్లు లాంటి దేవాలయాలకు కూడా లభించిన పక్షంలో అవి గొప్ప పర్యాటక ప్రాంతాలుగా రూపొందుతాయి. అంతేకాదు, వందలేళ్ళక్రితమే సూర్యగతిని లెక్కించి, తదనుగుణంగా నిర్మాణాలను చేపట్టిన అప్పటి ప్రతిభమీద యువతలో శాస్త్రీయ పరిశోధన ఆసక్తి కూడా పెరుగుతుంది.

కన్నెకంటి వెంకటరమణ

జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ, హైదరాబాద్

Updated Date - Apr 23 , 2024 | 03:41 AM