‘ఫార్మా’ కాలుష్యం నుంచి కాపాడతారనుకుంటే..!
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:55 AM
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ప్రాంత ప్రజల తరఫున రాస్తున్న బహిరంగ లేఖ. నిన్న మీరు ఇచ్చిన పత్రికా ప్రకటనలో తెలంగాణని మూడు జోనులు: ఓఆర్‌ఆర్ లోపల అర్బన్...
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ప్రాంత ప్రజల తరఫున రాస్తున్న బహిరంగ లేఖ. నిన్న మీరు ఇచ్చిన పత్రికా ప్రకటనలో తెలంగాణని మూడు జోనులు: ఓఆర్‌ఆర్ లోపల అర్బన్, ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ మధ్యలో సెమీ అర్బన్, ఆర్‌ఆర్‌ఆర్ వెలుపల రూరల్ జోనులుగా విభజించి పారిశ్రామికీకరణ చేపడతామని, అందులో ప్రజాప్రయోజనం దృష్ట్యా కాలుష్యం లేకుండా ఫార్మా విలేజ్‌లు స్థాపిస్తాం అని సెలవిచ్చారు. అట్లాగే మా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఫార్మా సిటీ కోసం ఇప్పటికే తీసుకున్న భూమిలో ఇతర పరిశ్రమలు స్థాపిస్తారని తెలిసింది. అసలు ఫార్మా కంపెనీలే వద్దని ప్రజలు అన్ని ప్రాంతాల్లో మొత్తుకుంటుంటే, మళ్లీ గత ప్రభుత్వం చెప్పిన విషయాలే చెప్పి కాలుష్యం లేకుండా ఫార్మా విలేజీలు స్థాపిస్తామంటున్నారు. ఎంతవరకు సమంజసం? తెలంగాణా ఇప్పటికే కాలుష్య భూతంతో పోరాటం చేస్తోంది. మన జీవ నది మూసి నదే ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఈ నది నాశనం అయ్యింది ప్రధానంగా కెమికల్ కాలుష్యం వల్లనే, దానికి ముఖ్య కారణం ఫార్మా కంపెనీలే. పోనీ పటాన్‌చెరు, జీడిమెట్ల పాతవి అక్కడ కాలుష్యం కంట్రోల్ చెయ్యటానికి వీలైన టెక్నాలజీ లేదు అనుకున్నా, నిన్న మొన్న ఇలాగే కాలుష్య రహితంగా చేస్తాం అని పెట్టించిన పోలేపల్లి సెజ్ పరిస్థితి కూడా ఇంతే. పోలేపల్లి, కాజిపల్లి వంటి చోట్ల, అట్లాగే పటాన్‌చెరు, బొల్లారంలలో కూడా స్థానిక ప్రజలు కంపెనీల కాలుష్యం గురించి లీగల్‌గా కంప్లైంట్ ఇచ్చి, పోరాటం చేసినా, వారిని బెదిరింపులకి గురిచేసి, నోరు మూయిస్తున్నారు. కంపనీలలో పనిచేసే కార్మికులు ఎప్పుడు ఏ కెమికల్ రియాక్షన్‌కి ప్రాణాలు పోగొట్టుకుంటారో చెప్పలేని పరిస్థితి. ఈ కంపెనీలు పెట్టిన చోట్ల చుట్టూ వ్యవసాయం సర్వనాశనం అయింది. తాగేందుకు నీరు లేదు, పీల్చేందుకు గాలి లేదు. ఈ కంపెనీలు ఎక్కడ పెట్టినా చుట్టూ ఉన్న వారికీ అనేక జబ్బులు, కిడ్నీ వ్యాధులు, చర్మ వ్యాధులు, గర్భిణి స్త్రీలకి గర్భస్రావాలు, పుట్టిన పిల్లలకి అంగవైకల్యాలు. మరి ఇటువంటి కంపెనీలని పెట్టించడం ప్రజాప్రయోజనం ఎట్లా అవుతుంది?
మీకు సలహాలు ఇచ్చే వారు చెప్పొచ్చు, మనకి చౌకగా మందులు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఫార్మా కంపెనీలని పెట్టించాలి అని. నిజంగా ఇప్పటివరకు పెట్టిన కంపెనీలలో తయారు చేస్తున్న మందులన్నీ మన ప్రజల కోసమేనా? లేక పాశ్చాత్య దేశాల్లో చవక మందులు సరఫరా చేసేందుకా? మన దగ్గర తయారయ్యే మందులు బయట దేశాలకి ఎగుమతి చేసేందుకే అని తెలుస్తోంది. మనకి సరిపడా కంపెనీలు ఇప్పటికే ఉన్నాయి. ఇంకా ఇంకా ఫార్మా కంపెనీలు పెట్టి మన గాలి, నీరు, ఆహారం కాలుష్యం చేసి, ప్రజలని కేన్సర్ బాధితుల్ని చేస్తే అది ఏ విధంగా ప్రజాప్రయోజనమో తమరు ఆలోచించాలి. ఈ విషయాలపైన దృష్టి పెట్టి మీరు పూర్తి సమీక్ష చేసి, సరైన నిర్ణయం తీసుకొని, ప్రజలను ఈ ఫార్మా కంపెనీల బెడద నుంచి కాపాడతారని ఆశిస్తున్నాం.
కవుల సరస్వతి,
రైతు, సామజిక కార్యకర్త