Share News

రెవెన్యూ సదస్సులు ఇలా ఉంటే సత్ఫలితాలు ఎలా?

ABN , Publish Date - Dec 17 , 2024 | 01:53 AM

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏభై ఏళ్ళ క్రితం సాహసోపేతంగా మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేసినపుడు అంతా ఆనందించారు. కానీ ప్రస్తుత గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ ఆ మునసబు, కరణాల వ్యవస్థే...

రెవెన్యూ సదస్సులు ఇలా ఉంటే సత్ఫలితాలు ఎలా?

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏభై ఏళ్ళ క్రితం సాహసోపేతంగా మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేసినపుడు అంతా ఆనందించారు. కానీ ప్రస్తుత గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ ఆ మునసబు, కరణాల వ్యవస్థే మేలనిపించేంతగా దిగజారింది. మొత్తం రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం పీడన వ్యవస్థగా మారిందన్నది అందరూ గుర్తించే వాస్తవం. దీనికి 90 శాతం అధికారులే బాధ్యులు.

ప్రతీ సోమవారం కలెక్టర్లు జరిపే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి వచ్చే సమస్యల్లో అత్యధికం రెవిన్యూ సమస్యలే. కలెక్టర్లు తగు పరిష్కారం కోసం అంటూ ఎండార్స్‌మెంట్ ఇవ్వడం తప్ప వాటికి శాశ్వత పరిష్కారం లేకుండా పోతోంది. క్షేత్ర స్థాయిలో జేసీ, ఆర్డీఓలు క్రియాశీలకంగా లేక వీటికి పరిష్కారం లభించడం లేదు. వ్యవసాయ భూములకు సంబంధించి వచ్చిన సమస్యలపై తహసీల్దార్లు సరైన శ్రద్ధ చూపకుండా ఆర్‌ఐ, వీఆర్వో, సర్వేయర్ల రిపోర్ట్‌లపై ఆధారపడటం కూడా ఆ సమస్యలు అపరిష్కృతంగా ఉండటానికి ప్రధాన కారణం. చాలామంది వీఆర్వోలు, సర్వేయర్లు పనికి ఒక రేటు చెప్పి అవి చెల్లిస్తేనే ఆ పని జరిగేలా చూస్తున్నారు. లేకుంటే ఏదో కారణం చెప్పి దరఖాస్తును ఆన్‌లైన్‌లో తిరస్కరిస్తారు. ఆన్‌లైన్‌లో తమ పేరు లేకపోతే భూమిపై హక్కు కోల్పోతామని భయపడి రైతులు ఎంతోకొంత ముట్టచెప్పి పని కానిచ్చుకుంటున్నారు. తప్పుగా నమోదు అయిన చిన్న పేరు సవరించడానికి కూడా జేసీ దాకా వెళ్లే పరిస్థితి నెలకొని ఉంది. వీఆర్వో, సర్వేయర్, తహశీల్దార్లదే రాజ్యం.


రాష్ట్రంలో భూ సమస్యలకు రెవెన్యూ సదస్సుల్లో ముగింపు పలికిస్తామంటూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతోంది. ఎట్టకేలకు డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా వచ్చే సమస్యలు కొన్ని ఉన్నాయి.

అడంగల్‌లో యజమాని/ అనుభవదారు పేర్ల మార్పు గురించిన సమస్య ప్రధానంగా రెండు రకాలు. ఒకటి కుటుంబ యజమాని చనిపోయినపుడు వారి వారసుల పేర్లు చేర్చడం. రెండు ఎవరైనా ఒక వ్యక్తి నుంచి భూమి కొనుగోలు చేసినపుడు కొనగోలుదారు పేరు అడంగల్‌లో చేర్చి వారికి పాస్ పుస్తకాలు ఇవ్వడం. ఈ విధంగా సక్రమంగా అడంగల్‌లో పేర్లు చేర్చడం వల్ల రైతులు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు పొందడానికి/ పంటలను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి/ పంట నష్టపరిహారం, బీమా పరిహారం పొందడానికి వీలవుతుంది.

సర్వే నెంబర్లతో సమస్యలు ముఖ్యంగా మూడు రకాలు: 1. కుటుంబ యజమాని చనిపోయినప్పుడు వారి వారసులు భూములు పంచుకున్నప్పుడు కాగితాల్లో రాసుకున్న విధంగా కాక భూమిపై వేరే సర్వే నెంబర్‌లో వాస్తవంగా సాగు చేసుకోవడం. 2. అలాగే ఒక రైతు సర్వే నెంబర్ 10/2లో భూమి కొన్నట్టుగా దస్తావేజులో ఉండి, వాస్తవంగా భూమిపై 10/5లో అనుభవంలో ఉండటం.

3. ఒక రైతు దస్తావేజులో సర్వే నెంబర్ 25 అని రాసుకుని వాస్తవంగా ఆ భూమికి దూరంగా ఉన్న సర్వే నెంబర్ 55లో అనుభవంలో ఉండటం. ఈ మూడు సందర్భాల్లో తహశీల్దార్లు సవరణ దస్తావేజు రాసుకు రమ్మని రైతులకు సూచిస్తున్నారు. భూములు అమ్మినవారు చాలా కాలం క్రితం మరణించి ఉంటారు. వారి వారసుల వద్దకు వెళ్లి సవరణ దస్తావేజు రాయమంటే వారు నిరాకరించవచ్చు. లేదా ప్రస్తుత భూముల ధరను బట్టి సొమ్ములు డిమాండ్ చేయవచ్చు. ఇలాంటి కేసుల్లో సవరణ దస్తావేజు లేకుండానే తహశీల్దార్లు క్షేత్ర పరిశీలన చేసి, సరిహద్దు రైతులు, గ్రామస్థుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని ప్రస్తుతం అనుభవంలో ఉన్న సర్వే నెంబర్‌ను నిర్ధారిస్తూ వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసి, అడంగల్‌లో మార్పులు చేయవచ్చు. అలా జారీ చేసిన ఉత్తర్వులు శాశ్వత రికార్డుగా భద్రపరిస్తే భవిష్యత్తులో వివాదాలకు తావు ఉండదు. ఈ సర్వే నెంబర్ల తేడాల సమస్యపై కూడా ప్రభుత్వ స్థాయిలో నిబంధనలు తయారు చేసి, తహశీల్దార్లకు స్పష్టమైన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తే ఇలాంటి సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయి.


ఈనాము భూముల విషయానికి వస్తే– ఈ విషయంలో 1956లోనే ప్రభుత్వం చట్టం చేసి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. దేవస్థానం/ దేవుని పేరుతో ఉన్న సర్వీసు ఈనాములు తప్ప మిగిలిన గ్రామ సర్వీసు ఈనాములను రైత్వారీ భూములుగా పరిగణించి/ మార్చి పట్టాదారు పాసు పుస్తకాలు ఇమ్మంటే వాటి అమలులో కూడా అలసత్వం, విపరీతమైన జాప్యం జరుగుతున్నది.

ఇక చుక్కల భూములు విషయమై 2017లో తెలుగుదేశం ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చి వాటికి పాసు పుస్తకాల జారీకి విధి విధానాలు జారీ చేసింది. 2022లో వైసీపీ ప్రభుత్వంలో సీసీల్‌ఎగా ఉన్న సాయిప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కిందిస్థాయి రెవెన్యూ అధికారులు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.

22ఎ నిషేధ భూములు– ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ, దేవాదాయశాఖవారు కొన్ని సర్వే నెంబర్లను గ్రామాలవారీగా సబ్ రిజిస్ట్రార్లకు పంపారు. అలా పంపినపుడు సబ్ డివిజన్లు పేర్కొనకుండా పూర్తి సర్వే నెంబర్ పంపడం వల్ల ఆ సర్వే నెంబర్లలో మిగిలిన రైతులు భూములను అవసరాలకు అమ్ముకోలేక 2015 నుంచి ఇబ్బందులకు గురవుతున్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖలు ఆ తప్పులు సవరించకుండా రైతులను తమ కార్యాలయాల చుట్టూ సంవత్సరాల తరబడి తిప్పించుకుంటున్నారు.


రెవెన్యూ ఉన్నతాధికారులు లేని అధికారాన్ని కట్టబెట్టుకొని 2011లో రెవెన్యూ రికార్డులు కంప్యూటరీకరణ చేసినపుడు కొన్ని భూములను రెడ్ మార్క్/ డిస్పూటెడ్ కేటగిరీలో పెట్టమని ఆదేశించడం తహశీల్దార్లకు వరంగా, రాజకీయ నాయకులకు, భూ కబ్జాదార్లకు అవకాశంగా మారింది. వారు కోరినట్టల్లా తహశీల్దార్లు కొన్ని భూములను రెడ్ కేటగిరీలో పెట్టారు. ఒక ప్రైవేటు భూమిని రెవెన్యూ అధికార్లు కోర్ట్ అదేశాల్లేకుండా ఏ అధికారంతో డిస్పూటెడ్ కేటగిరీలో పెడతారు? ఇది వైసీపీ పాలనలో భూకబ్జాలను పరాకాష్ఠకు చేర్చింది. గతంలోనే సుప్రీంకోర్టు సివిల్ తగాదాలను పరిష్కరించే అధికారం రెవెన్యూ అధికారులకు లేదని ఎన్నోసార్లు నొక్కి వక్కాణించింది. ఈ విషయంలో తహశీల్దార్లకు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలి.

డి– పట్టాలు రెండు రకాలు. ఒకటి పేదవారికి రెండు నుంచి ఐదు ఎకరాల వరకు వ్యవసాయం కోసం ఇచ్చే భూములు. రెండోది పేదవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు గరి‌ష్ఠంగా మంజూరు చేసే ఐదు సెంట్లు. రానురాను అది మూడు సెంట్ల నుంచి చివరకు ఒక సెంటు వరకు తీసుకుని వచ్చారు నేటి పాలకులు. వ్యవసాయం కోసం ఇచ్చిన డి పట్టా భూములను 20 సంవత్సరాల తరువాత స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని వైసీపీ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ పెద్దలు రెవెన్యూ అధికారులను లోబరుచుకుని 20 సంవత్సరాలు పూర్తి కాని భూములను కూడా ఫ్రీహోల్డ్ చేయించి, వేలాది ఎకరాలు కొట్టేశారన్నది పెద్ద ఆరోపణ. ప్రస్తుతం అలాంటి భూములపై ఎన్డీఏ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. వ్యవసాయానికి ఇచ్చిన డి – పట్టాల భూములు ఎలా ఉన్నా ఇళ్ల స్థలాలకు ఇచ్చిన 3–2 సెంట్ల భూమిని చాలామంది పేదలు తమ అవసరాలకు అమ్ముకున్నారు. వాటిని 80శాతం పేదలే కొనుక్కున్నారు. కానీ అమ్మకాలు రిజిస్ట్రేషన్ కాక తెల్లకాగితాలపైనే ఒప్పందాలుగా చేసుకున్నారు. అలాంటి వారు తమ పేరు మీద పట్టాలు మార్చుకోవడానికి నానా తంటాలుపడి రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇచ్చి మార్చుకుంటున్నారు. ఇళ్ల స్థలాల కోసం 2/3 సెంట్లు ఇచ్చిన భూములు పదేళ్ళ తరువాత బేషరతుగా ప్రభుత్వమే 22ఏ నుంచి తొలగించి, అమ్ముకునేందుకు అనుమతించాలి.


రోజూ ఇన్ని వందల సభలు జరిగాయి, ఇన్ని వేల పిటిషన్లు వచ్చాయని సమాచార సేకరణకే పరిమితం కాకుండా, వచ్చిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం కావాలి. ఇక్కడ పేర్కొన్న పరిష్కారానికి వీఆర్వోల నుంచి కలెక్టర్ల దాకా చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రతీ రెవెన్యూ అధికారి స్థాయితో నిమిత్తం లేకుండా తమ వద్దకు వచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీ లించి, ఏ విధమైన ప్రలోభాలకూ లోనుకాకుండా ప్రతిఫలం ఆశించకుండా పనిచేస్తే నూటికి 80శాతం సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయి. అప్పుడు ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సుల అవసరమే లేదు. 1989–90ల్లో సర్వే, సెటిల్‌మెంట్ కమిషనర్‌గా అనందరావు ఉన్నప్పుడు ఆయన పట్టాదారు పాసుపుస్తకాలు జారీ విషయంలో ఆచరణాత్మక సూచనలు చేశారు. వాటిని దుమ్ముదులిపి ఈ రెవెన్యూ సదస్సుల్లో తహశీల్దార్లకు అందజేస్తే మేలు. అలాగే ప్రతీ 15 రోజులకు ఒకసారి సమస్యల పరిష్కారం గురించి తహశీల్దార్లను అడగాలి. లేకుంటే రెవెన్యూ సదస్సులకు అర్థమే లేకుండా పోయే ప్రమాదం ఉంది.

మారిశెట్టి జితేంద్ర

రిటైర్డ్‌ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్

రాజమహేంద్రవరం

Updated Date - Dec 17 , 2024 | 01:54 AM