సంపద పెంచటం ఎలా?
ABN , Publish Date - Aug 18 , 2024 | 02:24 AM
డెబ్బయ్యో దశకం తొలినాళ్లలో మన గరిష్ట ఆదాయ పన్ను రేటు 97.75%. రూ.2,00,000 వార్షిక ఆదాయం దాటినవారంతా అంత పన్నూ (85% ఆదాయ పన్ను, 15% పన్నుపై సర్ ఛార్జి) చెల్లించాల్సి వచ్చేది...
డెబ్బయ్యో దశకం తొలినాళ్లలో మన గరిష్ట ఆదాయ పన్ను రేటు 97.75%. రూ.2,00,000 వార్షిక ఆదాయం దాటినవారంతా అంత పన్నూ (85% ఆదాయ పన్ను, 15% పన్నుపై సర్ ఛార్జి) చెల్లించాల్సి వచ్చేది. 1985 వరకు మనకు వారసత్వ పన్ను ఉండేది. 2015 వరకు సంపద పన్ను ఉంది. ఈ రెండు పన్నుల ఆదాయం అంతంతమాత్రం కాగా, వాటి వసూలు ఖర్చు మాత్రం ఆదాయాన్ని మించి పోయేది! దీంతోపాటు, అధిక పన్నుల జమానా అధికారులకు అక్రమార్జన అవకాశమైంది. ఆదాయాన్ని దాచిపెట్టి లాభపడటానికి, నల్లడబ్బు ఆర్థిక వ్యవస్థకి దారితీసింది.
తమ శ్రమకు, నైపుణ్యానికి తగ్గ ఫలితాల్ని ఒక వ్యక్తి అనుభవించలేకపోతే కష్టపడటానికి ప్రోత్సాహకం ఉండదు. వ్యవస్థాపక చొరవ ఆవిరైపోతుంది. పని చేసే ఆసక్తి అంతరించిపోతుంది. కొత్త పెట్టుబడులు, ఆవిష్కరణలు, అభివృద్ధి మందగిస్తాయి. పేదరికం కొనసాగుతుంటుంది. ఆదాయాన్ని, సంపదను ఎలా దాచిపెట్టాలి, ఆస్తుల్ని తర్వాతి తరానికి అనధికారికంగా ఎలా బదిలీ చేయాలి లాంటి అంశాల మీద శక్తియుక్తుల్ని అనుత్పాదకంగా వెచ్చించటం ఎక్కువవుతుంది. ఒక విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూరో, ఆవిష్కర్తో, సంపద సృష్టికర్తో అలాంటి తిరోగమన ధోరణుల్ని భరించాల్సిన అవసరం ఈవేళ లేదు. వ్యాపారానికి ఎక్కడ ఎక్కువ సానుకూలతలుంటే అక్కడికి తరలిపోతారు. వారిని ఏదీ ఆపలేదు. కాబట్టి వారసత్వ పన్నునో, సంపద పన్నునో, ఇష్టారాజ్యంగా అధిక పన్నులనో విధించటం వల్ల ఆదాయాలు రావు సరికదా, అభివృద్ధికి గండిపడుతుంది. వెనిజువెలా, ఉత్తర కొరియా, తూర్పు జర్మనీ, డెంగ్ జియావో పింగ్ ముందుకాలంనాటి చైనా, సోవియట్ యూనియన్, ఇంకా పలు దేశాలు సంపద పంపిణీ ప్రయోగాన్ని భారీస్థాయిలో చేశాయి. ఆర్థిక ఫలితాల్లో బలవంతపు సమానత్వాన్ని సాధించేందుకు ప్రయత్నించాయి. ఏం జరిగిందో చూశాం.
1991 నుండి ఈ మూడు దశాబ్దాలలో, భారత్‌లో దిగువనున్న 50 శాతం జనాభా ఆదాయాలు నాలుగు రెట్లు పెరిగాయి. అంతకుముందు కంటే ఎక్కువ ఆదాయాలు, మెరుగైన రహదారులు, విద్యుత్, మొబైల్ ఫోన్లు, టెలివిజన్, ఇంటర్‌నెట్, డిజిటల్ బదిలీలు ఎరగని కుటుంబం భారత్‌లో దాదాపు లేదు. కానీ నిజమైన పేదరికం ఇంకా కొనసాగుతోంది. కోట్ల మంది ఇప్పటికీ రెక్కాడితేగానీ డొక్కాడని స్థితిలో, రేపేంటి అనే అభద్రతలోనే ఉన్నారు. అటువంటి వాతావరణంలో, తాత్కాలిక వ్యక్తిగత పథకాలకు బలమైన ఆదరణ ఉంటుంది. అయితే సంక్షేమ చర్యలు ఆర్థికంగా ఆచరణసాధ్యంగా ఉండాలి. వచ్చే తరానికి ఆస్తుల్ని నిర్మించకుండా, తాత్కాలిక పథకాల కోసం ఎడాపెడా అప్పులు చేయలేం. సంక్షేమమే పరిపాలన కాకుండా, మౌలిక వసతులు, పెట్టుబడుల ప్రోత్సాహం, పోటీ, అధిక ఆర్థికాభివృద్ధిని జోడించాలి. అప్పుడు మాత్రమే పేదలకు శాశ్వత ప్రాతిపదికన ఆదాయాలు పెరుగుతాయి. పేదరికం తొలగుతుంది. అన్ని వర్గాల ప్రజల జీవన నాణ్యత మెరుగవుతుంది. కాబట్టి, అసలైన సవాలు ‘‘పంచటం ఎలా’’ కాదు; ‘‘పేదల ఉత్పాదకతను పెంచటం ఎలా, వారికి నిజమైన అవకాశాన్ని అందించటమెలా’’. పేదల్లో అత్యధికులు సంపద సృష్టిలో భాగమయ్యామని భావించనంత వరకూ, అభివృద్ధి నుంచి తమకు అర్థమయ్యే రీతిలో లాభం పొందనంత వరకూ, మన రాజకీయాలు అభివృద్ధికి వ్యతిరేకంగానే సాగుతుంటాయి. ప్రజల్లో ఎక్కువ శాతానికి ఎదిగే అవకాశాలు స్పష్టంగా అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే ఆర్థికాభివృద్ధికి మెజారిటీ ఓట్లు పడతాయి. కాబట్టి వచ్చే 10–15 సంవత్సరాలు మన ప్రజాస్వామ్యానికి, మన ఆర్థిక వ్యవస్థకి అత్యంత కీలకం.
ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయటానికి వీలైన ప్రతిదీ మనం చేయాలి. అభివృద్ధి ఒక్కటే సరిపోదు. ఇప్పటికీ చాలామంది జీవనప్రమాణాలని నిర్ణయించటంలో తలసరి ఆదాయం అత్యంత కీలకమైనది. అధిక అభివృద్ధిని కొనసాగించాలంటే, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతులు, పెట్టుబడులకు ప్రోత్సాహం, నియంత్రణ అడ్డుగోడల తొలగింపు కోసం మనం తదేకంగా కృషి చేయాలి. అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, అందులో పేదలకు మరింత సమాన భాగస్వామ్య అవకాశాలు అందించేందుకు నాలుగు కీలక విభాగాల మీద మనం దృష్టి సారించాలి. మొదటిది– ఉత్పత్తిలో కీలక పాత్ర వహించే భూమి, కార్మిక చట్టాల సంకెళ్లను తొలగించాలి. మరిన్ని పెట్టుబడులు ప్రవహించేలా, మరింత ఉపాధిని సృష్టించేలా చేయాలి. అభివృద్ధికి దన్నుగా నిలిచే కనీస స్థాయి చట్టబద్ధపాలన పరిస్థితుల్ని నెలకొల్పాలి. ఒప్పందాలు సరిగా అమలయ్యేలా చేయటం, వివాదాల్ని వేగంగా పరిష్కరించటం జరగాలి. రెండోది– మన ప్రజల ఉత్పాదకత, సంపాదనా సామర్థ్యాన్ని పెంచేందుకు జాతీయ స్థాయిలో విద్యారంగంలో ఓ బృహత్తర ప్రయత్నం కావాలి. పిల్లల నమోదు, మౌలిక వసతులు చాలవు, నాణ్యమైన పాఠశాల విద్యాప్రమాణాలు మన మంత్రం కావాలి. ప్రజలకు జేబుఖర్చు లేకుండా నాణ్యమైన ఆరోగ్యం, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులో ఉండాలి. మూడోది– అభివృద్ధి, ఉపాధి అవకాశాలకు చోదక శక్తులయ్యే 3000 చిన్న పట్టణాల సహజ అభివృద్ధిని ప్రోత్సహించాలి. గ్రామాల మధ్య అటువంటి పట్టణీకరణ వల్ల తక్కువ నైపుణ్యాలున్న కోట్లాది మంది కార్మికులు ఎక్కడో దూరంగా ఉన్న పెద్ద నగరాలకు వలస పోవాల్సిన, దుర్భర పరిస్థితుల మధ్య బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన అవసరం లేకుండా ఉపాధి లభిస్తుంది.
గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య అగాధం తొలగాలి, అనుసంధానం పెరగాలి. ప్రభుత్వాలు ఒక్కసారి మౌలిక వసతుల్ని నిర్మించి, పట్టణ ప్రణాళికను నిర్దేశిస్తే చాలు, ఇళ్ల నిర్మాణం, వాణిజ్యం, పరిశ్రమలు వంటివి ప్రైవేటు రంగం చూసుకుంటుంది. చివరిగా– రైతుకి, వినియోగదారునికి మధ్య అడుగడుగునా దళారులు లేకుండా మార్కెట్ గొలుసును కుదించాలి. రిటైల్ చెయిన్లు, పంట ఉత్పత్తుల నిల్వ, ప్రాసెసింగ్, కాంట్రాక్ట్ వ్యవసాయం, ఎగుమతులను ప్రోత్సహించటం ద్వారా వ్యవసాయాన్ని ఆధునీకరించాలి. సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించటానికి, అభివృద్ధిని, ప్రగతిని కోరుకునే మెజారిటీని సృష్టించటానికి ఇవన్నీ అవసరం.
డాక్టర్ జయప్రకాష్ నారాయణ్
లోక్‌సత్తా వ్యవస్థాపకులు