Share News

కమీషన్ల కాళేశ్వరాన్ని ఎంతకని సమర్థిస్తారు?

ABN , Publish Date - May 09 , 2024 | 06:03 AM

ఏప్రిల్ 25, 2024 రోజున ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీరమల్ల ప్రకాష్ రాసిన వ్యాసం ‘కాళేశ్వరంపై అకారణంగా విషం చిమ్ముతారు ఎందుకు?’ శీర్షికన ప్రచురితమైంది. ఈ వ్యాసంలో ప్రకాష్ తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తున్నట్టు...

కమీషన్ల కాళేశ్వరాన్ని ఎంతకని సమర్థిస్తారు?

ఏప్రిల్ 25, 2024 రోజున ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీరమల్ల ప్రకాష్ రాసిన వ్యాసం ‘కాళేశ్వరంపై అకారణంగా విషం చిమ్ముతారు ఎందుకు?’ శీర్షికన ప్రచురితమైంది. ఈ వ్యాసంలో ప్రకాష్ తెలంగాణలో ఎత్తిపోతల ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తున్నట్టు ప్రస్తావించడం చూస్తే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో జరిగిన అవకతవకల పైనుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. అదేవిధంగా కేవలం ఖర్చులు – ప్రయోజనాల నిష్పత్తి కోణంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రకాష్ చెప్పడం పూర్తిగా అవాస్తవం. నేను రాసిన వ్యాసాల్లో కేవలం ఖర్చులు – ప్రయోజనాల నిష్పత్తి ఆధారంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని చెప్పలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టే ప్రతి వంద రూపాయలకు కేవలం 52 రూపాయల ప్రయోజనం మాత్రమే లభిస్తుందని వెల్లడించింది. నేను ఇంతకుముందు రాసిన వ్యాసాల్లో సాంకేతిక సంక్లిష్టత, పర్యావరణ ముప్పు, నిర్మాణంలో నాణ్యత లోపం, ఉద్దేశపూర్వకంగా స్వప్రయోజనాల కోసం ప్రాజెక్టు ఖర్చును విపరీతంగా పెంచడం, ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ప్రయోజనాలకు మించి నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండి అవి తెలంగాణ అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచే పరిస్థితి... ఈ వాస్తవాలను ప్రస్తావించాను. భవిష్యత్తులో ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఇక ముందుకు తీసుకోకపోవడం ఆపి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాను.


ప్రకాష్ తన వ్యాసంలో అమెరికాలోని కొలరాడో నదిపై కట్టిన హూవర్ డ్యాము, ఈజిప్టులో నైలు నదిపై నిర్మించిన ఆస్వాన్ డ్యాము, చైనాలో యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గార్జెస్ డ్యామ్‌లను ప్రస్తావిస్తూ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సమర్థించే ప్రయత్నం చేశాడు. ఒక మామిడిపండును రేగుపండుతో పోల్చినట్లు ఉంది ప్రకాష్ చేసిన ప్రయత్నం. ఎందుకంటే చైనా, ఈజిప్టు, అమెరికాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టులు గ్రావిటీ ఆధారంగా కేవలం ఉపరితల కాలువల ద్వారా వ్యవసాయానికి నేరుగా నీరు అందించే ప్రాజెక్టులు. అంటే ప్రస్తుతం మన నాగార్జునసాగర్ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు వంటివి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికొస్తే ఇది పూర్తిగా ఎత్తిపోతల ద్వారా పనిచేసే ప్రాజెక్టు. ప్రకాష్ ఇలా ఏ విధంగా పొంతనలేని పోలికతో నేను భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకమనే భావన కలిగించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న గ్రావిటీ ఆధారిత ప్రాజెక్టులైన బాక్రానంగల్, తుంగభద్ర, హిరాకుడ్, నాగార్జునసాగర్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రస్తావించకుండా, తెలంగాణ ప్రజలకు చైనా అమెరికా ఈజిప్ట్‌లలో నిర్మించిన ప్రాజెక్టులపై అవగాహన లేదని భావించి, ఉద్దేశపూర్వకంగా ఏ మాత్రం పోలిక లేకుండానే ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో కాళేశ్వరం ప్రాజెక్టును పోల్చారు. ఇంకా తెలంగాణ ప్రజలు అమాయకులనే భావనలోనే కేసీఆర్ భజన మండలి ఉన్నట్టు దీన్నిబట్టి అర్థమవుతుంది.


ఏప్రిల్ 11, 2024న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన నా వ్యాసం ‘కాళేశ్వరానికి ఒక పాత రష్యన్ ప్రాజెక్టు గుణపాఠం’లో రెండు ఎత్తిపోతల ప్రాజెక్టుల మధ్య ఉన్న పోలికలను ప్రస్తావించాను. పూర్వపు సోవియట్ యూనియన్ తలపెట్టిన భారీ నదీ జలాల మరలింపు ప్రాజెక్టును నిలిపివేయడానికి ఆనాటి సోవియట్ యూనియన్ ప్రణాళిక సంఘం స్పష్టంగా చెప్పిన మూడు కారణాలు ఏమిటంటే– సాంకేతికంగా ఈ ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైనదని, పర్యావరణానికి పెద్ద ముప్పని, ఇంకా ఆర్థికంగా భారమని. కానీ ప్రకాష్ ఏప్రిల్ 25, 2024న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన తన వ్యాసంలో ఈ రష్యన్ నదీ జలాల మరలింపు ప్రాజెక్టును రాజకీయ కారణాలవల్ల మూసివేసినట్టుగా తన ఊహాగానంతో సృష్టించిన కారణాలను చెప్పుకొస్తూ, ఆ అనుభవాలు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు వర్తించవని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. అంతేగాక నా వ్యాసంలో స్పష్టంగా తెలిపినట్టు ఈ పూర్వపు సోవియెట్ యూనియన్ భారీ నది జలాల మరలింపు ప్రాజెక్టు 1986లో పూర్తిగా మూసివేసిన తర్వాత ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోలేదు. దీనికి ప్రధాన కారణం సోవియెట్ యూనియన్ అనుభవాలు. కానీ ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ప్రకాష్ పోలిక లేని అమెరికా, ఈజిప్ట్, చైనాల్లోని గ్రావిటీ ఆధారిత భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులను కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పోల్చారు.


ఈ సందర్భంగా నీటిపారుదల ప్రాజెక్టులలో భారతదేశం ఇతర ఆసియా దేశాలకు ఏ విధంగా దిక్సూచి అయిందో తెలుసుకోవడం అవసరం. 1947లో స్వాతంత్ర్యం అనంతరం మన దేశంలో మొత్తం నీటిపారుదల కింద ఉన్న నికర విస్తీర్ణం కేవలం ఐదు కోట్ల ఎకరాలు మాత్రమే. ఈ విస్తీర్ణం కూడా దాదాపు ఎక్కువ శాతం చెరువులు, బావుల కింద ఉండేది. స్వాతంత్రానంతరం భారతదేశం పేదరికం, ఆహార కొరత, కరువు, నిరుద్యోగం లాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండేది. వీటి పరిష్కారంలో భాగంగా తొలి ప్రధాని నెహ్రూ మొదటి మూడు పంచవర్ష ప్రణాళికలలో (1951–1966) భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి 1960వ దశకంలోనే ఏడు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించి దేశానికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఆ తదనంతరం ఇదే పరంపరని కొనసాగిస్తూ వివిధ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులను 1985 వరకు నిర్మించారు. మొత్తం దేశంలో ఉన్న జాతీయ హోదాతో కూడిన 16 భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మరో వంద మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులన్నీ దాదాపుగా 1951 నుండి 1980 మధ్యకాలంలో నిర్మించినవే. ఇవేగాక దాదాపుగా మరో 4000 చిన్న తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులను వివిధ రాష్ట్రాలలో ఇదే కాలంలో నిర్మించారు. వీటి ఫలితంగా దేశంలో నికరంగా నీటిపారుదల విస్తీర్ణం 2014 నాటికి 17 కోట్ల ఎకరాలకు చేరింది. ఆహార ధాన్యాలు ఉత్పత్తి 6 రెట్లు పెరిగి, పేదరికం గణనీయంగా తగ్గి, ఆహార భద్రతను సాధించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం ప్రత్యక్షంగా చూసాం. నెహ్రూ అభివృద్ధి విధానంలో భాగంగా నిర్మించిన భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రయోజనాలను చూసి 1965 తరువాత ఆసియా ఖండంలో వివిధ దేశాలు నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి సారించి కొత్త ప్రాజెక్టులు నిర్మించారు.

ఉదాహరణకు థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా లాంటి ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ, ప్రకాష్ ప్రస్తావించిన చైనాలోని యాంగ్జీ నదిపై త్రీ గార్జెస్ డ్యాము (1994 నుండి 2003), ఈజిప్ట్‌లో నైలు నదిపై ఆస్వాన్ డ్యాము (1960 నుండి 1970) లాంటివి నిర్మించారు. ఈ విధంగా మన దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ నిర్మించిన అన్ని భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు గ్రావిటీ ఆదారిత భూమి ఉపరితల కాలువల ద్వారా నేరుగా వ్యవసాయానికి నీరు అందించే విధంగా మాత్రమే నిర్మించారు. ప్రపంచంలో ఎక్కడ కూడా కాళేశ్వరం లాంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించలేదు.


ఇలా మన దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న పూర్వ అనుభవాలను పరిగణించకుండా, ముఖ్యంగా పూర్వపు సోవియట్ భారీ నది జలాల మరలింపు ప్రాజెక్టు గుణపాఠాలను పూర్తిగా విస్మరించి, సొంత ఇంజనీర్ల నిపుణుల కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి కేవలం స్వప్రయోజనాలు, కమీషన్ల కోసం మాత్రమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి పెద్ద అడ్డు గోడగా మారే ప్రమాదం ఉంది. ఈ అడ్డుగోడను ఎంత త్వరగా తొలగించుకుంటే తెలంగాణ అభివృద్ధికి అంత ఆర్థిక వనరుల కొరత తగ్గుతుంది.

ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

వ్యవసాయ ఆర్థికవేత్త

Updated Date - May 09 , 2024 | 06:04 AM