Share News

ఎన్ని కలలు.. ఎన్నికల పాఠాలు!

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:55 AM

రాజకీయ ప్రక్రియగా సాగాల్సిన ఎన్నికలు ఆధిపత్య విద్వేష రాజకీయాలకు ఆలవాలంగా మారాయి. విధానాల ప్రాతిపదికన జరగాల్సిన ఎన్నికలు కులం, మతం పేరుతో సమాజాన్ని విభజించడమే గాక...

ఎన్ని కలలు.. ఎన్నికల పాఠాలు!

రాజకీయ ప్రక్రియగా సాగాల్సిన ఎన్నికలు ఆధిపత్య విద్వేష రాజకీయాలకు ఆలవాలంగా మారాయి. విధానాల ప్రాతిపదికన జరగాల్సిన ఎన్నికలు కులం, మతం పేరుతో సమాజాన్ని విభజించడమే గాక, ధన బలమే నిర్ణయాత్మక శక్తిగా మారి ప్రజాస్వామ్య ప్రక్రియనే అపహాస్యం చేశాయి. స్వతంత్ర భారతంలో ఎన్నడూలేని విధంగా వికృత ధోరణులతో సాగిన ఎన్నికల ప్రక్రియ మరెన్నో హెచ్చరికలు చేసింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ పాలనా వ్యవస్థలు అధికార పార్టీ కొమ్ముకాసే విధంగా దిగజారాయి. దేశ భద్రతను కాపాడే రక్షణ దళాల కర్తవ్యాలు–త్యాగాలు ఓట్లు రాల్చే సాధనాలుగా మారిపోయాయి. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ అధికార పార్టీ కనుసన్నుల్లో నడిచేదిగా కుచించుకుపోయింది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సంఘం ఆర్టికల్ 324ను తవ్వితీసి ప్రచార గడువును కుదించింది. ఎన్నికల కమిషన్ సభ్యులు చివరి క్షణంలో రాజీనామా చేయడం వివాదాస్పదమైంది.


నూతనంగా వచ్చిన కమిషన్ బాధ్యులు ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయడమే ప్రధాని మోదీకి కలిసివచ్చిందనే వాదన ఉన్నది. సమాచార వ్యవస్థ పటిష్టంగా లేని సమయంలో కూడా స్వల్ప వ్యవధిలో ఎన్నికలు నిర్వహించిన చరిత్ర ఉంది. అలాంటిది సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చి కూడా ఏడు విడతలుగా ఎన్నికలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో అంతుబట్టని విషయమే. స్వతంత్ర భారతంలోని తొలినాళ్లలో రాజకీయ సిద్ధాంతాలు, విలువలు పునాదిగా ఎన్నికలకు జరిగేవి. 2014లో పోటీచేసిన అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఎన్నికైన వారిలో 50శాతం మంది కోటీశ్వరులే. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో జరిగిన ఓటుకు నోటు విధానం కొంత ప్రజలను మేల్కొల్పింది. ప్రజలు రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వటం వల్లే ఈ గెలుపు సాధ్యమైంది. ఈ కాలంలో అలాంటి ఉదాహరణలు అక్కడక్కడ కన్పిస్తున్నాయి. సామాన్యుడు పోటీలో నిలబడగలడా? అనే సందేహాలకు హుజురాబాద్ ఉప ఎన్నిక కారణమైంది. కానీ, 2023 ఎన్నికల ఫలితాలు దానికి మంచి సమాధానం చెప్పాయి. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే ఎన్నికల సంఘం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. ఎన్నికల ప్రక్రియ వారంలో ముగిసే విధంగా రూపొందించాలి.

డాక్టర్ సంగని మల్లేశ్వర్

కాకతీయ విశ్వవిద్యాలయం

Updated Date - Jun 04 , 2024 | 12:56 AM