బీజేపీ ఎలా ఓడిపోయింది?
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:04 AM
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పాలక పక్షం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పుగా అర్థం చేసుకోవడం సబబేనా? సబబేనని మాలో ఒకరు (యోగేంద్ర యాదవ్) గట్టిగా వాదించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం...

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పాలక పక్షం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పుగా అర్థం చేసుకోవడం సబబేనా? సబబేనని మాలో ఒకరు (యోగేంద్ర యాదవ్) గట్టిగా వాదించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం ఎన్డీఏకు సమకూరింది. అయితే బీజేపీ తన మెజారిటీని కోల్పోవడమే కాదు, ప్రజామోదాన్ని పొందడంలో కూడా విఫలమయింది. ప్రత్యర్థి పక్షం ఏదీ తన దరి దాపుల్లోకి రాని రీతిలో ఏకైక పెద్ద పక్షంగా బీజేపీ ఆవిర్భవించింది. అయితే 400కి పైగా సీట్లను గెలవాలని, 50 శాతానికి పైగా ఓట్లను కైవసం చేసుకోవాలని స్వయంగా నిర్దేశించుకున్న లక్ష్యాల వెలుగులో బీజేపీ సంఖ్యా బలాన్ని పరిశీలించవలసి వున్నది. అంతకంటే ముఖ్యంగా ఎన్నికల ఫలితాలను వాటి రాజకీయ సందర్భంలో చూడవలసి ఉంది. ఈ సార్వత్రక ఎన్నికలలో ధన బలం, మీడియా మద్దతు, ప్రభుత్వ యంత్రాంగం, మరీ ముఖ్యంగా ఎన్నికల సంఘం మొదలైనవన్నీ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న కఠోర వాస్తవం నేపథ్యంలో బీజేపీ జయాపజయాలను అంచనా వేయవలసి ఉంది.
ఈ అవగాహనకు ఒక సంభావ్య వ్యతిరేక వాదన బీజేపీ ఓట్ల వాటా కథ. పాలక పక్షం ఓట్ల వాటా 37.4 శాతం నుంచి 36.6 శాతానికి మాత్రమే పడిపోయింది. నిజానికి ఇది ఉపేక్షణీయమైనది. ఒడిషాలో బీజేపీ ఆశ్చర్యకరంగా జయపతాక నెగురవేసింది. కేరళలో పలు అవరోధాలను అధిగమించి తన ఉనికిని నెలకొల్పుకున్నది. ఆంధ్ర, పంజాబ్‌లలో తన ఉనికిని మెరుగుపరచుకున్నది. మొత్తం మీద దేశవ్యాప్తంగా తన ఉనికిని సుస్థిరపరచుకోవడంలో బీజేపీ పూర్తిగా సఫలమయింది అన్ని రాష్ట్రాలలోను రెండంకెల శాతంలో ఓట్ల వాటాను సాధించుకున్నది. ఈ వాస్తవాల ప్రాతిపదికన సార్వత్రక ఎన్నికలలో బీజేపీ విజయం సాధంచిందని ఆ పార్టీ మద్దతుదారులు వాదిస్తున్నారు. స్వతంత్ర పరిశీలకులు వారితో ఏకీభవించడం లేదు.
రాష్ట్ర స్థాయి ఓట్ల వాటాలను నిశితంగా పరిశీలిస్తే పాలక పక్షాలు కొన్ని ప్రాంతాలలో ఓడిపోయి, మిగతా ప్రాంతాలలో లబ్ధి పొందిన కథ కాదని అర్థమవుతుంది. నిజానికి బీజేపీ పాలక పక్షంగా లేని ప్రతి చోటా ఓటర్లు అక్కడి పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ సార్వత్రక ఎన్నికలలో రెండు విభిన్న బీజేపీలు పోటీ చేశాయి. ఒకటి పాలకపక్ష బీజేపీ; రెండు ప్రతిపక్ష బీజేపీ. పాలకపక్ష బీజేపీ ఈ ఎన్నికలలో తీవ్రంగా నష్టపోగా సవాల్‌దార్ బీజేపీ గణనీయంగా లబ్ధి పొందింది. పాలకపక్షాలు, రాజకీయ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా వేసిన ఓటుతో కొన్ని రాష్ట్రాలలో బీజేపీ బాగా లబ్ధి పొందింది. అయితే బీజేపీకి దక్కిన ఈ లబ్ధి జాతీయ స్థాయిలో ప్రజా తీర్పు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉందన్న వాస్తవాన్ని పాక్షికంగా కప్పిపుచ్చింది దీనివల్ల బీజేపీ దీర్ఘకాలిక లబ్ధి పొందే అవకాశం లేదు.
దేశ వ్యాప్తంగా మూడింట రెండు వంతుల నియోజకవర్గాలలో (కచ్చితంగా చెప్పాలంటే 356 సీట్లు) బీజేపీ ప్రాబల్య రాజకీయ పక్షంగా ఉన్నది. రాష్ట్ర పాలక పక్షంగా లేని చోట్ల కూడా అది ఆధిపత్య పార్టీగా ఉన్నది. బీజేపీ ప్రాబల్య నియోజక వర్గాలు పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్ నుంచి తూర్పున బిహార్, జార్ఖండ్ దాకా విస్తరించి వున్నాయి. బీజేపీ ప్రస్తుతం పాలకపక్షంగా లేని కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. ఈ రాష్ట్రాలలో తీవ్ర నష్టాలను చవి చూసింది. దాని రాజకీయ గుత్తాధిపత్యానికి తీవ్ర విఘాతమేర్పడింది. గత సార్వత్రక ఎన్నికలలో గెలుచుకున్న 271 నియోజకవర్గాలలో 75ను ఈ సారి కోల్పోయింది అయితే మిగతా రాష్ట్రాలు, ప్రాంతాలలో (187 సీట్లు) బీజేపీ పాలక పక్షాల, రాజకీయ ఆధిపత్య వర్గాల వ్యతిరేక శక్తిగా ఎన్నికల గోదాలోకి దిగింది. అధికారంలో ఉన్న లేదా ప్రాబల్య రాజకీయ పక్షాలను సవాల్ చేసింది. ఒడిషాలో బిజూ జనతాదళ్, ఆంధ్రలో వైసీపీ, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ సవాల్ చేసింది. ఇలా ఆయా రాష్ట్రాలలోని పాలక పక్షాలను సవాల్ చేయడం ద్వారా బీజేపీ లబ్ధి పొందింది. ఈ 187 సీట్లలో గతంలో గెలుచుకున్న వాటి కంటే ఈ సారి 12 సీట్లను అదనంగా కైవసం చేసుకున్నది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే బీజేపీకి 6 శాతం ఓట్లు పెరిగాయి. ఈ మొగ్గు జాతీయ స్థాయిలో ఓట్ల వాటా తగ్గుదలను 1 శాతం మేరకు నివారించింది.
బీజేపీ ఓట్ల వాటా పైకి కనిపించిన దాని కంటే అధ్వాన్నంగా ఉన్నది. 2019లోను, 2024లోను పోటీ చేసిన నియోజకవర్గాలు 399 ఉన్నాయి. వీటిలో 274 నియోజకవర్గాలలో ఓట్ల శాతం బాగా పడిపోయింది. మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, హర్యానా, హిమాచల్, పంజాబ్, జమ్ము–కశ్మీర్‌లలో బీజేపీ పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలోను ఆ పార్టీ ఓట్ల వాటా తగ్గిపోయింది. యూపీలో రెండు స్థానాలలో మినహా మిగతా నియోజకవర్గాలు అన్నిటిలోను బీజేపీ ఓట్ల వాటా గణనీయంగా తగ్గింది 20 శాతానికి పైగా ఓట్లతో గెలిచిన స్థానాల సంఖ్య 151 నుంచి 77కి తగ్గిపోయింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖీ పోటీ జరిగిన 215 స్థానాలలో బీజేపీకి పడిన ఓట్ల పెరుగుదలను చూద్దాం. గత సార్వత్రక ఎన్నికలలో ఈ నియోజకవర్గాలలో 90 శాతానికి పైగా కైవసం చేసుకున్నది. ఈ సారి బీజేపీ 153 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. 62 స్థానాలను కాంగ్రెస్‌కు కోల్పోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఈ నియోజకవర్గాలలో బీజేపీ వ్యతిరేక ఓట్లు 5.5 శాతం పెరిగాయి. ఇది బీజేపీకి తీవ్ర పరాజయమని చెప్పక తప్పదు.
బీజేపీ పాలకపక్షంగా ఉన్న రాష్ట్రాలలో ఆ పార్టీ పోటీ చేసిన స్థానాలలో దానికి వ్యతిరేకంగా పడిన ఓట్ల శాతం గణనీయమైన స్థాయిలో ఉన్నది. ఈ నెగెటివ్ ఓటు రాజస్థాన్‌లో 12 శాతం, హర్యానాలో 12 శాతం, హిమాచల్‌లో 13 శాతం మేరకు ఉన్నది. ఇదే రాష్ట్రాలలో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందింది. అయితే ప్రస్తుత ఎన్నికలలో రాజస్థాన్, హర్యానాలలోని కొన్ని ప్రాంతాలలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో ఆ పార్టీ గణనీయమైన సంఖ్యలో సీట్లను కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తీవ్రంగా నష్టపోయింది ఈ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పడిన ఓట్ల శాతం (6.8శాతం), దాని ఇరుగు పొరుగు రాష్ట్రాలలో నమోదైన బీజేపీ వ్యతిరేక ఓటుతో ఇంచుమించు సమరీతిలో ఉండడం గమనార్హం. బీజేపీ వ్యతిరేక ఓటు బిహార్‌లో 6.9 శాతం మేరకు, జార్ఖండ్‌లో అది 7 శాతం మేరకు ఉన్నది.
బీజేపీ ఓట్ల వాటాలో స్వల్పస్థాయి తగ్గుదల కర్ణాటక, అస్సోం, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్నది. ఈ అన్ని రాష్ట్రాలలో (కర్ణాటక మినహా) పాలకపక్షం తన సీట్లను చాలావరకు కాపాడుకోగలిగింది. కర్ణాటకలో బీజేపీ వ్యతిరేక ఓటు కొన్ని ప్రాంతాలలో మాత్రమే కేంద్రీకృతమైనప్పటికీ బీజేపీ చాలా సీట్లను కోల్పోయింది. పాలకపక్ష బీజేపీ నష్టపోని రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మాత్రమే. ఈ రాష్ట్రాలలో ప్రతిపక్షం బలహీనంగా ఉండంతో బీజేపీ లబ్ధి పొందింది. బీజేపీ ఓట్లను కొల్లగొట్టడంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమయింది.
బీజేపీ ప్రతిపక్ష పాత్ర నిర్వహించిన రాష్ట్రాలలో పాలకపక్షాల పట్ల వ్యతిరేకత జాతీయ పాలకపక్షానికి సానుకూలంగా పరిణమించింది. తెలంగాణలో బీఆర్ఎస్ పరోక్ష మద్దతు కారణంగా బీజేపీ తన ఓట్ల వాటాను 15.7 శాతం మేరకు అదనంగా పెంచుకున్నది. ఒడిషాలో 7 శాతం అదనపు ఓట్ల పెరుగుదలతో అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంతో పాటు ఆ రాష్ట్రంలో అధికార పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. కేరళలో 3 శాతం అదనపు ఓట్ల పెరుగుదలతో ఆ రాష్ట్రంలో తన మొదటి లోక్‌సభా స్థానాన్ని బీజేపీ గెలుచుకున్నది. తమిళనాడు, పంజాబ్‌లలో ఒక కీలక భాగస్వామ్య పక్షాన్ని కోల్పోయిన కారణంగా ఆ మాజీ మిత్రపక్షానికి అనుకూలంగా ఉండే సామాజికవర్గాల మద్దతును బీజేపీ కోల్పోయింది. ఆ రాష్ట్రాలలో గతంలో కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేసిన కారణంగా బీజేపీ తన ఓట్ల వాటాను మొత్తంగా పెంచుకున్నప్పటికీ విడివిడి నియోజక వర్గాలలో దాని ఓట్ల వాటా స్వల్పంగా తగ్గిపోయింది. ఈ ధోరణికి పశ్చిమ బెంగాల్ ఒక మినహాయింపుగా కనిపిస్తున్నది. ఈ రాష్ట్రంలో పాలక తృణమల్ కాంగ్రెస్‌ను బీజేపీ గట్టిగా ఎదుర్కొన్నది. అయితే ఓట్ల వాటాలో 1.3 శాతాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాజయం నుంచి బీజేపీ ఇప్పటికీ కోలుకోలేదని ఆ ఓట్ల వాటా తగ్గుదల స్పష్టం చేసింది.
భారతీయ జనతా పార్టీ ప్రజామోదాన్ని పొందిందా అన్నది ఈ సార్వత్రక ఎన్నికల అసలు ప్రశ్నగా చెప్పి తీరాలి. 400కు పైగా సీట్లను, 50 శాతానికి పైగా ఓట్లను గెలుచుకోవాలన్న లక్ష్యాన్ని బీజేపీ తనకుతాను నిర్దేశించుకున్నది. ఆ రికార్డు స్థాయి సీట్లు, ఓట్లు సాధిస్తాననే ఆత్మవిశ్వాసాన్ని ఆ పార్టీ పదేపదే వ్యక్తం చేసింది. ఎన్నికల షెడ్యూలును ప్రకటించక ముందే బీజేపీనే మళ్లీ విజేత అని సర్వత్రా భావించడం జరిగింది. ఆ పార్టీ శ్రేణులకైతే ఈ విషయంలో ఇసుమంత సందేహం కూడా లేదు. బీజేపీ ప్రత్యర్థి పక్షాల సంఖ్యా బలం గురించి ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ మిత్రపక్షాల సంఖ్యా బలంపై కూడా ఎవరూ శ్రద్ధ చూపలేదు మోదీ, ఆయన పార్టీ కేంద్రంగా జరిగిన అధికార క్రీడలో ఆ అంశాలన్నీ యాదృచ్ఛికమైనవేనని భావించడం జరిగింది. బీజేపీ భవిష్యత్తుకు సంబంధించిన నిజమైన ప్రశ్న: పాలకపక్ష బీజేపీని ప్రతిపక్ష బీజేపీ ఎలా రక్షించగలుగుతుంది? బీజేపీ ఎదుగుదలకు ఆస్కారమున్న రాష్ట్రాలు ఇప్పుడు ఎన్నో లేవు. వివిధ రాష్ట్రాలలో పాలకపక్షాలను సవాల్ చేసిన రాజకీయ శక్తిగా బీజేపీకి సమకూరిన సానుకూలతలు సుదీర్ఘకాలం పాటు కొనసాగవు. ఇది స్పష్టం. వెన్వెంటనే కాకపోయినా సమీప భవిష్యత్తులో, కాంగ్రెస్‌కు పట్టిన గతి తనకు పట్టకుండా ఉండేందుకు దోహదం చేసే మార్గాలను పాలకపక్ష బీజేపీ కనుగొనవలసి ఉన్నది. పైగా నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి క్షీణించిపోతున్న తరుణమిది. తిరుగులేని భవిష్యత్తును నిర్మించుకునే విషయంలో బీజేపీకి ప్రస్తుత సార్వత్రక ఎన్నికలు అంతగా నమ్మకాన్ని, భరోసాను ఇవ్వలేవు.
యోగేంద్ర యాదవ్
(శ్రేయాస్ సర్దేశాయి, రాహుల్ శాస్త్రి సహకారంతో)
(ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ విశ్లేషకుడు, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ యోగేంద్రయాదవ్ అందిస్తున్న ఐదు వ్యాసాల పరంపరలో ఇది రెండవది)