Share News

భారీ అంబేడ్కర్ విగ్రహాల వెనక దాచేస్తే దాగని కుట్రలు!

ABN , Publish Date - Jan 18 , 2024 | 02:00 AM

ఇపుడంతా విగ్రహాల టైంలా ఉంది. దేశమంతా విగ్రహాల చుట్టూ తిరుగుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రెండు ప్రముఖమైన విగ్రహ ప్రతిష్టల కోసం...

భారీ అంబేడ్కర్ విగ్రహాల వెనక దాచేస్తే దాగని కుట్రలు!

ఇపుడంతా విగ్రహాల టైంలా ఉంది. దేశమంతా విగ్రహాల చుట్టూ తిరుగుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రెండు ప్రముఖమైన విగ్రహ ప్రతిష్టల కోసం సిద్ధపడుతున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో, ప్రభుత్వమే అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన శ్రీరాముడి విగ్రహం ఇంకా పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ట చేసేందుకు ప్రధాని త్వరపడుతుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో, ఎన్నికల హడావిడి ముంగిట, జగనన్న ప్రభుత్వం జనవరి 19న విజయవాడ నడిబొడ్డున, బాబాసాహెబ్ నూట పాతిక అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం శరవేగంగా సిద్ధమవుతోంది. నిజంగానే ఈ పాలకులకు రామరాజ్యంపై, అంబేడ్కర్ కలలు కన్న సామాజిక న్యాయం పరిఢవిల్లే సమాజంపై శ్రద్ధ ఉందా?

శ్రీరాముడి విగ్రహ స్థాపన విషయాన్ని కాసేపు పక్కనబెడితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూడు వందల కోట్లకు పైచిలుకు ఖర్చుతో నిర్మించిన అంబేడ్కర్ స్మృతివనం ఆవిష్కరణ ఈ రాష్ట్రంలోని దళితులను ఓ కొత్త వేకువలోకి నడిపించనుందా?

కులం పేరుతో ఏర్పడ్డ వివక్షాయుత భారతీయ సమాజాన్ని రాజ్యాంగ హక్కుల ద్వారా, అనేక చట్టాల ద్వారా సంస్కరించిన సామాజిక న్యాయవేత్త డా. బి.ఆర్. అంబేడ్కర్. ప్రభుత్వం ఆయన భారీ విగ్రహాన్ని నిలబెట్టి, ఆయన జీవిత విశేషాలతో నగరం నడిబొడ్డున స్మృతివనాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయం. ఐతే ప్రజలూ, పాలకులూ ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. షెడ్యూల్డ్ కులాల ప్రజలను, వారి అంటరానితనాన్ని రూపుమాపడానికి జీవితాంతం శ్రమించి, వారు ఇతర సమూహాలతో సమానంగా బ్రతకడానికి చట్టాలు చేసిన సామాజిక న్యాయవేత్త అంబేడ్కర్ నూటపాతిక అడుగుల విగ్రహాన్ని స్థాపిస్తే ఇకపై వారిపై యథేచ్ఛగా జరుగుతున్న అత్యాచారాలు ఆగుతాయా? అసలు భారత ప్రభుత్వాలు ఎగబడి భారీ అంబేడ్కర్ విగ్రహాలు పెట్టడం అనే చర్య ఆయనను అందరి నాయకుడిగా ప్రచారం చేయడానికా లేక, విగ్రహం చూపి దళితులను మభ్యపెట్టి దేశంలో మెజారిటీగా ఉన్న వారి ఓట్లను దండుకోడానికా? గాంధీ గారిని జాతిపిత అంటాం. దేశంతో పసిపిల్లలతో సహా ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ దేశంలో ఎక్కడా ప్రభుత్వాలు ఆయన భారీ విగ్రహాల్ని ప్రతిష్టించగా చూడం. ఎందుకని? గాంధీ ఏ సామాజిక సమూహానికి చెందుతారో అది ఓటు బ్యాంకుగా ఉండేంత పెద్ద సమూహం కానందుకేనా?

ఎందుకు ఈ సందేహం కలుగుతున్నదంటే, ఈ మధ్య కాలం వరకూ అంబేడ్కర్ విగ్రహాలను ప్రతిష్టించుకున్నది దళితులు మాత్రమే. ఎస్సీ వాడల్లో మాత్రమే ఆయన విగ్రహం కనిపిస్తుంది తప్ప, మిగతా ఏ కులాల ఇలాకాల్లోనూ ఆయన విగ్రహం కనిపించదు. పైపెచ్చు ఊరి మధ్యలో ఎక్కడైనా ఆయన విగ్రహం నిలబెడితే, ఆ ఊరి ఆధిపత్య కులస్థులు ఆ విగ్రహాన్ని తీసేసే వరకూ నిద్రపోరు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నో చోట్ల ఉదయమే లేచి ఆ విగ్రహాన్ని చూడాల్సి వస్తుందని ఆధిపత్య కులస్థులు రాత్రికి రాత్రి విగ్రహాన్ని పెకలించి పడేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గరగపర్రు ఉదంతం అందుకు ఒక ఋజువు. అక్కడ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆ ఊరి ఆధిపత్య కులస్తులు తీసిపారేసినపుడు ఉద్యమం చెలరేగిన సందర్భంలో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్షనేత జగన్ రెడ్డి ఆ ఊరి దళితులను పరామర్శించారు కూడా. కానీ ఈనాటికీ రోడ్డుపక్క నిరాకరణలోనే నిలబడి ఉన్న ఆ విగ్రహాన్ని మళ్ళీ అదే చోట ప్రతిష్టించడానికి ఆయనెందుకు ప్రయత్నించలేదు?

భారత రాజ్యాంగం స్త్రీకి పురుషుడితో సమాన హక్కులూ కల్పించింది. ఆమెకు ఓటు హక్కు కల్పించడం ద్వారా, దేశ పాలనలో ఆమె భాగస్వామ్యాన్ని సుస్థిరం చేసింది. వైవాహిక జీవితం హింసాత్మకంగా ఉంటే విడాకులు తీసుకునే హక్కును కూడా అంబేడ్కర్ రాజ్యాంగమే స్త్రీలకు కల్పించింది. ఆస్తి హక్కు, దత్తత హక్కు ఇలా ఎన్నో మహిళా సాధికారతను పెంచే హక్కులను రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ స్త్రీలకు కల్పించారు. మరి ఆ స్త్రీలందరికీ చేరేలా అంబేడ్కర్ వారికి చేసిన గొప్ప మేళ్లను ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రచారం చేసాయా?

అంబేద్కర్ రాసిన థీసిస్ ‘ది ప్రాబ్లెమ్ ఆఫ్ ద రూపీ’పై ఆధారపడే ఈ దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసిన రిజర్వ్ బ్యాంకు రూపకల్పన జరిగింది. ఆయన హిల్టన్ యంగ్ కమిషన్‌కు సమర్పించిన సిద్ధాంతం వల్లనే సెంట్రల్ బ్యాంక్ సైతం ఏర్పడింది. ఈ దేశ సనాతన స్త్రీలు ఆ మతం విధించిన ఆంక్షల సంకెళ్ళ నుంచి బైటపడి, ఆస్తి హక్కు, వేతన ప్రసూతి సెలవు వంటి అనేక ప్రత్యేక హక్కులతో, సమాన వేతనాలతో, జీవిస్తున్నారంటే అందుకు అంబేడ్కర్ రూపొందించిన హిందూకోడ్ బిల్లే కారణం. మరెందుకు ఈ దేశంలోని ప్రతీ కులమూ, ప్రతీ తెగా, ప్రతీ మతమూ ఆయన అసమాన కృషివల్లే ఈ స్థితిలో ఉన్నాయన్న సంగతిని ఈ విగ్రహాలను ప్రతిష్టించే ప్రభుత్వాలు ప్రచారం చేయవు?

అంబేడ్కర్ ఆలోచనలను నిజంగా ఈ పాలకులు అభిమానించినట్టయితే ఎందుకు ఆయన కోరిన ‘కుల నిర్మూలన’ సైతం ఈనాటికీ ఒక పాఠంగా పాఠ్యపుస్తకాల్లో చోటు సంపాదించుకోలేకపోయింది? సామాజిక మాధ్యమాల్లో ఆయన రాజ్యాంగ రచనను ఇతరులకు ఆపాదిస్తూ మతోన్మాదులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వం ఎందుకు నియంత్రించే ప్రయత్నం చేయదు?

ఆంధ్రప్రదేశ్‌లో దళితులు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారన్నది నిర్వివాదాంశం. మొత్తం జనాభాలో పదహారు నుంచి పద్దెనిమిది శాతంగా ఉన్న ఎస్సీలు అంతకుముందున్న టీడీపీని ఓడించి జగన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. ఆయన ప్రమాణ స్వీకారానికి గంట ముందు రాజమండ్రి సమీపంలో సింగంపల్లి గ్రామంలో, రెండు మామిడికాయలు కోసుకున్నందుకు బిక్కి శ్రీను అనే దళితుడిని ఆ పొలం సొంతదార్లు పంచాయతీ ఆఫీసులో ఉరేసి చంపారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసారు కానీ దళితులపై ఆత్యాచారాలు చేస్తే సహించం అని ఒక్క మాటా చెప్పలేదు. ఆపై దళితులపై దమనకాండ మరింత పెచ్చుమీరిపోయింది.

మాస్క్ కోసం గట్టిగా అడిగాడన్న నెపంతో దళిత డాక్టర్ సుధాకర్‌ని అధికార పక్షం వేటాడింది. ఆయన తాగుబోతని, మరో పార్టీ అభిమాని అనీ వ్యక్తిత్వ హననం చేసి, నడిరోడ్డుపై అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి కట్టి, మోకాళ్లపై కూర్చోబెట్టి సభ్యసమాజం నివ్వెరపోయేలా అమానుషంగా ప్రవర్తించింది. చివరికి అతడు మానసిక వ్యథతో చనిపోయాడు. ఇక దళిత స్త్రీలపై అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు ఎన్నో. దళిత యువకుల నోళ్లలో మూత్రం పోయడాలు, దళిత అధికారుల హత్యలు కొనసాగుతూనే వచ్చాయి. ఏకంగా అధికార పక్ష ఎమ్మెల్సీ సైతం దళితుడైన తన డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసేంత నిర్లజ్జగా దళితులపై మారణకాండ కొనసాగింది. ఆ హంతక ఎమ్మెల్సీని తగిన రీతిన శిక్షించకుండా గౌరవ ముఖ్యమంత్రి వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. జైల్లో ఉండాల్సిన హంతకుడు ఏ మాత్రం భయం, గిల్ట్ లేకుండా ప్రజల్లో నవ్వుతూ తిరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల వల్ల దళితులపై అత్యాచారాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత తేలిగ్గా తీసుకుంటుందో దళితులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. వారికోసం ఉద్దేశించిన దళిత సాధికారతా పథకాలను సైతం రద్దు చేసి వారి వెన్ను విరిచిన ఈ సమయంలో అంబేడ్కర్ నూట పాతిక అడుగుల విగ్రహ స్థాపన ఎవరిని మభ్యపెట్టడం కోసం?

అంబేడ్కర్ విగ్రహాలు కట్టడం ద్వారా ఆ సమూహాల ఉద్వేగాలను రెచ్చగొట్టి వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో ఎలా హైజాక్ చేస్తున్నాయో ఈ విగ్రహ రాజకీయాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం నెగ్గినా దళితులను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే పరమావధిగా ‘అంబేడ్కర్ విగ్రహాలు పెడతాం’ అన్న ప్రకటనలు చేస్తున్నాయి అనేది ఈ రోజు అందరికీ తెలిసిన సత్యమే!

ఈ ప్రభుత్వాలు దళితేతరుల మనసుల్లో దళితులంటే ‘తక్కువవాళ్ళు’ అనే భావన దూరం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయనంతవరకూ, ఈ రోజు దేశానికి ప్రధానులుగానూ ముఖ్యమంత్రులుగానూ వెలుగుతున్న శూద్ర కులస్థులు రాజకీయ అధికారం వరకూ రావడానికి కారణం అంబేడ్కర్ అన్న సత్యాన్ని ఒప్పుకోనంతరకూ, ఈ దేశ దశా దిశా మార్చడంలో అంబేడ్కర్ కృషిని నిజాయితీగా ప్రచారంలోకి తీసుకురానంత వరకూ– వారు ప్రతిష్టించే భారీ అంబేడ్కర్ విగ్రహాల వెనుక ఆయన మహా కృషిని కుదించే భారీ కుట్ర దాగి ఉంటుందని ప్రజలు గ్రహించాలి. ‘‘దేశంలోని మైనారిటీలు, అణచివేయబడ్డ వారి పట్ల ఆధిపత్య వర్గాల వారు అమానుషాలకు తెగబడ్డ పక్షంలో, ‘మెజారిటీలు తమ పట్ల అన్యాయం చేయవచ్చు’ అని బలహీన సమూహాలు భయపడే పరిస్థితి వచ్చిన పక్షంలో, తాను రాసిన రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి కూడా వెనుకాడను’’ అని అంబేద్కర్ ఆనాడే ఘంటాపథంగా చెప్పారు. ప్రభుత్వాలు ఈ వాక్యాలు జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయడం ఈనాటి అత్యవసరం.

అరుణ గోగులమండ

Updated Date - Jan 18 , 2024 | 02:00 AM