Share News

వాక్యంతో భయాన్ని వేటాడిన హెమింగ్వే

ABN , Publish Date - May 20 , 2024 | 03:31 AM

హెమింగ్వే అమెరికన్‌ వాక్యానికి రూపురేఖలు మార్చేసాడు అంటారు. అర ఠావు పొడవున, మెలికలతో, విశేషణాలతో, అడుగడుక్కీ విరామచిహ్నాలతో వస్తూ ఉండిన పూర్వ వాక్యాన్ని తిరోగామిని...

వాక్యంతో భయాన్ని వేటాడిన హెమింగ్వే

హెమింగ్వే అమెరికన్‌ వాక్యానికి రూపురేఖలు మార్చేసాడు అంటారు. అర ఠావు పొడవున, మెలికలతో, విశేషణాలతో, అడుగడుక్కీ విరామచిహ్నాలతో వస్తూ ఉండిన పూర్వ వాక్యాన్ని తిరోగామిని చేసాడు, నాలుగైదు సరాసరి మాటల వాక్యాలు వ్రాసి. ఆ నేర్పుకు కారణం అతను వార్తాపత్రిక రిపోర్టర్‌గా పని చేసిన అనుభవం అన్నారు. నయం, టెలిగ్రాఫ్‌ ఆఫీస్‌లో చేశాడు అనలేదు. వాక్యం సరే, ఇతని కథలు కూడా మొదట చూడటానికి చాలా సరళంగా అమాయకంగా కనపడుతాయి, ప్రతీకలు అలంకారాలు నిగూఢార్థాలతో కథను పొడుపు కథ చేయడు గనక.

మరి, ఇతని అరమాటలు, పొట్టి వాక్యాలు, పొడి పొడి సంభాషణల శైలికి కారణం, ప్రయోజనం ఏమి అయి ఉంటాయి! హెమింగ్వే కథల విషయాలను చూసేటప్పుడే ఈ సందేహానికి కూడా సమాధానం కనపడుతుంది.


ఈ రచయితకు నోబెల్‌ బహుమతి ‘ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ది సీ’ అనే నవలకు వచ్చింది. కానీ ఈయన అలవోకగా వ్రాసిన చిన్న కథలతో పాఠక లోకానికి దక్కిన సాహిత్యానందం, అందుకు అతనికి వచ్చిన విశేషమైన పేరు ముందు నోబెల్‌ బహుమతి చిన్నది.

హెమింగ్వే కథలకు వస్తువులు తిప్పి తిప్పి కొట్టినా రెండంటే రెండే: ‘వేట’, ‘యుద్ధం’. అదనంగా అతనికి అంటగట్టిన వస్తువులు ‘సాహసం’, ‘పురుషాహంకారం’. కానీ అతని సబ్జెక్టు సాహసం కాదు, స్త్రీ నిర్లక్ష్యమూ కాదు. వేట, యుద్ధం, స్త్రీ నమ్మకద్రోహం వలె తెరమీద కనిపించే ఈయన కథావస్తువు వెనక ఉన్నది- తన రకరకాల భయమే, అదే హెమింగ్వే రచనలకు ప్రేరణ.

అతని మొదటి భయం చావు గురించి, రెండవ భయం తన భయం గురించి. రెండవది చాలా పెద్దది. నిజానికి ఈ రెండింటిని కూడా ఒక భయంగా కుదించవచ్చు, పొదుపరి హెమింగ్వేకు అది నచ్చుతుంది కూడా, వాక్య శిల్పం దృష్ట్యా. తన చావు భయాన్ని తను చంపకముందే అదే తనను చంపేస్తుందేమో అనే భయం హెమింగ్వే ది! అతని కథా వస్తువు, అతని జీవన్మరణ సమస్య కూడా అదే.

పలురకాల కారణాలుంటాయి రచయితలకు వ్రాయడానికి. రచన ‘నిర్మలీకరణ’ సాధనం అన్నాడు జాపనీస్‌ రచయిత నవోయ షిగా. హెమింగ్వేకు రచన ఒక రణం. ఊహ తెలిసినప్పటినుంచీ తనను ప్రత్యర్థిలా వెంటాడుతున్న ‘భయం’తో సలిపిన పోరే అతని కథారచన. ఆ యుద్ధ స్వరూపాన్ని పుస్తకాలలో ఎలా చూపించాడు?


ఉన్నదున్నట్లు సమస్యను మాట్లాడేవారు వేదాంతులు. కథలను మెటఫారికల్‌గా రాసి వేదాంతాన్నో, ఆధ్యాత్మికతనో, నీతి వర్తననో, ప్రకృతి ఆరాధననో బోధించే పని హెమింగ్వే అంతస్తు ఉన్న కథకుడు చేయడు. హెమింగ్వే కథల విలక్షణత వాటి వస్తువులో కంటే అవి పాఠకుడికి చివరకు ఏ స్థితి స్వరూపాలతో అందుతున్నాయీ అనేదాంట్లో ఉంది. వాస్తవంగా కథలో చెప్పదలుచుకున్న సమస్యను కాస్త ఓరగా జరిపి, ఆ సమస్య వలన చుట్టూ పాకే ప్రకంపనలు పర్యవసానాల లోంచి ఒక మేలైన శకలాన్ని ఎంచుకుని కథా విషయం చేయడం ఇతని లక్షణం. పదాలలో అక్షరాల పొదుపు, వాక్యాల నిడివిలో క్లుప్తత, కథను ఏక వాక్య సంభాషణల ద్వారా నడిపించడం అనే శైలి వెనక తనను మొత్తం కాగితం మీదకు ఒంపేసుకోవడానికి, అక్షరాలకు మొత్తం లొంగిపోవడానికి ఒప్పుకోని హెమింగ్వే పంతం ఉన్నది. కాబట్టే అతని వస్తువు, శిల్పం విడదీయలేని విధంగా కలిసి పుట్టిన కవలలు.

హెమింగ్వే కథలు "Découpage', "Kirigami' ఆర్ట్‌ లాంటివి. అటువంటి కథ కాగితం మీదకు తేవాలంటే రచయిత తన కలంతో కంటే కత్తెరతో ఎక్కువ పనిచేస్తాడు. క్లుప్తత ఉన్న కలం ఇతని ఒక పనిముట్టు అయితే, శస్త్రవైద్యుడి కత్తి వంటి కత్తెర రెండో ముఖ్య ఆయుధం. రచనను ముగించిన తర్వాత హెమింగ్వే ఒక శస్త్రవైద్యుడి అవతారం ఎత్తేవాడు. చిన్నచిన్నగా పరిష్కరించడంతో మొదలుపెట్టి, నిర్దాక్షిణ్యంగా కత్తిరించేస్తూ చివరకు పెద్ద పెద్ద కథా భాగాలనే పరిగ్రహిస్తూ, రచన ద్వారా సూచనప్రాయంగా చెప్పదల్చుకున్న అంశం మటుకే కాగితం మీద మిగిలిందాకా తక్కినదంతా తొలగిస్తూ పోయేవాడట. ఒకసారి కాదు పలుసార్లు ఈ ఆపరేషన్‌ జరిగేది పాపం ఆ కథకు. కానీ మిగిలిన కథ ఆరోగ్యానికి ఆ కత్తిరింపులూ తొలగింపులూ అవసరం. చాలా కథను ఆ విధంగా కత్తిరించడం మిగిలిన కథకు అదనపు మహత్వాన్ని నింపడం కోసమే. ఇది హెమింగ్వే మౌలిక రచనా వ్యాసంగ రీతి.


ఇక అతని కథాంశాల విషయానికి మళ్ళీ వస్తే లోకాభిప్రాయం ప్రకారం అవి- వేట, యుద్ధం, స్త్రీ చేసే నమ్మకద్రోహం అనుకుంటారు. నిజానికి అవి కాదు విషయాలు. అతనికి మూడు రకాల భయాలు అనుకున్నాం కదా. వాటికి సాక్ష్యం ఆత్మకథాత్మకాలైన హెమింగ్వే కథల్లో యెక్కడ ప్రముఖంగా కనపడుతున్నదో చూద్దాం.

‘ఇండియన్‌ కాంప్‌’ (1924) అనే కథలో నిక్‌, బహుశా ఆరేడేళ్ళ పిల్లవాడు. వాడి నాన్న డాక్టర్‌. ఆయన వృత్తిరీత్యా ఒక ట్రైబల్‌ వాళ్ళ గుడిసెకు వెళ్తుంటే నిక్‌ కూడా వెంట వెళ్తాడు. అక్కడ ఒకటే క్షణంలో ఒక స్త్రీకి పిల్లవాడు పుట్టడం, అదే గదిలో ఆ స్త్రీ భర్త అయిదు నిమిషాల క్రితం కత్తితో గొంతుకోసుకుని చచ్చిపడి ఉండటం చూస్తాడు. తిరిగి వచ్చేప్పుడు తండ్రీ కొడుకుల మధ్య సంభాషణ:

‘‘నాన్నా, మగవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారా?’’

‘‘ప్రతి ఒకరూ కాదు’’

‘‘ఆడవాళ్ళు?’’

‘‘ఉహూ, చేసుకోరు.’’

కాసేపు ఆగాక,

‘‘చచ్చిపోవడం చాలా కష్టమా నాన్నా?’’

‘‘కాదనుకుంట నిక్‌, చాలా సులభం. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు.’’


చావుని గురించి ఆలోచన వదల్లేదు ఎప్పుడూ హెమింగ్వేని. మరీ చిన్నప్పుడు చర్చ్‌లో విన్న ‘‘ఎప్పుడైనా ఈ తాడు తెగిపోవచ్చు’’ అనే ప్రార్థనాగీతంలో మాటలతో చటుక్కున చావు గురించి మొదటిసారి ఎఱుక. త్వరగానే అది భయంగా మారింది. ‘‘ఆర్మీ సర్వీసెస్‌కు వెళ్ళిన కొత్తల్లో ‘మనం చావం, అది వేరేవాళ్ళకు’ అనే అనుకుంటాం మనకు మొదటి గాయం అయిందాకా. తర్వాత ఇంక మన వంతు ఎప్పుడో అని భయపడుతూ ఎదురు చూడటమే మన వంతు’’ అంటాడు. కానీ, ‘‘నేను ఎప్పటికీ చచ్చిపోను’’ అని చాలా ధృడంగా అనుకుంటునే ఉన్నాడు జీవితమంతా, చివరకు తుపాకి నోట్లో పేల్చుకుని చచ్చిపోయిందాకా.

చావు భయం, తన స్త్రీ తనను వదిలేస్తుందేమో అనే భయం; ఈ రెండూ మానవుడి ఆదిమ భయాలు. వాటి అంతు చూద్దామని చేసినవే హెమింగ్వే వేటలు.

‘ది షార్ట్‌ హాపీ లైఫ్‌ ఆఫ్‌ ఫ్రాన్సిస్‌ మకూంమ్బర్‌’ అనే కథలో మొదటిరోజు వేటలో పులిని చూసి భయపడినవాడు మరుసటి రోజు భయంకరమైన అడవి దున్నపోతుని నేరుగా కళ్ళల్లోకి చూస్తూ దాని భుజాలను చీలుస్తూ తుపాకీ పేల్చాకనే అతడి పూర్వభయాలు అన్నీ పోయాయి. అడవి జంతువు భయం; భార్య దగ్గర పరువు పోతుందని, ఆమె తనను వదిలేసిపోతుందనే భయం కూడా. స్త్రీలతో హెమింగ్వేకు చేదు అనుభవాలు ఉన్నాయి, వాళ్ళు తనని వదిలేయబోతున్నారని తెలియగానే తనే వదిలేసేవాడు వారిని.

స్త్రీ లేకపోతే ఒంటరితనపు భయం, స్త్రీ వచ్చాకా ఆమె పోతుందనో, కూడా ఉంటే తనను అణిచేస్తుందనో భయం... ఇవి మగవాడికి తప్పవు. ఆ భయాల నుంచి వచ్చే పురుష వికారాలే- భార్య సమర్థురాలైతే ద్వేషం (‘స్నోస్‌ ఆఫ్‌ కిలిమంజారో’ అన్న కథలో రాచరికపు జీవితం ఇచ్చిన భార్య అంటే కోపం; తనను తనుగా మిగల్చలేదని, సోమరిని చేసి తన రచనాసక్తిని చంపేసిందని), ఒకవేళ మూర్ఖురాలైతే నిర్లక్ష్యం.


హెమింగ్వే స్త్రీ ప్రస్తావనతో కథలు ఎక్కువ రాయలేదు నిజానికి.

‘ఎ క్లీన్‌ వెల్‌ లైటెడ్‌ ప్లేస్‌’ అన్న కథ ఒంటరి ముసలి వాడి కథ. అందులో ఎక్కడా స్త్రీ ప్రస్తావన లేదు. కానీ, లేని స్త్రీ వదిలేసిన ఖాళీ చీకటితనాన్ని ఎలా ఈదాలో తెలీక ఆ వృద్ధుడు రోజూ ఎలక్ట్రిక్‌ దీపాల వెలుతురులో కాస్త శుభ్రంగా ఉన్న రెస్టారెంట్‌కు వచ్చి కూచుని రాత్రి పన్నెండు దాటినా ఇంటికి పోడు.

‘‘ఈ ముసలోడు ఎంతకూ పోడు, హోటల్‌ కట్టేద్దామంటే’’

‘‘ఇక్కడ ఉండే వెలుతురు, శుభ్రత కోసం వస్తాడు, ఇంకొంతసేపు కూచోని వెళ్తాడులే’’

‘‘నా పెళ్ళాం నా కోసం ఎదురు చూస్తుంటుంది, వీడికేం?’’

- ఇలా విసుక్కుంటున్న పడుచు వెయిటర్‌కు అర్థం కాని బాధ అతనితో మాట్లాడుతున్న ముసలి వెయిటర్‌కు తెలుసు: శూన్యమైన ఇంట్లో ఒంటరిగా ఉండటం ఎంతో కష్టం.

తాగుతున్న ముసలాడు పోయిన వారం ఆత్మహత్య చేసుకోబోయాడు.

‘‘కారణం?’’ - ముసలి వెయిటర్‌.

‘‘ఏమీ లేదు!’’ - పడుచు వెయిటర్‌.


ఇలాంటి అతి మామూలు మాటల సంభాషణలు పెట్టి కథ నడిపిస్తాడు హెమింగ్వే. కానీ ఈ మామూలు మాటల్ని సామాన్యంగా అందరూ మాట్లాడే అర్థంలో ఉపయోగించాడా? ఇక్కడ పెళ్ళాం ఉన్న పడుచు వెయిటర్‌ అన్న ‘‘Nothing’’ అనే మాటకు ప్రస్తుతం ఆ సందర్భంలో అర్థం- ‘‘అతనికి ఆత్మహత్య చేసుకునేంత సమస్య ఏమీ లేదు, చాలా డబ్బులున్నవాడు, ఏం మాయరోగం!’’ అని. కానీ అంతేనా! ఆ మాట ఇవ్వగల మరో అర్థం ముసలి వెయిటర్‌కు తెలుసు- ‘‘ఏ అర్థమూ ఈ జీవితానికి లేదు’’ అని.

- అవును, ఏమీ లేదు. ఏమీ అర్థం లేదు మన ఈ ఏమీలేనితనానికి. శూన్యం నుంచి వచ్చాం. శూన్యమే మన చిరునామా. శూన్యానికే చివరకు చెందుతాం - ముసలి వెయిటర్‌ స్వగతం.

వృద్ధాప్యం వచ్చే కొద్దీ ఆ సంగతి మరీ తెలియవస్తుంది.

మనిషికి మరో విచారం- ఏ విధంగా జీవించినా ఈ జీవితానికి చివరకు ఏమైనా సార్థకత ఉంటుందా! మన అస్తిత్వానికి సార్థకత సరే, అర్థం ఉందా!

హెమింగ్వే అన్ని థీమ్స్‌ స్పృశించాడు అనవచ్చా? వేట, యుద్ధం, యుద్ధానంతర నిస్పృహ, నిర్వేదం, తనను తిరిగి కూడదీసుకునేందుకు అడవిలో ఒంటరి జీవితం, ప్రేమ, స్త్రీ, వివాహాలు, వియోగాలు, నాటి నేటి ప్రపంచం పోకడ, మనిషి ఆంతర్యం, అంతశ్చేతనం, వృద్ధాప్యం, అశక్తత, మనిషి జీవితానికి అర్థరాహిత్యం, అస్తిత్వ వేదన... చివరకు ‘ది ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ది సీ’లో అతను పూర్తి క్రైస్తవ ఆస్తిక్యత వైపు జరిగాడు, ఆ ప్రతీకలు బాహాటంగా చూపించాడు అని కొందరు అన్నారు. దాంతో మానవ జీవితంలో దశలవారీగా అన్ని మైలురాళ్ళనూ పేపర్‌ మీదకు ఎక్కించినట్లే అనవచ్చా!


‘ది ఓల్డ్‌ మాన్‌ అండ్‌ ది సీ’లో చేపలు పట్టే ముసలాయనకు చిక్కినట్లే చిక్కి అతన్ని నడి సముద్రంలోకి ఈడ్చుకుపోయిన, ఆయనతో పంతంగా చివరి వరకూ పోరాడిన మార్లిన్‌ అనే పెద్ద సొరచేప మరేదో కాదు. అది ముసలాయన విధి. నీవా నేనా అన్నట్టు సాగిన ఆ యుద్ధంలో ముసలాయనే గెలిచాడు. కానీ చివరకు తన విధిని చూసి తనే జాలిపడ్డాడు, స్నేహితుడిగా ప్రేమించాడు, తనతో సారూప్యం చూసుకున్నాడు దానిలో.

ఎవడి విధి వాడు జాలి పడదగినది అతని దృష్టిలో. ఎవడి విధి వాడే మోసుకోవలసిన శిలువ. అదే అతను భుజాలు అరచేతులు కోసుకుపోయేలా మూడు రోజులు వీపు మీద మోసుకు ఈదినది. చివరకు దాని తల, కేవలం అస్థిపంజరం మాత్రమే తెచ్చుకోగలిగాడు వెనక్కు, కానీ ప్రశాంతంగా నిద్రపోయాడు ఆ గెలుపు తర్వాత. ప్రాణాలకు ఒడ్డి తనను భయపెడుతున్న శత్రువులతో పోరు చేయడం హెమింగ్వే జీవిత తత్వం.""the world is a fine place and worth fighting for and I hate very much to leave it''.

That's his quintessential philosophy.

సాహిత్య తత్వం కూడా.

‘‘రాయడానికి పుట్టాను, చాలా బాగా వ్రాయాలి’’ అనుకునే దిగాడు, రాశాడు, బహు గొప్పగా!

వేటలో వ్రాతలో కూడా సాహసి హెమింగ్వే.

కథను కూడా చివరకు అతని కథలో ‘మార్లిన్‌’ చేప లాగానే అస్థిపంజరం మాత్రం అట్టిపెట్టి మిగతాదంతా తీసిపడేసి ఇస్తాడు పాఠకులకు. ఆ బెస్త పల్లెలో మనుషుల్లాగే మనం కూడా ఆ ఎముకల ఆకృతి చూసి అసలు కథ స్వరూపాన్ని అంచనా వేసుకోగలగాలి. అతనికి దక్కవలసిన నిజమైన గౌరవం అందులోనే ఉంది.

పద్మజ సూరపరాజు

99403 44406

Updated Date - May 20 , 2024 | 03:31 AM