Share News

ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా?

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:43 AM

ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్నదని, విశాఖలో పరిపాలన రాజధాని నెలకొల్పి ఉద్ధరిస్తాననే భావోద్వేగాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు అయిదేళ్ల పదవీకాలం గడిపారు. ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లో...

ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా?

ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్నదని, విశాఖలో పరిపాలన రాజధాని నెలకొల్పి ఉద్ధరిస్తాననే భావోద్వేగాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు అయిదేళ్ల పదవీకాలం గడిపారు. ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లో అత్యధికులు ఈ రోజుకూ వ్యవసాయాధారంగా బతుకుతున్నారు. జగన్‌ హయాంలో అక్కడ ఒక్క సాగునీటి ప్రాజెక్టయినా పూర్తి కాలేదు. ఒక్క ఎకరాకయినా అదనంగా సాగునీటి వసతి కల్పించలేదు. మరి ఏ ధైర్యంతో తిరిగి తనకు పట్టం కట్టమని ఆయన ఉత్తరాంధ్ర రైతులను, అడుగుతున్నారు? సాగునీటి రంగంలో వ్యయం చేసిన గణాంకాలు పరిశీలిస్తే జగన్ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలు అవగతమౌతాయి. ఇటీవల రాష్ట్ర ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్ ఉత్తరాంధ్రలో తక్కువ నిధులు వ్యయం చేసినట్లు ప్రకటించడం గమనార్హం.

ఉత్తరాంధ్రలో వర్షపాతం ఎక్కువ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఉత్తరాంధ్ర ప్రజల గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి. దురదృష్టమేమంటే పడిన వర్షపు నీరంతా సముద్రం పాలౌతోంది. వంశధార, నాగావళి వంటి నదులే కాకుండా చిన్నా చితక నదులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వెనుకబడిన రాయలసీమతో పోల్చుకొన్నా మధ్య తరహా ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఎక్కువ. ఈ అయిదేళ్ల కాలంలో పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం అటుంచి, గతంలో నిర్మితమైన ప్రాజెక్టుల కాలువల ఆధునీకరణ, మరమ్మతులకు నిధులు విదల్చనందున అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుల కాలువలు కొంతమేర పూడి పోగా, ఎక్కువ భాగం పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్కలతో నిండిపోయాయి. కొన్ని పథకాల కింద భూసేకరణ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది.

జగన్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం పొందే ప్రాజెక్టుల లిస్ట్ రూపొందించారు. అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వంశధార, నాగావళి నదుల అనుసంధానం ఒకటి. దీనిని పూర్తి చేస్తే ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 50 వేల ఎకరాలకు సాగునీరు అదనంగా అందించవచ్చు. తెలుగుదేశం హయాంలో ఈ అనుసంధానం పనులు దాదాపు 60 శాతానికి పైగా పూర్తి అయ్యాయి. 19 టియంసిల సామర్థ్యంతో హిరమండలం జలాశయం దాదాపు పూర్తయింది. ఈ జలాశయం నుంచి నాగావళి నదిపై నిర్మితమైన నారాయణపురం ఆనకట్ట వరకు 33 కిలోమీటర్ల కాలువ తవ్వవలసి ఉంది. గ్రావిటీతో బేషుగ్గా నీళ్లు వెళతాయి. దురదృష్టమేమంటే తుదకు నారాయణపురం ఆనకట్ట గేట్లు కూడా దెబ్బతిన్నాయి, ఆనకట్ట దిగువ భాగంలో చప్టా ధ్వంసమైంది.

వంశధారపై నేరడి బ్యారేజీతో పాటు సైడ్‌వేర్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిషా రాష్ట్రంలో 106 ఎకరాల భూమి ముంపునకు గురౌతుందని, దానిని ఒడిషా సేకరించి ఇవ్వాలని వంశధార ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఇది జరిగితే అనుసంధానం గట్టెక్కినట్లే. ఒడిషా ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపి ఒప్పించేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేకపోయింది. అంతిమంగా ఇటీవల గొట్టా బ్యారేజీ నుంచి ఎత్తిపోతల ద్వారా హిరమండలం జలాశయానికి వంశధార నీళ్లు తరలిస్తామని ప్రకటనలు చేసి చేతులు దులుపుకొన్నారు. వాస్తవంలో గొట్టా బ్యారేజీ వద్ద 115 టియంసిలు నీళ్లు లభ్యమౌతాయని వంశధార ట్రిబ్యునల్‌తో పాటు కేంద్ర జలసంఘం నిర్ధారించింది. 1962లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు గొట్టా బ్యారేజీ నిర్మితమై ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్–ఒడిషా రాష్ట్రాలు నీటిని వినియోగించుకొంటున్నాయి. ఇన్నేళ్లయినా వంశధార నుంచి 30 టియంసిలు నీళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకోవడం లేదు. ఒడిషా కూడా చుక్క నీరు ఉపయోగించుకోవడం లేదు. కానీ పై భాగంలో వంశధార నుండి రుషికుల్యం నదికి వరద నీళ్లు తరలిస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్ అనుమతి లేకుండా హరిభంగి డ్యాం నిర్మించింది. అయినా వంశధార నుంచి 82 టియంసిలు నీళ్లు ఏటా సముద్రం పాలౌతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

కొత్త ప్రాజెక్టులు సంగతి దేవుడెరుగు. ఎప్పుడో నిర్మితమైన వంశధార ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ కూడా అటకెక్కింది. విషాదమేమంటే ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులకు అత్యల్పంగా నిధులు వ్యయం చేసి, అదే సమయంలో కొన్ని పథకాల అంచనాలు మాత్రం భారీగా పెంచేశారు. పోనీ పనులు జరిగాయా అంటే అదీ లేదు. పెండింగ్ ప్రాజెక్టులు గాని, నిర్మాణం జరిగిన పథకాల మరమ్మతులు గాని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తే తప్ప, ప్రతి ఏటా పెరిగే షెడ్యూల్ రేట్లు తడిసి మోపెడవుతాయి. ఈ అయిదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి రంగంపై చూపిన నిర్లక్ష్యం ఫలితంగా రేపటి ఎన్నికల్లో ప్రభుత్వం మారినా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని గాడిన పెట్టడం తలకు మించిన పని కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల్ని మభ్యపెట్టేందుకు కొన్ని పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చి, టెండర్లు పిలిచి, పనులు చేపట్టినా, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళు ఎక్కడ పనులు అక్కడే వదలిపెట్టి వెళ్లిపోతున్నారు.

విజయనగరం జిల్లాలో నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజీ 2003లో చంద్రబాబునాయుడి హయాంలో నిర్మాణం మొదలై, 2015లోనే మళ్లీ ఆయన హయాంలోనే ప్రారంభోత్సవానికి నోచుకొన్నది. 2.51 టియంసిలు సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్యారేజీ ద్వారా లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందవలసి వుంది. 1908లో నిర్మితమైన పాత బ్యారేజీ కింద 56 వేల ఎకరాల ఆయకట్టు వుంది. వెరసి మొత్తం ఆయకట్టు లక్షా 76 వేల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. అదనపు ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వడం అటకెక్కింది. తాజాగా పాత ఆయకట్టుకు నీళ్ల కోసం రైతులు రోడ్డెక్కారు. నాగావళి ఉప నదిపై జంఝావతి ఆధారంగా భారతదేశంలోనే అరుదైన పద్ధతిలో రబ్బరు డ్యాము నిర్మాణం జరిగింది. నాలుగు టీఎంసీల నీళ్లు ఉపయోగించుకొనే విధంగా నిర్మాణం జరిగితే, భూసేకరణ, కాలువలు మరమ్మతులకు నోచుకోనందున పూర్తి ఫలితాలు లభ్యం కాలేదు. వీటన్నింటికి మించి మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ జలాశయ నిర్మాణం ఉత్తరాంధ్ర ఇతర ప్రాజెక్టులలాగే అనిశ్చితిలో ఉంది. ఆ మధ్య సవరించిన అంచనాలతో పరిపాలన అనుమతి ఇచ్చారు. అయినా ఏం ప్రయోజనం? పుణ్యకాలం గడిచిపోయింది.

తెలుగుదేశం, కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు జరుగుతుంటే పెద్ద హడావుడి జరిగేది. శాంతిభద్రతల సమస్య తలెత్తి కాంట్రాక్టర్లను అదుపు చేసేందుకు పోలీసులు రంగప్రవేశం చేసేవారు. వైసీపీ హయాంలో సీన్ రివర్స్ అయింది. టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అరకొర టెండర్లు వేసినా పనులు చేయడం లేదు. పలువురు కాంట్రాక్టర్లు బిల్లుల కోసం హైకోర్టు కెక్కిన నేపథ్యంలో మొత్తంగా సాగునీటి రంగం స్తంభించిపోయింది.

విశాఖను పరిపాలన రాజధాని చేస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి, కనీసం విశాఖ శాశ్వత తాగునీటి సరఫరాకు చేసిన కృషి శూన్యం. పోలవరం నుంచి విశాఖ తాగునీటి కోసం 23.99 టియంసిల నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ పోలవరం ప్రాజెక్టే పురోగతికి నోచుకోలేదు. వాస్తవానికి ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిని జగన్‌ దృష్టిలో పెట్టుకొని వుంటే పోలవరానికి ఈ దుర్గతి పట్టేది కాదు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం పూర్తయితే తప్ప ఉత్తరాంధ్ర సుజల స్రవంతి (పోలవరం నుంచి 63.20 టియంసిలు కేటాయింపులున్నాయి) గాని, విశాఖకు సమృద్ధిగా తాగునీరు ఇచ్చే అవకాశం లేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాలో 3.21 లక్షల ఎకరాలకు, ఉమ్మడి విజయనగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు, మూడు ఉమ్మడి జిల్లాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందుతుంది.

గత అయిదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఉద్ధరిస్తున్న ఉమ్మడి విశాఖ జిల్లాలో పది లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే 4.9 లక్షల ఎకరాలకే సాగునీటి వసతి ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి అంచనా వ్యయం దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలైతే, ప్రస్తుతం 18 వేల కోట్ల రూపాయలకు పైగా నిర్మాణ వ్యయం పెరిగింది. అది కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి చెబుతున్నట్లు పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం జరిగినా సాధ్యం కాదు. తొలి దశ అంటే 41.15 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతుంది. పోలవరం ఎడమ కాలువ సిల్ లెవల్ 40.54 మీటర్లయినందున గ్రావెటీతో నీళ్లు తరలించడం అసాధ్యం. ఈ తొలి దశకూ నిధులు గాలిలో దీపంగా మారాయి. జగన్‌ పదవీకాలం మూడు నెలలు కూడా లేదు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధికి మిగిలిందల్లా హళ్లికి హళ్లి... సున్నాకు సున్నా మాత్రమే!

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - Jan 30 , 2024 | 03:43 AM