Share News

విద్వేషంతో విజయం సాధించలేరు!

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:19 AM

భారత పార్లమెంటుకు ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలను బయటినుంచి చూసేవాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకగా అభివర్ణిస్తుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ఎన్నికలు...

విద్వేషంతో విజయం సాధించలేరు!

భారత పార్లమెంటుకు ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలను బయటినుంచి చూసేవాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకగా అభివర్ణిస్తుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ఎన్నికలు ఒక సార్వత్రక ఉత్సవంగా గాక వివాదాలు వేదికగా మారుతున్నాయి. జరుగుతున్న ప్రచారం, ప్రసారమాధ్యమాల్లో చర్చలు, వాదోపవాదాలు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మొదటి దశ పోలింగ్ ముగిసిన తర్వాత, దేశంలో దశాబ్దం పాటు అధికారంలో ఉండి ప్రజలను కట్టడి చేసిన బీజేపీ ఉన్నట్టుండి ఎన్నికల ఎజెండా మార్చివేయడం ఇప్పుడు దేశాన్ని కలవరపెడుతోంది. భిన్నత్వానికి ప్రతీకగా చెప్పుకునే దేశాన్ని ఏకత్వ దిశగా మలిచేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇంతకాలం ‘జాతీయవాద’ ముసుగులో లోపాయికారిగా ఉన్న హిందూత్వను ఇప్పుడు ప్రధాన ఎజెండాగా చేసుకుని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ప్రజల మధ్య మత ప్రాతిపదికన విభజన రేఖ గీసి మరీ వేరు చేయాలని చూస్తోంది. నిజంగానే ఎన్నికల సభలు, రోడ్ షోలు ఇప్పుడు విద్వేష విష ప్రచారాల వీధులుగా మారిపోతున్నాయి.


ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణంగా ఎన్నికల ప్రచారం ప్రజలకు తాము ఏమి చేశాం, ఏమి చేస్తాం అనే అంశాల ప్రాతిపదికన జరగాలి. అధికారంలో ఉన్న పార్టీ తాము గతంలో చేసిన పనులను, ప్రజలకు జరిగిన మేలును వివరిస్తే ప్రతిపక్ష పార్టీలు తాము భిన్నంగా ఏమి చేయాలని అనుకుంటామో చెప్పాలి. కానీ ఇందుకు భిన్నంగా ఇప్పుడు ప్రజల ఆలోచనలను విద్వేషం వైపు మలిచే విధంగా ప్రచారం జరుగుతోంది. దానికి ప్రధానమంత్రి ప్రసంగాలు కారణం కావడం చాలామందిని కలవరపెడుతోంది. నరేంద్ర మోదీ రాజస్థాన్ ప్రచారంలో ముస్లింల మీద మొదలుపెట్టిన దాడి గురించి దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా విమర్శించాల్సింది పోయి, ఆ పార్టీని అడ్డం పెట్టుకుని మోదీ ముస్లిం ప్రజల పట్ల అక్కసు వెళ్లగక్కుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రజల సంపద వివరాలు సేకరించి, దానిని ముస్లింలకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకి పంచుతారు అని మొదలైన ఈ దాడి మూడు రోజుల్లో ముస్లిం రిజర్వేషన్లు, షరియా, పర్సనల్ లా వంటి విషయాల ప్రస్తావన దాకా వచ్చింది. అవి ఎన్నికల్లో చర్చకు రావడం తప్పు కాదు, ఆయన తమ ప్రభుత్వ విధానాన్ని, పార్టీ సిద్ధాంతాన్ని ప్రకటిస్తే అభ్యంతరం ఉండదు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసే పనికి పూనుకున్నారు. కాంగ్రెస్ వస్తే హిందువులకు రక్షణ ఉండదు అంటూ ఒక అడుగు ముందుకేసి హిందూ మహిళల తాళిబొట్లకు కూడా రక్షణ ఉండదు అనేదాకా వెళ్లారు. ఇది నిజానికి తీవ్ర ఆరోపణ. ఒక ప్రధానమంత్రి స్థాయికి తగని నిరాధారపూరిత నింద. సాధారణ ప్రజలు, మహిళల భావోద్వేగాలను రెచ్చగొట్టి కలవరపెట్టే మాట. అలా ప్రధాని మాట్లాడిన మాటలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి మాత్రమే కాదు మౌలికంగా ఈ దేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, నైతికంగా ఒక ప్రధాన మంత్రి స్థాయికి తగనిది. ఈ వ్యాఖ్యల పట్ల మోదీజీ కనుసన్నల్లో ఉన్న జాతీయ మీడియా సన్నాయి నొక్కులు నొక్కుతున్నా ప్రపంచ వ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలు ఆందోళన చెందుతూ కథనాలు ప్రచురించాయి. ప్రజల మధ్య ఇటువంటి విభజనరేఖ గీసి ఓట్లు రాబట్టుకోవడం ప్రజాస్వామ్యానికి, భారతదేశ భవిష్యత్తుకు మంచిది కాదని హితవు పలుకుతున్నాయి. తానే విశ్వగురువునని నమ్ముతున్న మోదీకి ఇప్పుడు ఈ హితవచనాలు చెవికెక్కేలా లేవు.


బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ పార్టీ మౌలిక సిద్ధాంతాల నుంచి దూరమవుతూ వచ్చింది. ‘సమష్టి’ నాయకత్వం స్థానంలో కేంద్రీకృత, ఏకవ్యక్తి ఆరాధనకు మళ్లింది. బీజేపీ మాతృక అయిన జనసంఘ్ నుంచి వారసత్వంగా వచ్చిన జాతీయవాదంతో కూడుకున్న సమగ్ర మానవతావాదం తన సిద్ధాంతంగా ప్రకటించుకుంది. ప్రజలను విడివిడిగా కులాలు మతాలతో కూడిన వ్యక్తులుగా కాకుండా సమాజంలో, దేశంతో భాగస్వామిని చేసి ఆర్థికాభివృద్ధిలో భాగం చేసి సమష్టి శక్తిగా మార్చే సమగ్ర అభివృద్ధి తమ సైద్ధాంతిక సారంగా ప్రకటించుకుంది. అలాగే సర్వ ధర్మ సంభావ్యతతో కూడుకున్న గుణాత్మక లౌకిక వాదం తమ విధానమని, సర్వ మతాలకు సమానమైన గౌరవం కల్పించే ‘సర్వ పంథా సమభావం’ తమ మౌలిక విలువ అని ప్రకటించుకుంది. గాంధీ ప్రతిపాదించిన సామ్యవాదం, సమరస సమాజం తమ ఆచరణగా పేర్కొంది. ఈ అంశాలతో ఎవరికీ పేచీ లేదు. కానీ ఈ సారి మాత్రమే గెలవడానికి భారతీయత అనే వసుధైక కుటుంబ భావన నుంచి దేశమంతా మోదీ కుటుంబం అని చెప్పుకునే స్థితికి చేరుకుంది. గత ఐదేళ్లుగా ఆ పార్టీ తన సిద్ధాంతాలను, సమష్టి నాయకత్వాన్ని పక్కనపెట్టి మోదీని మహిమాన్వితుడిగా, మహా పురుషుడిగా, విశ్వగురువుగా మార్చి ప్రచారం చేస్తూ వస్తోంది. అదే పద్ధతిలో మోదీ వేషభాషలను, హావభావాలనూ మార్చివేసి నిజంగానే ఆయనే రక్షకుడు అని నమ్మించే స్థాయికి తీసుకు వచ్చారు. ఇప్పుడు దేశంలో కొందరు అలా నమ్ముతున్నారు కూడా. ఇక్కడి వరకు పేచీ లేదు. కానీ ఈ ఐదేళ్లలో మోదీ చాలావరకు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలిగిస్తున్నాడనే విమర్శ ఉంది. నోట్ల రద్దుతో మొదలై కశ్మీర్, రైతాంగ ఉద్యమాలు, పౌరసత్వ చట్టాలు, కోవిడ్ కేర్, లాక్‌డౌన్ ఇట్లా అనేక నిర్ణయాలు విమర్శలకు కారణం అయ్యాయి. అలాగే పార్లమెంటులో చర్చకు తావులేకుండా, ప్రతిపక్షాల మాటకు విలువ లేకుండా అన్ని నిర్ణయాలు ఏకపక్షంగానే తీసుకున్నాడని, ప్రజాభిప్రాయానికి విలువలేకుండా చేస్తూ దేశాన్ని హిందుత్వ వైపు నడిపిస్తున్నాడనే విమర్శలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ క్షీణత కూడా కారణం అయ్యింది. రాహుల్ గాంధీ యాత్రలు, ప్రసంగాలతో స్పష్టమైన ప్రజల గొంతుకగా నిలబడుతున్నా ఆయన ఈ పదేళ్ల కాలంలో తమ పార్టీకి నాయకుడిగా ఎదగలేక పోయాడు, సీనియర్లను కలుపుకుపోయి, కాపాడుకోలేకపోయాడు. బీజేపీకి పరిపూర్ణ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని మలచలేకపోయాడు.

అలాగే ఇండియా కూటమికి సరైన దిశ చూపించడంలో కూడా విఫలం అయ్యాడు. అయినప్పటికీ రాహుల్ దేశంలో ఒక కొత్త సమష్టి వాదానికి ప్రతినిధిగా ఎదుగుతున్నాడు. భిన్నత్వంలో ఏకత్వం ప్రధానం అని ఆయన దళితులు, ఆదివాసులు, ముస్లింలు, ఇతర మైనారిటీలతో మమేకం అవుతూ సామూహిక రాజకీయాలను ప్రతిపాదిస్తున్నాడు. రాహుల్ వెంట నడిచే మేధావులు, పౌర సమాజం, ప్రజా సమూహాల సంఖ్య ఈ ఐదేళ్లలో పెరిగింది. వారిని తుకుడే తుకుడే గ్యాంగ్ అనో, అర్బన్ నక్సల్స్ అనో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా రాహుల్ గాంధీ పట్ల సమాజంలో కొంత సానుభూతి, కొంత గౌరవం పెరిగినట్టుగా బీజేపీ భావిస్తోంది. నిజానికి మోదీ ఈ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్‌లో చేసిన తొలి ప్రసంగంలో ఈ దేశమంతా తన పరివారమని, దేశంలో ఉన్న 140 కోట్లు తన కుటుంబ సభ్యులని అన్నారు. ఇది మంచి పరిణామమని, దేశ ప్రధాని కుల మత జాతి విబేధాలు లేకుండా మాట్లాడాడని అంతా భావించారు. కానీ తొలి విడత పోలింగ్ తరువాత ఆయన మనసు మారింది, మాట కూడా మారింది. అనుకున్న మేరకు అనుకూల వాతావరణం కనిపించకపోవడంతోనే మోదీ, ఆయన పార్టీ ప్రతికూల అంశాలను లేవనెత్తుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.


నిజానికి రాజకీయ వ్యవస్థ అదుపుతప్పినప్పుడు దానిని దారికి తెచ్చే ఆయుధం ఓటు అని నమ్మి దేశంలో ఓటు హక్కు సార్వత్రికం కావాలని కలలుగన్న మొట్టమొదటి భారతీయుడు డా. బాబాసాహెబ్ అంబేడ్కర్. 1919లోనే యువ అంబేడ్కర్ బ్రిటిష్ అధికారులను కలిసి భారత దేశంలో కులం, మతం, సంపద, ఆడ, మగా అనే తేడా లేకుండా పౌరులందరికీ ఓటు హక్కు ఉండాలని వాదించారు. ఓటు హక్కు ద్వారా ప్రజలకు సమానమైన, విలువ, గౌరవం, గుర్తింపు లభిస్తాయని ఆయన గట్టిగా నమ్మారు. అదే ప్రజాస్వామ్యానికి పునాది అవుతుందని కూడా విశ్వసించారు. ఆ మేరకు భారత రాజ్యాంగాన్ని ఒక బలమైన అస్త్రంగా దేశానికి అందించారు. రాజ్యాంగం ప్రకారం భారత పౌరులందరికీ సమాన హక్కులు, గౌరవం, గుర్తింపు ఉంటాయి. దేశంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, అంతరించిపోతున్న ఆలోచించే స్వేచ్ఛను, భావప్రకటన స్వాతంత్ర్యాన్ని, మన విశ్వాసాలను కాపాడుకునే అవకాశాలను రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు మనుషులందరికీ సమాన గౌరవం, సమాన విలువ, సమాన ప్రాతినిధ్యం ఇవ్వగలిగే వ్యవస్థలను, పటిష్టమైన పరివారాన్ని నిర్మించాలి తప్ప విద్వేషాలను రగిల్చి విడదీయ రాదు. ఇంకా కులాల, మతాల పేరుతో వైషమ్యాలు పెంచి పోషించుకుంటూ విభజన రేఖలు గీసుకుంటూపోతే పరివారమే కాదు, దేశం కూడా నిలదొక్కుకోలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి.

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

రాజకీయ విశ్లేషకులు

Updated Date - Apr 30 , 2024 | 03:19 AM