హరిత ధరిత్రే మనిషి ఆరోగ్య భాగ్యం
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:42 AM
శీతోష్ణస్థితిలో మార్పు దైనందిన వాతావరణాన్ని (ఒక ప్రదేశంలో ఒకే సమయంలో ఉన్న వేడి, చలి, తడి, పొడి మొదలైన పరిస్థితులు) ప్రభావితం చేస్తోంది; ఈ ప్రభావ ప్రాబల్యం అశేష ప్రజల జీవితాలు, వారి జీవితాధారాలను సమస్యలపాలు చేస్తోంది...

శీతోష్ణస్థితిలో మార్పు దైనందిన వాతావరణాన్ని (ఒక ప్రదేశంలో ఒకే సమయంలో ఉన్న వేడి, చలి, తడి, పొడి మొదలైన పరిస్థితులు) ప్రభావితం చేస్తోంది; ఈ ప్రభావ ప్రాబల్యం అశేష ప్రజల జీవితాలు, వారి జీవితాధారాలను సమస్యలపాలు చేస్తోంది. అయితే వాతావరణంలో తీవ్ర వైపరీత్యాలు మానవ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న విషయమై మనం చర్చించడం లేదు. ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతున్న ఈ నిరాశామయ కాలంలో, వడగాడ్పులు అనేక మంది ప్రజలను, ముఖ్యంగా పేదలను ఎలా చంపుతున్నాయో మనకు తెలిసివస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత – రాత్రి పూట వేడి– మనుషుల మరణాలకు ఎలా కారణమవుతుందో కూడా మనం తెలుసుకుంటున్నాం. మారుతోన్న వాతావరణంతో సుదూర భవిష్యత్తులో సంభవించనున్న విపత్తు, మన ఆరోగ్యానికి ఎలా, హానికరం కానున్నదో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఈ ఏడాది ప్రపంచ ప్రజలు ‘పగళ్లన్నీ పగిలిపోయీ/ నిశీథాలూ విశిర్ణిల్లిన’ ఎండాకాలాన్ని చవి చూశారు. అవును, ఈ ప్రచండ వేసవిలో (జూన్ మాసాంతంలో ఈ వ్యాసం రాస్తున్న సమయానికి) న్యూ ఢిల్లీలో 270 మంది వడదెబ్బకు చనిపోయారని అధికారిక వర్గాలు అంచనా వేశాయి. అయితే ఈ మృతుల సంఖ్యను అంగీకరించేందుకు సందేహిస్తున్నాను. నిజంగా ఎంత మంది చనిపోయిందీ మనకు తెలియదు. ఎందుకంటే హృద్రోగాలు, మూత్రపిండాల సంబంధిత జబ్బులు మొదలైన ఆరోగ్య సమస్యలను వేసవి వేడి మరింతగా ప్రకోపింప చేస్తుంది. కనుక ఈ వేసవిలో ఇంకా ఎంతో మంది ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పోయి తుది శ్వాస విడిచి వుంటారు. అయితే డాక్టర్లు ఆ మరణాలకు దారితీసిన యథార్థ కారణాలను అలక్ష్యం చేస్తున్నారు. నిరుపేదలు (నిర్మాణ కార్మికులు, సన్నకారు రైతులు తదితరులు) తమ శ్రమ జీవన పరిసరాలు, పరిస్థితుల కారణంగా ఎండల తీవ్రతకు అతిగా లోనవుతారు. మూడు పూటలా తిండికే నోచుకోని అభాగ్యులకు విద్యుత్ వసతులు అంతగా ఉండవు, అసలు లేకపోనూవచ్చు. మరి అటువంటి దుస్థితిలో కునారిల్లుతున్నవారు పని అనంతరం సేదదీరేందుకు అవసరమైన అత్యాధునిక సదుపాయాలు కలిగి ఉండరనడంలో సందేహం లేదు. ఇటువంటి నిర్భాగ్యుల మరణాలు ఎండ తీవ్రతకు సంభవించినవిగా రికార్డు కావడం లేదు. ఆ మృతులలో అత్యధికులు పేదలు లేదా వృద్ధులు అయివుంటారు. ‘అజ్ఞాత కారణాల’ వల్ల వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన వారుగా నమోదవుతున్నారు! భారత ప్రభుత్వ నోటిఫైడ్ డిసీజెస్ (డాక్టర్లు రోగ నిదానం చేసినప్పుడు ఏ జబ్బులనయితే ప్రభుత్వానికి లేదా స్థానిక ప్రజారోగ్య అధికారులకు విధిగా వాటి గురించి తెలియజేయవలసి ఉంటుందో ఆ వ్యాధులు)లో వడగాడ్పు మరణాలు లేవు. ఈ కారణంగా వాటిని రికార్డు చేయవలసిన, లేదా వాటి గురించి అధికారులకు సమాచారమివ్వాల్సిన అవసరం ఉండదు. ఇందువల్లే ఈ వేసవిలో తీవ్ర గాడ్పుల మూలంగా ప్రజల ఆరోగ్యానికి వాటిల్లిన హాని, సంభవించిన మరణాల గురించి మనకు కచ్చితంగా తెలిసింది తక్కువ అని గుర్తించవలసి ఉంది.
అయితే ఇప్పుడు వివిధ పరిశోధనలు ప్రాణాంతక వడగాడ్పుల తీవ్రతను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతల పెరుగుదల గరిష్ఠ మరణాలకు కారణంగా ఉన్నదనేది తొట్ట తొలుత మనం అర్థం చేసుకోవల్సిన వాస్తవం. ‘రాత్రిపూట ఉష్ణోగ్రత అధికంగా ఉన్న రోజుల్లో వడగాడ్పుల మరణాలు, రాత్రి పూట ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న రోజుల్లో కంటే 50 శాతం అధికంగా ఉంటున్నట్టు’ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో రెండేళ్ల క్రితమే (2022లో) ప్రచురితమైన ఒక పరిశోధనా పత్రం వెల్లడించింది. కారణమేమిటి? అధిక ఉష్ణోగ్రత నిద్రను ప్రభావితం చేస్తుంది. తత్కారణంగా, శ్రమతో అలసిన దేహం తనకు తానుగా ఉపశమనం పొందలేదు. దీని మూలంగా వేడి తీవ్రతకు శరీరం ఎక్కువగా లోనవుతుందని ఆ పరిశోధకుడు పేర్కొన్నాడు.
హెచ్చు ఉష్ణోగ్రతల మూలంగా సంభవిస్తున్న మరణాలు పట్టణాలు, నగరాలలో పెరుగుతున్నాయి. ఆ ఉష్ణోగ్రతలు మానవ శరీరాలు భరించే శక్తికి మించి ఉంటున్నాయి. ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’లో నా సహచరులు ఇటీవల రూపొందించిన ఒక నివేదిక ప్రధాన భారతీయ నగరాలలో వేడి పెరుగుదల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో వివరించింది. నగర పరిసరాలలో వ్యాపించి ఉన్న ఉష్ణోగ్రతలు దేశ సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా పెరుగుతున్నాయని వెల్లడయింది. 2001–2010 దశకంతో పోలిస్తే 2014–2024 దశకంలోని వేసవి కాలాలలో తేమ 5 నుంచి 10 శాతం మేరకు పెరిగినట్టు ఆ నివేదిక వెల్లడించింది. ఒక్క బెంగళూరులో మాత్రమే తేమ పెరుగుదల సంభవించలేదు. ఇందుకు కారణాలేమిటో శోధించవలసి ఉన్నది. దేశ వ్యాప్తంగా అన్ని వాతావరణ మండలాలలోను రాత్రిపూట నగరాలలో వాతావరణం చల్లబడడం లేదని కూడా ఆ నివేదిక వెల్లడించింది. 2001–10 దశకం వేసవి కాలాలలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పగటి పూట గరిష్ఠత కంటే 6.2 శాతం తగ్గి 13.2 శాతంగా ఉన్నాయి. అయితే గత పది వేసవి కాలాలలో పగలు, రాత్రి పూట ఉష్ణోగ్రతలలో తేడా అంటే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం తగ్గుముఖం పట్టింది. ఈ తగ్గుదల హైదరాబాద్‌లో 13 శాతంగా ఉన్నది. ఢిల్లీలో 9 శాతం, బెంగళూరులో 15 శాతం మేరకు ఆ తగ్గుదల ఉన్నది. కోల్‌కతాలో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉన్నది. వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడమే అందుకు కారణం.
మన ధరిత్రి అంతకంతకూ వేడెక్కుతోంది. ఈ ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలు గత గరిష్ఠ రికార్డులను బద్దలు కొట్టాయి. మరింత ఘోరమైన విషయమేమిటంటే వర్షపాతం క్రమరహితంగా ఉంటోంది. కొద్ది రోజులు అతివృష్టి. సుదీర్ఘంగా అనావృష్టి. ఉష్ణోగ్రతలూ నిలకడగా ఉండడం లేదు. మొత్తం మీద వాతావరణ వైపరీత్యాలు అంతకంతకూ మరింత హానికరమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాయు విన్యాసాలలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇవన్నీ వేసవి తాపాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆ పెరుగుదల ప్రాణాంతకంగా ఉంటోంది. మరో వైపు మన నగరాలలో సూక్ష్మ శీతోష్ణస్థితి (మైక్రో క్లైమేట్– మిక్కిలి చిన్న ప్రదేశంలో ఉండే శీతోష్ణస్థితి)లో ఆకస్మిక మార్పులు సంభవిస్తున్నాయి. హీట్ ఐలెండ్ ఎఫెక్ట్ అనబడే ఈ పరిణామం మరింతగా తీవ్రమవుతోంది. నగరాలు కాంక్రీట్ భవనాలమయం కావడమే ఇందుకు కారణమని మరి చెప్పనవసరం లేదు. రోడ్లపై వాహనాల రద్దీ, ఇంధన వినియోగం, ఎయిర్ కండిషనర్ల వాడకం విపరీతంగా పెరిగి పోవడంతో కర్బన ఉద్గారాలు పెరిగి వాతావరణంలో వేడి అధికమవుతోంది.
వేడి తీవ్రతకు సంబంధించి ఈ వేసవి మనకు కొత్త పాఠాలను నేర్పింది. వాస్తవమేమిటంటే వాతావరణ మార్పు అనేక ఆశ్చర్యకర పరిణామాలకు దారితీస్తోంది. మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావం విషమపూరితంగా ఉంటోంది. ఇప్పటికీ ఈ మార్పులను సమగ్రంగా అర్థం చేసుకోవడం జరగలేదు. వాతావరణ మార్పు మన ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపనున్నది ఇంకా విపులంగా అర్థం చేసుకోవల్సి ఉన్నది. మానవ తప్పిదాల కారణంగా పదే పదే ప్రాకృతిక విపత్తులు సంభవిస్తున్నాయి. మన సమున్నత, అధునాతన నాగరికతలకు ఆలంబన అయిన ప్రాకృతిక వనరులు వేగంగా క్షీణించి పోతున్నాయి. జీవ వైవిధ్యం హరించుకుపోతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితులు ధరిత్రి ఆరోగ్యాన్ని సమస్థితిలో ఉంచుతాయా? ధరిత్రి ఆరోగ్యం (ప్లానేటరీ హెల్త్) సమస్థితిలో ఉన్నప్పుడే మానవాళి ఆరోగ్యం భద్రంగా ఉంటుంది మానవ ఆరోగ్యం గురించిన సంప్రదాయక అవగాహనలో మౌలిక మార్పు తెచ్చిన భావనే ప్లానేటరీ హెల్త్. ప్రాకృతిక వ్యవస్థల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే ఈ భావన ప్రజారోగ్య భావన కంటే విశాలమైనది. మరింత స్పష్టంగా చెప్పాలంటే మానవ జీవన విధానాలు, వాటికి ఆధారమైన ప్రాకృతిక వ్యవస్థల ఆరోగ్యమే ప్లానేటరీ హెల్త్. మరి ధరిత్రి ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే మనం పర్యావరణ సమతౌల్యతను కాపాడుకున్నప్పుడే ధరిత్రికి శ్రేయస్సు, మానవాళికి ఆరోగ్య సంక్షేమం సమకూరుతాయి. వాతావరణ మార్పు అనేది మన అస్తిత్వ సంక్షోభమే అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవల్సిన సమయమాసన్న మయింది. ఈ విషయంలో ఇంకెటువంటి జాప్యం కూడదు. అది వ్యక్తులు, సమాజాలు, యావత్ మానవాళికి ఒక జీవన్మరణ సమస్య అని చెప్పడంలో ఎటువంటి అతి శయోక్తి లేదు.
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’
డైరెక్టర్ జనరల్, ‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)