Share News

రాజ్యాంగ సంస్థగా గ్రామసభ

ABN , Publish Date - Oct 03 , 2024 | 05:02 AM

పంచాయతీరాజ్‌– జిల్లాపరిషత్‌, మండల ప్రజాపరిషత్‌, గ్రామ పంచాయతీలతో కూడిన మూడంచెల నిర్మాణం. గ్రామపంచాయతీని గ్రామసభ, న్యాయ పంచాయతీలుగా విభజించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను ‘73వ రాజ్యాంగ సవరణ చట్టం–1992’ ద్వారా...

రాజ్యాంగ సంస్థగా గ్రామసభ

పంచాయతీరాజ్‌– జిల్లాపరిషత్‌, మండల ప్రజాపరిషత్‌, గ్రామ పంచాయతీలతో కూడిన మూడంచెల నిర్మాణం. గ్రామపంచాయతీని గ్రామసభ, న్యాయ పంచాయతీలుగా విభజించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను ‘73వ రాజ్యాంగ సవరణ చట్టం–1992’ ద్వారా రాజ్యాంగబద్ధం చేశారు, ఇది ఏప్రిల్‌ 24, 1993 నుంచి అమలులోకి వచ్చింది. కేంద్రప్రభుత్వం ఆదేశాలను అనుసరించి సంవత్సరంలో నాలుగుసార్లు అంటే (1) జనవరి 26, (2) ఏప్రిల్‌ 14, (3) జూలై ఒకటి, (4) అక్టోబరు 3 తేదీలలో గ్రామసభలను నిర్వహించడానికి పంచాయతీరాజ్‌ కమిషనరు ఆదేశాలు జారీ చేశారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(ఎ) ప్రకారం రాష్ట్ర శాసనసభల ద్వారా కొన్ని చట్టబద్ధమైన అధికారాలు గ్రామసభకు కల్పించారు. APPR చట్టం 1994లోని సెక్షన్లు 45, 161, 192 ద్వారా కొన్ని నిర్దిష్ట విధులు పంచాయతీరాజ్‌కు అప్పగించారు. అందువల్ల గ్రామసభ ఒక రాజ్యాంగ సంస్థ, స్థానిక పరిపాలన వ్యవస్థలో ప్రాథమిక ప్రజాస్వామ్య కేంద్రం. గ్రామ అభివృద్ధి, వికేంద్రీకృత ప్రణాళిక ప్రాథమిక వేదికగా గ్రామసభ పనిచేస్తుంది. ప్రజల భాగస్వామ్యం, వివిధ అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణను నిర్వహిస్తుంది. సంబంధిత గ్రామానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. పంచాయతీరాజ్‌ సంస్థల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. అట్టడుగు స్థాయిలో అనుబంధ విభాగాల మధ్యన సముచితమైన, ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుంది. గ్రామాల పరిధికి చెందిన వివిధ ప్రభుత్వ విభాగాలు/ సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థలు చేపట్టిన కార్యకలాపాల సామాజిక ఆడిట్‌ను నిర్వహించడానికి గ్రామస్థాయిలో గ్రామసభే నిజమైన వేదిక. ఈ విధంగా పారదర్శకత, జవాబుదారీతనం, ఏకీకరణలకు గ్రామసభ సరైన వేదికగా ఉంటూ సామాజిక, ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది. అందుకే గ్రామపంచాయతీ లబ్ధిదారుల ఎంపికను గ్రామసభ ద్వారా నిర్వహించడానికి గ్రామపంచాయతీలకు ప్రాధాన్యం ఇచ్చారు.


గ్రామసభలలో చర్చించాల్సిన అంశాలు ఏమిటంటే– ఖాతాల వార్షిక ప్రకటన, ఆడిట్‌ నివేదిక, మునుపటి సంవత్సర పరిపాలనకు చెందిన నివేదిక, ప్రస్తుత సంవత్సరానికి చెందిన కార్యక్రమాల వివరాలు, బడ్జెట్‌ లేదా వార్షిక కార్యక్రమం ద్వారా గుర్తింపబడని ఏదైనా కొత్త కార్యక్రమం, తాజా పన్నులు లేదా ఇప్పటికే ఉన్న పన్నుల పెంపు ప్రతిపాదనలు, పథకాలు, లబ్ధిదారులు, ప్రదేశాల ఎంపిక. వీటితో పాటు పంచాయతీ పరిధిలోని అన్ని స్థిర, చరాస్తుల వివరాల పట్టికలు, గ్రామ పంచాయతీ ఆమోదించిన బడ్జెట్‌ అంచనాల కాపీ; గ్రామ పంచాయతీ ఖాతాలపై ఆడిట్‌ నివేదిక కాపీ; పన్నులు, చెల్లించాల్సిన ఫీజుల బకాయిల్లో ఉన్న ఎగవేతదారుల జాబితా; గ్రామ పంచాయతీలో జరిగే నాలుగు గ్రామసభలకు ఆయా సంబంధిత విభాగాల గ్రామస్థాయి/క్షేత్రస్థాయి సిబ్బంది సమాచారాన్ని అందించాలి. రాష్ట్రంలోని 13,321 గ్రామపంచాయతీలు గ్రామసభను నిర్వహించాలి. అక్టోబర్‌ 3వ తేదీ గ్రామసభ లబ్ధిదారుల కార్యక్రమాల అమలులో పురోగతిపై సమీక్షా కార్యక్రమాలు; చేపట్టిన ప్రజా పనుల నివేదిక; సామాజిక–ఆర్థిక పురోగతి నివేదికలు నేరుగా అందించబడిన సేవల సమీక్ష, వివిధ అంశాల పట్ల దిద్దుబాట్లు ఏదైనా ఉంటే అవన్నీ చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. అయితే గ్రామసభలు అంత స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం లేదన్నది వాస్తవం. గ్రామపంచాయతీ సభలలో కోరం ఎలా పాటిస్తారో అదేవిధంగా గ్రామసభల్లో కూడా కోరం పాటించాలని నిబంధన లేకపోవడం వల్ల సర్పంచ్‌లు తమకు అనుకూలమైన ప్రజలను తీసుకొచ్చి గ్రామసభ నిర్వహిస్తున్నారు. దీంతో వాటికి ప్రాధాన్యం లేకుండా పోయింది.


గ్రామసభకు సకాలంలో సంబంధిత శాఖల క్షేత్రస్థాయి విధి నిర్వాహకులు అవసరమైన సమాచారాన్ని కనీసం ఒక వారం ముందుగా సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సమర్పించాలి. సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులు కూడా సమాచారాన్ని గ్రామసభకు సకాలంలో సమర్పించేలా చూడాలి. పంచాయతీ కార్యదర్శి మొత్తం సమాచారాన్ని సంచితపరచి, గ్రామసభ సభ్యులకు పంపాలి. డాక్యుమెంటేషన్‌లో భాగంగా గ్రామసభ ప్రొసిడింగుల విడియో గ్రాఫ్‌ కోసం పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేయాలి. గ్రామసభ ఫొటోగ్రాఫ్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఎవరైనా సంబంధిత క్షేత్రస్థాయి విధి నిర్వాహకుడు గ్రామసభకు హజరుకానట్లయితే, ఆ మేరకు గ్రామసభ తీర్మానాన్ని సంబంధిత శాఖ విభాగాధికారికి పంపాలి. ఆ శాఖ గ్రామసభ తీర్మానంపై తీసుకున్న చర్యని జిల్లా కలెక్టరుకు తెలుపుతూ గ్రామపంచాయతీకి సమర్పించాలి.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 23న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలుకు సంబంధించిన గ్రామసభ 13,326 గ్రామపంచాయతీలలో ఒకేరోజు విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచ రికార్డ్స్‌ యూనియన్‌ మేనేజర్‌ క్రిస్టఫర్‌ టైలర్‌ క్రాఫ్ట్‌ ప్రపంచ గుర్తింపు ధ్రువపత్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్‌ కళ్యాణ్‌కి అందజేశారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి అభివృద్ధి మొదలుకావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పంచాయతీరాజ్‌ సంస్థల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి 400 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు 1987 కోట్లు వచ్చాయి. అంతేకాక 2027 నాటికి జలజీవన్‌ మిషన్‌ ద్వారా 95.4 లక్షలు మేరకు కుళాయిల ద్వారా రక్షిత నీరు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ పథకం ద్వారా 215.8 కోట్లు ఇవ్వటానికి ఆమోదం తెలిపింది. నేటి ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థ పటిష్ఠత, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకురావాలని ఆసక్తి చూపించడం ముదావహం.


పంచాయతీరాజ్‌ చాంబర్‌ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ కేంద్రమంత్రిని కలిసి ఉపాధి హామీ నిధులను 90:10 నిష్పత్తిలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరింది. ఉపాధి హామీ కూలీలను గ్రామపంచాయతీకి అనుసంధానం చేసి గ్రామాల పరిశుభ్రతకు అవకాశం కల్పించాలని కోరింది. ఉపాధి హామీ సిబ్బందిని మండల పరిషత్‌, గ్రామపంచాయతీ ఆధీనంలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసి, ఆ వ్యవస్థను గ్రామ పంచాయతీల, సర్పంచ్‌ల ఆధీనంలోకి తీసుకువచ్చి, ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవస్థను రూపకల్పన చేయాలని; సచివాలయ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని; వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, ఆంధ్రప్రదేశ్‌ సర్పంచ్‌ల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి.


15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వెంటనే పంచాయతీలకు జమ అయ్యేట్లు చర్యలు తీసుకోవాలి. పంచాయతీకి సంబంధించిన నిధుల జమ, ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా జరిగేట్లు తక్షణ చర్యలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ పరిధిలోకి గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థను తీసుకురావాలి. స్థానిక సంస్థల్లో నిధుల వినియోగంలో జరిగే అవినీతిని నియంత్రించడానికి అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. పంచాయతీ విభాగం అధికార వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ఇ–పంచాయతీ కార్యక్రమం అన్ని జిల్లాల్లో అమలు చేయబడుతూ, ఇ–పంచాయతీ, నివాస స్కోరు కార్డ్‌ అనువర్తనాల మధ్య సంధానత ఉండేలా చర్యలు తీసుకోవాలి. అందుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్స్‌ విభాగాన్ని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేయాలి. తద్వారా గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి నిజమైన పునాది వేసినట్టు అవుతుంది.

టిఎంబి బుచ్చిరాజు

చైర్మన్‌, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌

Updated Date - Oct 03 , 2024 | 05:02 AM