Share News

వైద్యంపై ప్రభుత్వాలు శ్రద్ధపెట్టాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:41 AM

మనదేశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జీడీపీలో 1.1 నుంచి 1.6 శాతం మాత్రమే ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ...

వైద్యంపై ప్రభుత్వాలు శ్రద్ధపెట్టాలి

మనదేశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జీడీపీలో 1.1 నుంచి 1.6 శాతం మాత్రమే ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ. ఇందులోనే తాగునీటికి, పారిశుధ్యానికి కేటాయింపులు జరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్య రంగానికి జీడీపీలో 2.5శాతం నిధులు ప్రస్తుతం కేటాయించి, క్రమంగా దానిని 5.5 శాతానికి పెంచవలసిన అవసరం ఉంది. అంతేకాక తాగునీటికి, పారిశుధ్యానికి విడిగా నిధులు కేటాయించాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆరోగ్య వసతులు క్రమేణా పెంచుతున్నప్పటికీ, ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రజల ఆరోగ్య అవసరాల కోసం దేశంలో వెచ్చిస్తున్న వ్యయంలో 63శాతం ప్రజలు తమ సొంత నిధుల నుంచి ఖర్చు చేస్తున్నారు. దాంతో ప్రతి ఏటా 5.5 కోట్ల మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువకు చేరుతున్నారు. ప్రజల జేబుల నుంచి వైద్యానికి వ్యయం చేస్తున్న దానిలో ఎక్కువ శాతం మందులకే ఖర్చవుతోంది. మందులపై ప్రస్తుతం 5 నుంచి 18 శాతం ఉన్న జీఎస్టీని తొలగిస్తే ప్రజలకు కొంత భారం తగ్గుతుంది. ప్రజలందరికీ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి వైద్యానికి తగిన కనీస వైద్య మౌలిక వసతులు, మానవ వనరులను ప్రభుత్వాలు కల్పించాలి. సరైన వైద్య సదుపాయాలతో పాటు రక్షిత త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రతపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి.


సాంక్రమిత వ్యాధులతో పాటు, సాంక్రమితేతర జబ్బులు అంటే మధుమేహం, రక్తపోటు వంటివి కూడా ఆధునిక జీవన విధానంలో అధికమవుతున్నాయి. ధూమపానం వంటి దురలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం, ఆహార నియంత్రణ పాటించకపోవడం తద్వారా స్థూలకాయానికి దారి తీసి మధుమేహం, రక్తపోటు, కాలేయం, మూత్రపిండాల జబ్బులు మధ్య వయస్కులలో కూడా పెరుగుతున్నాయి. ప్రజలు కూడా తమ ఆరోగ్య రక్షణ కోసం వ్యక్తిగత జీవితాన్ని క్రమశిక్షణతో గడపాలి. దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ప్రజలు అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంది.

వైద్యంలో సరైన శిక్షణ, అర్హత లేనటువంటి నకిలీ వైద్యులు యాంటీబయాటిక్‌లను నిర్హేతుకంగా, అతిగా వినియోగించడం వలన ఆయా మందులకు వ్యాధి నిరోధక ప్రభావం తగ్గిపోతున్నది. యాంటీబయాటిక్స్ బాధ్యతాయుతంగా వినియోగించేలా చూడడం, అందుకోసం జాతీయస్థాయిలో ఈ–ప్రిస్క్రిప్షన్ విధానాన్ని రూపొందించి అమలు చేయడం అవసరం.

వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై భౌతిక దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. ఇవి అత్యవసర చికిత్స అందించడానికి వైద్యులు వెనకడుగు వేసే పరిస్థితులకు దారి తీస్తాయి. గత సంవత్సరం కేరళలో యువ వైద్యురాలు డాక్టర్ వందనాదాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఖైదీకి చికిత్స చే‍స్తుండగా, ఆ ఖైదీ చేతిలో ఆమె హత్యకు గురి కావడం దేశవ్యాప్తంగా వైద్యులను ఆందోళనకు గురిచేసింది. వైద్యులు నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో ప్రజలకు అత్యవసర వైద్యం అందించడానికి ప్రస్తుతం 23 రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రస్థాయి వైద్యుల రక్షణ చట్టాలను కఠినతరం చేస్తూ మార్పులు తీసుకురావాలి. డాక్టర్ వందనాదాస్ సంఘటన తర్వాత కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర చట్టాన్ని కఠినతరం చేస్తూ సవరించింది. కేంద్ర స్థాయిలో కూడా ప్రత్యేకంగా వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రుల రక్షణ చట్టాన్ని తీసుకురావడం అత్యవసరం.


అలాగే వైద్యుల నిర్లక్ష్యం ఫిర్యాదులపై కేసులు నమోదు చేసేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా పోలీస్ శాఖకు నిర్దిష్ట నిబంధనావళి కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో రూపొందించి అన్ని పోలీస్ స్టేషన్లకు జారీ చేయాలి. లేదంటే అవగాహన లేమితో పోలీసులు వైద్యులపై కొన్నిచోట్ల హత్యారోపణ, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం రాజస్థాన్‌లో ప్రసవ సమయంలో ఒక మహిళ అధిక రక్తస్రావంతో మరణిస్తే వైద్యురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంఘటనలో, సీనియర్ వైద్యురాలు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఈ విధమైన వేధింపులు వైద్యులు ఎదుర్కోవాల్సి వస్తే అత్యవసర చికిత్సలు అందించడానికి వారు తటపటాయించే అవకాశం ఉంది.

ఆధునిక వైద్యాన్ని అందిస్తున్న 4లక్షల మంది వైద్యులు సభ్యులుగా కలిగి, దేశంలో 1764 శాఖలు ఉన్న భారతీయ వైద్య సంఘం దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఐఎంఏ ప్రపంచంలోనే అతిపెద్ద వృత్తి నిపుణుల సంస్థ. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు విధివిధానాలు రూపొందించే సమయంలో ఐఎంఏను భాగస్వామిని చేయాలి.


గత సంవత్సరం డిసెంబర్‌లో తిరువనంతపురంలో జరిగిన 95వ ఐఎంఏ జాతీయ మహాసభల సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, విభిన్న రంగాలకు చెందిన మేధావులు వరస సమావేశాలు నిర్వహించి రానున్న 50 సంవత్సరాల కాలానికి దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ మేనిఫెస్టో రూపొందించారు. ఇందులో అన్ని కోణాల నుంచి వైద్య ఆరోగ్య రంగాలలో తీసుకోవాల్సిన చర్యల్ని కూలంకషంగా వివరించారు. ఈ హెల్త్ మేనిఫెస్టోను సాధారణ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా అందజేయనున్నది. ఆయా రాజకీయ పక్షాలు ఐఎంఏ హెల్త్ మేనిఫెస్టోని అధ్యయనం చేసి, ఇందులోని అంశాలను తమ పార్టీ మ్యానిఫెస్టోలలో పొందుపరచడానికి గల అవకాశాలను పరిశీలించాలి.

పేదవానికీ ధనికునికి ఒకే రకమైన వైద్యం అందుబాటులోకి వచ్చిన నాడు సార్వజనీన వైద్యం సాధించినట్లు అవుతుంది. ఆ దిశలో ప్రభుత్వాలు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రజలకు ఆరోగ్య హక్కు అందించినట్లు అవుతుంది.

డాక్టర్ గుర్రాల రవికృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట ఐఎంఎ యాక్షన్ కమిటీ చైర్మన్

Updated Date - Apr 25 , 2024 | 02:41 AM