Share News

గొల్లత్తగుడికి గుర్తింపేది!

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:11 AM

తెలంగాణ అంటేనే చరిత్ర. తరచిచూస్తే గతమంతా ఘనవైభవమే. ఆదిమానవుల కాలం నుంచి చాళుక్యులు, కాకతీయులు, నిజాం రాజుల దాకా ఈ నేల అణువణువూ అత్యద్భుతం...

గొల్లత్తగుడికి గుర్తింపేది!

తెలంగాణ అంటేనే చరిత్ర. తరచిచూస్తే గతమంతా ఘనవైభవమే. ఆదిమానవుల కాలం నుంచి చాళుక్యులు, కాకతీయులు, నిజాం రాజుల దాకా ఈ నేల అణువణువూ అత్యద్భుతం. ప్రతీ నిర్మాణం అపురూపం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, కల్వకుర్తి రహదారిలో ఆల్వాన్‌పల్లి దగ్గర అత్యంత చరిత్రాత్మకమైన, ప్రాచీనమైన గొల్లత్తగుడిగా జనం పిలుచుకునే జైన దేవాలయం ఉంది. ఈ ఆలయం హిందూ దేవాలయ వాస్తు శైలికి భిన్నంగా ఉంటుంది. చరిత్రకారులు ఈ ఆలయాన్ని ‘ఆది మందిరం’గా వ్యవహరిస్తారు. క్రీస్తుశకం 7, 8 శతాబ్దాలలో రాష్ట్ర కూటుల పాలనలో పూర్తిగా ఇటుకల దొంతరలా 65 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ ఆలయం నేటికీ చూపరులకు విభ్రాంతి గొలుపుతుంది.


భూలోక మల్లుని పేర వేయించిన శాసనం ఇక్కడ లభించింది. ఈ ఆలయం ప్రక్కనే జైనులు భక్తితో ప్రణమిల్లే జినుని ఆరడుగుల రాతి పాదాలు నిలబెట్టి ఉన్నాయి. ఈ దేవాలయ నిర్మాణానికి వాడిన ఇటుకల తయారీ శైలి దేశంలో మరెక్కడా కనిపించదు. దొంగలు గుప్తనిధుల కొరకు త్రవ్వకాలు జరిపిన నేపథ్యంలో 1950 సంవత్సరంలో రెండు జైన తీర్థంకరుల విగ్రహాలలో ఒకటి మహబూబ్ ‌నగర్ పిల్లల మర్రి మ్యూజియానికి, ఇంకొకటి హైదరాబాద్ స్టేట్ మ్యూజియానికి తరలించారు. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తుశాఖ అధీనంలో, చుట్టూ ఎత్తయిన ప్రహరీతో కాపలా వ్యక్తి పహరాలో ఉంది. ఇలాంటి ఆలయం దేశం మొత్తంలో ఇంకొకటి ఉత్తరప్రదేశ్‌లో ఉంది. అద్భుతమైన ఈ ఆలయాన్ని చరిత్ర జిజ్ఞాసువులు తప్పక సందర్శించాలి.


ఇంతటి ఘన చరిత్ర కలిగిన అలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది. గొల్లత్తగుడిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం చాలా ఉంది. దేశ విదేశాల నుండి సందర్శకులు, పరిశోధకులు ఈ ఆలయానికి విచ్చేసి ఇక్కడి ఘన చరిత్రను ప్రపంచానికి చాటే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మన ప్రాచీన చరిత్ర, ఆనవాళ్లను భావితరాలకు అందించినవారిమవుతాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఈ పురాతన ఆలయం అభివృద్ధికి నోచుకుంటే ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మరింత గుర్తింపు తెచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యేక నిధులను కేటాయించి ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఇక్కడ సందర్శకులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

ఖాజా అఫ్రిది

Updated Date - Oct 01 , 2024 | 03:11 AM