జెండా
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:26 AM
రాత్రిని చంద్రశిలపై వుతికి ధాత్రి అవయవాలపై పరిచి నీ దేహం మొగ్గని కాస్త కాస్త విప్పి రేకల్తో నన్నదిమి నీ జుట్టు అడవిని నిర్దాక్షిణ్యంగా నా మొహం చుట్టూ కప్పేసి...
రాత్రిని చంద్రశిలపై వుతికి
ధాత్రి అవయవాలపై పరిచి
నీ దేహం మొగ్గని కాస్త కాస్త విప్పి
రేకల్తో నన్నదిమి
నీ జుట్టు అడవిని నిర్దాక్షిణ్యంగా
నా మొహం చుట్టూ కప్పేసి
నన్ను కార్చిచ్చులోకి నెట్టేసి
నువ్వు నీ అమాయిక పెదాల్తో
నా జంతు పెదాలపై ముద్దు
పెట్టుకుంటావు
సూర్యుడూ చంద్రుడూ
మన పెదాల మధ్య
భగ్గున మండుతారు
నక్షత్రాలు
నఖక్షతాలు కాగానే
సుందర ప్రదేశాలు సెగలు సోకి
కందిపోగానే
నువ్వు లోకంలోని
అన్ని పువ్వుల వాసనా వేస్తావు
నేను నా గీతాల వాసన వేస్తాను
అప్పుడప్పుడూ నువ్వు
అమ్మ వాసన వేస్తావు
అప్పుడు
నా పెదాల మీద
నువ్వు వొదిలిన మంటల్ని తింటూ
నేను కాలం గడుపుతాను
ఈలోగా
హఠాత్తుగా
రక్తంలో తడిసిన
మన చర్మాన్ని జెండాగా కుట్టి
ఆసుపత్రిలో నువ్వు
మానవ పతాకను ఎగరేస్తావు
నగ్నముని