Share News

జీవన వ్యవస్థగా మారుతున్న ఫాసిజం

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:36 AM

ఇటీవలి కాలంలో ఫాసిజం అనే పదం అనేకమంది నోట తరచుగా వినవస్తోంది. బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తరువాత దీని గురించిన చర్చ అధికమైంది...

జీవన వ్యవస్థగా మారుతున్న ఫాసిజం

ఇటీవలి కాలంలో ఫాసిజం అనే పదం అనేకమంది నోట తరచుగా వినవస్తోంది. బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తరువాత దీని గురించిన చర్చ అధికమైంది. నిరంకుశత్వం, అణచివేత, నిర్భంధం, హక్కులహననాన్ని ఫాసిజానికి పర్యాయపదాలుగా వాడుతుంటారు. అధికారపార్టీ సాగిస్తున్న నియంతృత్వపాలన ఫాసిజమేనని, ప్రభుత్వాధినేతను ఫాసిస్టు అని ప్రతిపక్షం కూడా ఆరోపించడం పరిపాటి అయింది. అయితే ఫాసిజమనే భావనను ఈ తరహా సాధారణ అవగాహనకు కుదించడం సరైందేనా? ఎందుకంటే రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ కూటమి సైనికంగా ఓడిన తరువాత మానవాళికి ఫాసిజమనే ప్రమాదం తప్పిందని చాలామంది భావించారు. కానీ అది వాస్తవం కాదని తర్వాతికాలంలో స్పష్టమైంది. ఫాసిస్టులు సైనికంగా ఓటమి చెందినప్పటికీ, అది ఒక ప్రగతినిరోధక భావజాలంగా అన్ని సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశాలలో వ్యాప్తిచెందడం కనిపిస్తోంది. అభివృద్ధి చెందిన పశ్చిమదేశాలలోనే కాక ఆఫ్రికా లాంటి వెనుకబడిన దేశాలలో కూడా ఫాసిజం ఒక సార్వత్రిక దృగ్విషయంగా మారింది. ఇందుకు మనదేశం ఏ మాత్రం మినహాయింపు కాదు.


ఫాసిజం పోకడలను నిశితంగా పరిశీలిస్తే, సమాజపు నియమానుగత ప్రగతిని నిరోధించడానికి, అట్టడుగు పీడితప్రజల చైతన్యంతో సాగించే పోరాటాన్ని అడ్డుకోవడానికి తలెత్తిన ఒక రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక, తాత్వికభావజాలంగా దాన్ని పరిగణించవచ్చు. 17, 18 శతాబ్దాలలో అప్పటి రాజరికపాలనను తొలగించి, ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల ఆవిర్భావానికి నాయకత్వం వహించిన సామాజికశక్తులు ఒకదశ వరకు సమాజానికి దిశానిర్దేశం చేశాయి. మార్క్సిస్టు పరిభాషలో వీరిని పాలక బూర్జువావర్గం అంటారు. అయితే వీరు కాలక్రమంలో మరొక రూపంలో దోపిడి, పీడనల వ్యవస్థను ప్రతిష్ఠించి, గుత్తపెట్టుబడికి జన్మనిచ్చి, ప్రగతినిరోధక శక్తులుగా రూపాంతరం చెందారు. నాటి స్వేచ్ఛాయుత మార్కెట్ స్థానంలో సామ్రాజ్యవాదం పాదుకుని సామాజికరంగాలు అన్నింటా సంక్షోభం వ్యాపించింది. తదుపరి దశలో, ఒకనాడు వీళ్లు ఘనంగా ఎలుగెత్తి చాటిన స్వేచ్ఛా, సమానత్వ, సౌభ్రాతృత్వ నినాదాలను, శ్రేయోరాజ్య స్థాపన ప్రకటనలను, మ్యాగ్నాకార్టాలను, ప్రజాస్వామ్య హక్కుల పత్రాలను, రాజ్యాంగపీఠికలను 20వ శతాబ్ది తొలినాళ్లనుంచి వాళ్లే కాలరాసేయడం ప్రారంభమైంది. దీనికి ప్రతివాదంగా కార్మికవర్గపోరాటాలు, తిరుగుబాట్లు, విప్లవాత్మక మార్పులు ప్రపంచమంతటా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ పరిణామాల కారణంగా పాలకశక్తులలో కమ్ముకున్న మరణభీతి వాళ్లు ఫాసిజాన్ని ఆశ్రయించేలా చేసింది. ఈ నేపథ్యంలో కార్మికవర్గ విప్లవాన్ని నివారించడానికి, తమ పాలనను సుస్థిరం చేసుకోవడానికి పాలకవర్గాలు ముందస్తుగా చేపట్టే ఒక సమగ్ర ప్రగతినిరోధక పథకాన్నే ఫాసిజంగా నిర్వచించడం అధునాతన అవగాహన అవుతుంది.


మనదేశంలో 20వ శతాబ్ది ద్వితీయార్థంలో మార్క్సిస్టు అవగాహనను బహుముఖంగా పెంపొందించిన శిబ్దాస్ ఘోష్ రచనలలో ఈ ఫాసిజం గురించిన లోతైన అధ్యయనాన్ని మనం గమనించవచ్చు. ఆయన పరిశీలనల ప్రకారం ఫాసిజానికి ఉన్న మూడు మౌలికలక్షణాలను ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, తాత్విక పార్శ్వాలుగా విడదీసి అర్థం చేసుకోవచ్చు. ఒకటి: -ఆర్థికంగా సామాజికసంపద భారీస్థాయిలో కొద్దిమంది చేతుల్లోనే పోగుపడడం, రెండు: -రాజకీయంగా అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రసీ చేతుల్లో అధికారాలన్నీ కేంద్రీకృతం కావడం. ఈ రెండూ రాజ్యాన్ని కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలతో మమేకమై పనిచేసేలా తీర్చిదిద్దుతాయి. మూడు:- సాంస్కృతికరంగంలో ప్రజల ఆలోచనలలో అధ్యాత్మికవాదాన్ని సైన్సులోని సాంకేతిక అంశాలతో మిళితం చేయడం. ఒకచోట శిబ్దాస్ ఘోష్ ఇలా రాశాడు ‘‘ఫాసిజం ఒకవైపు ప్రజల్లో హేతుబద్ధ ఆలోచనా ప్రక్రియను నాశనం చేస్తుంది. వారిని పచ్చిస్వార్థపరులుగా మారుస్తుంది. జ్ఞానం, అధ్యయనం, విద్యా రంగాలను సాంకేతిక అంశాలకు పరిమితమయ్యే విధంగా చేస్తుంది. దీని అర్థం- అన్నిరకాల మానవవిలువలను పూర్తిగా పరిత్యజించి, సమాజం పట్ల బాధ్యతాయుతమైన భావనలేవీ లేని ఒక టెక్నోక్రాట్ల సమూహాన్ని సృష్టిస్తుంది. వీరికి ఉద్యోగం, వేతన బానిసత్వమే పరమావధిగా ఉంటాయి. డబ్బు కోసం ఏమైనా, ఏదైనా చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. ఇలాంటి మార్గం వైపు వారు సైన్సును, అధ్యయనాన్ని మళ్లిస్తారు. మరోవైపు ఫాసిజం అన్నిరకాల ఆధ్యాత్మికవాదాన్ని, మూఢనమ్మకాలను, అహేతుక మనస్తత్వాన్ని, గుడ్డితత్వాన్ని పెంచి పోషిస్తుంది. వీటన్నిటిని సైన్సులోని సాంకేతిక అంశాలతో విచిత్రంగా మిళితం చేస్తుంది’’. జనావళిలో ఈ మూడు లక్షణాలు పెరిగేకొద్దీ ప్రగతినిరోధక శక్తులకు బలం చేకూరుతుంది. వారు పరిరక్షించడానికి పూనుకున్న ప్రగతినిరోధక వ్యవస్థకు జీవనకాలం పెరుగుతుంది.


ఫాసిజం రూపురేఖల విషయానికి వస్తే ఆయా స్థల కాలాదులను బట్టి అవి దేశదేశానికి వేర్వేరుగా ఉంటాయి. ఒకచోట అది మిలటరీ నియంతృత్వం కావచ్చు లేదా అధ్యక్షతరహా పాలన కావచ్చు. పాకిస్థాన్‌లో సైనిక ఆధిపత్యం, మయన్మార్‌లో మిలటరీ జుంటా పాలన దీనికి ఉదాహరణలు. మరోచోట పార్లమెంటరీ ప్రజాస్వామ్య ముసుగులో రెండు ప్రధానపార్టీలు లేదా కూటముల పాలన ద్వారా కూడా ఫాసిజం చాపకింద నీరులా వేళ్లూనుకోవచ్చు. ఒక పార్టీ లేదా కూటమి ప్రజల్లో అపఖ్యాతి పాలైనప్పుడు మరొకదాన్ని ముందుకు తెస్తారు. అమెరికా, ఇంగ్లండ్, భారతదేశం దీనికి సరైన నమూనాలు. అందువల్ల ఫాసిస్టురాజ్యం అన్నిచోట్లా, అన్ని సమయాలలో నిరంకుశ పాలనగా, అణచివేత సాధనంగా పైకి కనిపించకపోవచ్చు. అది చాలాసార్లు ప్రజలను ఒప్పించడం ద్వారా వారిని తన వెనుక పెద్దసంఖ్యలో సమీకరించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందుకు కొన్ని జనాకర్షక పథకాలను, నినాదాలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకునే చర్యలు చేపడుతుంది. ఒక నాయకుణ్ణి అన్ని శక్తులు కలిగిన అసమానవ్యక్తిగా, అద్భుతవ్యక్తిగా చాటుతుంది. జర్మనీలో హిట్లర్‌ను ఫ్యూరర్‌గా చిత్రీకరించిన సంగతి మనకు తెలుసు. మనదేశంలో కూడా ఒకప్పుడు ఇందిరాగాంధీని, ప్రస్తుతం మోదీని ఆకాశానికి ఎత్తి చూపించడం అలాంటి ప్రయత్నాల్లో భాగమే.


ఫాసిజం ఒక్క పాలకపార్టీకే పరిమితమైన విధానం కాదు, అదొక పాలకవర్గ పథకం. ఏ పార్టీ అయితే పాలకవర్గ ప్రయోజనాలను, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల అనుకూల ఆర్థిక-, పారిశ్రామిక విధానాలను వేగంగా అమలు చేస్తోందో, దాని పర్యవసానంగా ప్రజలలో పెచ్చరిల్లే అసంతృప్తిని నేర్పుగా, చాకచక్యంగా పక్కకు మళ్లిస్తుందో ఆ పార్టీ వైపు ప్రగతినిరోధక శక్తుల తూకం మొగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో ఫాసిజాన్ని నిలువరించే ప్రతి నిరోధకం ఎన్నికల సమీకరణల ద్వారా పెంపొందదు. ఫాసిస్టు భావజాలానికి విరుద్ధంగా సైద్ధాంతిక, సాంస్కృతిక, తాత్విక ప్రతిప్రవాహ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ, బాధిత జన బాహుళ్యాన్ని దైనందిన సమస్యలపై సమరశీల పోరాటాల దిశగా సంఘటితం చేయాలి. అప్పుడే ఫాసిజాన్ని బలంగా ప్రతిఘటించే శక్తిని నిర్మించడం సాధ్యమవుతుంది.

ఎస్. గోవిందరాజులు

Updated Date - Jun 02 , 2024 | 01:36 AM