Share News

రైతుబిడ్డ రేవంత్‌కు సాగు కష్టం తెలుసు!

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:01 AM

భార‌తదేశంలో రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మ‌ర‌ణిస్తున్నాడు అని బ్రిటిషు ప‌రిశోధ‌కుడు, ఐసీఎస్ అధికారి మాల్కం డార్లింగ్ 1932లో తాను రాసిన ద పంజాబ్ పీజెంట్ ప్రాస్పారిటీ అండ్ డెబ్ట్‌ అనే గ్రంథంలో...

రైతుబిడ్డ రేవంత్‌కు సాగు కష్టం తెలుసు!

భార‌తదేశంలో రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మ‌ర‌ణిస్తున్నాడు అని బ్రిటిషు ప‌రిశోధ‌కుడు, ఐసీఎస్ అధికారి మాల్కం డార్లింగ్ 1932లో తాను రాసిన ద పంజాబ్ పీజెంట్ ప్రాస్పారిటీ అండ్ డెబ్ట్‌ అనే గ్రంథంలో రాశారు. 90 ఏళ్లు దాటినా ఆ వ్యాఖ్యానంలో పెద్ద‌గా మార్పు రాలేదు. భారీ నీటిపారుద‌ల ప్రాజెక్టులు, హ‌రిత విప్ల‌వం, క్షీర విప్ల‌వం వ‌చ్చి దేశవ్యాప్తంగా సాగునీటి వ‌స‌తులు మెరుగుప‌డి పంట, పాడి ఉత్ప‌త్తులు పెరిగినా ఎప్ప‌టికప్పుడు సాగు రంగం కొత్త కొత్త స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూనే ఉంది. పంట‌ పెట్టుబ‌డులు అధికం అవ‌డం, ప్ర‌పంచీక‌ర‌ణ‌తో ఇత‌ర దేశాల నుంచి భారీ మొత్తంలో పంట ఉత్ప‌త్తుల దిగుబ‌డులతో మ‌న పంట‌ల‌కు ధ‌ర‌లు ప‌డిపోవ‌డం, త‌రాలు మారుతున్న కొద్ది సాగుభూములు విభజ‌నకు గురై రెండెక‌రాల్లోపు భూమి మాత్ర‌మే స‌గ‌టున రైతు కుటుంబాల‌కు ద‌క్కుతుండ‌డంతో సాగులో మిగులుబాటు క‌ష్టమైపోతోంది. ఫ‌లితంగా రైతు కుటుంబాలు నిరంత‌రం అప్పుల్లో కునారిల్లుతున్నాయి.


అప్పుల ఊబి నుంచి రైతు కుటుంబాల‌కు విముక్తి క‌ల్పించాల‌నే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం రుణ‌మాఫీ ప్ర‌క‌టించింది. రైతు కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న అప్పులు మాఫీ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు జూలై 18న రూ.ల‌క్ష వ‌ర‌కు రుణాలున్న 11,50,193 మంది రైతుల ఖాతాల్లో రూ.6,098.93కోట్లు జ‌మ చేశారు. వారంద‌రినీ ఒక్క‌సారిగా రుణ విముక్తుల‌ను చేశారు. తాజాగా రూ.1.50ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలున్న 6.40ల‌క్ష‌ల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6,198కోట్లు జ‌మ చేశారు. మొత్తంగా 12 రోజుల వ్య‌వ‌ధిలోనే సుమారు 18 ల‌క్ష‌ల రైతు కుటుంబాల‌కు చెందిన రూ.12,296 కోట్ల మేర రుణాల‌ను పూర్తిగా మాఫీ చేశారు. రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీని ఆగ‌స్టులో పూర్తి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే చెల్లించిన రూ.12 వేల కోట్ల‌కుపైగా నిధుల‌కు మ‌రో రూ.19 వేల కోట్ల‌ను క‌లిపి రుణ‌మాఫీకి ప్ర‌జా ప్ర‌భుత్వం వెచ్చించ‌నుంది. స్వాతంత్య్ర భార‌తదేశ చ‌రిత్ర‌లోనే ఇది సువ‌ర్ణాక్షరాల‌తో లిఖించే చ‌రిత్ర‌.

సాగును బాగు చేస్తామంటూ, త‌మ పాల‌నా కాలం స్వ‌ర్ణ‌యుగం అని చెప్పుకుంటున్న ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత‌లు, నిన్న‌టి పాల‌కులు అప్పుల ఊబి నుంచి రైతును బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు చేసింది శూన్యం. రైతులంద‌రికీ రూ.ల‌క్ష రుణ‌మాఫీ హామీతో 2014లో ప్ర‌త్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్‌) అధికారంలోకి వ‌చ్చింది. మిగులు బ‌డ్జెట్‌తో ఏర్ప‌డిన రాష్ట్రం కావ‌డంతో ఒకేసారి రుణ‌మాఫీ చేస్తార‌ని అన్న‌దాత‌లు ఎంత‌గానో ఆశించారు. వారి ఆశ‌ల‌ను ఆడియాశ‌లు చేస్తూ నాలుగేళ్ల పాటు విడ‌త‌ల వారీగా రుణ‌మాఫీ ప్ర‌క్రియ‌ను సాగించారు. 2018లోనూ మ‌రోసారి రూ.ల‌క్ష రుణ‌మాఫీ ప్ర‌క‌టించిన నాటి ప్ర‌భుత్వం తొలిసారే మాదిరి మ‌ళ్లీ నాలుగు విడ‌త‌లుగా రుణ‌మాఫీని చేసింది. తొలి ద‌ఫా రూ.16 వేల కోట్లు, మ‌లి ద‌ఫా రూ.12వేల కోట్ల‌ను రుణ‌మాఫీకి కేటాయించారు. ఈ నిధుల‌ను ఏక కాలంలో కేటాయించ‌క‌పోవ‌డం, విడ‌త‌ల‌వారీగా కేటాయించ‌డంతో రైతులు వ‌డ్డీలు, వ‌డ్డీల‌కు వ‌డ్డీలు క‌ట్టాల్సి వ‌చ్చింది. ఫ‌లితంగా ల‌క్ష‌లాది మంది రైతులు రుణ విముక్తులు కాకుండానే మిగిలిపోయారు. త‌మ ప‌దేళ్ల పాల‌నా కాలంలో ఏనాడూ ఏక‌కాలంలో రుణ‌మాఫీ చేయలేనివారు, ఒకే ద‌ఫా రుణ‌మాఫీ చేస్తున్న ప్రజా ప్ర‌భుత్వంపైనా, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపైనా విమ‌ర్శ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దం!


దేశంలో రైతు రుణ‌మాఫీ చ‌రిత్ర‌ను చూసుకుంటే ప్ర‌స్తుత ప్ర‌జా ప్ర‌భుత్వం ఎదుర్కొంటున్నన్ని ప్ర‌తికూల‌త‌ల‌ను మ‌రే ప్ర‌భుత్వం ఎదుర్కొలేదు. 1987లో దేశంలో తొలిసారి హ‌ర్యానాలో నాటి ముఖ్య‌మంత్రి దేవీలాల్ రుణ‌మాఫీ చేశారు. ఆ మొత్తం రూ.227 కోట్లు మాత్ర‌మే. 1990లో నాటి ప్ర‌ధాన‌మంత్రి వి.పి.సింగ్ రైతులు ఎదుర్కొంటున్న రుణభారం నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్గించేందుకు రూ.10వేల చొప్పున రుణ‌మాఫీ చేశారు. నాడు దేశ‌వ్యాప్తంగా చేసిన రుణ‌మాఫీ రూ.7,825 కోట్లు మాత్ర‌మే. త‌ర్వాత 2008లో యూపీఏ–1 హ‌యాంలో మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌ధానమంత్రిగా ఉన్న‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా రూ.60 వేల కోట్లు రుణ‌మాఫీ చేశారు. ఇందులో భాగంగానే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రుణ‌మాఫీ జ‌రిగింది. నాడు ఉమ్మ‌డి రాష్ట్రంలో 60 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.11,100 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. తెలంగాణ వ‌ర‌కు చూసుకుంటే రూ.5వేల కోట్ల‌కు మించ‌వు. ఆ రెండుసార్లు కేంద్ర ప్ర‌భుత్వ‌మే రుణ‌మాఫీ చేయ‌డంతో రాష్ట్రాల‌పై భారం ప‌డ‌లేదు. 2008లో రుణ‌మాఫీ స‌మ‌యంలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌భుత్వ‌మే ఉండ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు నాటి ప్ర‌భుత్వం రూ.ల‌క్ష రుణ‌మాఫీకి హామీ ఇచ్చింది. మిగులు బ‌డ్జెట్‌తో ఏర్ప‌డిన నూతన రాష్ట్రంలో ఏక‌కాలంలో ఆ హామీ నెర‌వేర్చ‌డానికి పెద్ద‌గా ఇబ్బంది లేదు. అయిన‌ప్ప‌టికీ రైతుల‌ను రుణ విముక్తుల‌ను చేసేందుకు నాటి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు మ‌న‌సొప్ప‌లేదు. రెండు ద‌ఫాలు అధికారం చేప‌ట్టినా ఎప్పుడూ ఏక‌కాలంలో రుణ‌మాఫీ చేయ‌లేదు. రెండో ద‌ఫా పాల‌నా కాలంలో ఆల‌స్యం చేస్తూ చివ‌ర‌కు రూ.8వేల కోట్ల రుణాల‌ను మాఫీ చేయ‌నేలేదు. మొత్తంగా ప‌దేళ్ల‌లో ఎనిమిది విడతలుగా రుణ‌మాఫీ చేయ‌డంతో వ‌డ్డీల‌ భారం పెరిగిపోయి రైతుల అప్పులు తీర‌నేలేదు. అప్పుల భారంతో ప‌లువురు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.


ప్ర‌స్తుతం అందుకు విరుద్ధ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గ‌త పాల‌కుని ప‌దేళ్ల పాల‌న త‌ర్వాత రూ.ఏడు లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం మిగిలింది. ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మ‌రుక్ష‌ణం నుంచే సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు మొద‌లైంది. మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా, 200 యూనిట్ల‌లోపు ఉచిత విద్యుత్‌తో పాటు రైతు భ‌రోసాను ప్రభుత్వం అంద‌జేసింది. ఏడు నెల‌ల పాల‌నా కాలంలోనే రూ.30 వేల కోట్ల సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేసింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దివాళా తీసినా ఒక్కో పైసా కూడ‌బెట్టి అన్న‌దాత‌పై అప్పు భారం తీర్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గ‌ట్టి ప‌ట్టుప‌ట్టారు. ఫ‌లిత‌ంగానే పన్నెండు రోజుల వ్య‌వ‌ధిలోనే సుమారు 18 ల‌క్ష‌ల రైతు కుటుంబాల‌కు చెందిన రూ.12,296కోట్ల అప్పులు తీరిపోయాయి. ఆగ‌స్టులో మ‌రో 15 ల‌క్ష‌ల మంది రైతులు రుణ విముక్తులు కానున్నారు. వారికి చెందిన సుమారు రూ.19వేల కోట్ల‌కు పైగా రుణాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం మాఫీ చేయ‌నుంది. జీతాలు ఇవ్వ‌లేని దుస్థితిలో పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూనే రైతుల‌పై త‌న‌కున్న ప్రేమ‌, అంకుఠిత దీక్ష‌తో ప‌ట్టుప‌ట్టి రుణ‌మాఫీ చేశారు. ల‌క్ష‌లాది రైతు కుటుంబాల‌కు పెద్ద కొడుకుగా మారారు.


రైతు బిడ్డ‌గా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డికి రైతు స‌మస్యలపై సంపూర్ణ అవ‌గాహ‌న ఉంది. జ‌డ్పీటీసీ స‌భ్యుని నుంచి ముఖ్య‌మంత్రి వ‌ర‌కు ఎదిగిన ఆయ‌న‌కు క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌పై గట్టి పట్టు ఉంది. పాద‌యాత్ర స‌మ‌యంలో రైతుల రుణ‌భారంపై పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఆ అవ‌గాహ‌న నుంచి వ‌చ్చిన ఆలోచన‌తోనే రుణ‌మాఫీకి హామీ ఇచ్చారు. ఎన్ని అడ్డంకులున్నా వాటిని అధిగ‌మించి రుణ‌మాఫీ చేసి చూపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రైతు నేత‌లుగా గుర్తింపు పొందిన వారంతా రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పోరాడారు. కొంత‌మేర తీర్చ‌గ‌లిగారు. కానీ రేవంత్ రెడ్డి అంత‌కు మించి ఒక్క‌సారిగా రైతుల రుణ‌భారాన్ని సంపూర్ణంగా తొల‌గించారు. ప్ర‌తి రైతు కుటుంబపు దిగులును తొలగించారు. జాతిపిత మ‌హాత్మాగాంధీ చెప్పిన భార‌తీయ ఆత్మ‌ను పూర్తిగా సంతోష‌పెట్టారు.

దూదిపాళ్ల విజ‌యకుమార్‌

ముఖ్య‌మంత్రి ప్ర‌జా సంబంధాల అధికారి

Updated Date - Jul 31 , 2024 | 02:01 AM