Share News

హై స్కూల్ ప్లస్‌లో అన్నీ మైనస్‌లే!

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:37 AM

విద్యా సంస్కరణలలో భాగంగా 2022–23 విద్యా సంవత్సరం నుంచి హై స్కూల్ ప్లస్ పేరుతో ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. తదనుగుణంగా రాష్ట్రంలోని 292 ఉన్నత పాఠశాలల్లో బాలికల హై స్కూల్ ప్లస్‌లు ఏర్పడ్డాయి...

హై స్కూల్ ప్లస్‌లో అన్నీ మైనస్‌లే!

విద్యా సంస్కరణలలో భాగంగా 2022–23 విద్యా సంవత్సరం నుంచి హై స్కూల్ ప్లస్ పేరుతో ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. తదనుగుణంగా రాష్ట్రంలోని 292 ఉన్నత పాఠశాలల్లో బాలికల హై స్కూల్ ప్లస్‌లు ఏర్పడ్డాయి. బోధన సిబ్బందిని నియమించడం వల్ల 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ క్లాసులు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. 2024–25 విద్యా సంవత్సరం నుంచి కో–ఎడ్యుకేషన్ హై స్కూల్ ప్లస్ ఏర్పాటుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీనికి గాను 296 మండలాల్లో అవి ప్రారంభం కానున్నాయి. సంకల్పం దృఢంగా ఉన్నప్పటికీ సఫలం కాలేకపోవడానికి అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. సిబ్బంది నియామకం నుంచి నిర్వహణ వరకు అన్ని సమస్యలే.

హై స్కూల్ ప్లస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్మీడియట్ విద్య నిర్వహణ కోసం ప్రత్యేకమైన సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పవచ్చు. ప్రత్యేకమైన భవన నిర్మాణాలు, ఆట స్థలాలు, లాబులు, శాశ్వత ప్రాతిపదిక సిబ్బంది, బోధనేతర సిబ్బందిని కల్పించలేదు. చివరికి వ్యాయామ ఉపాధ్యాయుడు లేకుండా తూతూ మంత్రంగా హై స్కూల్ ప్లస్‌లు ప్రారంభమైనవి. నిర్వహణ గ్రాంట్ లేకపోవడం ఆలోచించదగ్గ విషయం. అందుకే వీటిలో చేరుటకు విద్యార్థులలో అనాసక్తి చూపడం వల్లే ఆశించిన రీతిలో ప్రవేశాలు జరగలేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలో తగిన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. స్కూల్ ప్లస్‌కు ప్రత్యేకంగా ప్రధానాచార్యులు లేకపోవడం వల్ల పరిపాలనపరంగా కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి.

పాఠశాల విద్యలో కొనసాగుతున్న ఇంటర్ కోర్సు ఇంటర్మీడియట్ విద్య విభాగం ఇచ్చే ఆదేశాలు కొన్ని అనుసరించక తప్పడం లేదు. దీంతో పాఠశాల విద్య ఇంటర్ విద్య విభాగాలకు పొంతన కుదరడం లేదు. ఇంటర్మీడియట్ విద్యా విభాగం సూచనల మేరకు బోధనా సిబ్బంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రమే బోధించినప్పుడే సరైన న్యాయం జరుగుతుంది కానీ హై స్కూల్ ప్లస్‌లో నియమింపబడ్డ బోధనా సిబ్బంది 9 నుంచి 12వ తరగతి వరకు బోధించడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటికి సరైన అకాడమిక్‌ క్యాలెండర్ లేకపోవడం చర్చించదగ్గ విషయం.

సివి ప్రసాద్

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఏపీటీఎఫ్ అమరావతి

Updated Date - Apr 03 , 2024 | 02:37 AM