Share News

ప్రతి ఫాసిస్టుకి సత్యంతో పేచీ ఉంటది

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:27 AM

నన్ను ఇలా పరిచయం చేస్తున్నందుకు, మొట్టమొదట మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. తెలంగాణ ప్రజలతో నాకు సరికొత్త గాడానుబంధం ఉందని భావిస్తాను. అది ఏమిటంటే చెప్పలేనేమో కానీ...

ప్రతి ఫాసిస్టుకి సత్యంతో పేచీ ఉంటది

మౌమితా ఆలం : పలకరింపు

తెలుగు ప్రజలకూ, బెంగాలీ సాహిత్యానికీ అవినాభావ సంబంధం ఉంది. ఠాగూర్‌, బంకించంద్ర చటర్జీ, శరత్‌ బాబులు ఇక్కడ ఇంటింటికి పరిచయ మయ్యారు. ఇప్పుడు మీ కవిత్వం తెలుగులోకి అనువాదం అయింది. ఎలా ఫీలవుతున్నారు?

నన్ను ఇలా పరిచయం చేస్తున్నందుకు, మొట్టమొదట మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. తెలంగాణ ప్రజలతో నాకు సరికొత్త గాడానుబంధం ఉందని భావిస్తాను. అది ఏమిటంటే చెప్పలేనేమో కానీ రమాసుందరి (మాతృక ఎడిటర్‌), ఉదయమిత్ర, వేణుగోపాల్‌, వరవరరావు లాంటి వారల సహచర్యంతో, నాకు నా సొంత గడ్డమీద ఉన్నట్లే అనిపిస్తది. మీకు ఒక విషయం చెప్పాలి నా మొదటి పుస్తకం ‘ఖీజ్ఛి కఠటజీుఽజట ౌజ ్టజ్ఛి ఈ్చటజు’ 2019లో అచ్చయినప్పుడు, రమాసుందరి మొదటి ప్రతిని ఫేస్‌బుక్‌లో ఉంచి, ప్రపంచానికి నన్ను పరిచయం చేశారు. ఆమె నాకు ఔ్చుఽజఠ్చజ్ఛ ౌజ ్క్చజీుఽట కవితను ఆడియో చేసి పంపారు. ఆ కవిత చదువుతూ, ఆమె కళ్ళు చెమర్చడం ఒక మర్చిపోలేని అనుభూతి. తెలంగాణ ప్రజలతో నాకున్న భావోద్వేగ అనుబంధం ఇటువంటిదే.

మీరు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు కదా. మీరు ఉంటున్న ‘సిలిగురి’ కూడా వెనుకబడ్డ ప్రాంతమే. అయినా మీకు జాతీయ, అంతర్జాతీయ అంశాలమీద ఈ పట్టు ఎలా వచ్చింది?

నేను ఉత్తర బెంగాల్లోని మారుమూల ప్రాంతం నుండి వొచ్చాను. అది పూర్తిగా లోతట్టు ప్రాంతం. ‘తీస్తా’ నది ఒడ్డున నివసించేదాన్ని. అక్కడే పుట్టి పెరిగాను. బాల్య మంతా అమ్మమ్మ, పిన్నమ్మ సాన్నిహిత్యంలో గడిచిపో యింది. నాకు మా అమ్మా నాయనలతో పెద్ద అనుబంధాలు ఏమి లేవు. వాళ్లు ఒక లోతట్టు ప్రాంతంలోని టీ తోటల్లో పనిచేసేవాళ్ళు. చిన్నప్పటినుంచి మా ‘కాలా’ (పిన్ని) నా చదువుపట్ల శ్రద్ధ వహించేది. మా ఊరికి 20కి.మీ. దూరంలో గల స్కూలులో నాకు అడ్మిషన్‌ దొరికింది (1996-97). ప్రయాణమంతా దారుణంగా ఉండేది. నేను సైకిల్‌ నేర్చుకునే దాకా, రెండు కిలోమీటర్లు బురద బాటలో నడిచి, ఆ తర్వాత ఒక రిక్షా తీసుకొని బస్టాండ్‌కు చేరుకునేదాన్ని. కానీ, ఆ ప్రయాణమే తర్వాతి కాలంలో, ఒక వరంగా మారింది. స్కూలుకు వచ్చి పోయేటప్పుడు, అక్కడి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడేదాన్ని. వాళ్లు కూడా నాతో అంతే ఆప్యాయంగా ఉండేవాళ్ళు. ఆ పల్లె జనాల వల్లనే నాకు దయ, దృఢత్వం, నిరాడంబరత అబ్బినాయి. ప్రజలతో గల ఈ సాన్నిహిత్యమే నాకు రాజకీయ స్పృహను కలిగించింది.

పట్టణంలో డిగ్రీ పూర్తి చేశాను. ఈ లోపున మా చిన్నమ్మ పెళ్లయిపోయింది. ఆమె భర్త (వరుసకు చిన్నాయన) సరాసరి మా ఇంటికి వచ్చేసాడు. ఇంట్లోకి అతగాడి ప్రవేశంతో నా జీవితం దుర్భరమైపోయింది. భయంకర బాధల పల్లవి నా బాల్యం. కళ్ళు మూసుకుంటే చాలు, ఇప్పటికీ అది నన్ను వెంటాడుతది. అసలు నాకు బాల్యం అనేది లేకుంటేనే బాగుండును అనిపించేది. అర్ధరాత్రి నన్ను లైంగికానందం కోసం తడిమే ఆ హంతక హస్తాలు ఇప్పటికీ వెంటాడుతున్నట్టు అనిపించి రాత్రులు నిద్ర పట్టదు.

ఇంగ్లీష్‌ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ చేశాను. మూడేళ్ళకు టీచర్‌ని అయ్యాను. ఆ క్రమంలోనే, నేను ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లాడాను. నా కుటుంబం ఒప్పుకోక పోవడంతో వాళ్లతో అన్ని సంబంధాలు తెగిపోయాయి. పోనీ కాపుర మైనా నిలుస్తదేమో అనుకుంటే, అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. నిత్యం తిట్లతో, హింసతో కాపురం నిత్యాగ్ని గుండమైంది. నాకు 2019లో విడాకులు వచ్చినా, 2017నుండి నేను నా భర్తతో విడిపోయే ఉన్నాను. నాకు ఎనిమిదేళ్ళ పాప ఉంది. తానే నా సర్వస్వం నేను కాలేజీ చదివేటప్పుడు బుక్స్‌ కొనడానికి సరిగా డబ్బులు ఉండేవి కావు. ఉద్యోగం వచ్చాక పుస్తకాలు కొని బాగా చదవడం మొదలు పెట్టాను. ఆ ప్రయాణం కొనసాగింది. నా కలహాల కాపురంలో పుస్తక పఠనం ఒక ఉపశమనంగా ఉండేది.

మీరు చాలా సాహసంగా రచనలు చేస్తున్నారు. పబ్లిషర్స్‌తో సమస్యలు ఏమీ ఉండవా?

ప్రతి ఫాసిస్టుకి సత్యంతో పేచీ ఉంటది. నేను రాస్తున్నా నంటే నడుస్తున్న కాలానికి ప్రతినిధిగా రాస్తున్నా. సంతోషకర మైన విషయం ఏమిటంటే, ఇప్పటికీ కొన్ని పత్రికల్లో నిరసన కవితలకు చోటు దొరుకుతున్నది. ‘ద వైర్‌’, ‘అవుట్‌లుక్‌’, ‘కౌంటర్‌ కరెంట్స్‌’, ‘నాగరిక్‌.నెట్‌’, ‘ఉత్తర్‌ భాంగా సంబత్‌’ లాంటివి నా కవితల్ని వేసుకుంటున్నాయి ఎన్‌. రవిశంకర్‌ గారు నా కవితలకు చేసిన అనువాదాన్ని కొన్ని మలయాళ పత్రికలు స్వీకరిస్తున్నాయి. తెలుగులోనైతే ‘మాతృక’ నాకు మొదటి నుంచి గొప్ప మద్దతుగా నిలుస్తోంది.

మామూలు పదాలతో ఇంత క్లిష్టమైన విషయాలను ఎలా చెప్పగలుగుతున్నారు? మీపై ప్రభావాలు?

నా కవితలు జోల పాటలు కావు. అవి ప్రజల్ని చైతన్యం చేయడానికి రాసినవి. నా పదాలకు కార్మికుల, కర్షకుల, దగా పడ్డ మహిళల చెమట వాసన ఉంటది. నా అక్షరాలు నా చుట్టూ జరిగే హింసకు నిరంతర సాక్ష్యాలు. కులం, మతం, వర్గం, జెండర్‌ పేరు మీద నా చుట్టూ హింస అల్లుకుంటు న్నది. నన్నెవరు ప్రభావితం చేశారు అనేది చెప్పడం కష్టమే. కానీ, అరుంధతీరాయ్‌, ఆగా షాహిద్‌ అలీ, వరవరరావు, నాజుల్‌ ఇస్లాం... మొదలైన వాళ్ళ రచనల్ని ఇష్టంగా చదువుకుంటాను

ఇప్పుడు కుల, మత, భాషల్లో ఆధిపత్య ధోరణులు ఎక్కువయ్యాయి. జెండర్‌ వివక్ష కొనసాగుతూనే ఉంది. దీనికి పరిష్కారం ఏమిటి?

నేను రాజకీయ నాయకురాల్ని కాదు. కానీ రాజకీయ స్పృహ కలిగిన ఓ కవయిత్రిగా, వ్యాస రచయిత్రిగా నేను చెప్పేది ఏమంటే, కేవలం వర్గ స్పృహ కలిగిన రాజకీయాలు మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలవు. సరైన మార్గంలో నడిపించగలవు

మతోన్మాద రాజకీయ వాతావరణంలో, ఒక ముస్లిం మహిళగా మీరెట్లా ఫీల్‌ అవుతున్నారు. నిత్యం వెంటాడబడి, వేధించబడి, హత్యకు గురయ్యే మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటి?

ఇప్పుడు ముస్లిం మహిళల పరిస్థితి అతిదారుణంగా ఉంది. చాలా వివక్షను ఎదుర్కొంటున్నారు. రోజురోజుకి మతోన్మాదుల చేతుల్లో ముస్లిం మహిళలు బలవుతున్నారు. ‘బుల్లి భాయ్‌ సుల్లి డీల్స్‌’ యాప్‌ వంటి నీచ నికృష్టమైన యాప్స్‌ని చూస్తున్నాం. ఫాసిజం యొక్క అనేక పార్శ్వాలు మమ్మల్ని, మా కలల్ని ధ్వంసం చేస్తున్నాయి. ఒక ముస్లిం మహిళగా మమ్మల్ని చిన్నచూపు చూడడం మాకు ఎరుకనే. అది మా వెన్ను మీద పాము పారాడినట్లుంటుంది. కానీ సాధ్యమైనంతగా ఎదిరించాలి. చదువుకునే విషయంలో మనం వెనుకంజ వేయొద్దు. విద్యాధికులైన మహిళలు ముందుకొచ్చి, అట్టడుగున అవమానాలకు గురవుతున్న ముస్లిం మహిళలకు చేయూతను ఇవ్వాలి. జ్ఞానమే ఆయుధంగా ఫాసిస్టులను ఓడించాలి. ఎందుకంటే ఫాసిజానికి అజ్ఞానమే ఆధారం.

మీరు ఇప్పుడు నవ యువ కవులకు ప్రతినిధి గదా. వాళ్లకూ, అంతిమంగా తెలుగు వాళ్లకూ మీరిచ్చే సందేశం ఏమిటి?

ప్రపంచం రక్తమోడుతుంటే, చంద్రుని అందం మీద పద్యం రాయొద్దన్నదే నా సందేశం.

ఇంటర్వ్యూ, అనువాదం: ఉదయ మిత్ర

(ఉదయమిత్ర అనువాదంలో మౌమితా ఆలం కవిత్వం

‘రాయగూడని పద్యం’ సంపుటిగా ఇటీవల విడుదలైంది)

Updated Date - Mar 18 , 2024 | 06:27 AM