Share News

దోపిడీ గురువుల నీతి ప్రవచనాలు

ABN , Publish Date - May 04 , 2024 | 04:50 AM

తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట అక్రమ వసూళ్లు చేసి ఢిల్లీకి పెద్ద వాటాను నల్లధనం రూపంలో తరలిస్తున్నారని తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ...

దోపిడీ గురువుల నీతి ప్రవచనాలు

తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట అక్రమ వసూళ్లు చేసి ఢిల్లీకి పెద్ద వాటాను నల్లధనం రూపంలో తరలిస్తున్నారని తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. వెంటనే రేవంత్‌పై విచారణకు ఆదేశించాలని, ఈడీని, ఐటీని దించాలంటూ కేసీఆర్‌ ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌ మిలాఖత్‌ కాకపోతే ఆయన వ్యాఖ్యానించిన వెంటనే ఈయన ఎందుకు సమర్థిస్తూ మాట్లాడతారు. ఏ ఆధారాలు లేకుండా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఎలా మాట్లాడతారు? అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న మోదీ, కేసీఆర్‌ సుద్దపూసల బండారం ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టిపెట్టిన కేసీఆర్‌ మహారాష్ట్రకు వెళ్లి ఎన్‌సీపీకి చెందిన మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌కు రూ.10కోట్లు ఇచ్చి బీఆర్‌ఎస్‌ కండువా కప్పారు. కేసీఆర్‌ వంటి అథమ స్థాయి నాయకుడిని ఇంతవరకు చూడలేదని శరద్‌పవార్‌ అన్నారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరించడం కోసం అక్కడి నాయకులకు కేసీఆర్‌ భారీగా డబ్బు ముట్టజెప్పి తన పార్టీలో చేర్చుకున్నారని, అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కోసం ఒక విమానాన్ని కొనుగోలు చేశారని ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో జగన్‌కు భారీగా ఆర్థిక సహాయం అందించారని, అదేవిధంగా కుమారస్వామికి కూడా సహాయం అందించినట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ పొత్తుపెట్టుకోకుండా ఉంటే ఆయనకు రూ.వెయ్యి కోట్లు ఇస్తానని ఆఫర్‌ చేసినట్లు కూడా వార్తలు చదివాం. హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికలలో కేసీఆర్‌ పెట్టిన ఖర్చును చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఎంత అవినీతికి పాల్పడకపోతే ఒక్కో నియోజకవర్గంలో రూ.500 కోట్ల చొప్పున కేసీఆర్‌ ఖర్చు పెట్టారు? అలాగే తెలంగాణలోని ప్రతి జిల్లాలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి బీఆర్‌ఎస్‌ పార్టీకి అన్ని వసతులతో కార్యాలయాలను కేసీఆర్‌ నిర్మించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా కార్యాలయాలను నిర్మించుకోలేదు.


డబ్బును వెదజల్లి ఇతర పార్టీ నాయకులను పార్టీలు ఫిరాయించేలా చేసుకుంటూ ధన రాజకీయం చేస్తున్న వ్యక్తి కేసీఆర్‌. 2024 ఎన్నికల్లో విపక్ష కూటమికి తనను ఛైర్మన్‌ను చేస్తే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలకు అయ్యే ఎన్నికల ఖర్చు మొత్తాన్ని భరించేందుకు తాను సిద్ధమని కేసీఆర్‌ ఓ ప్రైవేట్‌ సమావేశంలో తన సహచరులతో చెప్పినట్లు ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఓ వీడియో ద్వారా ఏప్రిల్‌, 2023లో బయటపెట్టారు. 2014లో ఎన్నికల ఖర్చుల కోసం అప్పులు చేసిన కేసీఆర్‌.. తొమ్మిదేళ్లు గడిచేటప్పటికి దేశం మొత్తం ఎన్నికల ఖర్చు భరించే స్థాయికి చేరుకున్నారంటే ఎన్ని లక్షల కోట్లు అక్రమంగా గడించారో!

2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశం మొత్తం మీద రూ.60వేల కోట్లు ఖర్చయ్యాయని, దానిలో బీజేపీ 45 నుంచి 50శాతం వరకు వ్యయం చేసిందని, కాంగ్రెస్‌ కూటమి కేవలం 15 నుంచి 20శాతం మాత్రమే ఖర్చు చేసిందని, దేశంలో జరుగుతున్న ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు లెక్కకడుతున్న సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌–ఢిల్లీ) అధినేత ఎన్‌.భాస్కర్‌రావు తెలిపారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం ఎన్నికల ఖర్చు రూ.1.35లక్షల కోట్లకు చేరుకుంటుందని ఈ సంస్థ తెలిపింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 45శాతం ఎన్నికల ఖర్చు చేసిందనుకుంటే.. ఇప్పుడు దేశం మొత్తం మీద ఎన్నికల ఖర్చు కేసీఆర్‌ భరిస్తానని చెబుతున్నారంటే.. రూ.60 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్‌ ఎంత డబ్బు సంపాదించి ఉంటే.. దానిలోంచి ఇంత సొమ్ము ఖర్చు చేస్తారు? తెలంగాణను నిలువు దోపిడీ చేసి, అడుగడుగునా కుంభకోణాలకు పాల్పడకపోతే కేసీఆర్‌కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?


కేసీఆర్‌ కుటుంబం హైదరాబాద్‌ సిటీ చుట్టుపక్కల వేల ఎకరాల అత్యంత ఖరీదైన భూములను కబ్జా చేసి వేలాది కోట్లు ఆర్జించిందని, కేసీఆర్‌ కుటుంబం సంపాదించినంత డబ్బు చరిత్రలో మరెవరూ సంపాదించలేదని గత ఎన్నికలకు ముందు ప్రజలు కథలు కథలుగా చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 30 నుంచి 40వేల కోట్లు, మిషన్‌ భగీరథలో తక్కువలో తక్కువగా 10వేల కోట్లు సంపాదించారని ప్రజలు చెప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో ఓడిపోవటానికి ఈ అవినీతే ప్రధాన కారణం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జిల్లాల నుంచి రాజధాని వరకు యధేచ్ఛగా వేల ఎకరాలు దోపిడీకి పాల్పడి, ఎన్నికల్లో వందల కోట్లు వెదజల్లారు. అయినా ప్రజల చేతిలో ఓటమి తప్పలేదు.

ఎన్నికల్లో ఖర్చుకోసం ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ను మోదీ తీసుకొచ్చారు. ఈ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.6986.5 కోట్లు నిధులు రాగా, కాంగ్రెస్‌కు రూ.1334 కోట్లు, బీఆర్‌ఎస్‌కు రూ.1332 కోట్లు విరాళాలుగా వచ్చాయి. జాతీయ స్థాయి కాంగ్రెస్‌ పార్టీతో సమానంగా బీఆర్‌ఎస్‌కు నిధులు అందాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి కంపెనీలను బెదిరించి బీజేపీ బాండ్లను కొనుగోలు చేయించింది. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖల దర్యాప్తును ఎదుర్కొంటున్న 41 కంపెనీలు బీజేపీకి రూ.471 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చాయి. ఈ సంస్థల్లో సోదాలు జరిగాక వచ్చిన విరాళాలు రూ.1698 కోట్లు. ఎన్నికల బాండ్ల రూపంలో కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు 2013–23 మధ్యకాలంలో అందిన నిధులు రూ.7726 కోట్లు. దీనిలో సింహభాగం 64.7 శాతం బీజేపీకి అందాయని ఈసీని ఉటంకిస్తూ బిజినెస్‌ లైన్‌ వార్తా కథనం ప్రచురించింది. దీనిలో కాంగ్రెస్‌కు 10.7 శాతం మాత్రమే నిధులు అందాయి.

ఈ ఎలక్టోరల్‌ బాండ్లు అంతర్జాతీయ స్థాయి దోపిడీ రాకెట్‌ అని రాహుల్‌ చెప్పగా, ఈ బాండ్లతోనే బ్లాక్‌మనీ కట్టడి అవుతుందని మోదీ చెప్పారు. అయితే ఈ ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, అధికారంలో ఉన్న పార్టీలు దీనితో బెదిరింపులకు పాల్పడతాయని చెబుతూ ఈ పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.


ఈ బాండ్ల ద్వారా పార్టీలకు వచ్చిన విరాళాలపై దర్యాప్తునకు కేసీఆర్‌, మోదీ సిద్ధమా? ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై మోదీ మాట్లాడగానే ఈడీ, సీబీఐలతో దర్యాప్తు జరిపించాలని కేసీఆర్‌ కోరారు. దేశం మొత్తం ఎన్నికల ఖర్చు పెడతానని కేసీఆర్‌ చెప్పారు కదా! దీనిపై కూడా సీబీఐ దర్యాప్తునకు ఆయన సిద్ధమా? దేశంలో ఉన్న పోర్టులు, ఎయిర్‌పోర్టులన్నీ అదానీకి కట్టబెట్టడం వెనుక నిధులు దండుకునే వ్యూహం ఏమీ లేదా? కంపెనీలను బెదిరించి మోదీ–కేసీఆర్‌లు వేలకోట్లు దండుకొని కాంగ్రెస్‌పై ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అంటూ మిత్రులిద్దరూ దాడికి దిగుతున్నారు.

తాను బతికున్నంత కాలం ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వనని మోదీ అంటున్నారు. మరి దీనిపై వెంటనే కేసీఆర్‌ ఎందుకు స్పందించడంలేదు? అంటే ఆయన కూడా మోదీ వ్యాఖ్యలకు మద్దతిస్తున్నట్లే కదా! గత వారం రోజులుగా ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే దేశ సంపదంతా ముస్లింలకు పంచి పెడుతుందని అంటున్నారు. మోదీపై కేసీఆర్‌ ఉత్తుత్తి విమర్శలు రకరకాలుగా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వటం లేదని, పునర్విభజన చట్టంలో పొందుపర్చిన ఏ హామీలు నెరవేర్చడం లేదంటూ విమర్శలు చేశారు. కానీ, ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ చేసిన విమర్శలను కేసీఆర్‌ ఎందుకు ఖండించటం లేదు? ఆయనే కాదు బీఆర్‌ఎస్‌ నాయకులెవరూ ఇంతవరకు దీనిపై స్పందించటం లేదంటే వారు కూడా మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లే కదా!

అద్దంకి దయాకర్‌

ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ

Updated Date - May 04 , 2024 | 04:50 AM