భద్ర భవిష్యత్తుకు పర్యావరణ భోగట్టా
ABN , Publish Date - Jun 07 , 2024 | 03:45 AM
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వారి ప్రత్యేక డేటాసెట్ సిరీస్‌లోని 9వ eBook ‘State of India’s Environment 2024 : In Figures’. దేశ పర్యావరణ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించేందుకు..

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వారి ప్రత్యేక డేటాసెట్ సిరీస్‌లోని 9వ eBook ‘State of India’s Environment 2024 : In Figures’. దేశ పర్యావరణ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించేందుకు పర్యావరణ సంబంధిత సమాచారం లేదా ఆధార సామగ్రికి ప్రథమ ప్రాధాన్యమిచ్చిన వార్షిక నివేదిక ఇది. పర్యావరణ వ్యవస్థల నిర్దిష్ట పరిస్థితిని సంఖ్యల ద్వారా తెలియజేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పర్యావరణ భోగట్టా. సమస్యలను నిశితంగా, సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉపకరించే సమాచారమిది. సమస్య పరిష్కారానికి దోహదం చేసే కార్యాచరణకు ప్రేరణనిస్తుంది. పర్యావరణ విపత్తులను నివారించడంలో సదరు కార్యచరణ చాలా కీలకమైనది.
నేను నివసిస్తున్న న్యూఢిల్లీ నగరంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించిపోయిన సందర్భంలో నేను ఇది రాస్తున్నాను. ‘కంచు వృషభముల అగ్ని శ్వాసం క్రక్కే గ్రీష్మం’ను న్యూఢిల్లీ వాసులు చవిచూస్తున్నారు. ఇదిలా వుంటే నీటి సంక్షోభం కూడా ముంచుకొస్తున్నట్టు అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ చండ్రగాడ్పులలోనే శ్రమించక తప్పని కూలీ, మాలీ, కార్మికుల తిప్పలు మాటల్లో చెప్పగలమా? వారు ఆ వేడిని భరించక తప్పదు. ఆ శ్రమ జీవుల అవస్థలు అర్థం చేసుకోవాలంటే మారుతోన్న వాతావరణం నుంచి ఉత్పన్నమవుతున్న సంక్షోభాలను అర్థం చేసుకోవాలి. ఈ eBookలోని సమాచారం దీన్నే స్పష్టం చేసింది. భూమి అంతకంతకూ వేడెక్కి పోతోందనడానికి స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. భూతాపం మాత్రమే కాదు వాతావరణ వైపరీత్యాలు పేదల, నిరుపేదల వెన్ను విరుస్తున్నాయి. భారత్‌లోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 69 వాతావరణ కేంద్రాలలో 23, గత 122 సంవత్సరాలలో ఎన్నడూ లేని రీతిలో గరిష్ఠ వర్షపాతాన్ని రికార్డు చేశాయి.
సరే, భారత ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రజాస్వామ్య సంరంబం ఏ వెలుగులనివ్వగలదో మనకు త్వరలోనే అవగతమవుతుంది. కొత్త –(పాత) ప్రభుత్వ ఎజెండా ఎలా ఉండాలని ఈ పర్యావరణ భోగట్టా మనకు సూచిస్తున్నది? కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలు ఏమైనప్పటికీ ఇది వాతావరణ మార్పు తీవ్రమవుతున్న కాలం అనే వాస్తవాన్ని అర్థం చేసుకుని తీరాలి. ఈ నివేదిక స్పష్టం చేస్తున్న మొదటి పాఠమిది. శీతోష్ణస్థితులు ఆయా ఋతువులకు అనుగుణంగా ఉండడం లేదు. చండ్ర గాడ్పులు, చలిగాడ్పులు, కుండపోత వర్షాలు కాలం కాని కాలంలో మన అనుభవానికి వస్తున్నాయి. ఆర్థికాభివృద్ధి లబ్ధి చాల మందికి ముఖ్యంగా పేదలకు దక్కకుండా చేస్తున్నాయి. వాతావరణ చిక్కుల నుంచి ఉపశమనానికి దోహదం చేసే అభివృద్ధి వ్యూహాల రూపకల్పన అనివార్యమవుతోంది.
నిలకడలేని వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి లభించగల సమస్త సహాయమూ రైతులకు అంది తీరవలసిన అవసరముంది. ఇది ఎవరూ కొట్టివేయలేని వాస్తవం. ఈ సహాయంలో అత్యంత ముఖ్యమైనది పంటల బీమా పథకం. రైతులకు ఈ పథకం అవసరం ఎంతైనా ఉన్నది. అయితే అది సరైన రీతిలో అమలవుతుందా? సమాధానం స్పష్టమే. ఆ పథకంలో తగు మార్పులు చేసి పటిష్ఠంగా అమలుపరచాల్సిన అవసరమున్నది. పంట నష్టాలకు కారణమవుతున్న స్థానిక వాతావరణ పరిస్థితులను సైతం పరిగణనలోకి తీసుకుని పంటల బీమా పథకాన్ని రూపకల్పన చేయాలి.
ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకే కాకుండా కాలుష్యకారక వాయు ఉద్గారాలను నియంత్రించేందుకు సైతం మనం మన విద్యుదుత్పాదన పద్ధతులను మార్చుకోవల్సిన అవసరమున్నది. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని చేస్తున్నాయో మరి చెప్పవలసిన అవసరం లేదు. విద్యుదుత్పాదనకు అధునాతన పద్ధతులను పాటిస్తే భూ తాపం పెరుగుదలకు కారణమవుతున్న హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఉక్కపోత నుంచి ఉపశమనానికి మనకు మరింత విద్యుత్ అవసరమవుతుంది కదా. మరి విద్యుదుత్పాదనకు బొగ్గు లాంటి కాలుష్య కారక ఇంధన వనరును ఉపయోగించడం మనకూ, మన ధరిత్రికి మరింత విపత్తును కొని తెచ్చుకోవడమే అవుతుంది. భారత ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించింది. అందుకే అది పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. వేల కోట్ల రూపాయలు అందుకు మదుపు చేస్తోంది. మన విద్యుత్ వినియోగం రెట్టింపు అయినప్పటికీ బొగ్గుపై ఆధారపడకుండా ఉండేందుకే ఆ అధునాతన పద్ధతులను అనుసరిస్తోంది. అయితే థర్మల్ విద్యుత్తే ఇప్పటికీ మన విద్యుత్ అవసరాలలో అధిక భాగాన్ని తీరుస్తుందని ఈ వార్షిక నివేదిక స్పష్టం చేసింది. విద్యుత్ వాహనాల విక్రయాలు అత్యధికంగా ఉంటున్న మాట నిజమే అయినా ఈ వార్షిక నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల శ్రేణిలోనే విద్యుత్ వాహనాల విక్రయాలు అధికంగా ఉంటున్నాయి. విద్యుత్ వాహనాలు డీజిల్ వాహనాలను ముఖ్యంగా ప్రైవేట్ కార్లు లేదా బస్సులను స్థానభ్రంశం చేయలేదు. ఫలితంగా వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు రవాణా పద్ధతులను పునరావిష్కరించుకోవలిసిన అగత్యమేర్పడింది. ప్రజా రవాణా సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. ప్రజా రవాణా రంగాన్ని పర్యావరణ హితకరంగా ఉండేలా తీర్చిదిద్దడానికి మనం కొత్త వ్యూహాలను రూపొందించుకోవలిసిన అవసరమున్నది.
నగరాలలో నీటి కొరత, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాథమ్యాలుగా ఉండాలి. వాటితో పాటు ప్రజా రవాణా వ్యవస్థను పతనస్థితి నుంచి ఉద్ధరించడానికి కూడా అగ్ర ప్రాధాన్యమివ్వాలి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఈ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ఈ వార్షిక నివేదిక పేర్కొంది. వాతావరణ మార్పుతో ఉత్పన్నమవుతోన్న సంక్షోభాలను నివారించడం మన ప్రణాళికల లక్ష్యంగా ఉండాలి. నిపుణ పరిష్కారాలు అభివృద్ధికి దోహదం చేస్తాయి. జీవనాధారాలకు తోడ్పడుతాయి. అందరికీ శ్రేయస్సును సమకూరుస్తాయి. మరీ ముఖ్యంగా వాతావరణ మార్పు సమస్యలను అధిగమించేందుకు ఆలంబన అవుతాయి. ఈ పర్యావరణ భోగట్టా మనలను ఈ సమస్యలపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. అంతకంటే ముఖ్యంగా తక్షణమే కార్యాచరణకు దిగవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. వినూత్న ఆలోచనలతో శీఘ్రగతిన, పెద్ద ఎత్తున కార్యోన్ముఖులం కావాలి.
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’
డైరెక్టర్ జనరల్, ‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)