Share News

ఎన్నికల ఎత్తుగడగా మారిన ఎన్‌కౌంటర్లు

ABN , Publish Date - May 29 , 2024 | 05:41 AM

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ దేశ ఆదివాసుల పట్ల ఎందుకోగాని ఆగ్రహంగా ఉన్నారు. 2024 ఆరంభం నాడే ఆరు నెలల పాలుతాగే పసిగుడ్డును చంపి మారణహోమానికి తెర తీశారు. దేశంలో...

ఎన్నికల ఎత్తుగడగా మారిన ఎన్‌కౌంటర్లు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ దేశ ఆదివాసుల పట్ల ఎందుకోగాని ఆగ్రహంగా ఉన్నారు. 2024 ఆరంభం నాడే ఆరు నెలల పాలుతాగే పసిగుడ్డును చంపి మారణహోమానికి తెర తీశారు. దేశంలో ఒకప్పుడు ఎన్నికల వాతావరణం పరుచుకోగానే హింసాత్మక ఘటనలు ఆగిపోయేవి. ఎన్‌కౌంటర్లు నిలిచిపోయేవి. క్రమేపీ పరిస్థితులు మారి ఎన్నికల సందర్భంలోనే ఎన్‌కౌంటర్ల హత్యాకాండ ఒక అంతర్భాగమైంది. బీజేపీకి వ్యూహాత్మకంగా ఎన్నికల సమయంలో ఏదో ఒక హీరోయిక్‌ హింసాత్మక చర్యను అమలు చేస్తున్నది. పుల్వామా, సర్జికల్‌ స్ట్రయిక్, ఇప్పుడు మావోయిస్టులను మట్టుపెట్టడం వంటి ఎత్తుగడలు ఇందులో భాగమే!

బీజేపీకి ఈసారి ఎన్నికల నినాదంగా మావోయిస్టురహిత సమాజ నిర్మాణం అవసరమైంది. 2024 జనవరి 1న బీజాపూర్‌ జిల్లాలోని గంగులూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కావడ్‌ పంచాయతికి చెందిన ముతవెండి గ్రామంలో సాయంత్రం 3 నుంచి 4 గంటల సమయంలో పోలీసులు కాల్పులు జరపగా తల్లి మాసె ఒడిలో ఉన్న పసిపాప చనిపోయింది. పసిపాప సోడి మంగ్లీ హత్యకు వ్యతిరేకంగా బీజాపూర్‌ జిల్లా గార్నం గ్రామంలో జరుగుతున్న ధర్నాలో పాల్గొనడానికి వెళ్తున్న గ్రామస్థులపై జరిపిన కాల్పుల్లో మైనర్‌ బాలికలైన పూనెం నంగి (బెల్లంనేంద్ర గ్రామం), మడకం సోని (గోటుం గ్రామం)తో పాటు, గోటుం గ్రామస్థుడు కారం కోస చనిపోయారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు.


2024 ఏప్రిల్‌ 2న జరిగిన మరో సంఘటనలో పుట్టు చెవిటి, మూగ అయిన 12 ఏళ్ళ కమ్లిని పోలీసులు తీసుకెళ్లి కాల్చి చంపారు. ఆ తర్వాత కాల్పుల్లో చనిపోయిందని ప్రకటించారు. బుల్లెట్‌ గాయాలతో ఛిద్రమైన కమ్లీ నిర్జీవ శరీరాన్ని తల్లి గుర్తించలేకపోయింది. చివరికి చంపిన పోలీసులే గుర్తించి కమ్లి నీ బిడ్డనే అని నిర్ధారించి శవాన్ని అప్పజెప్పారు. ఏప్రిల్‌ 10న జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. బీజాపూర్‌ జిల్లా గంగులూరు అడవుల్లోని పిడియా కొండల్లో సుదీర్ఘంగా హోరాహోరీ కాల్పులు జరిగాయని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. మృతుల్లో అగ్రనాయకులు వున్నారని కూడా ప్రకటించారు. వాస్తవానికి వీళ్ళు అత్యంత సాధారణ ఆదివాసీలు. తునికాకు ఏరుకోవడానికి అడవికి వెళ్ళారు. వాళ్ళను చంపి నక్సలైట్లని ప్రకటన చేశారని చత్తీస్‌గఢ్‌ మానవ హక్కుల కార్యకర్తలు నిర్ధారించారు.

వార్తాపత్రికల్లో వస్తున్న ఎన్‌కౌంటర్‌ మృతుల ఫోటోలు పరిశీలిస్తే సగానికి పైగా సాధారణ దుస్తుల్లో వున్న ఆదివాసీలే ఉన్నారు. మధ్యభారత అరణ్యాలలో ఆదివాసీలతో పాటు వారితో పెనవేసుకుపోయిన మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టులంటే వీరు అని వేలు పెట్టి చూపెట్టలేని విధంగా మిళితమై ఉన్నారు. కనుక మావోయిస్టులను మట్టుబెట్టడం అంటే ఆదివాసీలను మట్టుబెట్టడమే. అత్యంత సాధారణ ఆదివాసీ సమూహాలను భీతావహులను చేసి ఖనిజ సుసంపన్న ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడం ఒక ప్రణాళిక. దీనిని అడ్డుకుంటున్న మావోయిస్టులను ఏరివేయడం అసలైన ప్రభుత్వ విధానం. ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాయి.


గడిచిన ఐదేళ్ళలో కేంద్రం ప్రభావిత రాష్ట్రాలకు ఏడాదికి వెయ్యి కోట్ల పైన మంజూరు చేసింది. దీనికి తోడు బలగాలను క్షేత్రస్థాయికి తరలించేందుకు, గాయపడ్డ వారిని చికిత్స కోసం తీసుకెళ్ళేందుకు హెలికాప్టర్లను అదనంగా మంజూరు చేస్తోంది. కేంద్ర హోం శాఖ ఇటీవలి నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఒక్క బస్తర్‌ ప్రాంతంలోనే 80 వేల బలగాలు వివిధ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయి. అడవుల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున క్యాంపులు నెలకొల్పారు. ఒక్క క్యాంపులో 2వేల నుంచి 5 వేల వరకు బలగాలను దింపుతున్నారు. బలగాలు పెరగడంతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. దండకారణ్య వ్యాప్తంగా విస్తరించే వ్యూహంలో భాగంగా పెద్ద సంఖ్యలో ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌ (ఎఫ్‌ఒబి)లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ ఎవరి కోసం? ఏ ప్రజానీకాన్ని ఉద్దరించడానికి? ముఖ్యంగా బస్తర్‌, బీజాపూర్‌, దంతెవాడ, కాంకేర్‌, కొండగావ్‌, నారాయణపూర్‌, సుక్మా జిల్లాలతో కూడిన బస్తర్‌ డివిజన్‌పై ప్రత్యేక కేంద్రీకరణ కొనసాగుతుంది. ఒకవైపు సుప్రీంకోర్టు సొంత పిల్లలపై యుద్ధమెందుకు? అంటూనే ఉంది. మరోవైపు నరసంహారానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. గడచిన నాలుగేళ్ళలో చత్తీస్‌గఢ్‌లో 63 ఎఫ్‌ఒబిలను అదనంగా ఏర్పాటు చేశారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క కాంకేర్‌ జిల్లాలోనే 8 ఎఫ్‌ఒబిలు ఏర్పాటయ్యాయి. ఈ క్యాంపుల్లో సిఆర్‌పిఎఫ్‌, కమాండో బెటాలియన్‌ ఫర్‌ రెజల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టిఎఫ్‌), డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ (డిఆర్‌జి), బస్తర్‌ ఫైటర్స్‌, బిఎస్‌ఎఫ్‌, ఐటిబిపిలతో పాటు స్థానిక పోలీసులు ఉంటున్నారు.


బలగాలన్నీ కలిసి జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు దాదాపు 120 మందిని చంపివేశాయి. అందులో సగానికి పైగా సాధారణ ఆదివాసీలే. అంటే సగటున రోజుకొక్కరి చొప్పున హత్య చేశారు. లక్షల సంఖ్యలో మోహరింపబడిన ఈ సాయుధ బలగాలు బూటకపు ఎన్‌కౌంటర్లు, గ్రామాలపై దాడులు, కొట్టడం, అక్రమ అరెస్టులు, జైళ్లు, మహిళలపై అత్యాచారాలు, ఇళ్లపై పడి దోచుకోవడాలు చేస్తున్నారు.

ఈ మారణకాండ ఈనాటిది కాదు, ఏనాటి నుంచో కొనసాగుతున్నదే. 2005లో సల్వాజుడుం, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరుతో 2009 నుండి 2017 వరకు, దాని తర్వాత ఆపరేషన్‌ సమాధాన్‌ 2017 నుండి 2022 వరకు, ప్రస్తుతం ఆపరేషన్‌ సూరజ్‌కుండ్‌ పథకం వరకు మారణహోమం కొనసాగిస్తున్నాయి. ఇవేవీ ప్రభుత్వాలు కోరుకున్న ఫలితాలను సాధించలేకపోయాయి.

ఇంత నిర్బంధకాండ అమలుపరిచినా, ఆదివాసీలు ‘జల్‌ జంగిల్‌ జమీన్‌’ తర్వాత పర్యావరణం, అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం చివరి వరకు పోరాడుతామని ఆందోళనకు దిగారు. బస్తర్‌ రీజియన్‌లో గత నాలుగేళ్ళకుపైగా 25 చోట్ల నిరవధిక ఆందోళన శిబిరాలు జరుగుతున్నాయి. సిలింగేర్‌ ఆందోళన మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది. ప్రభుత్వం తెచ్చిన పంచాయత్‌ ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ (పెసా) చట్టం, అటవీ హక్కుల గుర్తింపు చట్టం తమ హక్కులకు మద్దతుగా ఉందని, కార్పొరేట్‌ సంస్థల దోపిడీని అనుమతించబోమని ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. ఆ పోరాటాలకు మావోయిస్టులు మద్దతిస్తున్నారు. ఒకరిని మట్టుబెట్టి, ఇంకొకరిని భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ సంపదను కార్పొరేట్లకు అప్పగించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే 2022 ఆపరేషన్‌ సూరజ్‌కుండ్‌లో భాగంగానే ‘ఆపరేషన్‌ కగార్‌’ పథకం ముందుకు వచ్చింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో సరిహద్దు భద్రతాదళాల సమావేశంలో 2023 డిసెంబర్‌ 1న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘వామపక్ష తీవ్రవాదం మీద చిట్టచివరి యుద్ధం’ అని ప్రకటించారు. ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏర్పడడంతో ‘ఆపరేషన్‌ కగార్‌’ మరింత క్రూరం అయింది. ఇప్పుడు మధ్యభారత ఆదివాసీలు ఆపరేషన్‌ కగార్‌ కింద ముప్పేట దాడికి గురవుతున్నారు. ఈ భీభత్స దాడులను ఎదుర్కోవడానికి ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా దృఢంగా నిలబడ్డారు. దేశ వారసత్వ సంపద దేశ ప్రజలకే చెందాలనే ఆకాంక్షకు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత పౌర సమాజం పైన కూడా ఉన్నది. నిత్యం కొనసాగే ఈ మారణకాండపై వాస్తవాలు సేకరించడానికి, ఆపదలో ఉన్న ఆదివాసీలకు అండగా నిలవడానికి పౌర సమాజానికి, హక్కుల సంఘాలకు స్వేచ్ఛనివ్వాలి.

లక్ష్మణ్‌ గడ్డం

అధ్యక్షులు, పౌర హక్కుల సంఘం

Updated Date - May 29 , 2024 | 05:41 AM