Share News

సమతావాది కవిత్వోపనిషత్తు

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:09 AM

ఈ ఏడు డా. ఎన్‌ గోపీ గారికి డెబ్బై నాలుగేళ్ళు నిండి డెబ్బై ఐదు వస్తుంది. పదిహేడేళ్ళ ప్రాయంలో తొలి కవిత వ్రాసిన ఈ కవి తన 29వ కవితా సంపుటి (‘రేపటి మైదానం’) ఆవిష్కరించబోతున్నాడు...

సమతావాది కవిత్వోపనిషత్తు

ఈ ఏడు డా. ఎన్‌ గోపీ గారికి డెబ్బై నాలుగేళ్ళు నిండి డెబ్బై ఐదు వస్తుంది. పదిహేడేళ్ళ ప్రాయంలో తొలి కవిత వ్రాసిన ఈ కవి తన 29వ కవితా సంపుటి (‘రేపటి మైదానం’) ఆవిష్కరించబోతున్నాడు. జీవితంలో ఇంత కాలం సుసంపన్నమైన కవిత్వం రాయడం పట్ల వర్తమాన భవిష్యత్తరాలు సంభ్రమాశ్చార్యాలతో కళ్ళప్పగించి చూస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కవిత్వంతోబాటు విమర్శ, పరిశోధన, అనువాదాలు, యాత్రా చరిత్రలు, పాఠ్యగ్రంథాలు, వ్యాఖ్యానాలు, సభలు, సమావేశాలు- ఒక మానవ మాత్రుడికి ఇంత వ్యాపకం ఎలా సాధ్యపడింది? తెలుగు వచన కవిత్వ చరిత్రలో ఈ సృజనకారుడి స్థానమేమిటి?

ఏ కవైనా తొలినాళ్ళకీ, తదనంతర జీవన దశలకూ ఖచ్చితంగా మార్పు చెందుతాడు. ఒక అరవై ఏళ్ళ గోపీ కవిత్వాన్ని పుస్తకాలవారీ విభజించి చూసినా, అవి ప్రచురించిన కాల ప్రాధాన్యంలో పేర్చినా, మనకు కొంత చిక్కు వచ్చే ప్రమాదమే ఎక్కువ ఉంది. అత్యంత చలన శీలత గలిగిన గోపీ కవిత్వ పరిణామాల్ని ఒక దశకీ, చట్రానికీ లోబడి చూడటం కష్టం. ఏ పుస్తకంలో కవిత ఏలాంటి గొంతుతో పలికింది? ఎటువంటి భావాన్ని ఎంత సాంద్రంగా విప్పి చెప్పింది? అది గోపీ రాసిన ఆయా కాలపు కల్లోలాల్ని, సంఘర్షణని సరిగ్గా ప్రతిబింబించిందా లేదా? వస్తుశిల్పాల సమన్వయం ఎటువంటిది? భాషలో విశేషణాలను ఈ కవి నిజంగానే పరిహరించాడా? వంటి రకరకాల సందేహాలు వస్తాయి. డెబ్బై-ఎనభైల విప్లవ పోరాట ప్రభావం, తదనంతర అస్తిత్వవాద విచారమూ ఈ కవిలో సూచ్యంగా ప్రదర్శిత మైనాయి. గోపీ సాహిత్య స్వభావం వాదాలకు భిన్నంగా స్వతంత్రంగానే ఉన్నది. ఈతని కవిత్వంలో ‘ఉధృతమైన’ తెలంగాణ ఉద్యమ ధోరణి కన్నా నిలకడగా అక్కడి జీవన రూపం ఎక్కువ ప్రతిబింబించింది. ఉద్రేక పూరితంగా గాక మృదువైన నిరసన కలిగి ఉంది. కవిది స్థూలంగా ఆర్ద్రత నిండిన ఆలోచనాత్మక స్వరం కావటాన ఎక్కువగా ఆ నేలపై జన ధనస్వామ్యాల ప్రభావ (ఉద్యమం వర్సెస్‌ రాజకీయం) వివరం చెబుతాడు. ‘శాపగ్రస్త తెలంగాణ’, ‘గుర్తుకొస్తున్నారు’, ‘సమరంలో అమరం’, ‘సారాంశం’, ‘నిప్పును లేపకండి’ కవితల్లో తెలంగాణ ప్రాంత సంవేదన, సంస్కృతి నిండి ఉంటుంది. ‘రండి, రెండు రాష్ట్రాలను ఆశీర్వదిద్దాం, రెంటికీ మధ్య పూలకంచెను నిర్మిద్దాం, ఏం పరవాలేదు’ (మరో సంకల్పం) అన్న గోపీ సమతా, సామరస్యవాది.


గోపీ సామాన్య జన జీవన మూలాన్ని ‘పల్లెసూక్తం’గా ప్రవచించాడు. సైప్రస్‌ వెళ్ళినా, నయాగరాలో తడిచినా, ‘పల్లె నా జ్ఞాపకాల ముల్లె, ఎప్పటికీ తరగని పరిమళాల మల్లె’ అని తన పల్లె మట్టిని కళ్ళకద్దుకున్నాడు. ఏ శక్తీ నిలువరించలేకపోయిన ప్రపంచీకరణ, నగరీకరణ పరిణామ దశల్ని కార్యకారణ సహితంగా గోపీ కవిత్వంలో చూడవచ్చు.

గోపీ కవిత్వ దృక్పథం ‘మానవ స్వేచ్ఛా కాంక్ష’ కలిగినది. కలిసిన మనుషులూ, తిరిగిన ప్రదేశాల ప్రస్తావన కవితల్లో చాలా ఎక్కువ. ఒక సామాన్యుడు, అందునా మధ్యతరగతి మూలాలున్న పల్లెటూరివాడవటం చేత, మనిషి అంతశ్చేతనపై ఆయా వెలుపలి శక్తుల ప్రమేయాన్ని గోపీ సరిగ్గా పసిగట్టాడు. శ్రీలంక, కాశ్మీరు, లండన్‌, హైదరాబాద్‌, ఈశాన్య భారతం వంటి ప్రదేశాలపై రాసిన కవితల్లో అక్కడి మతతత్వ, రాజకీయ, పెట్టుబడిదారీ ప్రతిఫలనాలున్నాయి. ప్రయాణ కవిత్వ పరిశీలనలో కవి ముఖ్యంగా ‘సౌందర్యాన్వేషి’. యాత్రా చిత్రణ స్వభావం చాలావరకూ ఆనందకారకమై ఉంటుంది. పర్యటించిన ప్రదేశం అతనిలోకి ప్రవేశించి రాగద్వేషరహితుణ్ణి చేస్తుంది. ప్రదేశాలకు ఉండే ఉదాత్తమైన చారిత్రక ప్రేరణల్ని పాఠకుడు తనలో తానే వెతుక్కునేట్టు చేస్తాడు. కవిత్వానుభవానికీ, సంచార గుణానికీ లంకె వేస్తాడు. కవి చతురతకు ప్రయాణ కవితలు కరదీపికలు.


గోపీ పట్టణ ప్రాంత మధ్యతరగతి జీవన దౌర్భల్యాల్ని వ్యవహార భాషలో కవిత్వీకరించాడు. అతనిలో నిర్వచనాలకి, అనుప్రాసాదులకు ప్రాధాన్యం ఉన్నది. పదవైచిత్రిని మరువలేడు. ఉపమాలోలత్వం జాస్తి. అభివ్యక్తి సుందరి మృదు స్పర్శకి దాసుడు. అతని నాస్టాల్జియాలోని ఉద్వేగానికి కొంత వర్గ లక్షణమూ (వడ్ల గిర్నీ), సామాజిక చైతన్యమూ (మా ఊరి చెరువు, మేస్త్రీ కొడుకు) ఉండటం చేత అవి కేవలం తలపోతగానో వలపోతగానో మాత్రమే మిగిలిపోలేదు. ఆ విలక్షణత వలనే గోపి రచనలు పలు భాషల్లోకి వెళ్ళి ప్రజల ఆమోదం పొందాయి. గోపీ కవితలే కాదు ఎవ్వరి రచనలైనా సామాన్యుడికి చేరడం అన్నింటికన్నా ముఖ్యమైన విజయం. బహుశా ‘ప్రజా కవి వేమన’ పరిశోధక రచనవల్ల గోపి కవిత్వ దృక్పథం సామాన్యుడి జీవితంలోకి మరింత తొంగి చూడగలిగింది. సామాజిక వ్యవస్థని సూక్ష్మతరంగా పరిశీలించిన వేమన కవిత్వం నీతి ప్రబోధకమైనది. సరళ పద్యరూపంలో ఉన్నది. గోపీ, అదే భావాంశ సమర్థనని, సందేశాత్మక రీతిని (మరీ ముఖ్యంగా నానీలలో), గుణప్రాధాన్యంగా వచన కవిత్వంలో సాధన చేశారు.

కవిత్వానికి కాబట్టని విషయమేలేదన్న గోపీ మాట ‘కాదేదీ కవితకనర్హం’ అన్న శ్రీశ్రీని జ్ఞాపకానికి తెస్తుంది. అయినప్పటికీ కంటబడిన ప్రతిదాన్నీ కవితామయం చేయడం వైవిధ్యమనిపించుకోదు. కవి నిరంకుశత్వానిక్కూడా కొంత ‘అదుపు’ (ట్ఛట్టట్చజీుఽ) తప్పనిసరి. ప్రతి కవికీ అనుభూతి అతిరేకత నుంచి తప్పించుకునే ఎగ్జిట్‌ బోర్డులూ ఉండితీరాలి. పిన్నీసు, అంగి, జల్లెడ, పార, బొంత, చెంబు, టెలీఫోన్‌, స్కూల్‌ గంట, నిచ్చెన, అద్దం వంటివాటిపై కవితల్ని చూస్తే గోపీ జీవితంలోంచి కవిత్వాన్ని వేరు చేయలేని మమకారమూ, అశక్తతా ఉన్నాయి. అది బలహీనతగా కొంతమంది, బలముగా మరికొంతమంది నిర్ణయించి ఉన్నారు. రారా తిలక్‌ భావుకత్వ లక్షణం పట్ల వ్యాఖ్యానిస్తూ కించిత్‌ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి అందుకు కారణమంటాడు. పరిణతి చెందిన కవికి తన కవిత్వేతివృత్తం పట్ల ప్రేమాభిమానాలు సరే, సముచిత గౌరవం, పట్టింపూ తప్పనిసరిగా ఉంటాయి. గోపీ అనేక ఉదాత్తమైన కవితా వస్తువులతోబాటు కొన్ని అప్రధాన వస్తువులనూ స్వీకరించారనిపిస్తుంది. అయితే ఎటువంటి వస్తువునైనా గొప్పగా నిర్వహించగల శిల్పచాతుర్యం గోపీ ప్రత్యేకత. అనుభవం అసలు సంపద. వచన కవిత్వానికి సంప్రదాయబద్ధమైన నియమ రాహిత్యాన్ని, వచన కవికి లక్షణ నిర్దేశం లేని సౌలభ్యాన్ని గోపీ చాకచక్యంగా వినియోగించుకున్నారు. అన్నింటికన్నా గోపీ కవిత్వాశయం (ఝ్చజీుఽ జీఛ్ఛ్చీ) గొప్పదై ఉండటం చేత అతని ‘విరివి’ సమకాలికుల నుండి నేర్పుగా విడివడి విమర్శను తట్టుకున్నది. లోకజ్ఞత (ఛిౌఝఝౌుఽట్ఛుఽట్ఛ), చమత్కృతి (ఛిౌుఽఛ్ఛిజ్టీ) వలన అత్యంత పాఠకా దరణ చూరగొన్నది.


సినారె కవితా లక్షణాలైన శబ్దప్రేమ, వర్ణనాధిక్యత, భాషా పటిమ, భావ నిగ్రహములలో కొన్ని గోపీ వంటి ‘రసరమ్య’ కవులక్కూడా అబ్బినాయంటే అతిశయోక్తి కాదు. (స్మృతికవితల్లో మరింతగా) లయను గమనించ వచ్చు. గోపీది కూడా తిలక్‌ వలె కరుణరస ప్రధానమైన కవిత్వమైన ప్పటికీ అది కేవలం ‘అందమైన కరుణరసం’ కాదు. సత్యతగల (ఠ్ఛిటజ్టీడ) కరుణ. అందుకు నేత కార్మికుల వలస దీనత్వాన్ని చిత్రించిన ‘ఓ రాజయ్య కథ’ (1991) సాక్ష్యము.

గోపీ కాళోజీ, బాలగోపాల్‌, చేరా, వంటి వాళ్ళపై ఎన్నో స్మృతి కవితలు వ్రాసినప్పటికీ వాళ్ళమ్మాయి గురించిన ‘మా అమ్మాయి’, ‘మృత్యు దుఃఖం’ కవితలు మనకి ఊపిరాడనివ్వవు. గోపీ కవిత్వం మరింత మానవీకరణ చెందడంలో వాళ్ళమ్మాయి మృతి వేదన (1996), పరితాపము అంతర్లీనంగా ఉన్నాయి. ‘‘నరనరాల్లో ప్రసరించే సూదిలాగ, మా అమ్మాయి మరణం బాధారుణ సంగీతంలా తరుముతుంది. చివరి శ్వాస దాకా అదే నా నేపథ్య శృతి’’ అంటాడు. అతని భరింపరాని వ్యక్తిగత వేదన రస ప్రాధాన్యంగా, విషయ సంగ్రహంగా నిర్మాణాత్మక పద్యంలోకి బదిలీ అవుతుంది. ఉపనిషత్సమానమైన జ్ఞాన సారాంశాన్ని, ఆధునిక జీవన వేద రహస్యాలను వివేకవంతంగా గోపీ కవిత్వీకరించాడు. నానీలు (1997), జలగీతం (2002), వృద్ధోపనిషత్‌ (2019) ప్రపంచీకరోనా (2020) వంటి కావ్యాలు, కావ్య రూపాలు అందుకే చాలా విజయవంతమైనాయి.

గోపీ కవిత్వం, వినిమయలోకపు విచిత్ర పోకడలతో రాజీలేని సంఘర్షణ పడ్డది. ఈ కవి ప్రతీకల రహస్యాన్ని అనాయాసంగా దొరకబుచ్చుకున్నాడు. గోపీకి బ్లాగ్‌ లేదు. వెబ్‌సైట్‌ ఊసూ తెలియదు. కానీ ఆధునిక కవిత్వ మాంత్రికతకి మాత్రం సాఫ్ట్‌వేర్‌ కనుగొన్నాడు. క్లుప్తతకన్నా అధికంగా ప్రభావశీలతని, గుప్తతని, అంతకుమించి ఆప్తతని పొదవుకుని కవిత్వాన్ని జీవన భాషగా పలికించిన సిద్ధుడు గోపి. తంగేడుపూలు సంపుటికి ముందుమాట రాస్తూ ‘నేను కవిత్వంలో గుణాన్నే కాకుండా, పరిమాణాన్ని కూడా చూస్తాను’ అన్నారు కుందుర్తి. ఈ డెబ్బై ఐదేళ్ళ కుర్రాడు పెద్దాయన మాటని మర్చిపోలేదు.

(జూన్‌ 25 ఎన్‌. గోపీ 75వ జన్మదినోత్సవం)

శ్రీరామ్‌ పుప్పాల

- 99634 82597

Updated Date - Jun 24 , 2024 | 06:09 AM