Share News

ఈసీ నిష్పాక్షికతపై నీడలు

ABN , Publish Date - May 29 , 2024 | 05:45 AM

న్యాయం చేయడానికి నిష్పాక్షికత అవసరం. నిష్పాక్షికత లేని చోట న్యాయాన్ని ఆశించడం వల్ల ప్రయోజనం లేదు. న్యాయం అనే ప్రాథమిక హక్కును అందించిన ప్రతి సంస్ధ లేదా వ్యక్తి పట్ల గౌరవం...

ఈసీ నిష్పాక్షికతపై నీడలు

న్యాయం చేయడానికి నిష్పాక్షికత అవసరం. నిష్పాక్షికత లేని చోట న్యాయాన్ని ఆశించడం వల్ల ప్రయోజనం లేదు. న్యాయం అనే ప్రాథమిక హక్కును అందించిన ప్రతి సంస్ధ లేదా వ్యక్తి పట్ల గౌరవం పెరుగుతుంది. విశ్వసనీయత ఏర్పడుతుంది. పాఠశాల ఆట మైదానంలో చిన్నారుల క్రీడా పోటీ నిర్వాహకులైన వ్యాయామ ఉపాధ్యాయులు గానీ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువుగా భావించే ఎన్నికలను నిర్వహించే ఎన్నికల సంఘం గానీ ఇందుకు మినహాయింపు కాదు.

అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను ఇనుమడింపచేసిన వ్యవస్ధలలో ‘భారత ఎన్నికల సంఘం’ (ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా – ఈసీ) ప్రముఖమైనది, ప్రథమ స్థానం ఇవ్వదగ్గది. ప్రవాస పాకిస్థానీయులు, బంగ్లాదేశీయులు తరుచు తమ దేశాలలోని లోపభూయిష్టమైన, పక్షపాత ఎన్నికల విధానంపై ఆవేదన చెందుతూ భారత ఎన్నికల సంఘం నిజాయితీని ప్రశంసిస్తుంటే ప్రవాస భారతీయులు గర్వంతో ఉప్పొంగిపోతుంటారు. ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా ఎన్నిక ‘చేయబడ్డ’ తమ ప్రతినిధుల విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తమ దేశంలో కూడా భారత ఎన్నికల వ్యవస్థ తరహా నిజాయితీతో కూడిన విధానం అమలులో ఉంటే తమ పరిస్ధితి మరో రకంగా ఉండేదని నిర్వేదం చెందడం కద్దు.


ప్రజాస్వామ్య వ్యవస్ధ పచ్చగా వర్ధిల్లేందుకు రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులు తమ విధ్యుక్త ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వహించడం చాలా ముఖ్యం అని ఒకప్పుడు భారత ఎన్నికల సంఘం నిరూపించింది. భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పదవీ విరమణ చేసి, రంగారెడ్డి జిల్లాలో ఒక వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తున్న జె.యం. లింగ్డో (ఈశాన్య భారతంలోని మేఘాలయ ఆయన సొంత రాష్ట్రం) పొరుగున ఒక ప్రవాస భారతీయుడు నివాసముంటారు. లింగ్డోకు కుక్కలంటే అమిత ప్రేమ. ఆయన వద్ద మూడు కుక్కలు – తషీ, షిరాజ్, ఐసిస్ – ఉన్నాయి. వాటితో ఆడుతూ వ్యవసాయం చేసుకొంటూ గడిపే లింగ్డోను కొందరు కలిసి అతని హయంలో ఎన్నికల సంఘం పని తీరును అభినందిస్తే... అందులో తన పాత్ర ఏమిలేదని చెబుతూ రాజ్యాంగానికి తాను ఈ కుక్కల తరహా పరిరక్షకుడిగా పని చేసేందుకు కొంత వరకు ప్రయత్నించానని మాత్రమే వినయంగా చెబుతారు.


2002 గుజరాత్ అలర్ల అనంతరం గడువుకు ముందే శాసన సభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడానికి నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాలను లింగ్డో అడ్డుకున్నారు. క్షేత్ర స్ధాయిలో పర్యటించి ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి గుజరాత్‌లో లేదని లింగ్డో తేల్చి చెప్పారు. అంతకు ముందు టి.యన్.శేషన్ ఎన్నికల సంఘం అధికారాలు ఏమిటో ప్రజలకు తన చేతల ద్వారా చూయించారు. సోనియాగాంధీ వలే లింగ్డో క్రైస్తవుడని అప్పట్లో బహిరంగ సభలలో వ్యాఖ్యానించిన మోదీ తాజాగా సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించె బ్రాహ్మణుడైన దివంగత శేషన్ తీరును కూడ తప్పుపట్టారు. అలాగని, రాజీవ్ గాంధీ హత్యానంతరం మూడు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడంలో ఉన్న ఔచిత్యాన్ని మోదీ ప్రశ్నించడంలో సహేతుకత ఉంది. ఇటువంటి సమున్నత నేపథ్యం కల్గిన భారత ఎన్నికల సంఘం నేడు పక్షపాతం చూపుతోంది. ప్రేక్షక పాత్ర వహిస్తోంది. అసమర్థంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. విపక్షాల పట్ల వివక్షతో వ్యవహరిస్తుందనే అపవాదు మోస్తోంది. పోలయిన ఓట్ల సంఖ్యను తెలియజేసే ఫాం 17–సిను బహిర్గతం చేయడానికి ఎన్నికల సంఘం వెనుకంజ వేసిన తీరును పౌర సమాజం ప్రశ్నించింది. ఓటింగును హెచ్చించాలని ఒక వైపు భగీరథ యత్నం చేస్తుండగా మరోవైపు కొన్ని చోట్ల ఓటింగుకు అవాంతరాలు కల్పించినట్లుగా అరోపణలు రావడం దిగ్ర్భాంతి కల్గిస్తుంది. తమపై గుప్పిస్తున్న అరోపణలను, రెక్కిస్తున్న అనుమానాలను నివృత్తి చేయడానికి ఎన్నికల సంఘం పెద్దగా శ్రద్ధ చూపకపోవడం కూడ అశ్చర్యం కలిగిస్తోంది.


ఉల్లాసం కొరకు వీక్షించే క్రికెట్ పోటీలలో సైతం విజయంపై విశ్వసనీయత కొరకు నిష్పాక్షికంగా వ్యవహరిస్తారనే అభిప్రాయంతో తటస్ధులుగా భావించే ఇతర దేశాల వారిని అంపైర్లుగా నియమించుకోవడం జరుగుతోంది. అంపైర్లు చిన్నపాటి మానవ తప్పిదం లేదా విడియో రీప్లే తర్వాత కూడ పక్షపాతంతో వ్యవహరిస్తే క్రీడాభిమానుల అగ్రహవేశాలు కట్టలు తెంచుకుంటాయి. ప్రపంచ కప్ ఆస్ట్రేలియా–భారత్ ఫైనల్స్ కానీ ఇటీవల జరిగిన ఐపియల్‌లో రాజస్ధాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌ను ఔట్ చేసిన విషయంలో వ్యక్తమయిన నిరసన గమనార్హం.

మరి, తమ తల రాతలను మార్చే ఎన్నికలను నిర్వహించే ఎన్నికల సంఘం తీరుతెన్నులపై ప్రజలకు ఉన్న అవగాహన ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న. బంతి మైదానం దాటే విషయమై ప్రశ్నించే గొంతుకలు ఓట్ల విషయంలో పట్టించుకోవడం లేదు!

2019 సార్వత్రక ఎన్నికలతో పోల్చితే, ఈ సారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు ఒక ప్రాముఖ్యత ఉంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే, నిర్ధారించే రానున్న కాలానికి దొహదపడే ఈ ఎన్నికలు మాములు ఎన్నికలు కావు. అరబ్బు దేశాల తరహా లాంఛనప్రాయ ఎన్నికల ద్వారా వ్యక్తి కేంద్రీకరణతో కూడిన నియంతృత్వ వ్యవస్ధకు నాంది పడనుందని భయాందోళన వ్యక్తమవుతుంది. ఒక దేశం ఒక ఎన్నికలు దిశగా వేగంగా పావులు కదులుతూ మున్ముందు ఒక దేశం ఒక ఎన్నికతో పాటు ఒక నాయకుడనే భావన కూడ వచ్చినా అశ్చర్యపడవల్సిందేమీ లేదు.


స్వయంప్రతిపత్తి కల్గిన రాజ్యాంగ సంస్ధల పని తీరుపై అనుమానాలు, అరోపణలు పెరుగుతున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎన్నికల సంఘం తన కీర్తిని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తే, ప్రజాస్వామ్యం మరింత మెరుగ్గా వర్ధిల్లుతుందనడంలో సందేహం లేదు.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - May 29 , 2024 | 05:45 AM