Share News

అంటకాగేవారికి ఈసీ చర్యలు ఓ హెచ్చరిక!

ABN , Publish Date - May 24 , 2024 | 06:12 AM

రాష్ట్రంలో ఎన్నికల రోజూ, ఆ పిమ్మట కూడ పెద్దయెత్తున హింసాకాండ చెలరేగి భయానక వాతావరణం ఏర్పడటంతో ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించి..

అంటకాగేవారికి ఈసీ చర్యలు ఓ హెచ్చరిక!

రాష్ట్రంలో ఎన్నికల రోజూ, ఆ పిమ్మట కూడ పెద్దయెత్తున హింసాకాండ చెలరేగి భయానక వాతావరణం ఏర్పడటంతో ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించి కొందరు పోలీసు అధికారులు, ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకోవటం అనివార్యం అయింది. నిప్పు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాలక మానదు అన్నట్లు కొందరు అధికారులు దౌర్జన్యకాండకు సహకరించారనీ, మరికొందరు సహకరించకపోయినా అల్లర్ల నియంత్రణలో విఫలమైనారని ఎన్నికల సంఘం ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. ఇటువంటి చర్యల వల్ల మున్ముందు మన పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కూడ రాజకీయ మొహమాటానికి తావు లేకుండా సంఘ విద్రోహశక్తుల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఉపకరిస్తాయి. అలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే, న్యాయస్థానాల, ప్రజల మద్దతు కూడా లభిస్తుంది, పాలన గాడిలో పడుతుంది. మున్ముందు ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదే ఒరవడి కొనసాగిస్తే సమాజానికి మాత్రమే గాక వారికి, వారి కుటుంబాలకు భద్రత లభిస్తుంది.


ఒకప్పుడు నేరస్తులు, రౌడీలకి పోలీసులంటే హడల్, వారి కంటబడకుండా తప్పించుకుని తిరిగేవారు. మరి నేడో... పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగంపైనే దాడులు పెరిగిపోతుంటే వారిని వారే కాపాడుకోలేని దుస్థితి ఏర్పడింది. శాంతిభద్రతలు కాపాడటం ప్రభుత్వ ముఖ్య బాధ్యత. మరోవైపు సరిహద్దుల వద్ద సైనికుల వలె పోలీసులు కూడ నిత్యం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వారి లాగే ఎందరో ప్రాణాలకు తెగించి నిజాయితీగా విధులు నిర్వహించేవారూ ఉన్నారు. అయినా సమాజంలో వారికి తగిన గుర్తింపు లేదు. అందుకు కొంత స్వయంకృతాపరాధం కూడా ఉన్నది. పని వత్తిళ్ళతో సతమతమయ్యే పోలీసు యంత్రాంగంలోని కొందరు ‘అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు’ అమాయక, పేద ప్రజలపై చూపుతారనీ, బడా నేరస్తుల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తారని అపప్రధ ఉన్నది. ఇకనైనా పోలీసు యంత్రాంగం సంఘవిద్రోహుల పట్ల నిక్కచ్చిగా, కఠినంగా వ్యవహరిస్తే, ఎంతటి ఘరానా నేరస్తులైనా తోకముడిచి పారిపోతారు. పోలీసులు, అధికార యంత్రాంగం కలిసికట్టుగా అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలి. అప్పుడే సమాజంలో శాంతిభద్రతలు మెరుగుపడతాయి.

తిరుమలశెట్టి సాంబశివరావు

నరసరావుపేట

Updated Date - May 24 , 2024 | 06:12 AM