Share News

‘ఇండియా’కు ఆరంభ అనుకూలతలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:15 AM

పద్దెనిమిదవ సార్వత్రక ఎన్నికల ఆరంభ దశలో ప్రతిపక్ష ఇండియా కూటమికి అనేక అనుకూలతలు ఉన్నాయి. వాటి నుంచి అది ప్రయోజనం పొందనున్నది. దేశంలోని దాదాపు ఐదో వంతు...

‘ఇండియా’కు ఆరంభ అనుకూలతలు

పద్దెనిమిదవ సార్వత్రక ఎన్నికల ఆరంభ దశలో ప్రతిపక్ష ఇండియా కూటమికి అనేక అనుకూలతలు ఉన్నాయి. వాటి నుంచి అది ప్రయోజనం పొందనున్నది. దేశంలోని దాదాపు ఐదో వంతు నియోజకవర్గాలలో పోలింగ్ మొదటి దశలోనే జరగనుండడమే అందుకు కారణంగా చెప్పవచ్చు. తొలుతనే ఆధిక్యతను సమకూర్చుకునేందుకు వివిధ అనుకూలతలు ‘ఇండియా’కు ఒక అవకాశాన్ని కల్పించనున్నాయి.

మూడు అంశాలు సంయుక్తంగా ‘ఇండియా’కు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తొలిదశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో ఎన్‌డీఏ, ‘ఇండియా’లు 2019 సార్వత్రక ఎన్నికలలో ఇంచుమించు సమానస్థాయిలో సీట్లు సాధించుకున్నాయి. ప్రస్తుత రాజకీయ పొత్తుల ప్రాతిపదికన చూస్తే తొలిదశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో గత పర్యాయం ఎన్‌డీఏ, ‘ఇండియా’ చెరి 49 సీట్లను గెలుచుకున్నాయి. మిగతా ఆరు దశలలోను ఎన్‌డీఏకే స్పష్టమైన అనుకూలత ఉన్నది. అయితే తొలి దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో ఉభయ కూటములకు విజయావకాశాలు సమస్థాయిలో ఉండడం గమనార్హమైన విశేషం.

2019 అనంతర పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఈ సమతుల్యత ‘ఇండియా’కు అనుకూలంగా మొగ్గుతుంది. ఇండియా కూటమి 55 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నదని, ఎన్‌డీఏ 42 స్థానాలలో మాత్రమే ముందంజలో ఉన్నదని విశదమవుతుంది. తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ‘ఇండియా’ భాగస్వామ్య పక్షాలు కొంత మేరకు విజయావకాశాలను కోల్పోయినప్పటికీ అవి రాజస్థాన్‌లో తొమ్మిది, మధ్యప్రదేశ్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలలోను లబ్ధి పొందగలవని తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇది కేవలం గణాంక సంభావ్యత మాత్రమే కాదు, శుక్రవారం నాడు పోలింగ్ జరగనున్న కొన్ని ప్రాంతాలలో ఇండియా కూటమికి రాజకీయ అవకాశాలు మెరుగుపడనున్నాయి. జాట్, ‌గుజ్జర్, మీనా తదితర వ్యవసాయక కులాల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న రాజస్థాన్ ఉత్తర, తూర్పు ప్రాంతాలు ఆ రాష్ట్రంలో రైతు ఉద్యమానికి గుండెకాయ వంటివి. ప్రస్తుత ఎన్నికలలో సీపీఎం, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది. ఈ పొత్తు వల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఎంతైనా ఉన్నది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ఈ తొలిదశ పోలింగ్ శాతం రెండో దశ పోలింగ్‌పై ప్రభావం చూపనున్నది.

ఉత్తరప్రదేశ్‌లో తొలిదశలో వాయవ్య ప్రాంతంలోని ఎనిమిది నియోజకవర్గాలలో పోలింగ్ జరగనున్నది. ఆ ప్రాంతంలో ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఈ కారణంగా సమాజ్‌వాది పార్టీ ఈ నియోజకవర్గాలలో మెరుగైన ఫలితాలను సాధించే అవకాశమున్నది. రైతుల ఉద్యమం కూడ ఈ ప్రాంత ప్రజలను బాగా ప్రభావితం చేసింది.

మహారాష్ట్రలో విదర్భ ప్రాంతం వలే మధ్యప్రదేశ్‌లో మహాకోశల్ ప్రాంతం ఇప్పటికీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నది. ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాలలో బీజేపీ జైత్రయాత్రను అడ్డుకునేందుకు విదర్భ, మహాకోశల్ ప్రాంతాలు ‘ఇండియా’ కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఒక మంచి అవకాశాన్ని సమకూర్చనున్నాయి. ఎగువ అసోంలోని అన్ని నియోజకవర్గాలకు, ఉత్తర బెంగాల్‌లోని మూడు స్థానాలకు నేడు పోలింగ్ జరగనున్నది. ఈ నియోజకవర్గాలు అన్నిటినీ 2019లో బీజేపీ గెలుచుకున్నది. బీజేపీ వాటిని ఈసారి మళ్లీ గెలుచుకోలేకపోవచ్చు. అయితే అసోం, బెంగాల్ రాష్ట్రాలలో బీజేపీతో దీటుగా తలపడేందుకు ప్రతిపక్ష కూటమి ఈ స్థానాలను గెలుచుకోవలసి ఉన్నది. ఈశాన్య భారతంలోని పర్వత ప్రాంతాల రాష్ట్రాలు అన్నిటిలోను ఒకటి రెండు చోట్ల మినహా అన్ని నియోజకవర్గాలలోను నేడు పోలింగ్ జరగనున్నది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రాబల్యాన్ని మణిపూర్ మహా విషాదం ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం లేదన్నది పరిశీలకుల అభిప్రాయంగా ఉన్నది.

బీజేపీ తన సిట్టింగ్ ఎంపీలలో సగం మందికి పైగా మళ్లీ టిక్కెట్లు ఇవ్వకపోవడం ‘ఇండియా’ కూటమికి మరొక విజయావకాశాన్ని సమకూర్చనున్నది. రాజస్థాన్‌లో తన 11 మంది ఎంపీలలో తొమ్మిది మందికి మళ్లీ టిక్కెట్లు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. అధికార పార్టీ అభ్యర్థిత్వాన్ని పొందలేకపోయిన ఆ తొమ్మిదిమందీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ‘ఇండియా’ కూటమి తన 48 మంది ఎంపీలలో 28 మందిని మళ్లీ పోటీకి నిలబెట్టింది. తమిళనాడులో తన 38 మంది సిట్టింగ్ ఎంపీలలో 18 మందిని మార్చి వేసింది.

క్లుప్తంగా చెప్పాలంటే ఉత్తరాదిన ఇండియా కూటమికి 2019 అనంతర అసెంబ్లీ ఎన్నికలలో లభించిన ఆధిక్యతలు ప్రస్తుత సార్వత్రక ఎన్నికలలో దానికి విజయావకాశాలుగా మారనున్నాయి. దక్షిణాదిన 2019లో ఈ కూటమి తాను గెలుచుకున్న సీట్లను విజయవంతంగా రక్షించుకుంటున్నది. అంతేకాకుండా తొలి దశలోనే ఆ సంఖ్యా బలానికి అదనంగా 10 నుంచి 15 సీట్లను చేర్చుకునే అవకాశమున్నది. అయితే రాజకీయ అవకాశాలు అంత తేలిగ్గా సమకూరుతాయా? అందునా మోదీ– అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రత్యర్థిగా ఉన్న పరిస్థితులలో అది మరీ కష్టం. ఇండియా కూటమి తొలిదశలోనూ చాలా సవాళ్లను అధిగమించవలసి ఉన్నది.

తమిళనాడులో తనకు ఉన్న స్థానాలు అన్నిటినీ నిలబెట్టుకోవడం ‘ఇండియా’కు ప్రథమ, అత్యంత ముఖ్యమైన సవాల్. సిట్టింగ్ ఎంపీలలో కొంతమందికి టిక్కెట్ నిరాకరించడం, మరికొంతమంది నియోజకవర్గాలను మార్చడం ఆ సవాల్‌ను అంగీకరించడమేనని చెప్పవచ్చు. ప్రస్తుత దశలో ఇండియాకు ప్రధాన ప్రత్యర్థి ఎన్‌డీఏ కాకుండా బలహీనపడిన అన్నాడీఎంకే అవడం గమనార్హం. బీజేపీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఎన్‌డీఏకు ప్రజల మద్దతును సమీకరించలేకపోయింది. ఫలితంగా తమిళనాడులో ఎన్‌డీఏ ఇప్పటికే ఒక బలహీన కూటమిగా ఉన్నది. భాగస్వామ్య పక్షమైన పీఎంకేకు రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకోదగిన శక్తి లేదు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, దినకరన్‌ ఉన్నప్పటికీ ఎన్‌డీఏ ప్రాబల్యం పెరగలేదు. అయితే బీజేపీ ప్రచార ఉద్ధృతి మూలంగా ఎన్‌డీఏ ఓట్ల వాటా పెరిగే అవకాశమున్నది. అంతేకాకుండా దీర్ఘకాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రముఖ శక్తిగా ఎన్‌డీఏ ఆవిర్భవించవచ్చు. అన్నాడీఎంకే– బీజేపీ కూటమి విచ్ఛిన్నమవడం వల్లే తమిళనాడులో త్రిముఖ పోటీలు జరుగుతున్నాయి. డీఎంకే వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బీజేపీ, దాని మిత్రపక్షాలు ఇండియా కూటమికి తోడ్పడవచ్చని భావిస్తున్నారు.

తమిళనాడుతో పాటు కాంగ్రెస్, బీజేపీల మధ్య ముఖాముఖి పోటీ జరగనున్న 45 నియోజకవర్గాలలో ఎన్‌డీఏకు తీవ్ర సవాళ్లు ఎదురుకానున్నాయి. వాటిలో 36 స్థానాలలో గత సార్వత్రక ఎన్నికలలో కూడా కాంగ్రెస్–బీజేపీ మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. బీజేపీ 30 స్థానాలను గెలుచుకున్నది. ఈ తొలిదశలో ఇండియా మెరుగైన ఫలితాలను సాధించాలంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో అత్యధిక స్థానాలను గెలుచుకోవలసి ఉన్నది.

2019లో బొటాబొటి మెజారిటీతో గెలుచుకున్న సీట్లు అన్నిటినీ కూడా ఇండియా మళ్లీ గెలుచుకోవలసి ఉన్నది. అటువంటి సీట్లు ఇండియాకు ఏడు ఉండగా, ఎన్‌డీఏకు ఐదు ఉన్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష కూటమి పరిస్థితి మెరుగ్గా ఉన్నది. ఇండియా కూటమి కొన్ని అంతర్గత, బాహ్య సవాళ్లను కూడ అధిగమించవలసి ఉన్నది. 14 సీట్లలో ఇండియా భాగస్వామ్యపక్షాలు పరస్పరం పోటీ చేస్తున్నాయి! పశ్చిమ బెంగాల్‌లో 3, లక్షదీవులులోని ఏకైక నియోజకవర్గం, అసోంలో మూడు స్థానాలలో ఇండియా భాగస్వామ్య పక్షాలు పరస్పర ప్రత్యర్థులుగా ఉన్నాయి. సరే, ఇండియా వెలుపల ఉన్న కొన్ని చిన్న పార్టీలు సైతం ఈ ప్రతిపక్ష కూటమికి నష్టం చేసే అవకాశమున్నది. తొలిదశ పోలింగ్ జరగనున్న 86 నియోజకవర్గాలలో బీఎస్‌పీ పోటీ చేస్తోంది. ఈ పార్టీ ఓట్ల వాటా ప్రతి ఎన్నికలలోనూ తగ్గుతూ వస్తోంది అయినా యూపీ, ఉత్తరాఖండ్‌లలో ఇండియా విజయావకాశాలను ఈ పార్టీ దెబ్బ తీసే ప్రమాదమున్నది. ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి 2019లో వలే బలంగా లేకపోవచ్చు గానీ విదర్భ ప్రాంతంలో ఇండియా కూటమి ఓట్లను ఈ పార్టీ కొల్లగొట్టే అవకాశమున్నది. రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ సింగ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన మద్దతుదారులైన జాట్‌లు, ముస్లిం ఓటర్లు హర్షించడం లేదు. అయినప్పటికీ ఆయన రాజకీయం ఇండియా కూటమి ప్రభావాన్ని తగ్గించే అవకాశమున్నది.

ఎన్నికల ప్రచారంలో గతంలో వలే ఆనందోత్సాహాలు కన్పించడం లేదు. ఎన్నికల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నది. పోలింగ్‌లో పాల్గొనే ఓటర్ల శాతం తక్కువగా ఉండవచ్చనేందుకు ఇది సూచనా? తొలిదశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలలో 2019లో 69.9 శాతం పోలింగ్ జరిగింది. జాతీయ సగటు కంటే రెండు పాయింట్లు అధికం. ముఖ్యంగా తమిళనాడు వెలుపల రాష్ట్రాలలో సగటు కంటే తక్కువ పోలింగ్ శాతం ఒక విస్తృత పోలింగ్ రీతిని సూచించవచ్చు. ఎన్నికల తొలి దశలో పోలింగ్ శాతాలు 18వ సార్వత్రక ఎన్నికలలో ప్రజల మనస్థితిని తెలియజేసే తొలి సూచన అవుతాయి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - Apr 19 , 2024 | 05:15 AM