Share News

కలలు సాకారమయ్యేది కష్టమే!

ABN , Publish Date - May 23 , 2024 | 05:31 AM

ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి అగ్నిపరీక్షగా ఉన్నాయి. దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలకు తోడు ప్రజల మనోభావాలు...

కలలు సాకారమయ్యేది కష్టమే!

ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి అగ్నిపరీక్షగా ఉన్నాయి. దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలకు తోడు ప్రజల మనోభావాలు, ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకుంటే మిగిలిన పార్టీల కంటే బీజేపీనే పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు సొంతంగా 370 సీట్లు సాధిస్తామంటోంది. కాంగ్రెస్‌ పార్టీ బలహీనతల దృష్ట్యా బీజేపీ బలంగా ఉన్నట్లు భావిస్తున్నా, సీట్ల సంఖ్య పెంచుకోవడం ఆ పార్టీకి కత్తిమీద సామే.

పాలనలో వైఫల్యాలు బీజేపీకి ఎన్నికల్లో ప్రతిబంధకం కానున్నాయి. ప్రధానంగా పేదరికం రేటు 11.28 శాతానికి చేరింది. నిరుద్యోగం పెరిగింది. చదువుకున్న వారిలో 20 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశం వెనుకబాటులో ఉంది. నూతన విద్యావిధానం పేరిట సంఘ్‌పరివార్‌ భావజాలాన్ని పెంచుకునేందుకు బీజేపీ యత్నించింది. ఆరోగ్యరంగంలో భారత్‌ అథమస్థానంలోనే ఉంది. జీడీపీలో ఈ రంగానికి కేటాయింపులు 1.2 శాతం మాత్రమే. మాతాశిశు మరణాలు ఎక్కువే. సామాన్యులకు వైద్యం ఖరీదైనదిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం లోపభూయిష్టంగా ఉంది. మౌలిక వసతుల అభివృద్ధిని గొప్పగా చెబుతున్నా దేశంలో ఇంకా పది శాతం గ్రామాలకు సరైన రోడ్లు లేవు. జాతీయ రహదారుల శాతం 24 గానే ఉంది. నగరాలు, పట్టణాల ప్రగతి అంతంత మాత్రమే. మెట్రో నగరాలు నీటికొరతతో తల్లడిల్లుతున్నాయి. దేశంలోని 19 శాతం గ్రామాలకు విద్యుత్‌ అందడం లేదు. సాగునీటి, తాగునీటి సమస్యలు పెద్దఎత్తున ఉన్నాయి. సహజ, వర్షాధారిత నీటి వనరులను సద్వినియోగం చేయడంలో కేంద్రం విఫలమయింది. రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడం లేదు. ట్రైబ్యునళ్లు, బోర్డుల పేరిట కాలయాపన చేస్తోంది. నదుల అనుసంధానం పేరిట కొత్త చిచ్చుకు తెరలేపుతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య తేడాల తీవ్రత పెరిగింది.


ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వాటిని నెరవేర్చకపోవడంలో బీజేపీ ముందంజలో ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించలేదు. దేశంలో 40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి దానిని నెరవేర్చకపోగా నల్లచట్టాలు తెచ్చి రైతులను మరింత నష్టపరిచేందుకు యత్నించింది. పంటలకు మద్దతు ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు పేరిట హంగామా చేసినా దాంతో ఒనగూరిందేమీ లేదు. పైగా దేశంలోని నల్లధనం తెల్లధనం అయింది. ప్రభుత్వరంగ సంస్థలను సద్వినియోగం చేయకపోగా వాటిని విక్రయించి, మూసివేసి ఆ వ్యవస్థను దెబ్బతీసింది. స్విస్‌బ్యాంకు నుంచి నల్లధనాన్ని తెప్పించి ప్రతీ పౌరుని ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి, చేతులెత్తేసింది.

రాష్ట్రాలతో సంబంధాలు సరిగా లేవు. సెస్‌ల పేరిట పన్ను వాటాలకు గండి కొట్టింది. అదానీ వంటి వారికి అండగా నిలిచి అపఖ్యాతి పాలయింది. పలువురు పారిశ్రామికవేత్తలు బ్యాంకుల్ని, ప్రజలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి విదేశాలకు పారిపోతే చూస్తూ ఊరుకుంది. మేక్‌ ఇన్‌ ఇండియా ఒక నినాదంగా మిగిలిపోయింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, నిర్వీర్యం చేస్తోంది.


బీజేపీ పదేళ్ల పాలనలో ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖలు పూర్తిగా అస్మదీయ శాఖలుగా మారిపోయాయి. తమకు గిట్టని, ఎదిరిస్తున్న వారిని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎన్డీయే ప్రభుత్వం వారి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంది. ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, మంత్రులను, ముఖ్యమంత్రులను కేసుల్లో ఇరికించి భయపెట్టి లొంగదీసుకొన్నది. లొంగని వారిని జైల్లో పెట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్, ఉత్తరాఖండ్‌ సీఎం సోరేన్‌ల అరెస్టులు రాజకీయ కక్షసాధింపులే. రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలని కూలగొట్టి ఫిరాయింపులకు కొత్త అర్థాన్ని చెప్పింది. దేశానికి ప్రగతి నమూనాలను చూపాల్సి ఉండగా... అందుకు భిన్నంగా ఆలయాలు, నినాదాలను చూపుతూ దాన్నే ఘనతగా చాటుకుంటోంది. విదేశాంగ విధానాలు విమర్శల పాలయినా సమీక్షించుకోలేదు. రిజర్వేషన్ల వంటి సున్నిత అంశాన్ని వివాదం చేసింది. కులగణన చారిత్రక అవసరమైనా దానిని చేపట్టేందుకు బీజేపీకి ధైర్యం చాలడం లేదు. భారత్‌ వెలిగిపోతుందనే అతి ప్రచారం 2004లో బీజేపీని దెబ్బకొట్టింది. ఇప్పుడు మితిమీరిన ప్రచారం ఆ పార్టీని నష్టపరిచే ఛాయలు కనిపిస్తున్నాయి.

మాయాజాలంతో ఓటర్లను తమవైపు తిప్పుకుంటామని బీజేపీ నేతలు కలలు కంటున్నా, అవి పూర్తిగా సాకారమయ్యేలా లేవు. ప్రజలు విజ్ఞలు... దేశ స్థితిగతులు, కేంద్రం పాలన తీరుతెన్నులు, హామీల అమలులో వైఫల్యాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకునే తమ తీర్పునిస్తారు. ప్రధానంగా సమస్యల వలయంలో ఉన్న పేదలు, ఉపాధి కోసం చూస్తున్న నిరుద్యోగులు, మద్దతు లేని రైతులు, ప్రగతికి నోచని మహిళలు, వెనకబడిన వర్గాల వారు... ఇలా అన్ని రంగాల వారు అన్ని విషయాలను బేరీజు వేసుకొనే తగిన నిర్ణయం తీసుకుంటారు. ప్రజల తీర్పు అన్నింటికీ ప్రామాణికంగా నిలుస్తుంది.

డాక్టర్‌ బిఎన్‌ రావు

బిఎన్‌రావు ఫౌండేషన్‌

Updated Date - May 23 , 2024 | 05:31 AM