Share News

హిందూ మతాన్ని మాత్రమే మీ చరిత్ర అంగీకరించదా?

ABN , Publish Date - Apr 17 , 2024 | 05:39 AM

‘మతాన్ని చరిత్ర అంగీకరించదు’ అంటూ ఏప్రిల్ 7న కొప్పర్తి వెంకట రమణమూర్తి రాసిన వ్యాసంలో మతం చరిత్రగా, చరిత్ర మతంగా మారుతున్న నేటి పరిస్థితుల్లో చరిత్రకు మతానికి ఉండే వైవిధ్యాన్ని...

హిందూ మతాన్ని మాత్రమే మీ చరిత్ర అంగీకరించదా?

‘మతాన్ని చరిత్ర అంగీకరించదు’ అంటూ ఏప్రిల్ 7న కొప్పర్తి వెంకట రమణమూర్తి రాసిన వ్యాసంలో మతం చరిత్రగా, చరిత్ర మతంగా మారుతున్న నేటి పరిస్థితుల్లో చరిత్రకు మతానికి ఉండే వైవిధ్యాన్ని ప్రశ్నించి సమాధానం రాబట్టుకోవలసిన అవసరం ఉందని చెబుతూ, హిందువులకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలను స్పృశిస్తూ, శ్రీకృష్ణుడు, శ్రీరాముని అవతార విషయాలను ప్రస్తావించారు. కానీ ఆ వ్యాసం ధోరణి చూస్తే కేవలం హిందూ మతాన్ని మాత్రమే చరిత్ర అంగీకరించదు అని చెప్పకనే చెప్పినట్లు ఉంది.

మతానికి వస్తువు దేవుడు, చరిత్రకు వస్తువు గతం – అంటే మానవునికి సంబంధించిన గతంలోని విషయాలు అని అర్థం. మతానికి వస్తువు దేవుడు అనేది క్రైస్తవం, ఇస్లాంలకు సంబంధించిన భాషణం. ముస్లింలను, క్రైస్తవులను మినహాయిస్తే (ప్రభుత్వ లెక్కల్లో చెప్పినట్లు) నానా కులాలుగా విడిపోయిన హిందువులు అనుసరించేది మతం కాదు. ఇది ఒక జీవన విధానం. ఈ జీవన విధానంలో ఏ సాంప్రదాయం, ఏ ఆచారం ఒకరి సొత్తుగా లేదు. హిందువులు అనుసరించే ఆచారాలు, సాంప్రదాయాలు ప్రార్థనా విధానాలు, ఆరాధనా పద్ధతులను లోతుగా అధ్యయనం చేసిన సుప్రీంకోర్టు హిందువులు పాటించేది ఒక జీవన విధానమే కానీ మతం కాదని తేల్చి చెప్పింది. ఇందుకు కారణం లేకపోలేదు. యజ్ఞోపవీతం ధరించి, నిత్యం నియమానుసారంగా గాయత్రీ మంత్రం జపించే బ్రాహ్మణుడికీ, కొండల్లో జీవిస్తూ కొండ దేవరను పూజించే కోయ జాతి వాడికీ ఆరాధనా విధానంలో ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. అయినప్పటికీ వీళ్లిద్దరిని హిందువులుగానే ఈ దేశ ప్రభుత్వం గుర్తిస్తుంది.

చరిత్రకు మతం లేదని చెప్పడం వాస్తవమేనా? ఇది వాస్తవమైతే క్రైస్తవ మతానికి సంబంధించిన క్రీస్తును చరిత్రను లెక్కించడానికి ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటున్నారు? చరిత్రకు మతం లేకపోవచ్చు. చరిత్ర తనకు తాను చెప్పుకోదు! చరిత్రను వ్యాఖ్యానించేది మానవులే కదా! చరిత్రను వ్యాఖ్యానించే వారిలో నిష్పాక్షికత లోపిస్తే ఒక మతంలోని విషయాలు మరుగునపడడమో, ఆ మతానికి దుర్వ్యాఖ్యలను జోడించడమో జరుగుతుంది కదా?

ఈ దేశ చరిత్రను రాసింది బ్రిటిష్‌వాళ్ళు. వేద సాహిత్యంలో భాగాలైన వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణికాలను ఆంగ్లీకరించింది పాశ్చాత్యులు. ఈ విషయంలో భారతదేశానికి సంబంధించిన సంస్కృత పండితులకు ఏ మాత్రం పాత్ర లేదు. భారత రాజ్యాంగ రచనా సభ్యులు మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించడంలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల రాజ్యాంగాలలోని ముఖ్య విషయాలను తీసుకున్నారనే విషయం సత్య దూరం కాదు. మన దేశానికి సంబంధించిన వేద సాహిత్యాన్ని విశ్లేషించే వామపక్షవాదులు ఇదే తంతును అనుసరించారు. ఈ వ్యాసంలోని నేపథ్యం కూడా అదే!

చరిత్ర నిజాన్ని ఆధారాలతో సహా తెలియజేస్తుందని చెప్పడం ఎంతవరకు వాస్తవం? 1922లో హరప్పా, మొహంజోదార ప్రాంతాలలో సింధూ నాగరికత శిథిలాలు బయటపడేంత వరకు భారతదేశానికి పురాతన చరిత్ర లేదని బ్రిటిష్ చరిత్రకారులు వాదిస్తూ వచ్చారు. అంతవరకు భారతదేశ చరిత్ర గురించి చెప్పిన చారిత్రక విషయాలు అసత్యాలుగా మారిపోయాయి. 40 సంవత్సరాల క్రితం ఫ్లూటో సౌర కుటుంబంలో ఒక గ్రహం అని చెప్పింది చరిత్ర. ఇప్పుడు ఆ సత్యం కాస్తా అసత్యమై నిలబడింది. అంటే గతానికి అంటే చరిత్రకు సంబంధించిన విషయాలలో కొత్తవి చేరినప్పుడు పాతవి అసత్యాలుగా మిగిలిపోతాయి. ఋగ్వేద రచన క్రీస్తు పూర్వం 2000–1500 సంవత్సరాలలో జరిగి ఉండవచ్చునని, ఎవరో రస హృదయులు రాశారని చెప్పడం వాస్తవమేనా?

ఇక ఆధ్యాత్మిక సాహిత్యంలోని దేవాసుర సంఘర్షణను బ్రిటిష్‌వాళ్లు అల్లిన కట్టుకతల చరిత్ర అయిన ఆర్య ద్రావిడ వాదంతో అనుసంధానం చేయడం వ్యాసకర్త చేసిన విచిత్రమైన విన్యాసం. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ జాత్యాహంకారం ఓడించబడటంతో ఆర్యులు ఒక జాతి అనే వాదం ప్రపంచంలో తిరస్కరించబడింది. కానీ భారతదేశంలోని వామపక్షవాదులు దానినే పట్టుకొని ఊగులాడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ వాదాన్ని వదులుకుంటే వామపక్ష చరిత్రకారులకు, వామపక్ష మేధావులకు, వామపక్ష నాయకులకు మనుగడ ఉండదు.

ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనపై 1857లో భారతదేశంలో అన్ని ప్రాంతాల ఆచార సాంప్రదాయాలకు అతీతంగా తిరుగుబాటు చేశారు. దీనిని ప్రథమ భారత స్వాతంత్ర సమరం అంటారు. ఈ సమరం బ్రిటిష్ పాలకులు మేధావుల ఆలోచనలను మార్చింది. ఈ దేశంలో బ్రిటిష్ పాలనను స్థిరీకరించుకోవడానికి ఆర్య ద్రావిడ వాదాన్ని, హిందువులు ముస్లింలు వేరు వేరు జాతులవారు అనే ద్విజాతి సిద్ధాంతాన్ని (సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ చేత చెప్పించి) భారతీయుల బుర్రల్లోకి ఎక్కించారు. ముస్లిం లీగ్, ద్రవిడ పార్టీలు బ్రిటిష్ వాళ్లకు అనుకూలంగా, స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశాయనే విషయం చాలామంది భారతీయులకు తెలియదు. వేద జ్ఞానానికి మూలపురుషుడైన వేద వ్యాసమహర్షిని ‘వ్యాసుడనే ఋషి నాలుగు వేదాలను వర్గీకరించాడంట’ అని వ్యంగంగా చెప్పడం వెనుక భారతీయ రుషి పరంపర పైన వ్యాసకర్తకు ఉండే వ్యతిరేక భావన అర్థమైంది.

మతం హఠాత్తుగా మొదలవుతుందని ఒకచోట చెప్పి, మానవ నాగరికతలో ఒక పనిముట్టు, ఒక వ్యవస్థ రూపాంతరము చెందినట్లు, మత భావనలు కూడా రకరకాలు రూపాలు తీసుకుంటాయని మరోచోట చెప్పడాన్ని బట్టి వ్యాసకర్త భారతీయ సాంస్కృతిక విషయాలలోని క్లిష్టతను అర్థం చేసుకోలేదనిపిస్తోంది. అసలు మతాన్ని చరిత్ర రూపంలోకి ఎందుకు తీసుకొచ్చినట్టు? శివుడిని లింగ రూపంలో ఎందుకు ప్రతిష్టిస్తారు? దీనికి ఆధ్యాత్మికపరమైన కోణాన్ని అర్థం చేసుకోకుండా, చిత్త చాంచల్యంతో, లైంగిక పరిభాషలో విశ్లేషించడం విజ్ఞత అనిపించుకోదు.

కొండా సుమంత్ రెడ్డి

సామాజిక విశ్లేషకులు

Updated Date - Apr 17 , 2024 | 05:39 AM