Share News

పూల పండుగకు ప్రజాస్వామ్య పరిమళాలు

ABN , Publish Date - Oct 10 , 2024 | 04:48 AM

తెలంగాణలో ఒక తరం ముందు దళిత హిందువులను అడగండి, వాళ్ళు ఎప్పుడైనా బతుకమ్మ ఆడారో.. మేమెప్పుడూ బతుకమ్మ ఆడలేదు. టౌన్లలో పల్లెల్లో అగ్ర కులాలు, వడ్ల, శూద్ర, కమ్మరి, పద్మశాలి, తెనుగు, గొల్ల, ఇతర శూద్ర కులాల స్త్రీలు పగలంతా...

పూల పండుగకు ప్రజాస్వామ్య పరిమళాలు

‘‘నల్ల పోచమ్మకు మొక్కులే కానీ దసరాకు

నవ దుర్గలు లేవు. నవ రాత్రులు లేవు’’

తెలంగాణలో ఒక తరం ముందు దళిత హిందువులను అడగండి, వాళ్ళు ఎప్పుడైనా బతుకమ్మ ఆడారో.. మేమెప్పుడూ బతుకమ్మ ఆడలేదు. టౌన్లలో పల్లెల్లో అగ్ర కులాలు, వడ్ల, శూద్ర, కమ్మరి, పద్మశాలి, తెనుగు, గొల్ల, ఇతర శూద్ర కులాల స్త్రీలు పగలంతా గునుగు పువ్వు కొని, ఆ పూల దంట్లకు రంగులు వేసి ఆరబెట్టేవాళ్ళు. ఇతరకులాల స్నేహితురాళ్ళ ఇళ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మలు, పిన్నమ్మలు, వదినెల చేతివేళ్ళకు ఆకుపచ్చ రంగు, ఊదా రంగు ఉండడం చూసేవాళ్ళం.

అత్తగారి ఇళ్ల నుండి పుట్టింటికి వచ్చిన అక్కలకు, బావలకు మర్యాదలు, పిండవంటల ఘుమఘుమలు, సాయంత్రం బతుకమ్మ ప్రసాదాల తయారీతో వాళ్ళ ఇళ్ళు చాలా సందడిగా ఉండేవి. మా టౌను చుట్టుపక్కల పల్లెల నుండి మా చుట్టాలు అత్తలు, వరుసయ్యి చిన్నమ్మలు, అక్కలు తెల్లవారుజమున్నె గునుగు పువ్వు ఎత్తుకొని వచ్చి బజార్లో, ఇల్లిల్లూ తిరిగి అమ్మి ఊళ్లకు మల్లేవాళ్ళు.

మనం ఎందుకు బతుకమ్మ పండుగ చేసుకోము అంటే మనకు (మాలా, మాదిగలకు) ఉండదు అని చెప్పేవాళ్ళు. కారణం అడిగితే ఎవరో ఒక మాదిగ స్త్రీ చేనులో పొద్దంతా చచ్చే కష్టం చేసొచ్చి, సాయంత్రం అలసిపోయి దొరికిన పూలతో బతుకమ్మ పేర్చిందట. తన గుడిసెలో వట్టి తునకలు తప్ప నైవేద్యం పెట్టడానికి ఏమీ లేవట. ఆ తునకలనే ఒక చిప్పలో వేసి బతుకమ్మ మీద పెట్టుకొని వీధిలోకి పోగా ఒక కాకి వచ్చి తునకలను అందుకొని ఎగిరిపోయిందట. అప్పుడు బతుకమ్మకు కోపం వచ్చి మీరు ఈ పండుగ చేసుకోవద్దు అన్నదట.


అయితే బేసిక్‌ ప్రశ్న బతుకమ్మ ఒక దేవతా? నవ దుర్గల్లో ఏ స్వరూపం? దసరా నాడు మేకలు, గొర్లు కోసి రక్తాలు వారగా పోసి, పొలిచల్లె దేవతకు మాంసాహారం ఎందుకు నచ్చలేదు?

అసలు కారణం బతుకమ్మ లాంటి ఆటవిడుపు పండుగలో పని నుండి శ్రామిక అట్టడుగు స్త్రీలకు మినహాయింపు ఇవ్వాల్సి వస్తుందని, అట్టడుగు స్త్రీలను దూరంగా పెట్టడం అనే దురాచారమే కారణం.

పూలను పూజించి, Pubertyనీ, సంతాన భాగ్యాన్ని గ్లోరిఫై చేసే పండుగగా బతుకమ్మను ప్రముఖ చరిత్రకారుడు రామోజు హరగోపాల్‌ అభివర్ణించారు. Infant deaths.. వరుసగా పిల్లలు పుట్టి చనిపోవడంతో పిల్లల్ని బతికించుకోవాలని, వాళ్ళకు పుల్లయ్య, బిచ్చం / బుచ్చమయ్య / బతుకయ్య లాంటి పేర్లు పెట్టుకోవడం చేసేవాళ్ళు. బిడ్డలను భిక్షగా ప్రసాదిస్తే భిక్షం / బుచ్చయ్య లాంటి పేర్లు పెట్టడం పరిపాటి. బతుకమ్మ కూడా అట్లాంటి గర్భధారణ, సంతానోత్పత్తి, డెలివరీకి సంబంధించిన స్త్రీ ఆరాధన అయి ఉండవచ్చు.


నిజాం కాలంలో శూద్ర కులాల స్త్రీలు, అందరూ కలిసి ఆయా గ్రామాల జమీందార్ల, పటేళ్ల.. గడీలు అనబడే నివాసాలకు, బతుకమ్మలను తీసుకొని వెళ్ళి, అక్కడ అంతా కలిసి బతుకమ్మ ఆడేవాళ్ళు. ఒక్కోసారి అక్కడి దొరల భార్యలు కూడా బతుకమ్మ ఆడేవాళ్ళతో కొంతసేపు ఆడేవాళ్ళు. దొరలకు ఊరంతా తమ వద్దకు వచ్చి బతుకమ్మ ఆడటం ఒక గొప్ప ప్రతిష్ఠగా ఉండేది. తెలంగాణలో బతుకమ్మను మినహాయిస్తే ఒకప్పుడు దసరా అంటే పెత్రమాస (మహాలయ అమావాస్య), మానాయి, దసరా మూడు రోజులే జరుపుకొనేది.

బతుకమ్మ పాటలు పరిశీలిస్తే శూద్ర, అతిశూద్ర, శ్రామిక వర్గ స్త్రీల వెతలనే కబుర్లుగా, పాటలుగా పాడుకునేవాళ్ళు అని అర్థం అవుతుంది. రోజూ వారి ఇంటా బయటా పనులు చేసుకొనే స్త్రీలు వాళ్ళకు ఎదురయ్యే అనుభవాలుగా పాటలయ్యాయి.. ఉదాహరణకు ‘‘రాగి బిందె దీస్క రమణీ నీళ్ళకు వోతె రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన’’ లాంటివి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, ఉద్యమంలో తెలంగాణ సంస్కృతికి, ఆటపాటలకు, బతుకమ్మ లాంటి పండుగలకు ఎనలేని ప్రాముఖ్యం లభించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ ఆట పాట ప్రముఖ పాత్ర పోషించింది తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలియకుండానే ఒక గొప్ప Cultural Unification జరిగింది. కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా ఉద్యోగులు, భిన్న వర్గాల స్త్రీలు బతుకమ్మలు పేర్చారు. బతుకమ్మ పాటలు కంఠతా పట్టారు. దళిత, గిరిజన, ముస్లిం, క్రిస్టియన్‌ స్త్రీలు, పురుషులూ వందల్లో వీధుల్లో బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు, పాడారు.


తెలంగాణ ఉద్యమం బతుకమ్మను డెమోక్రటైజ్‌ చేసింది. కొద్ది కులాల స్త్రీలు మాత్రమే ఆడుతుండగా దూరంగా నిలబడి చూసే దళిత గిరిజన స్త్రీలు నేడూ బతుకమ్మ సంబరాల్లో, వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు. ఇదివరకు ఎన్నడూ లేనిపండుగను ఓన్‌ చేసుకొన్నారు.. వివిధ రంగుల పూలతో బతుకమ్మలను పేర్చడం, పూజలు చెయ్యడం నేర్చుకున్నారు. ఇప్పుడు కుల మతాలకు అతీతంగా కొత్తబట్టలు కట్టుకుని, పూల దొంతరల చుట్టూ, దాండియాలు ఆడుతున్నారు. చేతుల్లో కోలలతో నృత్యాలు చేస్తున్నారు.

ఈ మధ్య తరచూ వాట్సాప్‌ గ్రూప్‌లలో సంప్రదాయంగా ఆడండి, డీజేలు వద్దు, అంటూ పాత పద్ధతుల్లో బతుకమ్మ ఆడే పల్లెటూరి స్త్రీల వీడియోలు షేర్‌ చేస్తున్నారు. ఆ పాత పద్ధతిన ఆడే స్త్రీలల్లో దళిత స్త్రీలు ఉండరు. ఎందుకంటే పాతతరం దళిత స్త్రీలకు బతుకమ్మ లేదు.

ఇప్పుడు బతుకమ్మ... Has widened the Horizons of Festivity... ఇప్పుడు Bathukamma has reached a cult status. Bathukamma is now a Regional Entity.

సంప్రదాయవాదులు.. ధర్మపరిరక్షకులూ ఇప్పటి అమ్మాయిల బతుకమ్మ ఆటలను విమర్శించే ముందు వినాయక నిమజ్జనాల సందర్భంగా తాగి చిందులేసి తీన్మార్‌లను గుర్తుచేసుకోండి. అంతకన్నా అధ్వానంగా ఏమీ లేవు బతుకమ్మ ఆటలు.


పండగ ఏదైనా ఒక సందోహం, ఒక ఆటా పాటా... ముఖ్యంగా బతుకమ్మ మహిళల పూల పండుగ. స్త్రీత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకొనే పండుగ. ఆడనివ్వండి, పాడనివ్వంటి.. మనసు విప్పి ఎలాంటి inhibitions లేకుండా కోలాటాలు వెయ్యనివ్వండి. గాజుల చప్పుళ్ళతో గంతులు వేయనివ్వండి.. పేదా, గొప్పా, ఈ కులమూ ఆ కులమూ అననివ్వని నేటి బతుకమ్మ అసలు పండుగ.

రండి.. ఆడుదాం బతుకమ్మ.. బాజాప్త, బరొబర్‌

రజిత కొమ్ము

Updated Date - Oct 10 , 2024 | 04:48 AM