Share News

ప్రజాస్వామ్య వస్త్రాపహరణం!

ABN , Publish Date - May 31 , 2024 | 02:12 AM

ఎన్నికల సంఘం నియమావళిని, నిబంధనలను బేఖాతరు చేస్తూ అధికార పార్టీ వైసీపీ నాయకులు ధనం, అధికారం, పోలీసు బలంతో బరితెగించి ఇటీవల జరిగిన సార్వత్రక ఎన్నికల్లో...

ప్రజాస్వామ్య వస్త్రాపహరణం!

ఎన్నికల సంఘం నియమావళిని, నిబంధనలను బేఖాతరు చేస్తూ అధికార పార్టీ వైసీపీ నాయకులు ధనం, అధికారం, పోలీసు బలంతో బరితెగించి ఇటీవల జరిగిన సార్వత్రక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఎన్నికల ప్రక్రియను జగన్ ప్రభుత్వం గుప్పెట పట్టి ఇష్టానుసారం చెలరేగిపోయినా స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించలేదు. ఆదర్శంగా ఉండాల్సిన కొందరు అధికారులు జగన్ ప్రలోభాలకు ఆశపడి ప్రజాస్వామ్య వ్యవస్థని కుప్పకూల్చారు. ఎన్నికల సంఘం మొదటి నుంచి కఠినంగా వ్యవహరించి ఉంటే అధికారపార్టీ నాయకుల విధ్వంసానికి, హింసకి అడ్డుకట్ట పడేది.


ప్రతి ఒక్క ఓటరూ స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని పదేపదే ప్రకటనలు గుప్పించినా, ఆచరణలో ఎన్నికల సంఘం ఘోర వైఫల్యం చెందింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకొనే అవకాశం ఉందని ముందే తెలిసినా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తం కాలేదు. దాంతో పోలింగ్‌ తర్వాత రోజు కూడా అనేక ప్రాంతాల్లో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలోనూ ఈసీ వైఫల్యం చెందింది.


గతంలో ఎన్నికల్లో దాడులు, ఘర్షణలు, హత్యలు అంటే బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు గుర్తుకువచ్చేవి, ప్రస్తుతం వాటిని మించి ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. వైసీపీ శ్రేణులు ఎన్నికల రోజు, తర్వాత రోజు మారణాయుధాలతో తిరుగుతూ రాయలసీమ, పల్నాడు పల్లెలను భయకంపితం చేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ నాయకులు సాగించిన దమనకాండను రాష్ట్ర ఎన్నికల సంఘం కళ్లుండీ కబోదిగా వ్యవహరించింది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరగడంతో వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించి అక్షింతలు వేసి, ఆయా జిల్లాల్లో కొందరు పోలీస్‌ ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేసింది. మరికొందరిపై బదిలీ వేటు వేసింది. కొన్ని జిల్లాల అధికారులపై ఈసీ చర్యలు తీసుకొన్నా దాని వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు.


రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో 12,438 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. వీటిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 31,385 పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో లోపలా, బయటా వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా జిల్లా, రాష్ట్రస్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించే ఏర్పాట్లు చేపట్టి, ఇందుకు సుమారు 150 మంది సిబ్బందిని కేటాయించామన్నారు. కానీ తొమ్మిది పోలింగ్‌ కేంద్రాల్లో దౌర్జన్యకారులు ఈవీఎంలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రాన్ని అత్యంత సమస్యాత్మక కేంద్రంగా ఎన్నికల సంఘం గుర్తించినా, ఇక్కడ కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రత కోసం వినియోగించడం దారుణం. ఇదే బూత్‌లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్‌ మెషిన్లను నేలకేసి కొట్టి పగులగొట్టారు. ఎన్నిక జరిగిన 13వ తేదీన ఈవీఎంను ధ్వంసం చేస్తే, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన తర్వాత కానీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చెయ్యలేదంటే... దారుణ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం కాదా?

నీరుకొండ ప్రసాద్

Updated Date - May 31 , 2024 | 02:12 AM