Share News

ప్రజాస్వామ్యం డొల్లతనాన్ని నాడే పసిగట్టిన అంబేడ్కర్

ABN , Publish Date - Apr 13 , 2024 | 03:21 AM

‘ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే హంగులెన్ని ఉన్నా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజానికి వంశపారంపర్య పాలక వర్గాలతోనూ, వంశపారంపర్య పాలిత వర్గాలతోనూ కూడిన ప్రభుత్వమే’...

ప్రజాస్వామ్యం డొల్లతనాన్ని  నాడే పసిగట్టిన అంబేడ్కర్

‘ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే హంగులెన్ని ఉన్నా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిజానికి వంశపారంపర్య పాలక వర్గాలతోనూ, వంశపారంపర్య పాలిత వర్గాలతోనూ కూడిన ప్రభుత్వమే’ – ఇవి అంబేడ్కర్ మాటలు. 1943 సెప్టెంబర్‌లో ‘ఆలిండియా ట్రేడ్ యూనియన్ వర్కర్స్ స్టడీ క్యాంపు’లో ముగింపు ఉపన్యాసంలో అంబేడ్కర్ ఈ మాటలన్నారు. వంశపారంపర్య పాలననీ కుటుంబ పార్టీలనీ ఓడించటానికే ఈ ఎన్నికలు అని మోదీ రోజూ చెప్పుకు తిరుగుతున్న తరుణంలో దీని మూలకారణాలేమిటో తెలుసుకోటం అవసరం. 1943 అంటే స్వతంత్రం ఇంకారాలేదు. కానీ అప్పటికే అంబేడ్కర్ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గూర్చి ఇండియా చర్చలు సాగిస్తున్నది’ అంటూ ఇలా చెప్పారు: ‘తస్మాత్ జాగ్రత్త! పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైకి కనిపించినట్టుగా అత్యుత్తమ వ్యవస్థేమీ కాదని భారతీయులకు చాటిచెప్పగల ధైర్యవంతుడి అవసరం ఉంది.’ ఈ ఉపన్యాసంలోని అనేక భావనల్ని పాలకవర్గ పండితులూ, అంబేడ్కర్ వాదులే కాదు, వామపక్షీయులు కూడా తెలిసో తెలియకో ఉటంకించరు. తెలిసినవారూ మరుగుపరుస్తుంటారు. నేటి పార్లమెంటు ఎన్నికల తరుణంలో ఈ ఉపన్యాసంలోని భావనల క్లుప్త పరిచయమే ఈ వ్యాసం.

‘అన్ని రాజకీయ సమాజాలూ పాలక, పాలిత వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి. ఇదొక దుర్లక్షణం. ఈ దుర్మార్గం అక్కడికి ఆగితే అంతగా పట్టించుకోనక్కర్లేదు. కానీ ఇంకా దౌర్భాగ్యం ఏమిటీ అంటే ఈ చీలిక ఒక మూస లాగా తయారై, వర్గాల దొంతరగా ఘనీభవించి పోయింది. ఎంతగా అంటే పాలకులు ఎల్లప్పుడూ పాలకవర్గాల నుంచే ఉంటారు, పాలితులు ఎప్పటికీ పాలకవర్గాలు కాజాలరు. ప్రజలు తమ్ముతాము పరిపాలించుకోరు. ప్రభుత్వం ఏర్పాటవుతుంది, దాన్ని పాలకవర్గాలకు వదిలేస్తారు. ఇది తమ ప్రభుత్వం కాదన్న విషయాన్ని ప్రజలు మర్చిపోతారు. కాబట్టి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ‘ప్రజల యొక్క – ప్రజల చేత’ ప్రభుత్వం ఏనాడూ కాదు, ఫలితంగా ‘ప్రజల కొరకు’ ప్రభుత్వంగా ఎన్నడూ లేదు. రాజకీయ జీవనం ఇలా దుర్మార్గంగా నిర్మితమై ఉన్నందున ఈ ప్రజాస్వామ్యం ఘోర వైఫల్యంగా మిగిలిపోయింది,’ అని తీర్మానించారు అంబేడ్కర్.

యూరప్‌లో నిరంకుశ ఫ్యూడల్ రాజరికాలు ప్రజాస్వామిక విప్లవాల్లో పతనమైపోయాయి. ముఖ్యంగా ఫ్రెంచి విప్లవ పర్యవసానమే ‘స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం’ అన్న ప్రజాస్వామిక భావనలు. అయితే అవి చాలా పరిమితమైనవనీ, ఆధునిక పెట్టుబడిదారీ దోపిడీకి ఆలంబనలనీ తర్వాత (రష్యాలోనూ, చైనాలోనూ వచ్చిన శ్రామికవిప్లవాల ద్వారా) రుజువైంది. పెట్టుబడిదారీ (బూర్జువా) ప్రజాస్వామ్యం స్థానంలో ప్రజలకు చెందిన ‘జనతా ప్రజాస్వామ్యం’ అన్న పద్ధతికి అవి నాంది పలికాయి. దారుణ దోపిడీ పద్ధతుల్ని రద్దు చేసిన విప్లవాలుగా, మానవాళి మహాప్రస్థానంలో చారిత్రక మైలురాళ్లుగా అవి నిలిచాయి. సామ్రాజ్యవాదం ఎంత నిర్దాక్షిణ్యంగా, విధ్వంసకారిగా ఉంటుందో 1943 సెప్టెంబర్ నాటికి ప్రపంచయుద్ధంతో తేటతెల్లమైంది. ఆధునికయుగ విహంగవీక్షణం చేస్తూ అంబేడ్కర్ ఇలా అంటారు: ‘నిరంకుశ రాజరికాలకు వ్యతిరేకంగా సుదీర్ఘమైన, రక్తపాతంతో కూడిన పోరాటాల తర్వాత వాటి స్థానంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నెలకొన్నది. పాలనా వ్యవస్థలో ‘ఇదే ఆఖరి మాట’ అని తొలుత భావించారు. ప్రతి మానవుడికీ స్వేచ్ఛ, ఆస్తి, సుఖ సంతోషాలూ లభించే కొత్త సహస్రాబ్ధిలోకి అడుగుపెడుతున్నాం అని నమ్మారు. అయితే ఆశ్చర్యకర పరిణామాలు సంభవించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సార్వజనీనంగా ఆమోదించి శతాబ్ది కూడా కాకుండానే ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చింది. ఫాసిజం ఉన్నచోటే కాక, ఇతర దేశాల్లోనూ తిరుగుబాటు వచ్చింది’ అని అంబేడ్కర్ ఎత్తి చూపారు. అలాంటి తరుణంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కావాలని ఇండియా బ్రిటన్‌తో చర్చలు జరుపుతున్నదంటూ, ‘పైకి కనిపించినట్టుగా ఇదేమీ అత్యుత్తమ వ్యవస్థ కాదని వారికి చెప్పే ధైర్యం ఎవరైనా చేయాలి’ అని అంబేడ్కర్ కోరారు! పెట్టుబడిదారీ దేశాల్లోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు వర్గస్వభావాన్ని అంబేడ్కర్ చర్చించారు కానీ, ఇండియాలో అది మరింత వికృత రూపాలు దాల్చింది. భూస్వామ్య విధానాన్ని రద్దుచేసి దున్నేవారికే భూమిని పంచకుండా, నిజమైన ప్రజాస్వామ్యానికి పునాదైనా పడదు. అయినా అర్ధవలస, అర్థఫ్యూడల్ పునాదుల్ని అలాగే ఉంచి ఉపరితల వ్యవస్థగా, పై మెరుగుగా మనదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక్కడా బ్రిటిష్ పాలనా పద్ధతులే కావాలని మన దళారీ పెట్టుబడిదారీ పాలకవర్గాలూ, వారి రాజకీయ ప్రతినిధులూ కోరుకున్నారు.

1942 క్విట్ ఇండియా మూలంగా ఆగ్రహించిన బ్రిటీష్ వారితో బేరసారాల ప్రక్రియ ఆగిపోయిన తరుణంలో టాటాబిర్లాలు బ్రిటిష్ పాలకులతో మంతనాలు జరిపి, వారితో రాజీకీ, ‘కామన్వెల్త్‌కి లోబడిన డొమినియన్‌లో బ్రిటిష్ నమూనా పాలన’కూ పునాదులు వేశారు. 1935 రాజ్యాంగ నకలుగా, బ్రిటిష్ పాలకులిచ్చిన రెండు ముసాయిదాల ఆధారంగా రూపొందినదే 1950 రాజ్యాంగం. ఈ వైరుధ్యాలన్నీ అంబేడ్కర్‌కు బాగా తెలుసు. అందుకే తుదిముసాయిదా ఆమోదం సందర్భంగా 1949 నవంబర్ 25 నాటి రాజ్యాంగ సభ ఉపన్యాసంలో ఇలా హెచ్చరించారు: ‘1950 జనవరి 26 నాడు మనమొక వైరుధ్యాలమయమైన జీవనంలోకి అడుగుపెడుతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది కానీ, సామాజిక–ఆర్థిక జీవనంలో అసమానత అలాగే ఉంటుంది. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించి తీరాలి. లేకపోతే ఈ రాజ్యాంగ సభ ఎంతో కష్టపడి నిర్మించిన ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థని అసమానతలకు బలైన వర్గాలు విధ్వంసం చేస్తారు.’ వంశపారంపర్య పాలకులతో కూడిన మన దేశ కుహనా ప్రజాస్వామ్యం నెహ్రూ గాంధీ కుటుంబాల కోరిక మేరకే ఏర్పడలేదనీ, దానికి మన వ్యవస్థలో చాలా లోతైన పునాదులున్నాయనీ పై వివరణ తెలియజేస్తున్నది.

నిజానికలాంటి కుటుంబాలు కాంగ్రెసుకే పరిమితం కాలేదు. గ్వాలియర్ రాజమాత సింధియా మొదలైన ఫ్యూడల్స్‌ దేశవ్యాప్తంగా నాటి జనసంఘ్ పార్టీకి పునాదులు వేసి రాజపోషణ చేశారు. ఇందిరమ్మ రాజభరణాలు రద్దుచేస్తే వాజపేయీ వారిపక్షానే పార్లమెంటులో వ్యతిరేకించారు. మనది అనాదిగా ప్రజాస్వామ్యమేనని సంఘీయులు చెప్తుంటారు: భరతుడు పద్నాలుగేళ్ల పాటు చెప్పులు సింహాసనంపై పెట్టి ఏలిన రామరాజ్యమూ, వారసత్వ హక్కుకై పోరాడిన ఝాన్సీరాణీ మన ఆదర్శం. అనేకమంది మాజీ ముఖ్యమంత్రుల్నీ కాదని, కర్ణాటకలో యడ్యూరప్ప కొడుకుని రాష్ట్ర బీజేపీ నేతగా నియమించారు; అవినీతి అంటూ తామే పార్టీ నుంచి బహిష్కరించిన నేత ఆయన. అవినీతి అవసరం గుర్తించిన మోడీ–షాలు గనుల రారాజులైన గాలి జనార్దనరెడ్డి సోదరులకు బళ్ళారి రాజ్యాన్ని మళ్లీ ఈ మధ్యే అప్పగించారు. మైసూరు మహారాజా మనవడిని లోక్‌సభకు అభ్యర్థిగా నిలబెట్టారు. ఇన్ని చెప్పిన అంబేడ్కర్ తర్వాత ఆ వ్యవస్థతోనే రాజీ పడ్డారు కదా అంటే – నేనొక కిరాయి రచయితని (hack), ఇష్టంలేని పనులన్నీ చేసాను, ఈ రాజ్యాంగాన్ని తగులబెడుతాను అన్న మాటలే ఆయనిచ్చిన సమాధానం.

ఎమ్. జయలక్ష్మి

రిటైర్డ్ ఏజీఏం, ఆప్కాబ్

Updated Date - Apr 13 , 2024 | 03:21 AM