Share News

వంచన పాలైన పాలమూరు – ఇంకా వలసే దిక్కైన ప్రజలు!

ABN , Publish Date - May 09 , 2024 | 06:01 AM

పదేళ్ళు కావస్తున్నా ‘పాలమూరు – రంగారెడ్డి’ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. 2015లో పరిపాలనా అనుమతిని లభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనా వ్యయం రెండింతలు అయ్యింది. 2004–2014 మధ్య కాలంలో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని...

వంచన పాలైన పాలమూరు – ఇంకా వలసే దిక్కైన ప్రజలు!

పదేళ్ళు కావస్తున్నా ‘పాలమూరు – రంగారెడ్డి’ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. 2015లో పరిపాలనా అనుమతిని లభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనా వ్యయం రెండింతలు అయ్యింది. 2004–2014 మధ్య కాలంలో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉంది. నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా దేశంలో ఆహార కొరతను తీర్చవచ్చు అని భావించి 11వ పంచవర్ష ప్రణాళిక (2007–12)లో రాష్ట్రాలలో నిర్మించే బహుళార్ధక సాధక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ హోదా కల్పించబడిన ప్రాజెక్టులకు 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగిలిన 10 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇందులో భాగంగా యూపీఏ ప్రభుత్వం దేశంలో 16 ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించింది. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలనేది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ సంకల్పం. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తమకు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే ఉద్దేశం లేదని ప్రకటించింది. ఇక 2022లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎమ్‌కేఎస్‌వై) కింద ప్రాజెక్టుల గుర్తింపు నిధుల కేటాయింపునకు సంబంధించి కొత్త నిబంధనలను జారీ చేసింది బీజేపీ ప్రభుత్వం. దీని ద్వారా దేశంలో ఇకపై ఏ సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయహోదా లభిస్తే 90శాతం బదులు 60శాతం నిధులను మాత్రమే కేంద్రం ఇస్తుంది. మిగిలిన 40శాతాన్ని రాష్ట్రాలు భరించాలి. దీనిని బట్టి వ్యవసాయ రంగం సాగు, తాగు నీటి రంగాలపై బీజేపీ దృష్టికోణం ఏమిటో అర్థమవుతున్నది.


కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌ సాక్షిగా కొత్తగా ఏ రాష్ట్రానికి జాతీయ హోదా ప్రాజెక్టు ఇవ్వమని ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టు జాతీయ హోదా విషయంలో ప్రత్యేకించి దక్షిణ తెలంగాణకు చెందిన కేంద్ర క్యాబినెట్‌ మంత్రి కిషన్‌రెడ్డి తన సొంత జిల్లా రంగారెడ్డిలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందుతుందని తెలిసి తనే ముందుండి జాతీయ హోదా సాధించుకు రావల్సింది పోయి దేశంలో తెలంగాణ కంటే పేద రాష్ట్రాలు చాలా ఉన్నాయనీ, ఒకవేళ దేశంలో ఏ రాష్ట్రానికైనా జాతీయ హోదా ఇస్తే తెలంగాణ ప్రాజెక్టు తీసుకువస్తానని మీడియా సాక్షిగా ప్రకటించారు. మరి సరిగ్గా కర్ణాటక ఎన్నికలకు కొన్ని నెలల ముందు కర్ణాటక రాష్ట్రంలోని అప్పరభద్ర ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా 2023–2024 బడ్జెట్‌లో రూ.5300కోట్లు కేటాయించింది. మిగతా రాష్ట్రాల అభ్యంతరాలు పట్టించుకోకుండా కేంద్ర జల సంఘం వెంటనే అనుమతి ఇచ్చేసింది. ఆ వెంటనే కేంద్రంలో మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపేసింది. ఇన్ని జరుగుతున్నా ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు తమ ప్రాంత హక్కుల కోసం ఎందుకు నోరు మెదపలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి.


తెలంగాణ ఏర్పడిన తరువాత 2015లో మొదలైన పాలమూరు రంగారెడ్డి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదు. కాని 2017లో మొదలైన కాళేశ్వరాన్ని అంతకు మూడింతలు నిధులు వెచ్చించి పూర్తి చేశారు. కరువు, వలసలు, ఫ్లోరైడ్‌తో బాధపడే ప్రాంతాన్ని పక్కకు పెట్టి కాళేశ్వరాన్ని పూర్తిచేయడాన్ని చూసి ఈ ప్రాంత ప్రజల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. ఫలితంగా దక్షిణ తెలంగాణలో ఆ పార్టీ ఆనవాళ్ళు లేకుండా పోయింది.

అత్యంత వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో రాష్ట్రం ఏర్పడి పదేళ్ళయినా బీమా, నెట్టెంపాడు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేకపోవడం సిగ్గుచేటు. ఆర్‌డీఎస్‌లో తెలంగాణ వాటా 15.9 టీఎంసీలను పూర్తిగా ఇప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నాము. కాని ఈ ప్రాంత మంత్రికి మాత్రం నీళ్ళమంత్రి అని బిరుదు వచ్చింది. ఇక బీజేపీ నాయకులు 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తిగా విస్మరించారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ మొదలుకొని దివంగత సుష్మాస్వరాజ్‌ వరకు అందరూ హామీ ఇచ్చారు కాని జాతీయహోదా రాలేదు. పదేళ్ళయినా పాలమూరు నుండి ముంబైకి బస్సులు పోతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, చేవెళ్ళ, నల్లగొండ, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజల ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను పాలమూరు – రంగారెడ్డికి జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదు అని నిలదీయాల్సిన అవసరం ఉంది.

రాగి శ్రీనివాస్‌ రెడ్డి

Updated Date - May 09 , 2024 | 06:01 AM