Share News

ప్రతిపక్షాల పగటి కలలు

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:43 AM

భారతీయ జనతా పార్టీ కేవలం ఉత్తరాది పార్టీ అని, దక్షిణాదిలో అది నెగ్గుకురాదని కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న బూటకపు ప్రచారంలో అణుమాత్రమైనా వాస్తవం లేదు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఉత్తరాది పార్టీ మాత్రమేనని...

ప్రతిపక్షాల పగటి కలలు

భారతీయ జనతా పార్టీ కేవలం ఉత్తరాది పార్టీ అని, దక్షిణాదిలో అది నెగ్గుకురాదని కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న బూటకపు ప్రచారంలో అణుమాత్రమైనా వాస్తవం లేదు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఉత్తరాది పార్టీ మాత్రమేనని, ఉత్తరాది వారికే బీజేపీ పెద్ద పీట వేస్తుందని అర్థం పర్థం లేని ఆరోపణ చేశారు. నిజానికి తెలంగాణలో బీజేపీ మూలంగానే ఆయన కాళ్ల కింద నీరు ప్రవహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ మేధావుల్లోనూ బీజేపీ ప్రభావం ఎంత విస్తరించిందంటే ఇవాళ బీఆర్ఎస్ స్థానాల్లో దూసుకురావడమే కాదు. కాంగ్రెస్ స్థానాలను కూడా అది కైవసం చేసుకునే క్రమంలో ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి సీటుతో సహా మెజారిటీ సీట్లలో ఇవాళ బీజేపీ ప్రాబల్యం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ విస్తరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ సీట్ల కోసం ప్రతి నియోజకవర్గంలోనూ నేతలు పోటీపడుతున్న తీరే బీజేపీ ప్రాబల్యానికి నిదర్శనం. బీజేపీ నేతలు ఎక్కడకు వెళ్లినా వేలాది ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. బీజేపీ–తెలుగుదేశం–జనసేన కూటమి జనాదరణ జగన్మోహన్ రెడ్డి అనుయాయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. బీసీలు, దళితులు, ఆదివాసీలతో సహా అట్టడుగు వర్గాలు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో బీజేపీకి ఆకర్షితులవుతున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 13 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్ చండీగఢ్‌, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో ఒక్క సీటు కూడా సంపాదించుకోలేని కాంగ్రెస్, బీజేపీని ఢీకొంటుందంటే ఎవరు విశ్వసిస్తారు? అదే సమయంలో 21 రాష్ట్రాల్లోని 224 సీట్లలో 50 శాతం పైగా ఓట్లను సాధించిన బీజేపీ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమయిందన్న ప్రతిపక్షాల విమర్శలో అర్థం ఏమైనా ఉన్నదా?

తమిళనాడు, కేరళలో బీజేపీ విస్తరిస్తోందని, ఈ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధిస్తుందని ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా వ్యాఖ్యానించారు. ఒక్క తమిళనాడులోనే బీజేపీకి 5 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన చెప్పారు. తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకె, బీజేపీల మధ్యే ఉన్నదని స్పష్టంగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో తమిళనాడులో ఒక్క సీటు కూడా సాధించలేని బీజేపీ ఈసారి కనీసం పది నియోజకవర్గాల్లో డీఎంకే కూటమికి గట్టి పోటీనిస్తోంది. కన్యాకుమారి–నాగర్ కోయిల్–తిరునల్వేలి బెల్ట్– రామనాథపురం, కోయంబత్తూరు ప్రాంతాల్లో బీజేపీ బలం రోజురోజుకూ పుంజుకుంటోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 25 శాతం పైగా ఓట్లు లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తమిళనాడులో అనేకసార్లు ఉధృతంగా పర్యటించిన మోదీ తమిళ ప్రజలకు సుపరిచితుడయ్యారు. కొత్త పార్లమెంట్ భవనంలో చోళ రాజవంశీకుల సెంగోల్‌ను ప్రతిష్ఠాపించడం నుంచి కాశీ–తమిళ సంగమం వరకు అనేక చర్యల ద్వారా ఆయన ఉత్తరాదికి, దక్షిణాదికి వారధి నిర్మించారు. భారతదేశానికి చెందిన కచ్చతీవును శ్రీలంకకు అకారణంగా అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. గత వారం మోదీ కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహించినప్పుడు వేలాది మంది మోదీ, మోదీ అంటూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మోదీ తన ప్రసంగం తమిళ భాషలో ప్రజలకు చేరేలా చూడడం వారి మనసులను హత్తుకుంది. వీటన్నిటి రీత్యా ఉత్తర–దక్షిణ విభజనను సృష్టించి దక్షిణాదిలో ప్రజలను బీజేపీకి దూరం చేయాలని చూస్తున్న ప్రతిపక్షాల ఎత్తుగడలు ఏ మాత్రం ఫలించేలా లేవు. ఈసారి దక్షిణాదిలో బీజేపీ సాధించే విజయాలు అందర్నీ దిగ్భ్రాంతి పరుస్తాయని స్వయంగా మోదీ ప్రకటించడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.

ఇవాళ దక్షిణాదిన ప్రతి నియోజకవర్గంలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇళ్ల నిర్మాణం, ఉచిత ఎల్‌పిజి, వైద్య బీమా, ఉచిత ఆహారధాన్యాల సరఫరా గురించి తెలుసు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో యువకుల్లో అత్యధికులు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న విషయం ప్రతిపక్ష పార్టీలు గమనించడం లేదు. ముఖ్యంగా తొలిసారి ఓటర్లైనవారు బీజేపీ వల్లనే దేశం మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కేరళలో కొన్ని దశాబ్దాలుగా వామపక్ష ప్రజాస్వామిక ఫ్రంట్, యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాలను చూసిన అక్కడి ప్రజలు క్రమంగా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిని, మోదీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. అక్కడ బీజేపీకి కేథలిక్ క్రైస్తవుల మధ్దతు రోజురోజుకూ పెరుగుతోంది. తమిళనాడులో అన్నాడిఎంకె, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పట్ల ప్రజలకు పెరుగుతున్న ఏహ్యభావం బీజేపీ క్రమంగా బలపడేందుకు ప్రధాన కారణమవుతున్నది.

నేడు దేశంలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాల అమలు, నగదు బదిలీలు గమనించినవారెవరైనా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నదంటే విశ్వసించలేరు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి వల్ల మోదీకి అత్యధిక సీట్లు లభిస్తాయని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. తలసరి వినియోగం మెరుగుపడిందని, జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని, పేదరికం తగ్గిపోయిందని, ఇవన్నీ ప్రజల్లో మోదీ పట్ల సానుకూల అభిప్రాయాలు ఏర్పరిచాయని భల్లా అభిప్రాయపడ్డారు. ఎవరు కాదన్నా మోదీ హయాంలో జీడీపీ రెట్టింపు స్థితిలో 3.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. తలసరి ఆదాయం రెట్టింపైంది. ఎగుమతులు 400 శాతం పెరిగి 750 బిలియన్ డాలర్లకు మించిపోయాయి. ఇవాళ అనేక పట్టణాలు మెట్రోనగరాలుగా మారి ప్రజలకు అక్కడే ఉపాధి లభిస్తోంది. ఎక్స్‌ప్రెస్ హైవేలు దాదాపు 400 శాతం పెరిగి 4067 కి.మీ మేరకు విస్తరించాయి. జాతీయ రహదారులు 53,700 కి.మీ విస్తరించాయి. విదేశీ రిజర్వులు 694 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

మోదీ చేసిన మంచి పనులే మొత్తంగా బీజేపీ గెలుపునకు కారణమవుతాయని 45 శాతం మంది విశ్లేషిస్తున్నట్లు ఎకానమిస్ట్ పత్రిక అంచనా వేసింది. ఆ తర్వాత సంక్షేమ పథకాలు, నాయకత్వ లక్షణాలు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు, భారతదేశానికున్న అంతర్జాతీయ ప్రతిష్ఠ, హిందువుల ప్రయోజనాలు కాపాడడం మొదలైనవన్నీ మోదీ విజయపరంపరలో భాగమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 57 శాతం మంది ప్రజలు మోదీ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారని, దేశంలో సగం మంది ప్రజలు మోదీ తిరిగి రావాలని ఆశిస్తున్నారని సిఎస్‌డిఎస్– లోక్‌నీతి కూడా వెల్లడించింది. ఈ రీత్యా, మోదీ సారథ్యంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాలేదని పగటి కలలు కంటుంటే వారిని భర్తృహరి చెప్పిన మూర్ఖుల జాబితాలో చేర్చాలి.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - Apr 23 , 2024 | 03:43 AM