Share News

కార్పొరేట్, సైనిక్ భారత్‌‌లు కలిసి ఆదివాసీలపై యుద్ధం!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:07 AM

నాలుగు దశాబ్దాలుగా ఎంతో హింసను అనుభవించిన దండకారణ్యంలో గత మూడు నెలలుగా తీవ్ర యుద్ధమే నడుస్తున్నది. ఇది దండయాత్రను, దురాక్రమణ యుద్ధాన్ని, అంతర్యుద్ధాన్ని తలపిస్తున్నది. ఏప్రిల్ 16న మాడ్‌ ప్రాంతంలో జరిగిన దాడిలో 29 మంది చనిపోయారు...

కార్పొరేట్, సైనిక్ భారత్‌‌లు కలిసి ఆదివాసీలపై యుద్ధం!

నాలుగు దశాబ్దాలుగా ఎంతో హింసను అనుభవించిన దండకారణ్యంలో గత మూడు నెలలుగా తీవ్ర యుద్ధమే నడుస్తున్నది. ఇది దండయాత్రను, దురాక్రమణ యుద్ధాన్ని, అంతర్యుద్ధాన్ని తలపిస్తున్నది. ఏప్రిల్ 16న మాడ్‌ ప్రాంతంలో జరిగిన దాడిలో 29 మంది చనిపోయారు. వీరిలో విప్లవకారులు ఎందరో, సాధారణ ఆదివాసులు ఎందరో ఇప్పటికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ అనే సరికొత్త యుద్ధంలో భాగంగా ఈ మారణకాండ జరిగింది. ఢిల్లీలోని ప్రభుత్వం అబూజ్‌మాడ్‌ను చేజిక్కించుకోడానికి తన సర్వసైన్యాలను దండకారణ్యానికి తరలించింది. మొన్నటి దాకా ఎవ్వరికీ తెలియని మారుమూల అటవీ స్థావరం కోసం జరుగుతున్నట్లు కనిపించే ఈ పోరాటం ఎవరికైనా జానపద గాథలా అనిపించవచ్చు.

వాస్తవానికి ద్రవ్యపెట్టుబడి యుగంలో, ఆధునిక రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న సంఘర్షణ ఇది. అక్కడున్న సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికి జరుగుతున్న యుద్ధం ఇది. సారాంశంలో ఈ పోరాటం దేశ రాజకీయార్థికాల కేంద్రస్థానానికి సంబంధించినది. దేశమంతా పెద్ద ఎత్తున సాగుతున్న కార్పొరేటీకరణకు దండకారణ్యంలో తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యాక పాలకులు ఆ ప్రాంతాన్ని అతిపెద్ద మిలటరీ జోన్‌గా మార్చేశారు. ఇది ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. కనీసం ముప్పై ఏళ్ల చరిత్ర ఉన్నది. కార్పొరేటీకరణకు ఆటంకంగా ఉన్న ఆదివాసీ ఉద్యమాన్ని ప్రభుత్వం మారుమూల సమస్యగా భావించడం లేదు. అదే కేంద్ర సమస్య అనుకుంటోంది.

అబూజ్‌మాడ్‌ ఘటన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అమితానందంగా స్పందించాడు. మావోయిస్టు ఉద్యమం అభివృద్ధికి అతిపెద్ద శత్రువనీ, దాన్నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని అన్నాడు. దేశంలో కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా ఉద్యమాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని అతి పెద్ద ప్రమాదంగా భావించడంలో స్పష్టమైన రాజకీయార్థిక వైఖరి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నినాదం ఒకటే. ‘మావోయిస్టు ఉద్యమం నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం.. కార్పొరేట్లకు అప్పగిస్తాం’. దీని కోసం తెచ్చిన ఆపరేషన్‌ కగార్‌ 2017లో మొదలైన ఆపరేషన్‌ సమాధాన్‌–ప్రహార్‌లో భాగమే అయినా గుణాత్మకంగా భిన్నమైనది.

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు ముఖ్యమైన ప్రకటనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వెలువడ్డాయి. ఒకటి: మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన; రెండు: మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని రాష్ట్ర హోం మంత్రి విజయ్‌శర్మ ప్రకటన. మొదటిది నిర్మూలన కాబట్టి సిఆర్‌పిఎఫ్‌, బిఎస్‌ఎఫ్‌, నేషనల్‌ సెక్యురిటీ గార్డ్స్‌ తదితర బలగాల్లోని వేలాది మందిని అదనంగా దండకారణ్యంలోకి తరలించారు. రెండోది చర్చలు కాబట్టి అటవీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి, గనుల తవ్వకానికి ఆటంకం కల్పించకూడదనే కండీషన్‌ పెట్టారు. సజావుగా గనులు తవ్వుకోడానికి కార్పొరేట్లకు అనుకూల వాతావరణం ఉండాలని, అప్పుడే చర్చలు జరుగుతాయని చెప్పారు. దీనికి మావోయిస్టులు సిద్ధమైనా కాకపోయినా అలాంటి అనూకూల వాతావరణాన్ని నెలకొల్పాల్సిన తక్షణ బాధ్యత తనకు ఉన్నదని ప్రభుత్వం భావించింది. ఈ స్వల్ప కాలంలోనే ఒక్క మాడ్‌ ప్రాంతంలోనే ఆరు బేస్‌ కేంపులు ఏర్పాటు చేసింది.

సైనిక ఉద్రిక్తత ఉన్న చోట ఇరు పక్షాల మధ్య చర్చలకు ఎవరు ప్రతిపాదించినా అది రాజకీయాల ప్రాధాన్యతను పెంచాలి. కానీ ఛత్తీస్‌గఢ్‌ ఢిల్లీ డబల్‌ ఇంజన్‌ ప్రభుత్వం చర్చలకు వింత ప్రతిపాదన పెట్టింది. కార్పొరేట్ల తరపున ప్రభుత్వం ముందుకు వచ్చి, వాళ్ల పనులకు ఏ ఇబ్బందీ కలగకుండా చేయడమే లక్ష్యంగా చర్చలను ప్రతిపాదించింది. రాజకీయార్థిక పరిభాషలో ఇది కార్పొరేటీకరణ. దాన్ని సాధించేందుకు ఒక పక్క చర్చల ప్రతిపాదన, ఇంకో పక్క సైనికీకరణ అనే విధానాన్ని తీసుకొచ్చింది.

గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారం నుంచి బీజేపీ ప్రభుత్వం వేగంగా ఈ సన్నాహాన్నాంతా చేసింది. జనవరి ఒకటో తేదీ మంగ్లీ అనే పసిపాప హత్యతో కగార్‌ మొదలయ్యాక విరామం లేకుండా ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఏప్రిల్‌ 2న బీజాపూర్‌ జిల్లా కోర్చోలి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు చనిపోయారని వార్త వచ్చింది. వాళ్లంతా మావోయిస్టులైనా కాకపోయినా ఆదివాసులే. అప్పటి నుంచి 75 మందిని ఎన్‌కౌంటర్‌ పేరిట ఆదివాసులను, విప్లవకారులను కాల్చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో జరిగిన వైమానిక దాడులకు కొనసాగింపుగా ఐదోసారి జనవరి 13న ఏరియల్‌ బాంబింగ్‌ కూడా చేశారు.

నిజానికి 2022 అక్టోబర్‌ 27, 28 తేదీల్లో హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ఒక చింతనా శిబిరం జరిగింది. దీనికి వివిధ రాష్ట్రాల హోం మంత్రులు, హోం సెక్రటరీలు, పోలీసు, సైనిక అధికారులు హాజరయ్యారు. వీళ్లంతా ‘నూతన భారతదేశం’ అనే ఒక స్వప్నం గురించి చర్చించారు. అది 2047 నాటికి సాకారం కావాలని అన్నారు. సుమారుగా ఆ కాలంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార పత్రికలు దీన్నే హిందు రాష్ట్ర సాకారం చేసే లక్ష్యంగా ప్రకటించుకున్నాయి. న్యూ ఇండియాకైనా, హిందూ రాష్ట్ర స్థాపనకైనా మావోయిస్టు ఉద్యమం అడ్డంగా ఉన్నది. ఈ సంగతి సూరజ్‌కుండ్‌ చింతనా శిబిరమే కాదు. అంతక ముందే సంఘ్ పరివార్‌ కూడా తేల్చుకున్నది. వామపక్ష విప్లవోద్యమం ఉన్నంత వరకు కార్పొరేట్‌ హిందుత్వ పునాది మీద ‘నూతన భారత్‌’కు అవకాశం లేదు. కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర స్థాపన అనేది సంఘ్ పరివార్‌కు భావజాల సాంస్కృతిక వ్యూహమే కాదు. బీజేపీ ప్రభుత్వానికి రాజకీయార్థిక, సైనిక, పాలనా వ్యూహం కూడా. మధ్య భారతదేశంలో గత మూడేళ్లుగా కనీసం పధ్నాలుగు అతి పెద్ద ప్రజా పోరాటాలు నడుస్తున్నాయి. గతంలో ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమ కాలంలోనే మొదలైన సిలింగేర్‌ నిరాయుధ పోరాటం ఇప్పటికీ కొనసాగుతున్నది. అడవులను, చెట్లను, నీటిని, నేలను, ఆకాశాన్ని కాపాడుకోడానికి పర్యావరణ, సాంస్కృతిక, నైసర్గిక కోణాలతో ఈ రాజకీయార్థిక పోరాటాలు జరుగుతున్నాయి. లక్షలాది మంది ఏండ్ల తరబడి వంతెనలు, రోడ్లు, గనుల తవ్వకం, పర్యాటకం, హిందుత్వ ప్రచారం, రైతాంగ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చట్టాల వంటి అనేక సమస్యలపై పోరాడుతున్నారు. వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించలేకపోతున్నాయి. ఇప్పటి దాకా ఉన్న సమాధాన్‌ ఆపరేషన్‌ చాలక దానికి పదును పెడుతూ కగార్‌ను తీసుకొచ్చాయి.

గత పదేళ్లుగా దేశ ప్రజలందరూ అనుభవిస్తున్న ఉక్కబోత వెనుక, అభద్రత వెనుక, రాజ్యాంగ సంస్థల విధ్వంసం వెనుక ఈ వ్యూహం ఉన్నది. ఇక ఇది గతంలో దేశమంతా అనుభవించిన ఎమర్జెన్సీలాంటిదే కాదు. పీవీ నరసింహారావు ఆరంభించిన నూతన ఆర్థిక విధానాల వంటిదీ కాదు. రెండు నక్సలైట్‌ పార్టీలు కలిసి సిపిఐ మావోయిస్టుగా ఏర్పడగానే అప్పటి కాంగ్రెస్‌ ప్రధాని అన్నట్లు ‘దేశ ఆంతరంగిక శత్రువు’ మీది పోరాటం మాత్రమే కాదు. 2009 నుంచి 2017 దాకా నడిచిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ కూడా కాదు. ఇది సంఘ్ పరివార్‌ సాధించాలనుకుంటున్న కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర స్థాపన కోసం తాజాగా మొదలైన అపరేషన్‌ కగార్‌.

పాణి

Updated Date - Apr 18 , 2024 | 03:07 AM