Share News

సేవాదళ్‌ స్ఫూర్తితో నిర్మాణాత్మక రాజకీయాలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:24 AM

నన్ను మొదట ఆకట్టుకున్నది వారి గానమే. రాజకీయ సమావేశాలలో పాటలు పాడడం అసాధారణం కదా. గాయకుడు శ్రావ్యంగా పాడుతున్నాడు, మరాఠీ చరణాలను నేను అర్థం చేసుకోలేకపోయినా పాట....

సేవాదళ్‌ స్ఫూర్తితో నిర్మాణాత్మక రాజకీయాలు

నన్ను మొదట ఆకట్టుకున్నది వారి గానమే. రాజకీయ సమావేశాలలో పాటలు పాడడం అసాధారణం కదా. గాయకుడు శ్రావ్యంగా పాడుతున్నాడు, మరాఠీ చరణాలను నేను అర్థం చేసుకోలేకపోయినా పాట భావపూర్ణంగా ఉన్నది. ఆ గాయకుడు సంజీవ్‌ సానే. అతడొక కార్మిక నాయకుడు, బుద్ధి నైశిత్యమున్న రాజకీయ వ్యూహకర్త. ఆ తరువాత బృందగానం ప్రారంభమయింది. ప్రధాన గాయకుడు సంజయ్‌ ఎమ్‌జి. వృత్తిరీత్యా ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌. నిమ్నజాతులకు చెందిన యువజనులకు థానేలో ఒక ‘సంస్కార్‌ శివిర్‌’ను నిర్వహించిన వివేకశీలి. ఆయన పేరులోని ఎమ్‌జి అన్న అక్షరాలు ‘మంగళ గోపాల్‌’ను సూచిస్తాయి.. మంగళ తల్లి పేరుకాగా గోపాల్‌ తండ్రిపేరు. తన పేరులో అమ్మానాన్న పేర్లను చేర్చుకున్న సంస్కారి. నిషా శివుర్కార్‌ ఏ పాటా పాడలేదు. అయితే ఈ వినమ్రశీలి భర్తలు వదిలివేసిన, గెంటివేసిన ‘పరిత్యక్త’ మహిళలను సంఘటితం చేసిన సామాజిక కార్యకర్త. ఇది నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇక దృఢ సంకల్పుడు అయిన విలాస్‌ భోంగాడె యువ దళిత క్రియాశీలి. తన చేతల ద్వారానే తాను చెప్పదలుచుకునేది చెప్పే ఉద్యమకారుడు.


సరిగ్గా 30 సంవత్సరాల క్రితం థానేలో సమాజ్‌వాది జనపరిషత్‌ ప్రారంభ సమావేశంలో వీరందరూ నాకు తటస్థించారు. అదే వారితో నా మొదటి పరిచయం. అంతేకాదు శక్త్యుత్సాహాలు పరిపూర్ణంగా ఉన్న మహారాష్ట్ర ప్రజా జీవితంతో కూడా నాకు అదే మొదటి పరిచయం ఆదర్శవాదం, ప్రగతిశీల భావజాలం, భావచైతన్యం, క్రమశిక్షణ సమ్మిళితమైన ఈ యువ రాజకీయ క్రియాశీలురులో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది, సందేహం లేదు. నాకు సుపరిచితమైన ఉత్తర భారతావని సామాజిక రాజకీయ క్రియాశీల ప్రపంచానికి ఇది పూర్తిగా భిన్నమైనది. వ్యక్తిత్వాలలోను, ప్రతిభా పాటవాల వ్యక్తీకరణలోను విలక్షణులు అయిన ఈ మరాఠీ క్రియాశీలురులో అనేక సామ్యాలు కనిపించాయి. ఏ సంస్థ నుంచి వీరు ప్రభవించారు అని ఆశ్చర్యం కలిగింది. తెలుసుకోవాలన్న ఆసక్తీ జనించింది ఎవరో ఒకరు ‘సేవాదళ్‌’ అని అన్నారు. అవును వీరంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ సంస్థకు చెందినవారే.

రాష్ట్ర సేవాదళ్‌ (ఆర్‌ఎస్‌డి లేదా సేవాదళ్‌)ను 1941లో సోషలిస్టులు స్థాపించారు. అప్పటికివారు ఇంకా భారత జాతీయ కాంగ్రెస్‌లో అంతర్భాగంగా ఉన్నారు. జాతీయవాదం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, హేతువాదంకు నిబద్ధమైన ఒక యువజన స్వచ్ఛంద సంస్థే రాష్ట్ర సేవాదళ్‌. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు పోటీగా సేవాదళ్ ఏమీ ఏర్పడలేదు (ఆరెస్సెస్‌కు అప్పట్లో అంతగా రాజకీయ ప్రాధాన్యం లేదని మరి చెప్పనవసరం లేదు). సంఘ్‌, సేవాదళ్ మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అయినా రెండిటి మధ్య ఒక సామాన్యాంశం ఉన్నది.. రోజూ ‘శాఖ’ సమావేశాల ద్వారా బాలలు, నవ యవ్వన యువకులను సంఘటితం చేయడం ఈ రెండు సంస్థల ప్రధాన కార్యకలాపంగా ఉండేది. ఈ దైనందిన సమావేశాలలో వారు ఆటలు ఆడేవారు, వ్యాయామం చేసేవారు, సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొనేవారు, సైద్ధాంతిక చర్చలు జరిపేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆర్‌ఎస్‌డి కాంగ్రెస్‌ నుంచి నిష్క్రమించింది. సోషలిస్టు పార్టీలకు, ఏ ఒక్క సోషలిస్టు పార్టీకి అనుబంధ సంస్థ కాకుండా వాటితో సన్నిహితంగా పనిచేసేది. సేవాదళ్ అస్తిత్వ మొదటి దశాబ్దంలో దానికి చైతన్యశీల, స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందించిన ధీమంతుడు, దీక్షాదక్షుడు పాండురంగ సదాశివ్‌ సానే (1899–19౫0). సానే గురూజీగా మహారాష్ట్రలో ప్రతి ఒక్కరికీ గౌరవనీయుడు. తొలుత ప్రస్తావించిన థానే సమావేశంలో నేను విన్న పాట –ఖరా తో ఏక్చి ధర్మ/ జగాల ప్రేమ్‌ అర్పావె– సానే గురూజీ విరచితమే. ఆ పాట పాడిన సంజీవ్‌ సానే పేరు గురూజీ గౌరవార్థం పెట్టిందే.


సానే గురూజీని ఏమనాలి? ఒక సోషలిస్టు నాయకుడు అనవచ్చునా? కేవలం అలా భావించడం ఆయన్ని గౌరవించడం కాబోదని అనుకుంటున్నాను. ఆయన ఒక అజ్ఞాత కార్యకర్త, ఒక నిరుపమాన నిర్మాణదక్షుడు, ఒక నిర్భీక నిరసనకారుడు. ఎటువంటి అన్యాయాన్ని సహించలేని సానే గురూజీ ఒక గాంధేయవాది, ఒక జాతీయవాది, ఒక సామ్యవాది, అదే సమయంలో ఆయన ఒక ఋషితుల్యుడు. ఆయన ఉద్రేకపూరిత ప్రసంగాలు, ఉత్తేజకర రచనలు మహారాష్ట్ర యువజన ప్రపంచాన్ని చైతన్యపరిచాయి. ముఖ్యంగా ఆయన తన మాతృమూర్తి గురించి రాసిన ‘ష్యాంచీ ఆయీ’ మహారాష్ట్రలో అనేక తరాల వారి మనస్సులపై చెరగని ముద్ర వేసింది. ఆయన ‘భారతీయ సంస్కృతి’ మన చిరంతన సంస్కృతిపై ఒక కొత్త అవగాహనను కల్పించింది. మూఢ నమ్మకాలు, మత మౌఢ్యాన్ని ఆయన నిర్ద్వంద్వంగా ఖండించేవారు. తెగ, విశ్వాసం, కులం, జెండర్‌ ప్రాతిపదికన ఎవరి పట్ల వివక్ష చూపని అద్వైత దర్శనం ఆయనకు స్ఫూర్తి. మరో 82 ఇతర సంస్థలతో కలిసి ఆర్‌ఎస్‌డి, ప్రస్తుత అధ్యక్షుడు నితిన్‌ వైద్య నేతృత్వంలో ఒక ఏడాది కాలంగా నిర్వహిస్తున్న ‘సానే గురూజీ 125వ జయంత్యుత్సవాలు ఇటీవలే ముగిసాయి. మహారాష్ట్ర ప్రగతిశీల రాజకీయాలలో సేవాదళ్‌ అడుగు జాడలను గత మూడు దశాబ్దాలుగా నేను గమనిస్తూ వస్తున్నాను. అది అనేక సంస్థలకు స్ఫూర్తిగా నిలిచింది. ఛాత్ర భారతి, సమాజ్‌వాది మహిళా సభ, ముస్లిం సత్యశోధక్‌ సమాజ్‌, సమాజ్‌వాది అధ్యాపక్ సభతో పాటు భారతీయ భాషల మధ్య ఒక మేధో అనుబంధాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన అంతర్‌ భారతి, నిర్మాణాత్మక కార్యకలాపాలకు ఏర్పడ్డ సేవాపథక్‌, ఎస్‌ఎమ్‌ జోషి సోషలిస్ట్‌ ఫౌండేషన్‌, సానే గురూజీ మెమోరియల్‌ ట్రస్ట్‌ మొదలైనవి సానే గురూజీ స్ఫూర్తిదాయక వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నాయి.


మహారాష్ట్రలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అందరూ రాష్ట్ర సేవాదళ్‌తో సంబంధమున్నవారే కావడం గమనార్హం. రాజకీయ నాయకులు ఎస్‌ఎమ్‌ జోషీ, మృణాల్‌ గోరే, మధు దండావతే, బాపు కల్డాటె; సామాజిక క్రియాశీలురు సుధా వెర్డె, ప్రమీలా దండావతే, నరేంద్ర దభోల్కర్‌, హమీద్‌ దల్వాయి, బాబా అధావ్‌, మేధా పాట్కర్‌; సినీనాటక రంగాలకు చెందిన శ్రీరామ్‌ లాగూ, నీలూ ఫూలే, స్మితా పాటిల్‌; మేధావులు ఆచార్య జావదేకర్‌, గణేష్‌ దేవి మొదలైనవారు విశేషంగా ఎన్నదగినవారు.

రాష్ట్ర సేవాదళ్‌కు తన అస్తిత్వ మొదటి రెండు దశాబ్దాలలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఇప్పుడు లేవు. అయితే మన రాజ్యాంగ బద్ధ ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని సంరక్షించుకునేందుకు తప్పనిసరి అయిన విశాల దృక్పథంతో కూడిన ప్రయోజనకర రాజకీయాలకు ఒక విశిష్ట నమూనాను ఆ సంస్థ సమకూరుస్తుంది. ఒకటి మాత్రం స్పష్టం: మన గణతంత్రరాజ్య వ్యవస్థ కూల్చివేతకు ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలను ఎన్నికలలో బీజేపీకి గట్టి పోటీ నివ్వడం ద్వారా మాత్రమే ఎదుర్కోలేము, నిరోధించలేము. దేశ పౌరులను ప్రగతిశీల రాజకీయ విద్యావంతులుగా చేయడం, యువ తరాల వారిలో రాజ్యాంగ విలువలను పాదుకొల్పడం, సమస్యలపై సృజనాత్మకంగా ఆలోచించడం, వాటి పరిష్కారాలకు కొత్త ఆలోచనలతో ఎజెండాలు రూపొందించుకోవడం, నవ భావాలతో పని చేసే రాజకీయ కార్యకర్తలు, నాయకులను సుశిక్షణతో తయారు చేసుకోవడం భారత్‌గా ఊహించుకున్న సమాజాన్ని పునఃసృష్టించుకోవడం లక్ష్యాలుగా కల విశాల దృక్పథంతో కూడిన ప్రయోజనకర రాజకీయాలు ఈనాడు మనకు అవసరం. అటువంటి రాజకీయ సంస్కృతిని ఆనాడు రాష్ట్ర సేవాదళ్‌ సృష్టించి, పెంపొందించింది. ఆ దార్శనికత, కార్యదక్షతే నేడు మనలో లోపించింది. ఈ కొరతను తీర్చుకోవడానికి మనం వెన్వెంటనే పూనుకోకపోతే మన రిపబ్లిక్‌ భవిష్యత్తుకు తప్పక ముప్పు వాటిల్లుతుంది. రాష్ట్ర సేవాదళ్‌ పాఠాలు ఏమిటో గ్రహించడం కష్టమేమీ కాదు. వాటిలో మొదటిది– మనం మన యువజనులనే కాకుండా పాఠశాల బాలలనూ లక్ష్యంగా చేసుకోవల్సిన అవసరమున్నది. రెండోది– క్రీడలు, సాహిత్యం, కళల ద్వారా వ్యక్తిత్వ నిర్మాణ కార్యకలాపాలపై దృష్టి పెట్టడం. మూడోది– రాజ్యాంగ విలువలు, సామ్యవాద, లౌకికవాద గణతంత్ర రాజ్య ఆదర్శాలను పెంపొందించే ఏ ప్రయత్నమైనా వాస్తవిక జాతీయ వాదంగా, సుదృఢమైన ప్రాంతీయ సంస్కృతిగా, మన పురా నవ నాగరికతా స్ఫూర్తిగా అంతస్థగితం కావాలి. నాలుగోది–అన్యాయాల వ్యతిరేక పోరాటాలను నిర్మాణాత్మక కార్యాచరణతో కలిసికట్టుగా నిర్వహించాలి. ఐదోది– ఈ ప్రయోజనకర రాజకీయాలు ఎన్నికల వ్యవహారాలు, రాజ్యాధికారాలలో జోక్యం చేసుకుంటూనే ఏ రాజకీయ పార్టీకి అయినా సరే ఆమడ దూరంలో ఉండి తీరాలి.


ఇటువంటి విశిష్ట కృషికి ఆదర్శప్రాయమైన నమూనా ఆర్‌ఎస్‌డి మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఉన్నాయి: ద్రవిడ కజగం, కేరళ సాహిత్య శాస్త్ర పరిషత్‌, కర్ణాటక రాజ్య రైతా సంఘ్‌, దళిత్‌ సంఘర్ష్‌ సమితి (కర్ణాటక), ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌, ఛత్తీస్‌గఢ్‌ ముక్తి మోర్చా, ఛాత్ర యువ సంఘర్ష్‌ వాహిని, ఇండియన్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌, జయేష్‌ (మధ్యప్రదేశ్‌), సమతా సంఘటన్‌, బ్యాక్‌ వర్డ్‌ అండ్‌ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌. ఈ ప్రస్తావిత సంస్థల సృజనాత్మక జీవితం స్వల్పకాలికమైనదే అయినప్పటికీ వాటిలో అత్యధికం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. విశాల దృక్పథంతో కూడిన ప్రయోజనకర రాజకీయాల వ్యవస్థీకరణ, సుసాధ్యతలను అవి ధ్రువీకరించాయి.


ఈ తరం యువజనులలో రాజకీయ ప్రక్రియల ద్వారా సమాజ జీవితంలో పాలుపంచుకునే శ్రద్ధాసక్తులు లోపించడం పట్ల విచారగ్రస్తులమయినప్పుడు, వారి రాజకీయ ఉదాసీనతను తప్పుపట్టినప్పుడు, వారి సంకుచిత రాజకీయ వైఖరుల పట్ల దిగ్భ్రాంతి చెందినప్పుడు మనకు మనమే ఈ క్రింది ప్రశ్నలు వేసుకోవాలి: యువతలో రాజ్యాంగ విలువల పట్ల నిష్ఠా భావాన్ని పెంపొందించేందుకు దోహదం చేసే సంస్థలను మనం నిర్మించామా? విద్వత్‌ ఆసక్తులను పెంపొందించే స్టడీ సర్కిల్స్‌ సంప్రదాయం ఏమయిపోయింది? నిర్మాణాత్మక కార్యకలాపాలకు యువతను ప్రోత్సహిస్తున్నది ఎవరు? నిత్య జీవిత సమస్యలను విశాల రాజకీయ కర్తవ్యాలతో సంధానిస్తుంది ఎవరు? సమస్య వారితో లేదు మనతో ఉన్నది. మనకొక దార్శనిక నమూనా ఉన్నది. దాని స్ఫూర్తితో మనం తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలి. ఇంకెంత మాత్రం జాప్యం కూడదు. ఇది మనకు ఒక సవాల్‌. మనం నిర్దేశించుకోవలసిన జీవిత లక్ష్యం. మన కాలం సానే గురూజీల కోసం అవి నిరీక్షిస్తున్నాయి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - Dec 27 , 2024 | 06:24 AM