Share News

అంబేడ్కర్‌పై కాంగ్రెస్ కపట ప్రేమ

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:21 AM

ఇటీవల కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా మాట్లాడిన మాటల్లో 16 సెకండ్ల వీడియోను కట్ చేసి, దురుద్దేశంతో రాహుల్‌గాంధీ డైరెక్షన్‌లో కాంగ్రెస్ శ్రేణులు శివాలెత్తుతున్నాయి. రాజ్యసభలో అమిత్ షా....

అంబేడ్కర్‌పై కాంగ్రెస్ కపట ప్రేమ

ఇటీవల కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా మాట్లాడిన మాటల్లో 16 సెకండ్ల వీడియోను కట్ చేసి, దురుద్దేశంతో రాహుల్‌గాంధీ డైరెక్షన్‌లో కాంగ్రెస్ శ్రేణులు శివాలెత్తుతున్నాయి. రాజ్యసభలో అమిత్ షా ఒక గంట 32 నిమిషాలు చేసిన ప్రసంగంలో మూడు నిమిషాల 36 సెకండ్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ గురించి మాట్లాడారు. అందులోంచి 16 సెకండ్ల వీడియోను బయటికి తీసి చిలువలు పలువలు చేసి అమిత్‌ను, బీజేపీని బోన్‌లో నిలబెట్టే ప్రయత్నం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కుటిల యత్నం చేస్తున్నాయి. నెహ్రూ కాలం నుంచి రాహుల్‌గాంధీ వరకు అంబేడ్కర్‌తో పాటు ఎందరో దేశభక్తుల త్యాగాలను వాడుకొని గద్దెనెక్కడం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకేమీ తెలియదు. ఆ పార్టీ అన్యాయం చేసిన వాళ్లలో సుభాష్ చంద్రబోస్, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, అంబేడ్కర్‌, సర్దార్ వల్లభభాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ వంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు.


భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏనాడూ అంబేడ్కర్‌ను సహించలేదు. దళితుల పక్షాన మొదటి న్యాయశాఖ మంత్రిగా అంబేడ్కర్‌ను నియమించినా, ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదు. సి. రాజగోపాలాచారి, అంబేడ్కర్‌ రాజీనామా చేస్తున్నారని నెహ్రూకి తెలిసినపుడు.. రాజాజీ పోవడం వల్ల నాకు కొంత నష్టం కానీ, అంబేడ్కర్ వల్ల ఏ లాభం లేదు, పోతే పోనీ! అన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన మీర్జా అజ్మీర్ బేగ్ తన పరిశోధనలో బయటపెట్టిన అంశం ఏమిటంటే– నెహ్రూ మనస్తత్వం వంటపట్టిన కాంగ్రెస్‌వాదులకు అంబేడ్కర్‌ను రాజ్యాంగ సభ సభ్యుడుగా చేయడం కూడా ఇష్టం లేదు. ‘‘296 మంది రాజ్యాంగ సభ సభ్యుల్లో కూడా మొదట అంబేడ్కర్‌ ఉండాలని నెహ్రూ వర్గం కోరుకోలేదు’’ అని బేగ్‌ తన రచనల్లో తేల్చి చెప్పాడు. గాంధీని అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా ప్రమోట్ చేసేవారు, గాంధీజీ మరణించిన ఆరు సంవత్సరాల తర్వాత బాబాసాహెబ్ రాజ్యసభలో మాట్లాడుతూ గాంధీజీ గురించి వ్యక్తం చేసిన భావాలను తెలుసుకోవాలి. దళితుల పేరిట రూ.20 కోట్ల స్కీమును ప్రారంభించి, దానికి గాంధీజీ పేరు పెట్టాలని బాబాసాహెబ్ కోరుకున్నాడు. అంటరానితనం పట్ల నెహ్రూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, 370 ఆర్టికల్ భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తుందని ఆనాడే అంబేడ్కర్‌ చెప్పాడు. కానీ ఏనాడూ అంబేడ్కర్‌ మాటను నెహ్రూ, ఆయన నడిపే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, పైగా ఘోర అవమానం చేశారు.


పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ఫోటోలను పెట్టారు. కానీ అంబేడ్కర్‌ ఫోటోను పెట్టడానికి ఆ పార్టీకి మనస్కరించలేదు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఏర్పడిన వీపీ సింగ్ ప్రభుత్వం అంబేడ్కర్‌ ఫోటోను ఆవిష్కరించింది. బతికుండగానే ‘భారతరత్న’ పురస్కారాలను ప్రకటించుకున్న నెహ్రూ, ఇందిరలు... బాబాసాహెబ్ చనిపోయిన తరువాత కూడా ‘భారతరత్న’ ప్రకటించడానికి ఇష్టపడలేదు. కాంగ్రెసేతర ప్రభుత్వం బాబాసాహెబ్‌కు భారతరత్న ప్రదానం చేసింది. ఎప్పుడూ బాబాసాహెబ్‌ను కాంగ్రెస్ పార్టీ భారత సమాజం నుంచి దూరం పెట్టాలనే ప్రయత్నమే చేసిందని ‘పటేల్ ఏ లైఫ్’ అన్న పుస్తకంలో రాజమోహన్ గాంధీ స్పష్టంగా తెలిపారు.

భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కలిసి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యేటట్లు చేశారు. ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ అన్న పుస్తకంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ 112వ పేజీలో ఈ విషయాలన్నీ వివరించాడు. బాబాసాహెబ్‌ మొదటిసారి ముస్లిం లీగ్ తరఫున సంయుక్త బెంగాల్‌లో నిలబడితే 1.5 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడించింది. రెండోసారి 1954లో మహారాష్ట్రలోని బండారా ఉప ఎన్నికలో బాబాసాహెబ్ పోటీకి దిగితే, అంబేడ్కర్‌ అనుచరుడైన నారాయణ్ కాజ్రోల్‌కర్‌ను ఆయనపై పోటీకి నిలబెట్టి కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో 17,153 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడించారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే 1970లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కాజ్రోల్‌కర్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసింది. అప్పటివరకు డాక్టర్ బాబాసాహెబ్‌కు ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు.


బాబాసాహెబ్ పట్ల ఇన్ని దురాగతాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తోంది. ఆఖరికి బహుజన నాయకుడైన సీతారామ్ కేసరిని పార్టీ అధ్యక్షునిగా నియమించి, చివరికి ఆయనను బాత్రూంలో బంధించి సోనియా గాంధీ పార్టీని స్వాధీనం చేసుకున్నది. దళిత నాయకుడైన బాబు జగ్జీవన్‌రామ్‌ను కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ అనేక అవమానాలకు గురి చేశారు. సిక్కుల్లో దళిత వర్గానికి చెందిన మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు... రాజ్యాంగం ప్రకారం ఆమోదితమైన ఒక చట్టపు కాగితాన్ని ఆయన చేతిలో నుంచి లాక్కొని, ఏ పదవిలో లేని రాహుల్‌గాంధీ మీడియా ముందే చించేశాడు. అటువంటి రాహుల్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఉందా?


బతికున్నప్పుడు అంబేడ్కర్‌ను వేధించిన కాంగ్రెస్, ఇప్పుడూ అదే మార్గంలో నడుస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగం మార్చేస్తారంటూ రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీపై దుష్ప్రచారం చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను తన స్వార్థ రాజకీయాల కోసం నిర్దాక్షిణ్యంగా కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీని, దేశానికి ఎమర్జెన్సీ విధించి, చీకటి రోజులు తెచ్చిన ఇందిరాగాంధీని ఈ దేశం మరవలేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని దుర్మార్గంగా తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు రోజూ రాజ్యాంగం గురించి, అంబేడ్కర్‌ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. 2000 సంవత్సరానికి ముందు విస్తృత స్థాయిలో మీడియా లేదు. అప్పుడు ప్రభుత్వాలు చెప్పిందే ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి. నేడు ఆధునిక యుగం. ఎవరు ఎటువంటి అబద్ధాలకు, దుష్ప్రచారాలకు పాల్పడినా, వాటిని ఇట్టే బయటపెట్టేస్తోంది సోషల్ మీడియా. అందుకే ఈ యుగంలో కాంగ్రెస్ ఆటలు సాగవని, ఆ పార్టీ పెద్దలు గుర్తించాలి.

ఎం. రఘునందన్‌రావు

పార్లమెంటు సభ్యులు, మెదక్

Updated Date - Dec 27 , 2024 | 06:21 AM