Share News

దేశాభివృద్ధికి దిక్సూచి... కాంగ్రెస్‌ మేనిఫెస్టో

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:11 AM

గత దశాబ్దకాలంగా మోదీ పాలనలో ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా పేదరికం, నిరుద్యోగం, ఉపాధి కొరత, ధరల పెరుగుదల తీవ్రంగా ఉన్నాయి. దేశంలో దశాబ్దకాలంలో...

దేశాభివృద్ధికి దిక్సూచి... కాంగ్రెస్‌ మేనిఫెస్టో

గత దశాబ్దకాలంగా మోదీ పాలనలో ఆదాయ అసమానతలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా పేదరికం, నిరుద్యోగం, ఉపాధి కొరత, ధరల పెరుగుదల తీవ్రంగా ఉన్నాయి. దేశంలో దశాబ్దకాలంలో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం బలంగా వృద్ధి చెందింది. దీనిలో భాగంగా దేశ సహజ వనరులు, సంపద, భూమి, ఇంధన వనరులు, గనులు, రేవులు అభివృద్ధి పేరిట దేశంలోని అతికొద్ది మంది పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడంతో సంపద కేంద్రీకృతం అయి ఆదాయ అసమానతలు పెరిగాయి. 43 ఆశ్రిత పెట్టుబడిదారీ దేశాల్లో భారత్‌ 10వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అధిక పేదలున్న భారత్‌– కోటీశ్వరుల సంఖ్యలో 3వ స్థానంలో ఉంది. ముఖ్యంగా 2014–2023 మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు దేశంలో తీవ్ర ఆదాయ అసమానతలకు, సంపద కేంద్రీకరణకు ప్రధాన కారణం. దేశ జనాభాలో ఒక శాతం ధనికుల వద్ద 40 శాతం సంపద కేంద్రీకృతం అయినట్లు ఇటీవల పారిస్‌కు చెందిన వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ నివేదిక తెలిపింది. దీని ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే ఒక తీవ్ర ఆదాయ అసమానతలకు కేంద్రంగా మారిందని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పి.చిదంబరం ఆధ్వర్యంలో ‘న్యాయపత్రం’ పేరిట మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘పంచన్యాయ్‌’లో భాగంగా సమన్యాయం, రైతులు, కార్మికులు, యువకులు, మహిళలకు దేశవ్యాప్తంగా ‘మార్పు కోసం హస్తం’ అనే నినాదంతో దీన్ని తయారుచేశారు. సోనియా, రాహుల్‌, మల్లిఖార్జున్‌ ఖర్గే వంటి అగ్రనేతలు దీనిని ఢిల్లీలో విడుదల చేశారు. తెలంగాణలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ– ప్రజల ముంగిట్లోకి జాతీయ మేనిఫెస్టో కమిటీ దీనిని తీసుకువచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ సహజ లక్షణమైన అన్నివర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే సమ్మిళిత వృద్ధి సూత్రం ఆధారంగా ఇది రూపొందింది. అందరికీ దేశ ఆర్థిక, భౌగోళిక, సహజవనరుల సంపద, ఆర్థిక ఫలాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, నిరుద్యోగులు మొదలైన వారికి అభివృద్ధి ఫలాల్లో న్యాయమైన, సమాన వాటా పొందినపుడు దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. ఈ లక్ష్యంతో దేశంలో ఉపాధి కల్పన, సంపద సృష్టి, సంక్షేమం, అభిలషణీయ వనరుల వినియోగం వంటి సూత్రాల ఆధారంగా దేశ సమగ్ర అభివృద్ధికి దోహదం చేయడానికి ఈ మేనిఫెస్టో ఐదు న్యాయాల్లో భాగంగా 25 గ్యారంటీలు అందించింది. ఆ ఐదు న్యాయాల్లో ప్రధానంగా–

దేశ ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వంటి వారికి సమన్యాయం అందించడానికి దోహదం చేసే జనగణన, 50 శాతానికి మించి రిజర్వేషన్లు అందించడం; ఎస్సీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక; గిరిజనులకు భూమిపై హక్కు కల్పించటం ద్వారా అందరికీ దేశ సంపద సమాన పంపిణీ జరిగేట్లు చూస్తుంది.

దేశంలో ప్రధాన రంగం అయిన వ్యవసాయం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటోంది. వ్యవసాయ సంక్షోభం తప్పించడానికి ప్రధానంగా పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించటం; రైతులకు రుణ మాఫీకోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు; పంటల బీమా పథకం మరింతగా అభివృద్ధి చేయటం ద్వారా వ్యవసాయ రంగం ఎగుమతుల్లో వృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది.

కార్మికుల ఆరోగ్య, సామాజిక భద్రతలో భాగంగా కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం; అసంఘటిత రంగ కార్మికులకు ప్రమాద బీమా వర్తింపు మరో ముఖ్యమైన హామీ. కనీస వేతనాలను రోజుకు రూ. 400లకు పెంచడం, ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాలకు వర్తింప చేయడంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ రద్దు ద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రతను అందించాలనే ప్రయత్నం చేసింది. భారతదేశం మానవ వనరులకు నిలయం. వీటిని సద్వినియోగం చేయటం ద్వారా దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, ఉద్యమదారిత్వానికి, సాంకేతిక అభివృద్ధి, నైపుణ్యాలు పెంచడం ద్వారా యువకులను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ, అప్రెంటిస్‌ శిక్షణ, పరీక్షా పత్రాల లీకేజీ నివారణ, ఐదువేల కోట్ల రూపాయలతో స్టార్టప్‌ల స్థాపనకు యువతకు ప్రోత్సాహం కల్పించటం ద్వారా యువ అభివృద్ధికి గ్యారంటీని కల్పించింది.

మహిళా న్యాయంలో భాగంగా కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం; సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు మహిళలకు అందించటం; మహిళా ఉద్యోగులకు హాస్టల్స్‌ సంఖ్య రెట్టింపు; మహిళా హక్కుల సాధన, మహిళల అభివృద్ధి, సాధికారత, చైతన్యం పెంపునకు మేనిఫెస్టో ప్రాధాన్యత ఇచ్చింది.

అంతేకాక కాంగ్రెస్‌ పార్టీ అనేక ఇతర వాగ్దానాలు చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటానికి ఈడబ్ల్యుఎస్‌ కోటా అన్ని వర్గాలకు అందివ్వటం, జమిలి ఎన్నికల తిరస్కరణ; జమ్ము కాశ్మీర్‌, పుదుచ్చేరీలకు రాష్ట్ర స్థాయి హోదా ఇవ్వటం. అలాగే నూతన విద్యావిధానాన్ని సమీక్షించటం, రూ.25 లక్షల వరకు నగదు రహిత బీమా అమలుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అగ్నిపథ పథకం రద్దు, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలుచేయడం ద్వారా వ్యవసాయ వృద్ధి; నేషనల్‌ జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు వంటి ఇతర ముఖ్య హామీలు ఇచ్చింది. తద్వారా దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తామని గ్యారంటీల అమలు ద్వారా సమాజంలో భాజపా పాలనలో అన్ని రంగాల్లో జరిగిన విధ్వంసాన్ని తొలగించి పేదలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల జీవితాల్లో వెలుగురేఖలు తెస్తామని ప్రకటించింది.

ఠాగూర్‌ ‘గీతాంజలి’లోని ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో... ఎక్కడ సగర్వంగా తలెత్తుకుని ఉండగలమో... అంటూ సాగే వాక్యాలను నిజం చేయడానికి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రస్తావించింది. తద్వారా దేశ గౌరవం, సాధికారిత పెంపునకు కంకణబద్ధురాలయింది.

డా. రియాజ్‌

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి

Updated Date - Apr 19 , 2024 | 05:11 AM