పెను సవాళ్ళకు దారితీయనున్న వర్గీకరణ ప్రయత్నాలు
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:29 AM
‘కోటా తీర్పుపై శాసనిక చర్యలేవీ?’ శీర్షికన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ రాసిన వ్యాసంలో (24–10–2024) ఆయన మాలలపై అక్కసుతో అబద్ధ ప్రచారాల పరంపరను మరోసారి కొనసాగించారు...

‘కోటా తీర్పుపై శాసనిక చర్యలేవీ?’ శీర్షికన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ రాసిన వ్యాసంలో (24–10–2024) ఆయన మాలలపై అక్కసుతో అబద్ధ ప్రచారాల పరంపరను మరోసారి కొనసాగించారు. గత ఆగస్టు ఒకటో తేదీన దేశ అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఇచ్చిన తీర్పు కక్షిదారులకన్నా దాని ప్రభావిత వర్గాలను తీవ్రమైన ఆందోళనకు గురిచేసింది. ప్రధానంగా ఉత్తర భారత దళితులు ఈ తీర్పును అంగీకరించేది లేదని ఆందోళనలు చేస్తున్నారు. తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్‌లో ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా మాదిగ సామీప్య కులం లాంటి చమార్ కులస్తులు అధికంగా ఉన్న ప్రాంతాలలో, విజయవంతం కావడమే అందుకు నిదర్శనం. తీర్పుపై వేసిన అనేక రివ్యూ పిటీషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిజానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఇచ్చిన ఏ తీర్పుపై కూడ రివ్యూ పిటీషన్లను ఆయన అనుమతించలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్ల భవితవ్యంపై నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నది.
నిజానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో రెండుగా విడిపోయిన తర్వాత వర్గీకరణ డిమాండ్‌కు మునుపటి ప్రాధాన్యత లేకుండే. కాని 2023 నవంబర్ 11న సికింద్రాబాద్ సభలో ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలో రాజీవ్ గౌభా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, ఆ తర్వాత అన్నీ చకచకా జరిగిపోయినవి. ఇరవై సంవత్సరాల అనంతరం అనూహ్యంగా 2024 ఫిబ్రవరి 6న సుప్రీంకోర్ట్ రివ్యూ పిటిషన్‌ను ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసింది. వర్గీకరణ వాదులకు రెండురోజులు, వ్యతిరేకులకు ఒకరోజు మాత్రమే వాదనలను అనుమతించడంతోనే రాబోయే తీర్పును చాలామంది ముందుగానే ఊహించినారు. ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత తీర్పు.
565 పేజీల తీర్పును క్షుణ్ణంగా పరిశీలిస్తే, అనేక సంక్లిష్ట అంశాల ప్రస్తావన కూడా తీర్పులో ఉంది. ఎస్సీ ఎస్టీ ఉపకులాలు సజాతీయులు కారంటూ, ఎస్టీ వర్గీకరణను కూడా ఉటంకిస్తూ క్రీమీలేయర్ ప్రస్తావన తెచ్చింది. ‘ఎంపరికల్ డాటా’ అధారంగా అనేది అనేక సంక్లిష్టతలతో కూడుకొన్నది. దీని ప్రకారం ముందుగా జనాభా లెక్కలు తీయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి. 2011 జనాభా లెక్కల అనంతరం రాష్ట్రం విడిపోయింది కాబట్టి ప్రజల వలసలు జరిగిన నేపథ్యంలో పాత లెక్కలు రెండు రాష్ట్రాలకూ ఎంతమాత్రం ప్రామాణికం కాజాలవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన 2014 నుంచి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన సుమారు పదహారు రకాల స్కీముల ఆర్థిక ప్రయోజనాలు పొందిన లబ్ధిదారుల కులం లెక్కల సేకరణ, ప్రకటన జరగాలి. సుప్రీం తీర్పులో జనాభా, నిష్పత్తి పంపిణీ ప్రస్తావన లేదు. అయినా జనాభా శాతం కన్నా ఎక్కువ పొందినవారిని వెనుక వరుసలోను, తక్కువ ప్రయోజనం పొందిన వారిని ముందు వరుసలోను ఉంచడమే సహజ న్యాయం. డేటాలో తేడాలు ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు అని తీర్పులోనే సూచించింది. ఇదంతా ‘ఇష్టాలు లేదా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా’ జరగాలని కూడా పేర్కొంది.
అసలు అన్నింటికీ మించి ఉమ్మడి రాష్ట్రాల్లో అమలవుతున్న ఉద్యోగాల స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆర్టికల్ 371డి పరిష్కరించడం న్యాయశాఖకు ఒకపెద్ద సవాలే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అమలవుతున్న జిల్లా జోనల్ మల్టీ జోనల్ స్థాయి కేటగిరీ పోస్టుల్లో వర్గీకరణ ఎలా చేస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. 2011 జనాభా లెక్కల ఆధారంగా ముందుకు వెళ్తే గతంలో మాలలకు 6శాతం, మాదిగలకు 7శాతం కేటాయించిన వాటాలను అలాగే కొనసాగించాలి. ఏ గ్రూపుకు 1శాతం, డి గ్రూపుకు 1శాతం, రెండు గ్రూపులకు కేటాయించిన వాటాలను కలిపి ఏ గ్రూపుగా 2శాతం, ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ పేజీ 54 ప్రకారం తెలంగాణలో మాదిగలకన్నా వెనుకబడిన మాలలను బీ గ్రూపుగా 6శాతం, దగా పడ్డామంటూనే అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన ఉన్న మాదిగలను సీ గ్రూపుగా 7శాతం నిర్ణయించి కేటాయించడమే శాస్త్రీయ వర్గీకరణ అవుతుంది. పంజాబ్ రాష్ట్రంలో అమలవుతున్న 25శాతం ఎస్సీ రిజర్వేషన్లను ఏ – బీ అనే రెండు గ్రూపులుగా మాత్రమే వర్గీకరించిన అంశాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి.
1965లో బిఎన్ లోకూర్ కమిటీ రిపోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల కులాన్ని ఎస్సీ జాబితా నుంచి తొలగించమని సిఫారసు చేసిందంటూ కృపాకర్ రాసిన రాతలు అబద్ధం. అలాంటి డిమాండ్ అర్థరహితమైనదని 116 పేజీల బిఎన్ లోకూర్ కమిటీ రిపోర్టు పేజి నెంబర్ 56లో తిరస్కరించింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఇటువంటి అబద్ధపు రాతలు రాస్తూ, మాదిగ శ్రేణులను రెచ్చగొడుతూ, సమాజాన్ని తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేయడం దుర్మార్గం.
సుప్రీంకోర్టు తీర్పును న్యాయకోవిదులతో పరిశీలన చేయించకుండానే, ‘ఎంపరికల్ డేటా’ సేకరణ జరగకుండానే, కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన విధానమేమిటో ప్రకటించకుండానే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసే ప్రక్రియకు పూనుకొని ముందుకు వెళ్తున్నది. మంత్రివర్గ ఉపసంఘంలో ఇప్పటివరకు అగ్రభాగ ఫలాలు అనుభవించిన కులాల ప్రతినిధులను సభ్యులుగా ఉంచడం ఎవరి మెప్పుకోసమో కాలమే సమాధానం చెప్తుంది. ఏనుగును ఏడుగురు గుడ్డివారు ఏడురకాలుగా వర్ణించినట్లు వర్గీకరణ తీర్పును పలువురు పలురకాలుగా వక్రీకరిస్తున్నారు. చికిత్స చేసేముందు రోగనిర్ధారణ చేసి చికిత్సకు పూనుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా చికిత్సకు ఏర్పాట్లు చేసి రోగనిర్ధారణ ప్రయత్నాలు చేస్తున్నది. ఇరు వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ చివరకు రెంటికీ చెడ్డ రేవడై మిగిలినా ఆశ్చర్యం లేదు.
మామిడి నారాయణ
రీసెర్చ్ స్కాలర్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్