Share News

శ్రీశ్రీకి సినిమా అభ్యుదయ సాధనం

ABN , Publish Date - Apr 01 , 2024 | 12:55 AM

అప్పుడప్పుడే సినిమాలు మూకీల నుంచి టాకీల వైపు ప్రయాణం చేస్తున్నాయి. సినిమాల పట్ల సదభిప్రాయంలేని ఓ సంస్కృత పండితుడిని ఓ పాతికేళ్ళ కుర్రాడు ‘‘మాతో సినిమాకి మీరు కూడా రావాల్సిందే’’నని బలవంతపెట్టి మరీ తీసుకెళ్లాడు....

శ్రీశ్రీకి సినిమా అభ్యుదయ సాధనం

అప్పుడప్పుడే సినిమాలు మూకీల నుంచి టాకీల వైపు ప్రయాణం చేస్తున్నాయి. సినిమాల పట్ల సదభిప్రాయంలేని ఓ సంస్కృత పండితుడిని ఓ పాతికేళ్ళ కుర్రాడు ‘‘మాతో సినిమాకి మీరు కూడా రావాల్సిందే’’నని బలవంతపెట్టి మరీ తీసుకెళ్లాడు. తెర వెలిగింది. ‘‘మందలు మందలుగా వెళ్తున్న గొర్రెలు’’ - ఫ్రేమ్‌ కాస్త డిజాల్వ్‌ - ‘‘గుంపులు గుంపులుగా తోసుకుంటూ వెళ్తున్న కార్మికులు’’. ఇది ఆ సినిమాలోని ఫస్ట్‌ షాట్‌. ‘‘వీడెవడో ఘటికుడులా వున్నాడు! నాందీశ్లోకంలోనే కథాంశం యావత్తూ సూచించడం సంస్కృత నాటక మర్యాద! ఎంత చక్కగా ఆ మర్యాద పాటించాడు!’’ అని మెచ్చుకుని చిత్రమంతా తదేక దీక్షతో చూసి ఒక కొత్త అనుభవం కలిగించావంటూ ఆ కుర్రాడ్ని అభినందించారు. అలా ఆ పండితుడికి సినిమాలపట్ల ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఆ చిత్రం చార్లీచాప్లిన్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘మోడ్రన్‌ టైమ్స్‌’ (1936). ఆ సంస్కృత పండితుడు భారతి సాహిత్య మాసపత్రికకు తొలి సంపాదకుడైన గన్నవరపు సుబ్బరామయ్య. ఆ పాతికేళ్ళ కుర్రాడు శ్రీశ్రీ.

శ్రీశ్రీది 73ఏళ్ళ సుదీర్ఘ జీవితం. ‘‘ఎనిమిదో ఏట నుంచే రచనలు చేసేవాడిని’’ అన్న మాట పరిగణన లోకి తీసుకొంటే 65ఏళ్ళ సాహితీ వ్యాసంగం. అందులో సినీరచయితగా 35ఏళ్ళ అనుభవం. కమ్యూనిజం తెలియకమునుపే ఆ ధోరణి, భావజాలాన్ని అలవరుచుకొన్న అభ్యుదయవాది. అప్పుడప్పుడే సమాజంపై ప్రభావం పెరుగుతున్న సినిమాలపట్ల కూడా శ్రీశ్రీ లోతైన అభ్యుదయభావాలను కలిగి ఉన్నాడు.

శ్రీశ్రీ విద్యాభ్యాస దశలోనే ఒకవైపు షేక్‌స్పియర్‌, బైరన్‌, కీట్స్‌, షెల్లీల వంటి సాహిత్యకారుల సాహిత్యారాధనలోనూ మరోవైపు చార్లీచాప్లిన్‌, పుడోవ్కిన్‌, డెసీకా వంటి దర్శక దిగ్గజాల సినిమా మోజులోనూ ఒకేసారి పడ్డాడు. శ్రీశ్రీ పుట్టింది 1910లో. భారతదేశ సినిమా పుంజుకున్నది 1935 తర్వాత. అంటే శ్రీశ్రీ వయసు పాతికేళ్ళు. అప్పటికి మద్రాసులోనే ఉన్నాడు. దక్షిణ భారత దేశం లోకి సినిమా బీజం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా మొలకెత్తి, మారాకులేసింది? - ఇదంతా శ్రీశ్రీ కళ్ళముందు జరిగిందనడంలో సందేహం లేదు.

1952లో ముంబాయిలో జరిగిన ‘మొదటి అఖిల భారత చలనచిత్రోత్సవం’కి శ్రీశ్రీ ఆత్రేయతో కలిసి న్యాయనిర్ణేతగా వెళ్ళాడు. మద్రాసులో దక్షిణ భారత సినీ రచయితల సంఘానికి ఉపాధ్యక్షుడిగా (1976) కూడా పనిచేశాడు. రాజకీయ, సాహిత్య రంగాలను చూసినట్టే సినిమాని కూడా సామ్యవాద దృష్టితోనే చూస్తూ ఎదిగాడు. ఈ క్రమంలో 50ఏళ్ళ క్రింద వెల్లడించిన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఈనాటికీ ఎంతో విలువైనవిగా తోస్తున్నాయి. చిత్రసీమపై, అందులోని వివిధ విభాగాలపై తన ఆలోచనలను అక్కడక్కడ వ్యాసాల్లోను, ముఖాముఖి చర్చల్లోను, ‘సినీతంత్ర కాలమ్‌’ల ద్వారాను వెల్లడించాడు..

చిత్రసీమకి శ్రీశ్రీ కంటే ముందే శ్రీశ్రీ పాట వచ్చింది. ఆయన 1950లో ‘ఆహుతి’ సినిమా కోసం ‘ప్రేమయే జనన మరణలీల’ పాట రాయకముందే 1947లోనే ‘కాలచక్రం’ సినిమాలో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతం ‘నేను సైతం...’ను వాడారు. శ్రీశ్రీది వెయ్యికిపైగా గీతాలు రాసిన అనుభవం ఉంది. ‘తెలుగు వీరలేవరా!’ పాటతో తొలి జాతీయ అవార్డును 1974లో తెలుగువారికి తెచ్చిపెట్టాడు. కొన్ని పాటలు దృశ్యాలను మోస్తాయి, మరికొన్ని పాటలు సినిమాలనే మోస్తాయని నమ్మే శ్రీశ్రీని అసలు సినిమాకి పాటలు అవసరమా అని ప్రశ్నిస్తే, ‘‘పాటల్లేని చిత్రమే నిజమైనటువంటి చిత్రం’’ అంటూనే ‘‘మన ప్రత్యేక పరిస్థితుల్లో పాటలకి కథను మించిన ప్రాముఖ్యం కూడా ఉన్నదని చెప్పాలి’’ అంటాడు. మనకి ఇతర దేశాల్లో మాదిరి సెపరేట్‌ మ్యూజిక్‌ ట్రాక్స్‌ లేవు కాబట్టి పాటలు అవసరం అన్నది ఆయన ఉద్దేశం. పాటలు రాయటం గురించి మాట్లాడుతూ, ‘‘ఆది-అంత్యప్రాసలు వస్తే చాలు సినిమా పాట రాసెయ్యొచ్చని చాలామంది పొరబడుతూ ఉంటారు. పాటలు రాయడం చాలామంది అజ్ఞానులు అనుకున్నంత సులభం కాదు. పండితుల అనుకునేంత తేలిక కాదు. సినిమాపాట కొన్ని లక్షలమందిని మెప్పించాల్సి ఉంటుంది’’ అన్నాడు. సినిమా పాటలను కూడా సాహిత్య ప్రక్రియగా గుర్తించాలని భావించాడు శ్రీశ్రీ.

కథా రచయిత చిత్రసీమని శాసించే స్థాయికి చేరుకున్నప్పుడే విజయవంతమైన చిత్రాలొస్తాయని శ్రీశ్రీ భావించాడు. తమిళనాడులో రచయితల చేతిలోకి స్టీరింగ్‌ వీల్‌ వచ్చిందనీ, అందుకే అక్కడ కె.ఎస్‌. గోపాలకృష్ణ, వేలన్‌, ఎ.పి. నాగరాజన్‌లు రచయితలుగా మొదలై స్టూడియో అధినేతలయ్యారని; అన్నాదురై, కరుణానిధి లాంటివాళ్ళు గవర్నమెంటుని కూడా చేతుల్లోకి తీసుకున్నారని అంటాడు శ్రీశ్రీ. తమిళ నాడులో సాధ్యమైంది మన తెలుగులో కూడా సాధ్యమవుతుందన్నది ఆయన ఆకాంక్ష. తెలుగు రచయితల్లో అలసభావం (‘‘డెవిల్‌ మే కేర్‌’’) మెంటాలిటీ ఉన్నదనీ, దీనితోపాటు ఇతర సాంకేతిక శాఖలలో పరిచయం లేదనీ చెబుతూ, ఈ కారణం వల్లనే మాటల ద్వారా చిత్రాల్ని విజయవంతం చేసిన సముద్రాల రాఘవాచార్య, త్రిపురనేని గోపిచంద్‌, అనిశెట్టి సుబ్బారావు, ఆత్రేయ లాంటి రచయితలు డైరెక్షన్‌లో మాత్రం ఫెయిల్‌ అయ్యారంటాడు. శ్రీశ్రీ అన్నట్టు నాటక రంగం నుంచి నిరూపించుకువచ్చిన ఆ తరం రచయితలు దర్శకులుగా విజయవంతమయ్యుంటే సినిమా కళకు సామాజికపరంగా, రాజకీయపరంగా మరిన్ని మెరుగులు దిద్దే ప్రయత్నం జరిగేది. గిరీష్‌ కర్నాడ్‌ (కన్నడ), జయకాంతన్‌ (తమిళం) మాదిరి మన చిత్రసీమలో కూడా కొన్ని ‘జ్ఞానపీఠాల’ను సైతం చూసేవాళ్ళం. ఇప్పుడిప్పుడు పరిస్థితి మెరుగుపడి సినీరచయితలకు కూడా పద్మశ్రీలు పెరుగుతున్నాయి. ఇక, స్టూడియోలు, రాజ్యాధికారం ఏమోగాని రైటర్‌ - డైరెక్టర్‌ - ప్రొడ్యూసర్‌ క్రోనాలజీలో శ్రీశ్రీ ఆశించినట్టు ఇప్పుడిప్పుడే తెలుగులోనూ స్పీడు పెరిగిందనిపిస్తుంది.

‘‘అసలు ప్రక్రియాభేదంతో రచయితలంతా రాసేది నాటకమే. నాటకం ఉత్తమోత్తమ కళ. దీనికి మూలధాతువు నటుడు. ఏ కవిత్వమైన అభినయంతోనే పరాకాష్ఠకు చేరుకుంటుంది. అది ప్రజల్లో చేర్చే నటుడికి క్రమశిక్షణతోపాటు నాటకరంగ అనుభవం కూడా ఉండాలి’’ అంటారు శ్రీశ్రీ. తారాగణ ‘‘ప్రాధాన్యత’’ను మాత్రం ఆయన నిరసించాడు. హీరో అనీ విలన్‌ అనీ ఒక్క మనదేశంలో మాత్రమే ఉంటుందని చెప్తూ, ‘‘ఇతర దేశాల చిత్రాలలోని ప్రముఖ నటీనటులను లీడ్‌ రోల్స్‌ అంటారు. ఒక పదేళ్ళ కుర్రాడి చుట్టూ కథ అల్లి చిత్రం తీస్తే అతడే ప్రముఖ నటుడవుతాడు,’’ అంటారు. ‘‘ఒక్క నటుడికే ప్రాధాన్యం పెరిగితే సినిమా కళ కాకుండా వ్యాపార రంగంగా మారిపోతుంది’’ అంటారు. ‘‘నేటి సినిమా ఒక ఐస్‌బెర్గ్‌! నీటిమట్టం మీద నాలుగోవంతు ఈదేవాళ్లతో కలకలలాడుతుంటే నాలుగింట మూడువంతుల అభాగ్యులు నీటిలో మునిగి కనపడకుండా కలవరపడుతున్నారు’’ అని ఆయన అన్న మాట నేటికీ నిజమే. అందుకు చిత్తూరు నాగయ్య, పేకేటి శివరాం, కస్తూరి శివరావు వంటి నటుల అవసానదశలని గమనించవచ్చు. ఇది పేద సినీకళాకారుల దీనస్థితిపై శ్రీశ్రీ ఎప్పుడో చెప్పిన జోస్యం.

‘‘ప్రొడ్యూసర్లందరూ డబ్బు చేసుకుందామనే దృష్టితో వచ్చేవాళ్ళే’’నంటూ, ‘‘తెలుగు సినీమా రంగం తిమింగలాలతో కూడిన సముద్రం. ఈ తిమింగలాలు మొత్తం కళా సాగరాన్ని కల్లోలపరుస్తున్నాయి. ఈ సముద్రంలో కనీసం అభ్యుదయ భావాలతో కూడిన చిన్న దీవినైనా ఏర్పాటు చేయాలి,’’ అని ఆశపడ్డాడు. ఇదంతా సమిష్టి భావనతో సాధ్యమయ్యే మార్పు. పెట్టిన రూపాయి వెనక్కి రావడం సినిమాకు ప్రధాన అంశం. అది లేకపోతే ఒక ప్రొడ్యూసర్‌ ఒక సినిమా మాత్రమే తీయగలడు. ఈ మధ్యకాలంలో క్రౌడ్‌ ఫండింగ్‌ సినిమాలు ఒకటీ అరా మొదలై ఆగిపోయాయి. ఈ తోవలో శ్రీశ్రీ అప్పట్లోనే దృష్టి సారించడమన్నది విశేషం. దీనివెనుక ‘చెవిలో రహస్యం’ సినిమాకు నిర్మాతగా చేతులు కాల్చుకున్న అనుభవం లేకపోలేదు. దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టుకునే అవకాశాలు, సందర్భాలు శ్రీశ్రీకి అప్పట్లో చాలానే ఉన్నాయి. కానీ కమ్యూనిస్ట్‌ కార్యకలాపాల్లో సమయం లేకనో, ఇష్టం లేకనో దర్శకత్వం చేయలేదు. ‘‘సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన సినిమా నాకో సరదాగానే మిగిలింది.... నాకున్న ఇన్ని సంవత్సరాల సినిమా అనుభవంతోనూ లవలేశమైనా సామాజిక ప్రయోజనం సాధించలేకపోయాను’’ అని బాధపడ్డాడు.

సాహిత్యంలో అందరూ మెచ్చే ఠాగూర్‌ని తాను మెచ్చనట్టుగానే, సినిమాల్లో సత్యజిత్‌ రేని శ్రీశ్రీ హర్షించలేదు. ఇటాలియన్‌ సినిమాల ప్రభావంతో పైకొచ్చాడు తప్పా అతడిలో సొంత నిబద్ధత, వ్యక్తిత్వమంటూ ఏదీ లేదని ఆరోపించాడు. ఈ రెండు గుణాలు కలిగిన మృణాల్‌ సేన్‌, శ్యామ్‌ బెనగల్‌ గొప్ప దర్శకులన్నాడు. తెలుగులో ఆదుర్తి సుబ్బారావు, కె.బి. తిలక్‌, మాదాల రంగారావులని శ్రీశ్రీ అభిమానించి ప్రోత్సహించేవాడు. నిర్మాతకూ నటుడికీ మధ్య దర్శకుడు నలిగిపోతున్నాడని, ఈ ఇద్దరినీ శాసించే స్థాయికి చేరుకున్నప్పుడే విజయవంతమయ్యే చిత్రాల శాతం పెరుగుతుందనీ శ్రీశ్రీ సూచించాడు. శ్రీశ్రీ పేర్కొన్న ఈ లోపం కొన్ని తరాలపాటు అలాగే కొనసాగింది. ఇప్పుడిప్పుడే చిత్రసీమలో హీరోలతో సమానంగా దర్శకుణ్ణి గుర్తించి ఆదరిస్తున్నారు.

ఆధునిక కాలంలో సంస్కృతీ సంప్రదాయాలపై, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై మాధ్యమాలు ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. అందులో సినీమాధ్యమం తీవ్రత ఎక్కువ. ఈ ప్రభావాన్ని తమిళ సినీ రచయితలు గుర్తించారు. జాతీయ కవిగా సుబ్రహ్మణ్య భారతి, అంబేద్కర్‌ సరసన పెరియార్‌ని నిలిపే ప్రయత్నాల్లో సినిమాను కూడా భాగం చేసుకున్నారు. తెలుగులో ఈ విధమైన చేవ ఉన్నా చొరవ తక్కువ. తెలుగువాళ్ళు తీసే సినిమాల్లో సమకాలిక సమాజం కనపడదన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. శ్రీశ్రీ కూడా తెలుగు సినిమాల్లో ‘‘కథానాయకుడి ఊరేదో, పేరేదో, ఇంటిపేరేదో తెలియదు’’ అంటాడు. వాస్తవానికి సమాజ ధోరణిని తెలిపే వాస్తవిక ఘటనలెన్నో సినిమాగా మలచగలిగే నాటకీయతను కలిగి ఉన్నవి మనకు చాలానే ఉన్నాయి. పునర్వివాహానికి సుముఖంగా వుండి సనాతనుల మధ్య ఇరుక్కుపోయిన ఓ వితంతువును ఆ గ్రామం నుంచి రాత్రిపూట ఎలా లేవదీసుకు రావాలని కందుకూరి, బ్రహ్మ సమాజం బృందం వేసిన ప్రణాళికలు; వితంతు వివాహం అనంతరం అటు పుట్టింటివారు - ఇటు మెట్టినింటి వారుగాని కలగజేసుకొకపోతే పెళ్లి చేసిన తామే తిరిగి బాధ్యత వహించవలసి వచ్చినప్పుడు ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు పడ్డ మానసిక, ఆర్థిక సంఘర్షణలు; ఒకప్పడు చల్లా యానాదుల జీవన కేంద్రమైన నేటి రాకెట్‌ కేంద్రం శ్రీహరికోట నుంచి వారిని ఖాళీ చేయిస్తున్నప్పుడు వారి వేదనలు; వాకపల్లి గిరిజన మహిళల తరఫున కె. బాలగోపాల్‌ పోరాటం ఇలా ఎంతో నాటకీయత ఉన్న వాస్తవ సామాజిక సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని సినిమాలుగా మలచటంపై ఎందుకో నాటి ‘మధ్యతరం’ దర్శకులు దృష్టి సారించలేకపోయారు. ‘‘వాళ్ళు అవే చూస్తున్నారు కాబట్టి మేము ఇవే తీస్తున్నాం’’ అన్న వాదనను మొన్న ‘జైభీం’ సినిమాకు ఇక్కడ తెలుగులో లభించిన ఆదరణ కూలదోసింది. రచయిత ముదిరి దర్శకుడు అయితేనే తెరపై తెలుగు జీవితాల సాంద్రత పెరుగుతుందని శ్రీశ్రీ అన్న మాట వాస్తవ రూపం దాల్చగలిగే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. శ్రీశ్రీ అన్నట్టు సినిమా బాగుకీ, భ్రష్టుకీ కూడా ఉపయోగపడుతుంది. అది చాలావరకు తీసేవారిని బట్టి, కొంతవరకు చూసేవారిని బట్టి ఉంటుంది. శ్రీశ్రీ దృష్టితో సాహిత్య కోణంలో సినిమా కళని చూస్తే, ఆయన ఆలోచనలు ఇప్పటికైనా సాకారమైతే- సినిమా ఒక వినోదంగా మాత్రమేగాక, అభ్యుదయ సాధనంగా కూడా మారగలదు.

బుగడూరు మదనమోహన్‌ రెడ్డి

99898 94308

Updated Date - Apr 01 , 2024 | 12:55 AM